Thursday, April 23, 2020

నాన్నా పులి! ..........., నిజంగానే



నాన్నా పులి! ..........., నిజంగానే

-రాయపెద్ది వివేకానంద్


పెద్ద పులి నిలబడి వుంది జానకి ఎదురుగా.
కళ్ళలోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తోంది. ఇద్దరూ కదలటం లేదు. దాని కళ్ళలోకే చూస్తూ నిలుచుంది జానకి. పులి చాలా అలర్ట్‌గాచూస్తూ, తన తోకని బిర్రుగా చేసి కొరడాలా గాలిలోనెమ్మదిగా కదుపుతోంది.  ముందరి పాదాల్ని నేలకి బలంగా ఆన్చి దూకడానికి సన్నద్ధంగా వుంది. కాలి చివర పంజాల్నించి బయటకి రావటానికి కూచిగా వున్న గోళ్ళూ సిద్దంగా వున్నాయి. అప్పుడప్ఫుడూ తన నాలుక బయటకు చాచి తన మూతిచుట్టూ రాచుకొంటోంది.
పులిని అంత దగ్గరగా చూసేసరికి పైప్రాణాలు పైనేపోయాయి జానకికి. అదేమన్నా అడవా అంటే కాదు మహానగరం, అందులోనూ  నగరానికి నడిబొడ్డులో,అత్యంత సంపన్నులు నివసించే ఖరీదైన ప్రాంతంలో ఓ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణ. మధ్యాహ్నం పిల్లలిద్దరికి లంచ్ బాక్స్ ఇవ్వటానికి ప్రతిరోజు రావటం ఒక వ్యాపకంగా పెట్టుకుంది జానకి. కావాలంటే కారు డ్రయివర్‍తోనో, పనివారితోనో పంపవచ్చు. తనే సరదాగ స్కూటీలో వచ్చి వెళ్ళటం, నలుగురితో పరిచయాలు, కాస్తా మాటా, మంతి బావుంటుందని తనే రావటం అలవాటుగా పెట్టుకుంది. ఏదో చిన్న ఊర్లో సాధారణ డిగ్రీ చదివిన జానకి, పెళ్ళయ్యాక సాఫ్ట్ ఇంజినీర్ అయిన భర్తతోటి వచ్చి నగరంలో ఉంటోంది. చిన్న చిన్న సరదాల్తొ ఉల్లాసంగా ఎప్పటికప్పుడు ఆనందంగా ఉండకుంటే నగరజీవితం మనిషిని ఎంత యాంత్రికంగా మార్చేస్తుందో తెలియంది కాదు జానకికి. ఎప్పట్లాగే లంచ్ బాక్స్ తెచ్చి, కాసేపు నీటి తళ తళలని చూద్దామని చిన్ని గేటుతీసుకొని స్విమ్మింగ్‍పూల్‍వైపు వచ్చింది. కానీ ఈ రోజు ఇంత భయంకరంగా మారుతుందని కలలో సైతం ఊహించలేదు జానకి. ఒక్కోక్క క్షణము ఎంత విలువగలిగనదోనన్న విషయం తెలిసొచ్చిన రోజిది తనకి.
అసలిక్కడికిఎలా రాగలిగింది ఈ పెద్ద పులి? అయినా ఇప్పుడది కాదు ముఖ్యం, ఎలా తప్పించుకోవాలనేది ఆలోచించాలి తానిప్పుడు.
స్కూల్ తాలూకు ప్రచారచిత్రం తీయటానికి వచ్చిన కెమెరాబృందం కూడా ఒకటి ఉందక్కడ, ఒక డైరెక్టర్ లాంటి వ్యక్తి, ముగ్గురు కేమెరామెన్, జానకితోపాటు వీళ్ళూ చిక్కుకుపోయారు ప్రమాదంలో అదే స్విమ్మింగ్‍పూల్ ఆవరణలో.
పారిపోవటానికి వారికి ఉన్న ఒకే ఒక మార్గం వెనుక వైపున్న చిన్న గేటు మాత్రమే. కేవలం కొద్ది నిమిషాల ముందే స్విమ్మింగ్‍పూల్ తాలూకు మెయిన్ గేట్ మూసేయ్యటం జరిగింది. అదెలాగ జరిగిందో తెలుసుకోవాలంటె,  ఒక గంట వెనక్కు వెళ్ళాలి.

****                       ****                          ****

ఎప్పట్లాగే ఉదయాన్నే ప్రార్థనానంతరం పిల్లలందరూ ఎవరి తరగతి గదులకి వారెళ్ళిపోయి శ్రద్ధగా పాఠాలు చదువుకుంటున్నారు. ఎవరిపనులలో వారు నిమగ్నమయ్యారు. బాత్రూంలు శుబ్రపరచటానికి వెళ్ళిన రాజవ్వ చూసింది మొదట పులిని. బ్రష్‍లు, చీపుర్లు, బకెట్ పట్టుకుని వెళ్ళి ఓరగా మూసిన బాత్రూం తలుపు తీసింది రాజవ్వ.
చీకటి గదిలో మిణుగురుపురుగుల్లా మెరిసిపోతూ రెండు కళ్ళు కనిపించాయి మొదట.
గుర్‍ర్‍ర్ర్ మన్న చప్పుడు వినిపించింది నెమ్మదిగా. కుర్రాళ్ళేమయినా ఆటపట్టిస్తున్నారేమోననుకుంది మొదట. స్విచ్చాన్ చేసి, తనెదురుగా వున్న పెద్దపులిని చూసి అవాక్కయింది. ఆమె గొంతులోంచి మాట రాలేదు మొదట.
పిల్లి రావటం కద్దు, కుక్క రావటం కద్దు. ఇదేంటి పులి వచ్చింది, ఇది కలా నిజమా? కాసేపు తన కళ్ళని తను నమ్మలేకపోయింది రాజవ్వ. ఓ మూలన నక్కి పడుకుని ఉంది పెద్ద పులు. అసలెలా వచ్చిందో అది నగరం నడిబొడ్డున ఉన్న స్కూలు ఆవరణలోకి?
భయవిహ్వల అయి ఆమె పెట్టిన ’పులి...పులి’ అన్న వెర్రి కేకకి బిల్డింగ్ మొత్తం అప్రమత్తమయ్యింది. 
స్విమ్మింగ్ పూల్‍కి మూడువైపుల ప్రేక్షకులకై గ్యాలరీలు, నాలుగోవైపు ప్రధాన ద్వారం వుంటాయి.  ప్రధాన ద్వారం దాటి పూల్ ఆవరణలోకి రాగానే ఆహ్లాదకరంగా పచ్చని పచ్చికతో కూడిన లాన్ల్, పెద్ద పెద్ద వృక్షాలు వుంటాయి.  ఈ లాన్‍కి స్విమ్మింగ్‍పూల్‍కి మధ్యలో విశాలమైన వెయిటింగ్ హాలు,వరండా, దాని తర్వాత షవర్ బాత్ చేయటాన్కి సౌకర్యాలు, బట్టలు మార్చుకోవటానికి గదులు, బాత్‍రూంలు, ఇతర గదులు వుంటాయి.
ఇవన్నీ దాటాక స్విమ్మింగ్ పూల్. చాలా పెద్దది అది. వంద ఆడుగుల పొడవు, దాదాపు యాభై అడుగుల వెడల్పుతో వినీలాకాశం క్రింద స్వచ్చమైన జలాలతో చూడంగానే ఆహ్లాదంగా వుంటుంది.
ఆమె పెట్టిన కేకలతో ప్రమాదం పసిగట్టిన సెక్యూరిటి గార్డ్ స్విమ్మింగ్‍పూల్ తాలూకు ప్రధాన ద్వారం మూసేశాడు. కేకలు పెడుతూ బాత్రూం నుంచి బయటకు వచ్చిన రాజవ్వ ప్రధానద్వారం వైపే పరుగు తీసింది. పెద్దపులి కూడా ఆమెని వెంబడిస్తూ పరుగులు తీస్తూ వచ్చి ప్రధానద్వారం వద్దకు వచ్చి చేరుకుంది. గేటు మూసి వుండటం వల్ల ఆగాల్సొచ్చింది రాజవ్వ.
నిజమైన ఇరకాటంలో ఇప్పుడు పడ్డాడు సెక్యూరిటీ గార్డ్. గేటుతీయటమంటే సాక్షాత్తు మృత్యువుని స్కూల్లోకి ఆహ్వానించి, వందలాది ముక్కుపచ్చలారని చిన్నారుల జీవితాల్ని పణంగా పెట్టడమే అని అతనికి తెలుసు. గేటు తీసినాకూడా అది రాజవ్వని వదుల్తుంది అని ఏమీ నమ్మకమేమీ లేదు. ఆమెని ఎటు తిరిగీ ఎటాక్ చేస్తుంది ఆమెకి అది అతి సమీపంలో వుండటం వల్ల. గేటు తీయకుండా వుంటే కనీసం పిల్లలన్నా క్షేమంగా వుండొచ్చు. చివరికి పిల్లల్ని రక్షించటానికే నిర్ణయించుకొన్నాడు.క్షణంలో వెయ్యవవంతు పాటు ఆలోచించుకుని అతను నిర్ణయం తీసేసుకున్నాడు. గేటు మూసి వుంచటానికే  అతను తీసుకున్న నిర్ణయం వందలాది చిన్నారులను కాపాడింది.
కాకపోతే ప్రమాదం మరోవైపు నుంచి వచ్చింది.
తన ముందరేదయినా వస్తువు కదుల్తూ కనిపిస్తే దాన్ని పట్టుకోవటానికి దానివెంబడి పరిగెత్తే మన ఇళ్ళలోని పిల్లిలా,  ఈ పులి కూడా  తన సహజ సిద్దమయిన ప్రవృత్తి వల్ల రాజవ్వని వెంబడించింది,  అంతేగానీ ఆమెకి హాని చేసే ఉద్దేశ్యం ఉన్నట్టు లేదు దానికి నిజానికి.
రాజవ్వ అకస్మాత్తుగా ఆగిపోవటంతో,  పెద్దపులి కూడా ఆగిపోయింది. ఒక సారి ఆమె దగ్గరగా వచ్చి ఆమెని వాసన చూసింది. ఆ తరువాత పంజాతో ఆమెని ఒక్క తోపు తోసేసి ఓ మూలనున్నచెట్టు చాటుకు వెళ్ళిపోవటానికి ఉద్యుక్తురాలైంది. అయితే అది మేనీటర్ కాదన్నమాట. గతంలో ఆర్మీ శిక్షణ ద్వారా తెలుసుకున్న అంశాల్ని బేరీజు వేసుకుంటూ గేటు తీసి రాజవ్వని బయటకు రానిద్దాం అని సెక్యూరిటి గార్డు ఉద్యుక్తుడయ్యేలోగా, అప్పుడు జరిగింది ఆ సంఘటన.
గేటు చుట్టూ చేరి ఈ యావత్తు ఉదంతాన్ని శ్రద్ధగా చుస్తున్న టీచర్లు, ఇతర స్టాఫ్ మెంబర్లలో ఎవరో ’రాజవ్వా! కొట్టేయ్, కొట్టేయ్’ అని అరుస్తూ ఓ దుడ్డుకర్రను గేటుపైనుంచి లోనికి విసిరారు.
రాజవ్వకి సాయం చేస్తున్నామనుకుని, చిన్న చిన్న కంకర రాళ్ళని పులి మీద విసుర్తూ ’థేయ్,థేయ్’ అని అరవసాగారు.
లేని ప్రమాదాన్ని శంకించి, రాజవ్వని శత్రువుగా భావించిన పెద్దపులి, ఎగిరి దూకి రాజవ్వ మెడ కరిచి పట్టుకుంది. అప్పుడు వచ్చింది జానకి. గ్యాలరీల క్రింద కేవలం ఓ మనిషి పట్టేటంత చిన్న గేటు వుంది స్విమ్మింగ్‍పూల్‍కి వెనుకవైపు. అది తెరుచుకుని వచ్చి కాసేపు నీళ్ళని చూట్టానికి వచ్చింది ఆమె. రాజవ్వపైకి లంఘించిన పులిని చూసి అవాక్కయింది జానకి. ఆ అయోమయంలో మరింత ముందుకే పదడుగులు వేసింది మంత్రవశురాలిలా.
ఇప్పుడు ఆ ఆవరణలో పులినోట ప్రత్యక్షంగా చిక్కుకుపోయిన రాజవ్వ, కేమెరా ఏంగిల్స్ సరిచేసుకుంటున్న వీడియో బృందం, జానకి వీళ్ళు మాత్రమే మిగిలిపోయారు.
రాజవ్వమెడని బలంగా కరచిపెట్టుకుని లాక్కుంటూ ఓ పొదచాటుకు వెళ్ళి,ఆమె శరీరంపై ఓక కాలు అదిమిపెట్టి పరిసరాల్ని అప్రమత్తంగా గమనిస్తూ ’గుర్ర్, గుర్ర్’ అంటు చూస్తోంది పెద్దపులి.
రాజవ్వ ’పులి పులి’ అని మొదటి సారి కేకలు పెట్టినప్పుడు కెమెరాబృందం చిన్న గేటుకు కేవలం అయిదడుగుల దూరంలో మాత్రమే ఉండినారు. పారిపోవటానికి అది మహదావకాశం వారికి. కానీ రాజవ్వ తమవైపు కాక ప్రధాన ద్వారం వెళ్ళటంతో వారు కాస్తా తెరిపినపడ్డారు.
వృత్తిపరమైన ఆసక్తితో రాజవ్వ అరచుకుంటూ బయటకు వచ్చినది లగాయతు వీడియోలో రికార్డు చేయటం మొదలెట్టారు. పులి ఇటు వైపు వస్తే పారిపోదాములెమ్మని కాస్తా తాత్సారం చేశారు. చిన్నగేటు దగ్గరగానే వుండటం వారి ధైర్యానికి కారణం.
పెద్దగేటు వైపునుంచి ఇక్కడి దాకా రావటానికి కనీసం అంటే ఓ రెండొందల ఆడుగులదూరం వుంది కద, పులి ఇటువైపు రావటం మొదలంటూ పెడితే  క్షణాలలో చిన్న గేటుద్వారా బయటికిపారిపోయి, ఆ చిన్న గేటు మూసేస్తే, ఇక పులి బయటకు ఎంతమాత్రమూ రాలేదని వారి అంచనా. అది నిజానికి సరయిన అంచనానె. ఎందుకంటే చుట్టూ ఎత్తైన గ్యాలరీలు, మరో వైపు పెద్ద గేటూ ఇలా ఎటూ పారిపోవటానికి దానికి అవకాశం ఉండదు కూడాను.
అన్నీ అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది?
అందరి అంచనాల్నీ తలక్రిందులుచేస్తూ జానకి రంగప్రవేశం చేసింది సరిగ్గా అదే సమయానికి. రావటం రావటమే ఓ పదడుగులు ముందుకు దూసుకువెళ్ళి పెద్దపులి దృష్టి ఇటుపడేలా చేసింది.
రాజవ్వ శరీరం నిర్జీవం అయ్యేవరకు అలాగే ఒడిసిపట్టుకుని, ఆ వృద్దురాలు నిశ్చేతనంగా తలవాల్చాక, ఆమెని వదిలేసి ఇటువైపు నింపాదిగా అడుగులు వేయటం మొదలెట్టింది. కదలటం కూడా మరచిపోయి అలాగే చూస్తూ ఉండిపోయింది జానకి.
పెద్దగేటు దగ్గరి పచ్చిక బయలు దాటి, హాలు - వరండా దాటి, షవర్ బాత్ చేసే స్థలం దాటి నీరెండలోకి వచ్చి నిలబడింది. ఇప్పుడు పులి ఎదురుగా నీలిరంగు ఆకాశాన్ని ప్రతిఫలిస్తున్న స్విమ్మింగ్ పూల్. పూల్‍కి ఒక వైపు జానకి పులికి కాస్తా దగ్గరలో, పూల్‍కి రెండవవైపు వీడియోబృందం పులికి కాస్తా దూరంలో.
 చిన్న గేటు జానకి వచ్చిన వైపు వుంటుంది. ఇంకో రెండడుగులు ముందుకేసింది పులి. స్థాణువులా నిలబడిపోయింది జానకి.
పులి గాండ్రింపుతో ఒక్కసారిగా స్పృహలోకి వచ్చింది ఆమె.
ఇంకో రెండడుగులు ముందుకు వేసి , ఈతకొలను దగ్గర ఆగి, ముందరికాళ్ళు మడిచి, ముందుకు వంగి నింపాదిగా నీళ్ళు త్రాగింది పులి. దానిలో ఎటువంటి భీతి కనపడటంలేదు. మంచి యవ్వనంలో వుందది. ఆరోగ్యంగా నీరెండలో మిసమిసలాడుతున్న పచ్చటి శరీరం. నల్లరంగు చారలు దాని అందానికి తుదిమెరుగులు దిద్దుతున్నాయి.
రాయల్ బెంగాల్ టైగర్ అంటే ఇదే అనుకుంటా’ గేటు వద్ద నుంచుని ఉత్కంఠగా చూస్తున్న టీచర్ ఎవరో ప్రక్కనున్న వారికి చెపుతోంది. పెద్ద గేటు వైపు చేరిన జనాల సంఖ్య ఎక్కువయింది. చుట్టూ బిల్డింగ్స్ పై చేరిపోయి ఆందోళనగా చూస్తున్నారు టీచర్లు ఇతర స్టాఫ్ మెంబర్లు.
కొలనుకి ఒక అంచున సరిగ్గా మధ్యలో పెద్దపులి. దానికి యాభై అడుగుల దూరంలో ఒక వైపు జానకి. మరో వైపు అటుచివర ఓ వంద అడుగుల దూరంలో వీడియో బృందం. కాన్ఫరెన్సు హాల్లో బాస్ కి ఎదురుగా ఉన్న పొడగాటి టేబుల్‍కి అటుఇటూ కూర్చున్న ఇతర ఉద్యోగస్తులలా వున్నారు వారు. మధ్యలో స్విమ్మింగ్‍పూల్.
నీళ్ళు త్రాగటం ముగించి, ఒక సారి తల విదిల్చింది. మూతికి అంటుకున్న నీటిని పొడవైన నాలుక బయటకు చాచి,, మూతి చుట్టూ తుడుచుకుంది. కుడికాలు పైకెత్తి, పంజాని నాలుకతో తడిచేస్కుని, మొహం మొత్తం తుడుచుకుంది.
తరువాత ముందు కాళ్ళు చాచి ఒళ్ళు విరుచుకుంది. ఇప్పుడది ఎంతో ఉత్సాహంగా వున్నట్టు కనిపిస్తోంది. కెమెరా బృందం ఈ కదలికల్ని యావత్తు తమ కెమెరాలో బంధిస్తున్నారు.
తిరిగి నడక ప్రారంభించింది పులి. అది జానకి ఉన్న వైపుకి రాకుండా కెమెరామెన్లు ఉన్న వైపుకి నడకమొదలెట్టింది.
ఇప్పుడు కొలనుకి అటువైపు పులి, ఇటువైపు జానకి. మధ్యలో తళతళలాడుతూ నీలిరంగు నీళ్ళు. మధ్యలో ఆగి అది ఓసారి  జానకి వంక తేరిపార చూసింది, ఝల్లుమంది ఆమెకి. కాసేపలాగే నిలబడి ఆమె వంకే చూసి, తిరిగి నడక కొనసాగించింది పులి. వళ్ళంతా చల్లగా అయినట్టయింది జానకికి.
 కెమెరావారికి పులికి మధ్యలో దూరం తగ్గిపోతోంది.
"మేడం! చిన్న గేటు వైపు వచ్చేయండి. పారిపోదాం" కేకలు పెడుతూ పరుగులంకించుకున్నారు కెమెరా బృందం వారు. చెవుల్లొ ఆ అరుపులు చేరుకుంటున్నాయి కానీ, ఊహించని విధంగా కంటి ముందు జరిగిపోతున్న దృశ్యాల వల్ల బహుశా ఆమె మెదడు స్థంబించిపోయింది కాసేపు.
వెనక్కు తిరిగి కొన్ని క్షణాలు ఆలశ్యంగా పరుగు మొదలెట్టింది జానకి. ఆ కొన్ని క్షణాల ఆలశ్యంవల్ల చాలా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సొస్తుందని ఆమెకి ఊహామాత్రంగా కూడా తెలియదు.
పరుగందుకున్న వారిని చూసి అమితోత్సాహంతో వెంబడించింది పులి.దానికి అంతా ఆటలా వుంది. పూల్ ఆ చివరనుంచి నలుగురూ  జానకి ఉన్న వైపుకి వచ్చేసి చిన్నగేటులోంచి  బయటపడాలి.
మొదటి ముగ్గురూ క్షేమంగా బయటపడ్డారు. నాలుగో వాడు గేటుదగ్గరికి చేరుకోవటంలో మిగతా వారికంటే కాస్తా వెనుకబడ్డాడు.
వాడు చిన్నగేటుదగ్గరకు చేరుకునే లోగా వాడి పిరుదుని ఒడిసి పట్టేసింది పులి. ప్రాణభయంతో పరిగెత్తుతున్నఅతడెలాగోలాగ దాని బారినుంచి తప్పించుకుని రక్తమోడుతూ , చావు తప్పి కన్నులొట్టబోయినంతపనై , కుంటుతూ ఆ చిన్న గేటుని దాటి బయట పడగలిగాడు.
ఒకే ఒక క్షణం తేడాతో జానకి కూడా చిన్నగేటు దగ్గరికి చేరగలిగింది. ఇప్పుడు జానకికి పులికి మధ్య కేవలం ఒక నాలుగడుగుల దూరం మాత్రమే ఉంది. గేట్ దాటి బయటకు అడుగేసి , గేటు మూయటానికి ఆ సమయం చాలు నిజానికి. కాబట్టి జానకి కూడా క్షేమంగా బయట పడిగలిగేదే, ఒక చిన్న అపశృతి దొర్లకుండా వుండుంటే.
విధి వింతనాటకం ఆడటమంటే అదే కావచ్చు బహుశా.
చివరిగా పరిగెత్తిన వాడు గాయం కారణంగా కావచ్చు ఇరుకైన ఆ చిన్నద్వారాన్ని దాటుతుండంగానే స్పృహతప్పి పడిపోయాడు, ఆ పడటంలో అతను గేటును ఆసరాచేసుకుంటూ బరువంతా దానిపై వేసి నేలపై పడిపోయాడు. వాడలా పడటమేమిటి, ఆ పాత గేటు పూర్తిగా ఊడిపోవటమేమిటి క్షణాలలో జరిగిపోయాయి. ఇప్పుడు మూద్దామన్నా గేటు లేదు. పారిపోతున్న వారితో పాటుగా పులి కూడా స్వేఛ్చగా బయటకు రావటానికి ఆస్కారం ఏర్పడింది.
ఇప్పుడు జానకి సరిగ్గా ఆ ఇరుకైన గేటు వద్దకు వచ్చేసింది, అది  దాటంగానే తాను బయట పడ వచ్చు. పులి జోరుగా కదిలి వస్తోంది. నిజానికి  ఇంకా కూడా పులికి తనకి సేఫ్ డిస్టేన్స్ వుంది .
ఈ క్షణందాకా ఆ చిన్నగేటు దాటంగానే తను సేఫ్ అనుకుంటు వచ్చింది . ఇప్పుడు కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఏ గేటయితే తనకు రక్షణ ఇవ్వగలిగివుండేదో అది ఇప్పుడు ఊడిపోయింది. తానిక పూల్ లోపలవైపున ఉన్నా, బయటకి వెళ్ళినా రక్షణలేదిక తనకి.  ఆ ఇరుకైన చిన్న ద్వారం వద్దనే ఆగిపోయి, అడ్డుగా నిలబడిపోయింది.
పులికి తాను చిక్కటం ఖాయం అని అర్థం అయిపోయింది జానకికి. తన మృత్యువు గేటుకి ఇవతలా లేదా గేటుకి అవతలా అన్న విషయంలో మాత్రమే తానిక నిర్ణయం తీసుకోగలదు.
తాను ఇరుకైన ఆ గేటుకి అడ్డుగా నిలబడినంతసేపు పులి బయటికి వెళ్ళలేదు. తన్ని తరుముకుంటూ ఎప్పుడైతే పులి గేటు దాటి స్కూలు ఆవరణలోకి వచ్చేస్తుందో పరిస్థితి మరింత భయంకరంగా తయారవుతుంది. అందర్నీ తను మాత్రమే కాపాడగలదు.

ఆ చిన్న గేటు అవతలంతా తోట, పెద్ద పెద్ద వృక్షాలు, పచ్చిక బయలు వున్నాయి. దాని తర్వాత పెద్ద ఎత్తుగాలేని కాంపౌండ్ వాల్. ఆ కాంపౌండ్ వాల్ దాటితే కాలనీలోకి కూడా వెళ్ళిపోవచ్చు పులి కావాలనుకుంటే. కాంపౌండ్ వాల్‍లోపలి వైపునంతా  బ్లాకులు, బ్లాకులుగా స్కూలు భవనాలు, ఆఫీసు గదులు, క్యాంటీన్, టెన్నిస్ కోర్ట్, సర్వెంట్ క్వార్టర్స్, పార్కింగ్ ప్లేసు, ఇలా విస్తరించి ఉంది స్కూలు.
కాలం ఇప్పటిదాకా ఎంత వేగంగా పరిగెత్తిందో, దానికి వ్యతిరేకంగా ఇప్పుడు క్షణమొక యుగంలాగా గడుస్తోంది జానకికి.
రాజవ్వ పులిని గుర్తించటం,  అటువైపు పెద్ద గేటు మూసి వేయటం, రాజవ్వ పులి చేతికి చిక్కి హతమవటం, తనప్పుడే చిన్న గేటు ద్వారా ఈత కొలను ప్రాంగణంలోకి రావటం, పులి ఇటు వైపు వచ్చి కెమెరా వారిపై దాడి చేయటం, చిన్న గేటు ఊడిపోవటం, ఇదంతా సినిమా రీల్లా కొన్ని నిమిషాలలో జరిగి పోయాయి.
మీడియాకి వార్త వెళ్ళలేదింకా. ప్రిన్సిపాల్ ఫోన్ మీద ఫొన్ చేసి అన్ని శాఖలనీ అప్రమత్తం చేస్తున్నారు. పిల్లలెవర్నీ తరగతి గదులనుంచి బయటకు రానియ్యవద్దని మైకులో అన్ని క్లాసుల్లో ప్రకటనలు చేయిస్తున్నారు. అవసరమయితే పులిని షూట్ చేయటానికి సెక్యూరిటీ గార్డులు ఆయుధాలు సిద్ధం చేసుకుని చిన్న గేటు వద్దకు వచ్చేశారు.
జూ పార్క్ వారికి విషయం తెలిపారు.
"దయచేసి పులిని చంపవద్దు." ఛీఫ్ క్యూరేటర్ పాణిగ్రాహి ఫోన్లోనే అభ్యర్థించారు ప్రిన్సిపాల్ని. "కేవలం అరగంటలో ట్రాంక్విలైజర్లను తీసుకుని మాషూటర్స్ అక్కడికి చేరుకుంటారు. దయచేసి ఓపిక పట్టండి" పాణిగ్రాహికి జంతువులంటే ప్రాణం. పులికి అంతా ఓ ఆటలాగా వుంది. ఎవరైనా పారిపోతుంటేనే వెంటాడె గుణం కల్గిన ఆ పులి కూడా ఆగిపోయింది. జానకి చూపుని స్థిరంగా నిలిపి పులి కళ్ళలోకి చూస్తూ వుండిపోయింది.
మంత్ర ముగ్ధలా పులి కూడా జానకి కళ్ళలోకి చూస్తూ వుండిపోయింది. ఒక్కొక్క అడుగే వెనక్కు వేస్తూ నెమ్మదిగా తోటలోకి జారుకోవచ్చు తను కావాలంటే. కానీ జానకి ఆలొచన వేరే లాగా వుంది. ఆమె మనస్సులో కొన్ని స్థిరమైన ఆలోచనలు రూపుదిద్దుకుంటున్నాయి.
తాను ఈ వేళ బలి అవటం ఖాయం. ఆ తరువాత పులి బయటకు వెళ్ళి తన నరమేధాన్ని కొనసాగించనూవచ్చు లేదా ఆవేశపరులైన మానవులచేతిలో హతమారిపోనూ వచ్చు. ప్రకృతి ప్రేమికురాలైన జానకికి ఈ రెండు పరిణామలూ ఇష్టం లేదు.
తను ఇక్కడే వీలయినంత ఎక్కువ సేపు నిలబడితే, అందరికీ కాస్తా ఆలోచించుకోవడానికి సమయం దొరుకుతుంది.ఏదో మంచి పరిణామం చోటు చేసుకోవచ్చు. ఇలా సాగుతున్నాయి జానకి ఆలోచనలు.

సర్వే భవన్తు సుఖినః, సర్వే సంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు, మాకశ్చిద్దుఃఖ భాగ్భభవేత్
ఓమ్ శాంతి శాంతి శాంతిః

తండ్రి  పెంపకంలో చిన్నప్పటి నుంచి తాను పొందిన సంస్కారాలు జానకిని ఒక పరిపూర్ణ జ్ఞానవంతురాలిగా చేశాయి.  ప్రపంచంలో ప్రతి ఒక్క జీవి సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో వుండటమే నిజమైన జీవన విధానమని విశ్వసిస్తుంది జానకి.
పులిని వీలయినంత ఎక్కువసేపు నిలిపి ఉంచితే అనేక మంది పిల్లల్ని కాపాడినట్టవుతుంది, అందరు పిల్లలూ తన పిల్లల్లాంటి వారేకద.  ఈ పులి సైతం అకారణంగా తనకి హాని తలపెట్టదని ఎందుకో ధృఢవిశ్వాసం కలుగుతోంది. తన మనస్సు శాంతిమయంగా వున్నంత సేపు ఏజీవీ హాని తలపెట్టదు అని ప్రగాఢంగా నమ్ముతుంది ఆమె. మనలోని వ్యగ్రత తరంగాల రూపంలో మనచుట్టూ వున్న ప్రకృతిని ప్రభావితం చేయగలదని ఆధునిక కిర్లియన్ ఫోటోగ్రఫీ మరియు ’స్టడీ ఆఫ్ హ్యూమన్ ఆరా’ మనకు చెపుతున్నాయి. ఇవేవీ మూఢనమ్మకాలు కావని సైన్స్ చెబుతోంది.
మనం మన మనస్సంతా శాంతి మయంగా ఉంచుకుని ఎదుటి జీవి కళ్ళలోకి ప్రశాంతంగా చూపు నిలిపి ఉంచితే ఎంత కౄర జంతువైనా మనపై దాడి చేయదు అని చిన్నప్పుడు తండ్రి చెప్పిన పలుకులు వేద మంత్రాలలా  ఆమె స్మృతిలో మెదలుతూవున్నాయి స్పష్టంగా.
ఆ నమ్మకాన్ని ధృడపరిచే వీడియోలు ఇటివల్ యూట్యూబులో చూడటం జరిగింది తాను.
పులిని సైతం తన బిడ్డే అన్న భావాన్ని మదినిండా నింపుకొని దానికళ్ళలోకి స్థిరంగా చూస్తూ "బంగారూ ఏది ఏమయినా ఈవేళ నిన్ను బయటికి వెళ్ళనివ్వను, నీకూ హాని వద్దు, నీ వల్ల ఇతరులకూ హాని వద్దు" అన్న మాటల్ని స్పష్టంగా ఉచ్చరించింది జానకి. ఒక మాతృమూర్తి తన బిడ్డతో మాట్లాడుకుంటున్నటువంటి  తాదాత్మ్యత వుందా కంఠంలో.
పసుపు పచ్చ కాటన్ చీర, ఏర్రటి జాకెట్లో పవిత్రతకి మారుపేరులా వుందా క్షణంలో జానకి. ఇల్లు దగ్గరే కావటాన పెద్దగా మేకప్ కూడా ఏమీ చేసుకుని రాలేదు తాను. పసిమి చాయలో వుంటుంది జానకి. ఆమె సహజంగానే చాలా అందంగా వుంటుంది. అయిదున్నర అడుగుల ఎత్తు, ఎత్తుకి అనుగుణమైన్ శరీర సౌష్టవం, సభ్యత ఉట్టిపడే వస్త్రధారణ.
ఒళ్ళంతా చెమట్లు పట్టేసి వుండటాన నుదుటనున్న కుంకుమ కొద్దిగా చెదిరి వీరతిలకంలాగా వుండి ఆమె రూపానికి మరింత తేజస్సును ఇస్తోంది.
చీరకొంగు నడుమున దోపుకుని, రెండు చేతులూ నడుంపై వుంచుకుని, తొణకని బెణకని గాంభిర్యంతో చూపరులందరినీ అబ్బుర పరుస్తోంది.
తల్లి తండ్రుల దగ్గర తాను నేర్చుకున్న సంస్కారం, తండ్రి, గురువులు అందించిన విద్యలూ ఆమెకి సరయిన సమయంలో సరయిన విధంగా ఉపయోగపడుతున్నాయి. మానసిక శాస్త్రవేత్తలు చెప్పేదదే. మన మెదడుని చెత్తతో నింపుకుంటే, అవసరమైన సమయాలలో మనిషికి తనలోనుంచి ఆత్మస్థైర్యం అందే బదులుగా, ఆత్మఘాతకమైన ఆలోచనలు ఉద్భవిస్తాయి అని. దేశంలో ఇప్పుడు ఇన్ని ఆత్మహత్యలు పెరిగిపోవటానికి ఇదే కారణం. మార్కులే లక్ష్యంగా సాగుతున్న విద్యావిధానం యొక్క ఫలితం ఇది.
ఎక్కడో చదివిన రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి మాటలు అసంకల్పితంగా గుర్తొచ్చాయి జానకికి ఆ క్షణంలో. "అడవిలో అయితే పులిదే రాజ్యం, కానీ మనిషి జీవితంలో కూడా అదే పెత్తనం చేస్తే ఎలాగా, మనిషి న్యాయం వేరు, పులి న్యాయం వేరు."
చిన్నగా నవ్వుకుంది జానకి. పులి అడవిలోనే వుండాలి, మనిషి ఊర్లోనే ఉండాలి. ఆడవికి ఊరికి తేడా వుండాలి కద. తనని తాను కూల్‍గా వుంచుకోవటానికి మనస్తత్వశాస్త్రవేత్తలు ఏవయితే పాఠించాలని చెప్తారో సరిగ్గా అవే పనులు చేస్తోంది ఆమె. దీన్ని థాట్ హైజాకింగ్ ప్రాసెస్ అంటారు. ఒక సాధారణ గ్రాడ్యుయేట్ ఆమె. నిజానికి ఆమెకి ఇవేవీ తెలియదు కూడా. 
మనస్సును కాసేపు మనమేమీ చేయలేని సమస్య నుంచి మళ్ళించి ఇతర ఆహ్లాదకరమైన విషయాల గురించి ఆలోచిస్తే, కాస్మిక్ ఎనర్జీతో నిండిన విశ్వం నుంచి తప్పకుండా పరిష్కారం లభిస్తుంది అని చెప్తుంది ’ది సీక్రెట్’ అన్న పుస్తక రచయిత్రి ’రోండా బైర్నే’.
"నాన్నా పులి , నిజంగానే పులి వచ్చింది నాన్నా మాస్కూల్లోకి. అమ్మ ఆ పులికి ఎదురుగా నిలబడి వుంది నాన్నా. భయంగా వుంది నాన్నా. నీవు త్వరగా వచ్చేయి నాన్నా" కాసేపు తనేం వింటున్నాడో అర్థం కాలేదు ప్రకాష్‍కి.
పిల్లల చేతిలోంచి ప్రిన్సిపాల్ ఫోనందుకుని ఆ విషయం నిజమేనని కన్ఫర్మ్ చేయటంతో అదిరి పడ్డాడు. హైటెక్ సిటీనుంచి హుటాహుటిన బయల్దేరాడు.
పబ్లిక్ అడ్రస్ సిస్టెం ద్వారా ప్రిన్సిపాల్ జానకిని ధైర్యంగా వుండమని ప్రకటన చేశారు. ’జానకి గారు మీరు తీసుకున్న నిర్ణయం అసాధారణమైనది. మేమందరం మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాము. మిమ్మల్ని రక్షించటానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నాము. ఏ క్షణంలోనైనా జంతుప్రదర్శన శాల అధికారులు రావచ్చు. మీరు స్థైర్యం కోల్ఫోవద్దు. మీరు నెమ్మదిగా ఒక అడుగు వెనుకకు వేస్తే చాలు. మన సెక్యూరిటీ గార్డులు దాన్ని షూట్ చేయటానికి సిద్ధంగా వున్నారు"
దూరంగా కనిపిస్తున్న ప్రిన్సిపాల్ గది వైపు చూస్తూ ’వద్దన్నట్టు’ తల నెమ్మదిగా ఊపింది జానకి.
అప్పుడర్థమైంది అందరికీ ఆగిపోవాలని జానకి తీసుకున్న నిర్ణయం అనాలోచితంగా తీసుకున్నది కాదని. స్కూలు పిల్లల్ని, ఉద్యోగస్తుల్ని, అవతల కాలనీ ప్రజల్నీ ఇలా అందర్నీ కాపాడగలిగే అవకాశం పులిని అక్కడ ఆపిఉంచినంత సేపు మాత్రమే వుంటుందని, ఇలా అందర్నీ కాపాడే బాధ్యత తనొక్కతే ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా తన భుజస్కంధాలపై వేసుకుందని అందరికీ అర్థం అయిపోయింది.
అదృష్టవశాత్తు పులి కూడా కాస్తా నెమ్మదిగా వుంది.
పులి ఒకడుగు వెనుకకు వేసి వెనుక కాళ్ళని మడిచి తోక భాగం నేలకు ఆన్చి, యజమాని ముందు కూర్చునే పెంపుడు పిల్లిలా కూర్చుంది. నాలుక బయటకు వేలాడేసి ఊపిరి వేగంగా తీసి వదుల్తూ వుంది. అదలా విశ్రాంతిగా కూర్చోవటం ఆశ్చర్యమే.
జానకి చిరునవ్వుతో ప్రేమ నిండిన పలుకులను వల్లె వేస్తూనే వుంది. ఎంతో దగ్గరిబంధువులనో, పసిపిల్లలనో పలకరించినట్టు దానిని పరామర్శిస్తోంది. ఆమె గుండెనిండా ప్రేమే. అందులో ఇసుమంతయినా కపటత్వం లేదు.
జానకి మదినిండా ఎడతెగని ఆలోచనలు.
అడవులని సైతం ఆక్రమించుకుంటున్న మానవుడు జంతువులకు నిలువనీడలేకుండా చేస్తున్నాడు. చిత్తూరు జిల్లాలలో పొలాల్లోకి ఏనుగులు రావటాలు, ఊర్లలోకి పులులు రావటాలు ఇవన్ని దాని ఫలితాలే.
తను కూర్చున్న చెట్టు కొమ్మ తానే నరుక్కోవటం మనిషి ఆపనంతవరకు మనిషి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఓజోన్ పొరలో చిల్లి ఏర్పడితే తన ఉనికికే ముప్పు వచ్చే విషయం మానవుడికి తెలియంది కాదు. అయినా ఏసీలు ఆపడు, వాహన కాలుష్యాన్ని తగ్గించుకోడు.
చర్య అన్నది ఉన్నాక దానికి తగిన ఫలితం కూడా వుంటుంది కద.
అంతరిక్ష శాంతిః, పృథ్వీ శాంతిః, ఆపః శాంతిః, ఔషధస్యహ్ శాంతిః, వనస్పతయహ శాంతిః, విశ్వే శాంతిః.
తండ్రి చిన్నప్పుడు వల్లె వేస్తుండిన వేద మంత్రాలు గుర్తొచ్చాయి జానకికి. వంట చెరకుకోసం సైతం క్రిందపడిన ఎండుకొమ్మల్నే ఏరుకుని, చెట్టుకి హాని చేయని సంస్కృతి మనది. ఇదంతా మూఢనమ్మకం కాదు. ఏకలాజికల్ బ్యాలెన్స్ అని ఈ వేళ ఏదయితే అంటున్నారో అది మన సంస్కృతిలోనే వుంది. ఎప్పుడైతే మానవుడు దీనికి తిలోదకాలు ఇచ్చాడో ప్రకృతి వైపరిత్యాల్ని ఎదుర్కోవటాలు నిత్యకృత్యాలు అయ్యాయి.
జానకికి ఆ పులిని చూస్తున్న కొద్ది భయం కలగటం పోయి ఆ స్థానే జాలి, అంతకు మించిన ప్రేమ కలుగసాగాయి.
"ఏం భయపడకు బంగారు. నేనున్నాను కద. నిన్నెవరూ ఏం చేయరు. సరేనా!" ఆమె కంటి చూపునుంచి జాలువారుతున్న ప్రేమ, కంఠంలోంచి పొంగిపొర్లుతున్న వాత్సల్యం, పెదవులపై తటిల్లతలా మెరుస్తున్న మందహాసం, ఆమె గుండెల్నిండా నిండిన ప్రశాంతత ఆ కౄరజంతువుకు అర్థమవుతున్నట్టే వున్నాయి.
నెమ్మదిగా అది ఒక సారి కండ్లు మూసి తెరిచింది.  భయం కలిగించేలా నోరంతా ఒక సారి తెరిచి దాని కోరపండ్లు కనపడేలా అవులించింది.
జానకి దాన్నే చూస్తూ వుంది.
ఈ లోగా పెద్ద గేటు వైపు కొద్దిగా హడావుడి, కోలాహలం మొదలవటంతో అటు వైపు దృష్టి సారించింది ఆమె. ఖాఖీ యూనీఫాంలో వున్న నలుగురయిదుగురు ఆజానుబాహులైన వ్యక్తులు, జూ అధికారుల్లాగున్నారు, ఆమె వైపు చేతులు ఊపుతూ కనిపించారు.
మైకులో ప్రకటన వినిపిస్తోంది. " జానకి గారు. మీరింకేమీ కంగారు పడవలసిన పని లేదు. జంతుప్రదర్శన శాల అధికారి పాణిగ్రాహి గారు, వారి టీంతో సహా వచ్చేశారు. వారు మత్తుమందు(ట్రాంక్విలైజర్స్) కలిపిన బుల్లెట్లతో దాన్ని అదుపులోకి తీసుకుంటారు. వారు నెమ్మదిగా మీరున్న చిన్నగేటువైపుకి వస్తారు. మీ వెనుక నుంచి వారు వచ్చిన సమయానికి మీరు కొద్దిగా ప్రక్కకు తప్పుకుంటే వారు గన్స్ తో షూట్ చేస్తారు. మీరు కొద్దిగా సహకరించాలి. మీకు పాణిగ్రాహి గారు ఎప్పటికప్పుడు సూచనలని అందిస్తారు"
వారు స్విమ్మింగ్ పూల్‍చుట్టూ తిరిగి నెమ్మదిగా వెనుక వైపున్న చిన్న గేటు వద్దకు చేరారు. వారెంత నెమ్మదిగా వచ్చినా గాలిలో వచ్చిన మార్పులని గమనించగలిగింది ఆ జంతువు.
అది లేచి నెమ్మదిగా జానకికి దగ్గరగా వచ్చింది. ఎంత మాట్లాడినా అది కౄర జంతువు. కానీ జానకి దాన్ని ప్రేమతో పలకరిస్తూనే వుంది.

****
ఇక వర్తమానంలోకి వస్తే,
పెద్ద పులి నిలబడి వుంది జానకి ఎదురుగా.
కళ్ళలోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తోంది. ఇద్దరూ కదలటం లేదు. దాని కళ్ళలోకే చూస్తూ నిలుచుంది జానకి. పులి చాలా అలర్ట్‌గాచూస్తూ, తన తోకని బిర్రుగా చేసి కొరడాలా గాలిలోనెమ్మదిగా కదుపుతోంది.  ముందరి పాదాల్ని నేలకి బలంగా ఆన్చి దూకడానికి సన్నద్ధంగా వుంది. కాలి చివర పంజాల్నించి బయటకి రావటానికి కూచిగా వున్న గోళ్ళూ సిద్దంగా వున్నాయి.

అది ఒకడుగు ముందుకేసింది. జానకి దానినే చూస్తూ వుంది.
అప్పుడు జరిగింది ఆ సంఘటన.
ముందుకు రాబోతున్నదల్లా నెమ్మదిగా నేలపైకి వాలిపోయిందది. దాని కళ్ళు క్రమంగా మూతలు పడ్డాయి. విక్టరీ సింబల్ చూపిస్తూ చెప్పాడు పాణిగ్రాహి "కంగ్రాచ్యులేషన్స్ మేడం! కేవలం ప్రేమ అనే బలమైన ఆయుధంతో మీరు దీన్ని సరిగ్గా గంటసేపు ఆపగలిగారు. అరగంటలో రావలసిన వాళ్ళం ట్రాఫిక్ వల్ల ఆలశ్యం అయ్యింది.  మేమిచ్చిన డోస్ కి కనీసం ఇంకో మూడు గంటలు లేవదు అది"
బిలబిల లాడుతూ లోనికి వచ్చేశారు జర్నలిస్టులు,కెమెరాల వాళ్ళు. కానీ జానకి చూపు తన పిల్లల కోసరం వెదుకుతోంది.
"అమ్మా" అంటూ వచ్చి అక్కున చేరారు జానకి పిల్లలిద్దరు. ప్రకాష్ జానకిని అభినందిస్తూ బొటనవేలిని పైకి చూపిస్తూ దూరం నుంచే అభినందిస్తున్నాడు.  పిల్లలిద్దర్ని పొదివిపట్టుకుని జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకి సిగ్గు పడుతూ సమాధానాలు చెపుతోంది జానకి, చూపంతా ప్రకాష్ వైపే వుంది.
 -----సమాప్తం-------

-Published in Telugu Velugu Monthly Magazine May 2019

ఓ పిట్ట కథ (జానర్: సస్పెన్స్ థ్రిల్లర్, రొమాంటిక్ క్రైం డ్రామా)



ఓ పిట్ట కథ

(జానర్: సస్పెన్స్ థ్రిల్లర్, రొమాంటిక్ క్రైం డ్రామా)
చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూసిన అనుభూతి కలిగించింది ఈ సినిమా.
చివరి నిమిషం వరకు సస్పెన్స్ తో అద్భుతమైన స్క్రీన్ ప్లే తో బాగా సాగిపొతుంది. చాలా నీట్ గా, ఆహ్లాదంగా వుంది. అందరూ చూడదగ్గ చిత్రం. గోదావరి అందాలు, అరకు లోయ అందాలు చక్కగా ఉపయోగించుకున్నారు.
ఫోటొగ్రఫీ, సంగీతం, ఎడిటింగ్ డిపార్ట్ మెంట్లు ఈ సినిమాకి అసలైన బలం.
కొన్ని సంవత్సరాల క్రితం వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా చూసి ఒక విధమైన తృప్తి తో బయటికి వచ్చాను. నిజానికి, స్క్రీన్ ప్లే పరంగా, నేటివిటీ పరంగా, అందులో కొన్ని అంశాలు పంటి క్రింద రాయిలా తగిలినా, ఎంత వద్దనుకున్నా కనిపించే మళయాళ వాసనలు వున్నప్పటికి బాగానే వుందబ్బ అనిపించింది అప్పట్లో.
ఈ ’ఓ పిట్ట కథ’ లో అలాంటి ఇబ్బందులు కూడా ఏమీ లేవు, హాయిగా ఒక చక్కని తెలుగు చిత్రాన్ని తెలుగు వాతావరణంలో బాగా తీశారు.
ఈ స్థాయిలో అలరించిన చిన్న బడ్జెట్ సినిమాలు ఇటీవల రాలేదు. చిన్న బడ్జెట్ చిత్రాలన్నీ విధిగా అసభ్యత, లేదా యూత్ సినిమా అని పేరు పెట్టుకుని హింస, బూతులతో నిండి చండాలంగా వుంటున్నాయి.
కానీ ఈ ’ఓ పిట్ట కథ’ దృశ్యం సినిమా అంతటి తృప్తిని ఇచ్చింది.
ప్రేక్షకుడికి కలిగే ప్రతి సందేహానికి చివర్లో సమాధానం దొరుకుతుంది.
’ఓ పిట్ట కథ’ సినిమాని ఎటువంటి అంచనాలు లేకుండా చూశాను నిన్న సాయంత్రం.
అమెజాన్ ప్రైమ్‍లొ విడుదల అయింది.
ఈ సినిమా విడుదల తేది మార్చి ఆరు. బహుశా కరొనా దెబ్బకి విడుదల అయిన పదే పది రోజుల్లోపలే అమెజాన్ లో ప్రత్యక్ష్యం అయింది. పాపం అనిపించింది.
బ్రహ్మాజి తప్ప ఇందులో మనకు తెలిసిన నటీ నటులు ఒక్కరూ లేరు.
బాల నటిగా ’దేవుళ్ళు’ చిత్రంలో నటించిన నిత్యా షెట్టి హీరోయిన్ గా నటించటం ఒక విశేషం. ఈ అమ్మాయి చాలా చక్కగా చలాకీగా, చిలిపిగా పాత్రోచితమైన అమాయకత్వం తో చాలా అహ్లాదంగా కనిపించింది.
ఈ అమ్మాయి ప్రేమికులుగా నటించిన సంజయ్ కుమార్, విశ్వంత్ చాలా అనుభవమున్న నటులలాగా నటించారు. బ్రహ్మాజి పుత్రుడు సంజయ్ కుమార్ కి ఇది మొదటి చిత్రమే అయినా చాలా ఈజ్ తో నటించాడు.
కథ:
హీరోయిన్ వెంకట లక్ష్మి చిన్నతనం లోనే తల్లిని కోల్పోవడంతో, తల్లి తండ్రి అన్నీ అయి వాళ్ళ నాన్నగారు బాగా చూసుకుంటూ వుంటారు. వీళ్ళు ఒక చిన్న ఊర్లో వుంటారు. వీళ్ళ జీవనాధారం వాళ్ళ స్వంత సినిమా థియేటర్. అందులో అసభ్య చిత్రాలు ఆడిస్తూ ఏదో ఆ పూటకి ఆ పూటకి అన్నట్టు జీవితం వెళ్ళదీస్తూ వుంటాడు ఆమె తండ్రి. పైగా ఆయనకు ఊరంతా అప్పులు పేకాట వ్యసనం కారణంగా .
ఈ అమ్మాయి మేనత్త చిన్నప్పుడే ఇంట్లో వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్ళి చేసుకుని విదేశాల్లో స్థిర పడి వుంటుంది.
ఈ నేపథ్ద్యంలో ఆ మేనత్త కొడుకు ఊడిపడతాడు. మొదటిచూపులోనె మరదలితో ప్రేమలో పడతాడు.
ఈ అమ్మాయి అప్పటికే తన బాల్య మిత్రుడు, తమ సినిమా హాల్లో పని చేసే కుర్రాడితో (సంజయ్ ) ప్రేమలో వుంటుంది.
ఈ ముగ్గురి మధ్య కథ అనేక మలుపులు తిరిగుతుంది.
అరకులోయలొ వెంకటలక్ష్మి అనుమానాస్పద స్థితిలో అరకు లోయలో అదృశ్యం అవటం తో కథ అసలు మలుపు తిరుగుతుంది. ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఆమెని వెనుకపాటుగా ఓ ముసుగు మనిషి వచ్చి దాడి చేసే దృశ్యం తో కథ ప్రారంభ మవుతుంది. అక్కడి నుంచి ప్రతి పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో మనకు కథ చెబుతుంది.
సస్పెన్స్, క్రైం, ధనాశ, మోసం,హత్య, పోలీసు స్టేషన్ ఇలా సాగిపోతుంది. కథ.
స్క్రీన్ ప్లే మరియు ఇతర సాంకేతిక అంశాలు:
ఏ పాత్రకా పాత్ర పోలీసు స్టేషన్ లో ఎస్సై గారికి జరిగిన కథ చెప్పటం ద్వారా ప్రేక్షకులకు కథ మీద పట్టు దొరుకుతుంది. చివరికి ఏమవుతుంది అన్నది ప్రేక్షకుడికి సినిమా చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది.
ఏ పాత్రకి ఆ పాత్రే నిజమే కదా చెబుతోంది అని అనిపిస్తుందు ప్రేక్షకుడికి. ప్రతి పాత్ర పట్ల సానుభూతి కలుగుతుంది, కోపం వస్తుంది. తక్కువ డెప్త్ వున్న కథ అయినప్పటికీ, అద్భుతమైన స్క్రీన్ ప్లే వ్రాసుకుని, మంచి ఫోటోగ్రఫీ, ఏడిటింగ్, చక్కటి సంగీతంతో ఈ సినిమా చాలా రోజుల పాటు గుర్తు వుంటుంది ప్రేక్షకులకు.
ఇటీవలి కాలం లో సాంకేతికత మీద ఎక్కువ ఆధార పడి సామాన్య ప్రేక్షకుడికి గందరగోళం కలిగించిన చిత్రాలు చాలానే వచ్చాయి, మత్తు వదలరా మొదలైనవి.
కానీ ఇందులో స్క్రీన్ ప్లే నిజమైన హీరో. హోమ్ వర్క్ బాగా చేశారు స్క్రీన్ ప్లేమీద అని అర్థం అవుతుంది.
దర్శకుడు చందు ముద్దుకు మంచి భవిష్యత్తు వుంది.
ఇది అందరూ చూసి ఆనందించదగ్గ సినిమా.
ఒక మంచి ప్రయత్నం

లక్ష్మిస్ ఎన్టీఆర్ సుఖ జీవితానికి రాంగోపాల్ వర్మ చెప్పిన పాఠాలు



లక్ష్మిస్ ఎన్టీఆర్

సుఖ జీవితానికి రాంగోపాల్ వర్మ చెప్పిన పాఠాలు

రామ్ గోపాల్ వర్మ చాలా రోజుల తర్వాత మనసు పెట్టి ఒక సినిమా తీశాడు. మనసు పెట్టి సినిమా తీస్తే ఎంత బాగా తీయగలడో అంత బాగానూ తీశాడు.
రాములో ఒక ఆధ్యాత్మిక వేత్త దాగున్నాడని నాకనిపించింది. ఈ సినిమాలో నాకు ఆధ్యాత్మిక సందేశాలు లభించాయి.ఒక రాం గోపాల్ వర్మ సినిమాలో ఆధ్యాత్మిక సందేశాలా? అబ్బ ఛా! అని నవ్వుకుంటారేమో మీరు.నేను నిజమే చెపుతున్నా. చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనంలోనో, ఓషో ఉపన్యాసాలలోనో కనిపించే అంతటి లోతైన స్పిరిచ్యువల్ థాట్స్ నాకు ఇందులో రాము చెప్పదలచుకున్నాడని నేను అర్థం చేసుకున్నాను. ఒక జిడ్డు కృష్ణమూర్తి, ఒక యూజీ కృష్ణమూర్తి, ఒక పౌలో ఖొయిలో ఇతన్ని పూనాడా అన్నంత లోతైన్ భావనల్ని తెలుగు తెరపై అవిష్కరించే ప్రయత్నం చాలా సక్సెస్‍ఫుల్ గా చేయగలిగాడు రాము అని నేను చెప్పగలను.అతను చెప్పదలచుకున్న విషయం సూటిగా చెప్పకపోవటం వల్ల అందరికీ అది కనిపించలేదేమో. నాకనిపించింది చెపుతాను.
రాముతో వచ్చిన చిక్కేమిటంటే, అబ్బ ఇతను మా తెలుగు వాడే అని సగర్వంగా చెప్పుకుందామని మనం ఫిక్స్ అయిపోయేలోగా, ఒక చెత్త ట్వీట్ పెట్టి రాము అభిమానిని నేను అని చెప్పుకోవటానికి మనం ఇబ్బంది పడే పరిస్థితి కల్పిస్తాడు. ఒక అల్లరి పిల్లవాడితో ఒక తల్లి పడే ఇబ్బంది లాగే వుంటుంది తెలుగు ప్రేక్షకుల పరిస్థితి. మావాడే అని చెప్పుకోలేరు, చెప్పుకోకుండా వుండలేరు. ఏది ఏమయినా "లక్ష్మిస్ ఎన్టీఆర్" సినిమాతో అతని చెత్త ట్వీట్లు అన్నీ నేను క్షమించేసి నేను అతని అభిమానిని అని సగర్వంగా చెప్పుకోవటానికి గర్విస్తున్నాను.
కాని ఎప్పుడు కొంప ముంచుతాడో తెలియదు. దట్ ఈస్ రాము.
అతని సినిమాలు కొన్ని (అన్నీ కాదు) నాకెందుకో ఎవరూ చూడని కోణంలో కనిపించి ఆకట్టుకోంటాయి. కొన్ని రోజులు ఆ సినిమా మెమొరీస్ వెంటాడి వేధిస్తాయి. ఉదాహరణకి ’అంతం’ సినిమా తీసుకుంటే, అది ఏదో గ్యాంగ్‍స్టర్స్ సినిమాలాగా నాకు కనిపించలేదు. అత్యంత తెలివైన కుర్రాళ్ళకి వారి బాల్యంలో చుట్టూ వున్న వాతావరణం , పరిస్థితులు వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయి కదా అన్న కోణంలో ’అంతం’ సినిమా కనిపించింది. ఆ రోజుల్లో, ఎక్కడ బాల కార్మికులు కనిపించినా, చిన్న పిల్ల వాళ్ళు భిక్షగాళ్ళుగా కనిపించినా మనసు బాగా వేదనకి గురయ్యేది.
1) సుఖ జీవితానికి వర్మ చెప్పిన మొదటి పాఠం :
ప్రస్తుతం "లక్ష్మిస్ ఎన్టీఆర్" లో చంద్రబాబు నాయుడుని విలన్ గా చూపాడని, హీరోయిన్ ని అందంగా చూపాడని , కుటుంబం అతన్ని వెన్నుపోటు పొడిచిందని ఇలా అందరూ ఆయన చూపిన అంశాలే మాట్లాడుకుంటున్నారు. ఆయన చెప్పకున్నా నాకు బలంగా తోచిన విషయాలు నేను చెపుతాను.
మొదట రామారావు గారిని వారి కుటుంబ సభ్యులు దూరంగా పెట్టారు, ఆయన ఒంటరిని అనే భావనకు గురయ్యి కాలం గడుపుతూ వుంటారు ప్రారంభ సన్నివేశాలలో.
ఎందుకు అలా అని , విశ్లేషించుకున్నాను నేను. ఇది ఏ రివ్యూ వాళ్ళూ చేయని ప్రయత్నం. ఇక్కడే నేను రాము చెప్పదలచుకున్న ఆధ్యాత్మిక అంశాల్ని అర్థం చేసుకున్నాను. వృత్తి, వ్యాసంగాలలో ధృవతారలుగా, సెలబ్రీటి స్థాయికి చేరిన ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన పాఠాలు నాకు ఇక్కడ లభించాయి. రామారావు గారు తనను తాను దైవాంశ సంభూతుడిగా భావించుకుంటూ, ఇతరులు తనకు దాసానుదాసులుగా వుండటం చాలా మామూలు విషయం అన్న స్థాయి మానసిక స్థితిలో వుండేవారు అప్పటి దాకా. భార్యకు ఎలాగూ తప్పదు ఆయన మేల్ ఈగోని, మెగలో మేనియాని శాటిస్‍ఫై చేస్తూ కాలం గడుపుకుని పోయరు. పిల్లలు చిన్నపిల్లలుగా వున్నప్పుడు తప్పదు కాబట్టి ఆ విధంగా ఆయనకి తృప్తి కలిగించేలా ప్రవర్తించే వారు అప్పటిదాకా. అదృష్టవశాత్తు ఆయనను విజయలక్ష్మి వరిస్తూ రావటం, ఆయన పట్ట్ందల్లా బంగారం అవుతూ రావటం వల్ల ఎక్కడా ఆయన ఈగో దెబ్బతినే ప్రసక్తి రాలేదు.
అనుకోకుండా ఆయనకి ఎన్నికలలో పరాజయం ఎదురు కావటం వల్ల ఆయనకు ఒక షాక్ తగిలింది. ఇది సినిమా ప్రారంభ సన్నివేశం. ఆయనకి సాంత్వన పలకటానికి భార్య లేదు. అప్పుడప్పుడే కెరియర్‍లొ బిజీ అవుతున్న పరిస్థితులలో పిల్లలు వుండినారు. బాలయ్య బాబు అప్పుడు ’ముద్దుల మామయ్య’, ’సీతారామ కళ్యాణం’, ఇలా హిట్టు మీద హిట్టు కొడుతూ బిజీగా వుండినాడు. హరికృష్ణ ఏదో వ్యాపారాలలో బిజీగా వుండినాడు.
పోనీ ఇతర కుటుంబ సభ్యులైనా వచ్చి సాంత్వన పలుకుదామంటే అప్పటి దాక ఆయనకున్న మనస్థత్వం వల్ల ఎవరికీ ఆయన మనసుకు అంత దగ్గరికి వచ్చి ఆయన ఈగోని శాటిస్ఫై చేస్తూ, ఆయనని ఓదార్చే అవకాశం లేదు. అటువంటి అవకాశం వున్న భార్య ఆయనని వదిలి స్వర్గస్తురాలైంది.
ఈ వంటరి తనం అనేది ఆయన చేజేతులా చేసుకుంది. తనను తాను ఒక దైవాంశ సంభూతుడిగా, ఒక విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా కాక మామూలు మనిషిగా, ఇంట్లో సభ్యులతో ఒక మామ గారిలానో, ఒక తండ్రిగానో, మనవళ్ళూ మనవరాళ్ళతో ఒక తాతగా కలగలసి పోయి ఆడుతూ పాడుతూ వుండిపోయుంటే ఆయనకి ఈ వంటరి తనం వచ్చుండేది కాదు.
ఇతర మనుషులు తన దగ్గరికి రావాలంటే మెదట ఆయన పాదాల్ని ఆసాంతం స్పృశించి, కళ్ళకద్దుకుని వినయంగా ఒక ప్రక్కగా నిలబడి మాట్లాడితే గానీ ఆయన వారితో మాట కలపకపోయె,
ఇలాంటి స్థితిలొ ఆయన కుటుంబ సభ్యులకు ఎంతకూ అని ఓపిక వస్తుంది ఆయనకు తృప్తి కలిగేలా ప్రవర్తించాలంటే. అందువల్ల ఆయనకు వారు తగు గౌరవం ఇచ్చారే కానీ మానసికంగా దగ్గరగా మెసలలేకపోయారు. అది ఆయన స్వయంకృతం.
ఆయన ప్రొఫేషనల్ సక్సెస్ ని వ్యక్తిగత జీవితంలోకి , మనసులోకి తీసుకుని అందరికీ దూరంగా వుండిపోయాడు.
ప్రొఫెషనల్‍గా పీక్స్ లో సక్సెస్ ఫుల్ గా వున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక గుణపాఠం.
"నేను ఒక సామాన్యుడిని. నేనెంత ఎత్తులకు ఎదిగినా నా కుటుంబ సభ్యులందరితో నేను ఎటువంటి అహంకారం లేకుండా ప్రేమతో మసలుకుంటాను. వృత్తిపరమైన ఎత్తుపల్లాలకు కృంగిపోను. నా వాళ్ళే నా బలం. అన్న భావనని నేను పెంపొందిచుకుంటాను." ఇది చెప్పకనే వర్మ చెప్పిన మొదటి పాఠం ఈ సినిమా ద్వారా.
2) సుఖ జీవితానికి వర్మ చెప్పిన రెండవ పాఠం :
సాంత్వన పొందటానికి ఆయన తన ఈగోని శాటిస్ ఫై చేసే వ్యక్తిని ఎన్నుకున్నాడు. సంతోషం. కాకపోతే ఆమె ఒక స్త్రీ,యవ్వనంలో వుంది. అదొక తలకాయ నొప్పి. ఏతావాతా ఆమెని పెళ్ళి చేసుకున్నా ఏమీ ఫలితం వుండదు. ఆయన వయసు దృష్ట్యా, ఆయన ఆరోగ్యం దృష్ట్యా ఆమెని సుఖపెట్టలేడు, తాను సుఖ పడలేడు. లేని పోని లంపటం.
ఆయన రెండు పనులు చేసి వుండ వచ్చు. పెళ్ళి అన్న పంచాయితి పెట్టుకోకుండా, ’అమ్మా నా వయసు ఎక్కడా నీ వయసు ఎక్కడా, నన్ను నీ తండ్రి స్థానంలో ఊహించుకో, నిన్నూ నీ పిల్ల వాడిని, మీ వారిని పోషిస్తాను, మీరంతా వచ్చి ఇక్కడే వుండండి, నా వంటరితనం తీర్చండి, నా సేవలు చేస్తూ వుండు అన్చెప్పి, వీరగంధం సుబ్బారావు గారిని, వారబ్బాయినీ కూడా ఇంటికి పిలిపించుకుని, తన ఈగోని తృప్తి పరచుకుంటూ వారికీ ఇంత ఆశ్రయం కల్పించి వుంటే పోయేది. ఇందుకు, సుబ్బారావు గారికి కూడా ఏ అభ్యంతరం ఉండక పోను, ఆయన పాత్రని మలచిన తీరుని చూస్తే అలాగే అనిపిస్తుంది.
ఇలాకాకుండా ఆమెని ఆమె వచ్చిన పనైన గ్రంధ రచన మాత్రమే చేయనిచ్చి, తాను ఏ గురువునో ఎన్నుకుని ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించి వుంటే పొయేది. కుటుంబ సభ్యులూ గౌరవించే వారు, లక్ష్మీపార్వతి గారు గౌరవించి ఉండే వారు.
ఆయన ఏమి చెప్పినా , ఏమి చేసినా ఎదురు చెప్పని విధం గా ఆ పాత్రని మలిచారు కాబట్టి ఇబ్బంది ఉండకపోయేది.
వివాహేతర సంబంధాలు దెబ్బతీస్తాయి. ఆధ్యాత్మిక చింతన వైపు అడుగు వేయకుండా, వివాహేతర సంబంధాల ద్వారా స్వాంతన పొందవచ్చు అనే ఆలోచన చెడ్డది అని, వయసు వ్యత్యాసాలు చూసుకోకుండా దుందుడుకుగా అడుగేస్తే ఎన్టీఆర్ అంతటి వానికయినా పతనం తప్పదని వర్మ రెండవ పాఠం చెప్పాడు అనిపిస్తోంది ఈ సినిమా ద్వారా.
3) సుఖ జీవితానికి వర్మ చెప్పిన మూడవ పాఠం :
లక్ష్మీ పార్వతి పాత్ర ఆయనని చివరి దాకా కూడా రామారావు గారి పాత్రలో దైవాన్నే చూశారు. ఆమె చివరి దాకా కూడా ఆయనని ’స్వామీ’ అనే సంబోధిస్తుంది.
ఆయన ఒక మాట చెపితే కాదు అన్నది ఉండదు ఆమె వైపు నుంచి. కాకపోతే అప్పుడప్పుడు ఆయన ఆలోచనలని ఇంప్రొవైజ్ చేసి చిన్ని చిన్ని సలహాలు ఇస్తుంది.
ఇంచుమించు ఆమెలో ఒక మీరాబాయి తాలూకూ కృష్ణ భక్తిని చూపించారు. ఆహా నాకూ ఇలాంటి ఒక అభిమాని వుంటే బావుంటుంది కదా అని ప్రతి కళాకారుడు అనుకునేలా చిత్రీకరించారు ఆమె పాత్రని.
ఈమె వైపు నుంచి ఏ తప్పూలేదు. జరిగిన పొరపాటల్లా ఆమె దైవంగా భావించింది ఒక మనిషిని. అలా కాకుండా ఆమె నిజంగా దైవ మార్గంలో పురోగమించి వుంటే ఆమె జీవితంలో ఇన్ని ఒడిదుడుకులు, అపవాదులు వచ్చుండేవి కావు.
కాబట్టి తను ఎన్నుకొనే రోల్ మోడల్స్, విషయంలో ప్రతి ఆడపిల్లా జాగ్రత్తగా వుండాలి. ఆ రోల్ మోడల్ ఒక మామూలు మనిషి లాగా ప్రవర్తించి ’నన్ను పెళ్ళి చేసుకుంటావా’ అని అడిగితే మైకం నుంచి బయట పడాలి. మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాల్ని, మన వాళ్ళ జీవితాల్ని ప్రభావితం చేస్తాయి . ఇది వర్మ చెప్పదలచుకున్న మూడవ పాఠం ఈ సినిమా ద్వారా అని నాకర్థం అయింది.
సంగీతం సూపర్. నేపధ్య సంగీతం చాలా చాలా బాగుందు. కీరవాణి కన్న చక్కటి భవిష్యత్తు కళ్యాణి మాలిక్ కి వుంది అని బలంగా అనిపిస్తుంది. మరి అతనెందుకు లైమ్ లైట్ లోకి రాలేదో భవవంతుడికి తెలియాలి.
ఎన్టీయార్ పాత్రధారి కి డబ్బింగ్ సూపర్ గా అన్నగారిలాగానే చెప్పించారు
మొత్తం మీద వర్మ నూటికి నూరు మార్కులూ కొట్టేశాడు, అప్పటి పరిస్థితులు చూపించటంలొ కొన్ని పొరపాట్లు జరిగినప్పటికీ.
కొన్ని లోపాలు.
1) మొదటి సారి లక్ష్మీ పార్వతి ఆమె భర్తతో ఫోన్ చేసి మాట్లడినప్పుడు వారింట్లో ఒక ల్యాండ్ లైన్ ఫోను ఉన్నట్టు చూపించారు. ఆమెని ఒక వర్షం రాత్రి తన వద్దనే పడుకోమని చెప్పి ఆ విషయం సుబ్బారావు గారికి చెప్పినపుడు ప్రక్కీంటికి వెళ్ళీ పీ.పీ కాల్ మాట్లాడినట్టు చూపించారు.
2) అంబాసిడర్ కార్లు, ఫియట్ కార్లే కాక ఫోక్స్ వాగన్ వెంటో కార్లు కూడ వాళ్ళ ఫామిలి మెంబర్లు వాడినట్టు చూపించారు కొన్ని సార్లు. అప్పటికి ఆ కార్లు ఇంకా ఇండియాకి రాలేదు.
3) ఒక్క చంద్ర బాబు , గారు తప్ప మిగతా పాత్రలు ఎవ్వరూ అంటే బలకృష్ణ, హరికృష్ణ, మోహన్ బాబు, ఇలాంటి వాళ్ళు అస్సలు పోలికలు లేకుండా వున్నారు.
మొత్తం మీద అందరూ చూడదగిన సినిమా.
-రాయపెద్ది వివేకానంద్
హైదరాబాద్
P. S:
రాజకీయాలకు అతీతంగా కేవలం ఈ సినిమాని ఒక సినిమాగానే చూసి నేను స్పందించి వ్రాశాను.
దారి తప్పిన కొడుకు, బాధ్యత తెలుసుకుని సన్మార్గం లోకి వస్తే ఒక తండ్రి ఎంత ఆనంద పడతాడో, రాము డైరెక్షన్ చూసి ఒక అభిమాని గా నేను పొందిన ఆనందం అలాంటిది.
కెరియర్లో ఎన్నో తప్పటడుగులు వేసి అడపా దడపా మంచి సినిమాలు ఇచ్చే రాము కు నేను ఫాన్ నే కానీ మరల ఒక భయం. ఎక్కడ దారి తప్పి నాకు తలవంపులు తెస్తాడో నని.
నాది రాజకీయాలకు అతీతమైన విశ్లేషణ. రాము సినిమా గురించి రాము అభిమాని విశ్లేషణ
-రాయపెద్ది వివేకానంద్

ప్రియాంక రెడ్డి మరణం తర్వాత నాలో కలిగిన ఆలోచనలు.




ప్రియాంక రెడ్డి మరణం తర్వాత నాలో కలిగిన ఆలోచనలు.

ఒక చక్కటి విలువలున్న సినిమా చూసి బయటికి వస్తే అదే ప్రభావం మన మీద చాలా సేపు వుంటుంది.
’సత్య హరిశ్చంద్ర ’ సినిమా చూసొస్తే చాల రోజుల పాటు ఆ ప్రభావం వుంటుంది. మన అంతరత్మ మనల్ని అబద్దం చెప్పకుండా అడ్డం పడుతుంది.

అవునంటారా కాదంటారా?
ఒక డొక్కు సినిమా చూసొస్తే దాని తాలుకు ప్రభావం కూడా మన మీద వుంటుంది. మాకు డొక్కు సినిమాలు వద్దు అని నిర్మాతలని , దర్శకులని నిలదీసి అడిగే ప్రేక్షక సంఘాలు బయలు దేరాలి.

***

"నాన్నా పొర్న్ స్టార్ అంటే ఏమిటి?" నా పదకొండేండ్ల కొడుకు 2012 లొ ఈ ప్రశ్న అడిగినప్పుడు నాకు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు. ఒక తండ్రి వాపోయాడు.
ఒక బజారు దాన్ని మెయిన్ స్ట్రీం సినిమాకు తీసుకు వచ్చింది కూడా ఒక మహిళనే.
ఆ పిల్లవాడి తప్పేం లేదు. ఎక్కడ చూసినా సన్నీలియోన్ భజనే ఆ రోజుల్లో. సరిగ్గా అదే సంవత్సరం పూజా భట్ అనే ఒక గొప్ప మహిళా దర్శకురాలు ఈ ఉత్తమ నటిని మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ’జిస్మ్ -2’ అనే ఒక అభ్యుదయ చిత్రం ద్వారా ప్రవేశపెట్టింది. ఆ కారణంగా పిల్లవాడు ఆ ప్రశ్న వేశాడు. ప్రశ్నలే కద మన తెలివితేటలని పదునుపెట్టేది.
ఆ రోజుల్లో ఏ చానల్ తెరిచి చూసినా, ఏ వార్తా పత్రిక తిరగేసినా  ఈ సన్నీ లియోని యొక్క ఫోటోలు, ఇంటర్వ్యూలు కనపడేవి. ఈ విధంగా ఈ మహిళా మణి దయవలన  మన నిత్య జీవిత సంభాషణలలో కి పోర్న్ , పోర్న్ స్టార్ అనే మాటలు సర్వ సామాన్యమయిపోయాయి.
రవితేజ సినిమాలు, మహేష్ బాబు ఖలేజా సినిమాల పుణ్యమా అని "దొబ్బేయ్" అన్న మాట ఎంత మామూలుఅయిపోయిందో, సన్నీలియొని పుణ్యాన పోర్న్, పోర్న్ స్టార్ అన్నపదాలు మామూలు మాటలు అయిపోయాయి.

నేను మొన్న అమేజాన్  ప్రైమ్ లోఅనుకుంటా, రాజశేఖర్ సినిమా ’గరుడవేగా" చూద్దామని  కూర్చున్నాము మా ఆవిడ పిల్లలతో కలిసి. అందులో ఒక మెరుపు పాటలో చాలా మాములు నటి లాగా వచ్చి మన సన్నీలియోని డాన్సాడి పోయింది.
అంటే విలువలు ఎలా మారిపోతున్నాయో చూడండి.

**
చిరంజీవి గారు కూడా తెగ బాధపడిపోతున్నారు ప్రియాంక రెడ్డి ఉదంతం గురించి. మరి ఆయన ఘరానమొగుడు మున్నగు సినిమాలలో దాదాపు నీలి చిత్రాల స్థాయిలో వానపాటలకు గెంతులు వేసిన సందర్భాలు మరిచిపోయారనుకుంటాను.
మహేష్ బాబు కావచ్చు, చిరంజీవి కావచ్చు ఏ ఇతర సినీ ప్రముఖుడు కావచ్చు, ఈ సందర్భంగా మొసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు వీరందరూ కూడా ప్రస్తుత సమాజపు వికృతరూపానికి ప్రత్యక్షకారణాలు.
ఒక్క సిరివెన్నెల సీతారామ శాస్త్రి , ఆర్పీ పట్నాయక్ గార్లకి తప్ప సామాజిక బాధ్యత ఏ ఒక్క సినీ ప్రముఖునికీ ఉన్నట్టు తోచదు. వీరికి మాట్లాడే అర్హత లేదు. వీరు కనీసం నోర్లు మూసుకుని మౌనంగా వున్నా కూడా సంతోషమే.
నేను ఎంతో అభిమానించే గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా మినహాయింపు కాదు నా ఆరోపణలలో. వీరు పాడిన కొన్ని పాటలు (చక్రవర్తి గారి సంగీతం లో వేటూరి గారి పాటలు) సాక్షాత్తు బజారు పాటలే.
’గుగుగుడిసుందీ’
’వంగమాకు, వంగమాకు’ ఇలా ఎన్నో పాటలు.

విలువలు అన్నవి ఒక్క రోజులో దిగజారలేదు.
నాగేశ్వర రావు గారి స్టెప్పులు, జయమాలిని, జ్యోతిలక్ష్మిల గెంతులు, శొభన్ బాబు, మంజులలకవ్వింతలు ఇవన్నీ ప్రారంభం మాత్రమే. నాకు ఆరు ఏడు సంవత్సరాల వయస్సు లో సినీ నటి మంజుల ని చూసి తెగ సంచలనానికి గురయ్యేవాడిని. ఆ పోస్టర్ల ప్రభావం ఆవిడ డ్రెస్సుల ప్రభావం అలా వుండేది.

ఆ తరువాత మన పత్రికలు కూడా ఏమీ తక్కువ తినలేదు. మన ఘనత వహించిన రామోజీరావు గారు, ఈనాడు ఆదివారం అనుబంధం లో (అప్పుడు అది కూడా వార్తాపత్రిక సయిజులోనే వచ్చేది) డాక్టర్ జీ.సమరం గారి ’సెక్స్- సైన్స్’ అన్న వ్యాస పరంపర ఇచ్చేవారు. దానిని యం.శేషాచలంపబ్లికేషన్స్ వారో, నవభారత్ పబ్లికేషన్స్ వారో, గ్రంధాలుగా కూడా అచ్చువేయించారు.
మన వేమూరి బలరాం గారు పాపం తనవంతు గా ’సుఖ సంసారం’ అని చెప్పి సకుటుంబ సపరివార పత్రిక స్వాతి లో అచ్చువేయించే వారు, అంతటితో అగిపోక ’వారం వారం ఒక సరస కథ’ దానికి ’జే’ అనే అరవ ఆర్టిస్టు వేసే సభ్యతా సంస్కారాలు ఉట్టిపడే పతివ్రతల బొమ్మలు ఇవి కొనసాగాయి. ప్రజలకు ఇవన్నీ మామూలే అన్న భావన క్రమంగా జొప్పింపబడింది.  ఇక సినిమాలు,  కుటుంబ సమేతంగా వెళ్ళే సినిమాలో హిరో అనబడే అడ్డగాడిద ఎన్ని నీతిమాలిన పనులైనా చెయొచ్చు. అది మనం హాయిగా ఎంజాయ్ చేస్తూ చూడోచ్చు. అదంతా వినోదం మాత్రమే అని మనం అనుకోవాలి.

ఉండేది ఉండంగా ఇంటర్నెట్ విప్లవం కారణంగా ఇప్పుడు బూతు అరచేతిలోకి వచ్చేసింది.సెన్సార్ పరిధుల్లోకి రాని వెబ్ సిరీస్ లు , రాంగోపాల్ వర్మ లాంటి పయోముఖ విషకుంభ మేధావులు ఇప్పుడి విచ్చలవిడిగా తమ తమ పైత్యాలను వెబ్ సీరీస్ ద్వారా వెళ్ళగ్రక్కుతున్నారు.
ఇక సన్నీలియోని పుట్టినిల్లు లాంటి పోర్న్ సైట్లు గుడ్డలిప్పి నట్టింట్లో నాట్యమాడుతున్నాయి.

కానీ సంఘనియమాలలో మార్పులు ఏమీ లేవు. అవన్నీ చూడొచ్చు, మన పిల్లవాడు రాముడు మంచి బాలుడు అన్నట్టు వుండాలి.  ఇది ఎలా సాధ్యం. తెలిసీ తెలియని వయస్సులోనే అన్నీ చూడగలుగుతున్నారు.
దానికి తోడు సామాజిక మాధ్యమాల కారణంగా విపరీతమైన భావప్రకటనా స్వాతంత్ర్యం.

పాఠాలు బోధించే టీచర్లు ఎంత చక్కగా వున్నారొ చూద్దాము.
పాపం ఈ టీచర్లు సినిమా హీరోయిన్లని ఆదర్శంగా తీసుకుని,  బొడ్డు క్రిందకు చీరలు, చేయి ఎత్తెతే చంకలు, ముందుకు వంగితే స్థనద్వయ దర్శనం , వెనుక సమాజానికి అంకితం అన్నట్టు వీపు, అన్నట్టుగా ముస్తాబయ్యి స్కూలుకు వస్తున్నారు.
జన్మ సంస్కారం వున్న మొగ పిల్లలు బుద్దిగానే వుంటున్నారు.
ఇలాంటి అవతారాల్లో వచ్చే టీచర్లు చెప్పేనీతులు, ఇదిగో ఇందాకటి మన సినీప్రముఖులు చెప్పేనీతులలాగానే వుంటాయి. గౌరవం అనేది డిమాండ్ చేస్తే రాదు కద.
ప్రత్యక్షంగా విద్యావ్యవస్థలో వున్నవాడిని కనుక నాకు తెలుసు విద్యా సంస్థలు రక్తమోడుతున్నాయి, అన్ని విధాలా.
డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, బీర్లు, విస్కీలు ఇవి ఏర్లై ప్రవహిస్తున్నాయి కళాశాలలో. పదవ తరగతి కూడా దాటని పిల్లలకు అబార్షన్లు, లేచిపోవటాలు మామూలు విషయాలు అయ్యాయి.
పాపం కొందరు స్కూలు మాష్టార్లు కూడా ఇలాంటి "పవిత్ర" కార్యాలలో తమ వంతు కృషి చేస్తూ సమాజపు ప్రస్తుత ముఖ చిత్రానికి మరిన్ని వన్నెలు అద్దుతున్నారు.
ప్రస్తుతం సమాజం ఒక భయంకరమైన వలయంలో ఇరుక్కుంది.
షాద్ నగర్ లో ప్రజలు పోలీసు స్టేషన్ బయట చూపిన చైతన్యం మరువరానిది. కాని మన ఆగ్రహం మూల కారణాలని గుర్తించటంలో విఫలమవుతోంది.

ఈరోజు కొందరు మేధావులు వాట్సాప్ లో , ఫేస్ బుక్ లో కొన్ని వీడియొలు పెట్టారు. అందులో వేరే మత చాందస దేశాలలొ రేపిస్టులకు బహిరంగ శిరచ్చేదనం, బహిరంగంగా గన్ తో కాల్చి చంపటం వంటి దృశ్యాలు పెట్టి ఇవే శిక్షలు ఇక్కడ కూడా అమలు చేయాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు.
అంటే ఏమిటి మనం ఆటవిక న్యాయం వైపు కు అడుగులు వేద్దామా?
అసలు సమస్యని మూలాల్లోకి వెళ్ళీ ఆలోచించేది మానేసి, తాత్కాలికి హింసావాద పరిష్కారాలు వెదుక్కుందామా?

నన్ను అడిగితే తక్షణం ఈ క్రింది సలహాలు ఇస్తాను.
1) సనాతన ధర్మం ఆధారంగా విలువలు కలిగిన విద్యా విధానాన్ని ప్రోత్సహించాలి
2) సరస్వతి శిశుమందిర్ మోడల్ ని అన్ని స్కూళ్ళూ తక్షణం పాఠించాలి
3) రామాయణాన్ని ప్రతి స్కూలు సిలబస్ లో చేర్చి, చాగంటి కోటేశ్వర రావు గారి లాంటి వారి చేత అన్ని కళాశాలల్లోచక్కటి అవగాహన సదస్సులు నిర్వహింపజేయాలి.
4) రామాయణం మతగ్రంధం అనే భ్రాంతి నుంచి అందరూ బయట పడాలి
5) రామాయణాన్ని విమర్శించే వారిని బహిర్ంగంగా దేశద్రోహులు అని ప్రకటించాలి.


Wednesday, April 22, 2020

"కేశవుడు" (కథ)

Cover Page of Koumudi February 2020



"కేశవుడు" (కథ)
- రాయపెద్ది వివేకానంద్

ప్రిన్సిపాల్ గా నా ఉద్యోగం ఊడి పోయింది. నన్ను గడప దాటమన్నారు. 
నన్ను మరో ఉద్యోగి పని తీరుతో పోల్చి ఈ నిర్ణయం తీసుకున్నారు. పోనీ అవతలి వ్యక్తి ఏమయినా సీనియరా, లేదా నాకంటే బాగా తలపండిన వాడా అంటే అదీ కాదు. కేవలం సంవత్సరం కూడా సర్వీసు లేని కుర్రకుంక.
నా దగ్గర వచ్చి టీచర్ గా జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి పట్టుమని ఒక సంవత్సరం కాలేదింకా. 
అతను నా దగ్గర చేరిన రోజే ఏదో తేడాగా అనిపించింది. ఇక ఈ పిల్లలని ఆ దేవుడే  బాగు చేయాలి. గొర్రె కసాయి వాడిని నమ్ముకుంటుంది, అని మా మేనేజ్ మెంట్ వారు ఈ వెర్రి వాడిని నమ్మి , నన్ను పొమ్మన్నారు.
అసలేం జరిగిందో వివరంగా చెపుతాను . మీరు ఆసక్తిగా వింటున్నారు కాబట్టి మీరు ఆప్తులు అన్న భావన కలుగుతోంది నాకు.

*****

"మనం మన మాతృభాషని ప్రేమించాలి" నాకు స్పృహ తప్పినంత పనయింది. ఏమిటి ఈ పాడుమాటలు. మాది ఇంగ్లీష్ మీడియం స్కూలు. కార్పొరేట్ స్కూలు ప్రిన్సిపాల్ గా 
ప్రతిరోజు ఉదయాన్నేఅన్ని తరగతి గదుల ముందూ పర్యవేక్షణ చేస్తూ తిరుగుతూ ఉన్న నాకు కేశవుడి కంఠం పెద్ద షాకే ఇచ్చింది.
ఆగిపొయి వింటూండిపోయాను, ఇంకా ఏమేమి చెప్తాడో అని.
జొశ్యం టెక్నోస్కూల్ పదవ తరగతి గది నుంచి కేశవుడి కంఠం స్పష్టంగా వినిపిస్తోంది. "మనం విఙ్గ్యానం ఎంతగా పెంపొందించుకుంటామో, మన సంస్కారాన్ని కూడా అంతగానూ పరిరక్షించుకుంటూ వుండాలి. మన మూలాల్ని మనం మర్చి పోకూడదు. మనం ఎప్పుడైతే మన అస్తిత్వాన్ని కాపాడుకుంటామో అప్పుడే ప్రపంచం మనల్ని గౌరవిస్తుంది"
అయ్యా ఆయన తెలుగు మాష్టారు కాదు. స్పోకెన్ ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలెప్ మెంట్ ట్రెయినర్ గా అతను ప్రఖ్యాతి గాంచిన మా  జోశ్యం టెక్నో స్కూల్లో చేరి పట్టుమని నాల్గు నెలలు కాలేదు. 
అతని పోకడ ఆది నుంచి నాకు చిరాగ్గానే వుంది.
తెలుగు కూడా ఇంగ్లీష్ లో నేర్పిస్తాం మేం. 
’అ టు అః’  అనిట్రెయినప్ చేస్తాం, ’అ ఫర్ అమ్మ, ఆ ఫర్ ఆవు’ అని చెప్పి మేము స్టూడెంట్స్ ని ఇంగ్లీష్ లో పర్ ఫేక్ట్ గా మౌల్డ్ చేస్తాం. అది మా పద్దతి. లేదంటే పిల్లలకి ఇంగ్లీష్ ఎలా వస్తుంది? వెధవది తెలుగుదేముంది, వద్దన్నా వస్తుంది. రాకున్నా చింతలేదు. పరీక్ష్లలలో మార్కులు వచ్చేటట్టు ట్రెయినప్ చేస్తాం. జోశ్యం టెక్నోస్కూలా మజాకా? మాకు ఇంగ్లీష్ ముఖ్యం. ఇంగ్లీష్ లో మాట్లాడితే మాకు సొసైటీలో వచ్చే గుర్తింపే వేరు.
లోపల పాఠం కొనసాగుతోంది. వింటూండి పోయాను.
"జపాన్, జర్మనీ, దక్షీణకొరియా,చైనా, ఫ్రాన్స్ లు అభివృద్ది సాధించటానికి ప్రధాన కారణం వారు విద్యను వారి మాతృభాషలో నేర్చుకోవటమే" 
నాకు మిడిగుడ్లు పడ్డాయి. ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ’మా స్కూలు కేదో కీడు జరగబోతోంది. ఈ కేశవుడి రాక వల్ల ఖచ్చితంగా ఏదో ఉత్పాతం జరగబోతోంది అని అర్థం అయింది.. థాంక్ గాడ్ నేను సరి అయిన సమయానికి వచ్చి ఇతని నిజ స్వరూపాన్ని చూడగలిగాను.’కరుణామయుడైన భగవాన్ ఎంత కష్టం తెచ్చిపెట్టావయ్యా.’ నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఆసరా కోసం స్తంభం పట్టుకుని నిలబడిపోయాను.
అయిదంతస్తుల భవంతిలో మిగతా అన్ని క్లాసులు సక్రమంగా ఇంగ్లీష్ లో నడిచి పోతున్నాయి, ఇక్కడే నాకు పంటి కింద రాయిలా ’చెడు పలుకు ’వినిపిస్తున్నాయి.
ఎవరయినా పిల్లలు తెలుగులో మాట్లాడుతూ కనిపించారంటే వారిని కఠినంగా శిక్షిస్తాం. ఒక పలక మీద "నేను గాడిదను. నేను తెలుగులో మాట్లాడాను ఈ వేళ. అయాం సారీ" అని వ్రాయించి వాడిని ఒక్కో క్లాసుల్లొకి తీసుకెళ్ళీ పిల్లలందరి ఎదుట, బోర్డు దగ్గర నిలబెట్టి ఆ పలకలోని మాటలను వాడితోనే చదివించి, మిగతా వారికి కూడా ఙ్గ్యానోదయం అయ్యేలాగా చర్యలు చేపడతాం. అటువంటి ఉత్తమ శిక్షణ మా స్వంతం.
ఇలాంటి శిక్షలు ఎన్నో ఉన్నాయి మా దగ్గర. మరి క్రమ శిక్షణ అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తిని కద నేను.
ఇటువంటి క్రమశిక్షణ కలిగిన మా సంస్థలో, సాక్షాత్తు ఒక మాష్టారు, అందునా ఇంగ్లీష్ మాష్టారు, ఆ పిల్లల క్లాస్ టీచర్ ఇలాంటి పాఠాలు చెబుతుంటే నాలాంటి డిసిప్లిన్డ్ ప్రిన్సిపాల్ కి ఎలా వుంటుంది మీరే చెప్పండి. ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష వెయ్యాలో మీరే చెప్పండి.
ఇందాకే చెప్పినట్టు మాది నగరంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన కార్పొరేట్ స్కూలు. ర్యాంకులు, గ్రేడ్లు మా స్కూలుకు ప్రతి సంవత్సరం వస్తూ వుంటాయి. అలా ర్యాంకులు రెగ్యులర్ గా రావాలి అంటే మేము ఎంత శ్రమ పడతామో మీరు ఊహించలేరు. నగరం నడిబొడ్డున ఓ అయిదంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్ ని అద్దెకు తీసుకుని నడిపిస్తున్నాం ఈ స్కూలు ని. ఇలాంటి బ్రాంచులు నగరం నిండా మాకు ఓ ఇరవై దాకా ఉన్నాయి. గిట్టని వాళ్ళు కోళ్ళ ఫారంలో కోళ్ళలా కుక్కేస్తాం క్లాసుల్లో పిల్లలని అని ఆడిపోసుకుంటారు. మాకు అద్దెలూ అవీ వెళ్ళాలి గదండి మరి. గిట్టని వాళ్ళదేముంది లేండి ఏదయినా అనగలరు. మా స్కూళ్ళన్నింటిలో ఏకాగ్రత అంతా ర్యాంకులు , గ్రేడింగులు, మార్కులమీదనే వుంటుంది. చదువుకు ఆటంకం కలిగించే ప్లేగ్రౌండ్, ఆడిటొరియం, లైబ్రరీ వంటి వాటి జోలికి వెళ్ళం, వీటన్నిటి మాట దేవుడెరుగు, అసలు టాయిలెట్లు కూడా సరిగ్గా వుండవు. మా ఏకాగ్రత అంతా, ఇందాకే చెప్పాను కద, ర్యాంకులు, మార్కులు, గ్రేడింగులు వీటిమీదనే వుంటుంది. అదన్న మాట మేము విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత. ఇవన్నీ మాములు వాళ్ళకు చెబితే అర్థం చేసుకోరు, మీలాంటి సహృదయులకు చెబితే కనీసం నన్ను అభినందించి, నా పట్ల జాలి చూపిస్తారు.
నాకు  విద్యావేత్తగా నగరంలో చాలా మంచిపేరు వుంది. నేను డబల్ ఎమ్మే, ఎం.ఫిల్, పీ.హెచ్.డీ. గోల్డ్ మెడలిస్టుని. బట్టీ పట్టేసి చదువుకుంటు వెళ్ళిపోతే, ’ఏదో రకంగా’ డిగ్రీలు తెచ్చుకుంటే ఒక విద్యావేత్తగా గుర్తింపు పొందవచ్చు. ఏమంటారు? 
ఇక ప్రస్తుత విషయానికొస్తే, ఈ కేశవుడి పూర్తి పేరు ’బలీరాం కేశవుడు’ అట. నాగ్ పూర్ కు చెందిన ఎవరో స్వాతంత్ర్య సమరయోధుడి పేరట అది. ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటే అదే. ఈ బలీరాం కేశవుడి పేరే కాదు, అతని ప్రవర్తన కూడా చాలా చిత్రంగా వుంటుంది. నాకు సహజంగానే వ్యక్తిత్వవికాస శిక్షణ నిపుణులంటే ఎందుకో తగని చిరాకు, వీళ్ళు చెప్పే పాఠాలు మార్కులు తెచ్చిపెట్టవు కద. ఇతన్ని దగ్గరనుంచి చూసే కొద్దీ ఆ చిరాకు ద్విగుణీకృతం అవుతోంటుంది.
విద్యార్థులకుపోయి వ్యక్తిత్వవికాస శిక్షణ, సాఫ్ట్ స్కిల్స్ గాడిద గుడ్డు ఎందుకండి?  వీటికిపొయి మళ్ళీ ఒక ట్రెయినర్. 
అసలు పిల్లలంటే ఏమి చేయాలి? చక్కగా కూర్చుని చదువుకోవాలి. అర్థం కాకుంటే బట్టీ పట్టాలి. ప్రతీ రోజు స్లిప్ టెస్టని, తరచూ యూనిట్ టెస్టనీ, క్వార్టర్లీ అనీ, హాఫియర్లీ అని ఏదో ఒక పరీక్ష వ్రాస్తూ సంవత్సరాంతం లో వచ్చే పెద్ద పరీక్షకి సిద్ధపడాలి. ఇంతకు మించి ఈ పర్సనాలిటి డెవలెప్ మెంట్ వంటి పనికిమాలిన విషయాలు అస్సలు అక్కరలేదని నా నిశ్చితాభిప్రాయం.
ఇదిగో రాబోయె చెడురోజులకు నాందీప్రస్తావనగా, మా బ్రాంచీలోకి ఈ కేశవుడు వచ్చి పడ్డాడు. అసలు ఇతని ప్రవేశం వెనుక మా చైర్మన్ గారి అబ్బాయి పాత్ర వుంది. ఈ చైర్మన్ గారి అబ్బాయి మా స్కూలు మేనేజిమెంట్ లోకి రెండొ తరం ప్రతినిధిగా ఎంటర్ అవ్వటం, అతను తనతో కూడా ఈ కేశవుడిని తీసుకు రావటం జరిగాయి.
మా  చైర్మన్  గారు తనకున్న వందాలాది బ్రాంచిలలొ ఓ పాతిక బ్రాంచిలకు ఇదిగో తన పెద్దబ్బాయిని డైరెక్టర్ గా నియమించారు.
నాకు తెలుసు లెండి, మీలాంటి సహృదయులు ఖచ్చితంగా నాలాగే ఈ కేశవుడి పట్ల ఇప్పటికే అయిష్టత పెంచేసుకుని వుంటారని. కాని ఏమి చేద్దామండి, మేనేజిమెంట్ సపోర్ట్ వుంది ఈ కేశవుడికి. కలికాలం. ఏం చేద్దాం చెప్పండి?
ఈ వింత మానవుడు ఎలా వుంటాడో కాస్తా వివరంగా చెప్తాను, మీక్కూడా అతని మీద ఇంకాస్తా చిరాకు కలుగుతుంది.
పాతికేళ్ళు కూడా వుండవు ఈ వింత మానవుడికి.తెల్లటి శరీర చాయ, పల్చటి కళ్ళద్దాలు,లేత గడ్డం, మరీ సన్నం కాని శరీర నిర్మాణం, కోలమొహం, ఎప్పుడూ తెల్లటి కుర్తా పైజామలలో కనిపిస్తాడు.
అసలు నాకు తెలియక అడుగుతానండి, ఉపాధ్యాయుడు అంటే ఎంత సీరియస్ గ వుండాలి, అందునా పిల్లలతో ఎంత గంభీరంగా వుండాలి. ఈ వింత మానవుడికి అది కూడా తెలియదు.
ఎప్పుడు చూసినా చిరునవ్వుతో పిల్లలతో మాట్లాడుతూ వుంటాడు.
నిజం చెప్పొద్దూ అతనిలో నాకు అన్నింటికన్నా అత్యంత చిరాకు కలిగించే అంశం ఆ చిరునవ్వుతో కూడిన మొహం.  ఎప్పుడు నవ్వుతూ కనిపించే వాళ్ళంటే మీక్కూడా చిరాకే అని నాకు తెల్సు లెండి. అందునా ఉపాధ్యాయులు ఎంత సీరియస్ గా వుండాలి అని నేను అక్కడికీ ఎన్నో సార్లు చెప్పిచూశాను. 
తెలివా తేటా నా మాట విని ఏడిస్తే కద. నా మాట వింటే ఎప్పుడో బాగు పడిపోయే వాడు.
ఇకపోతే స్టూడెంట్లంతా ఇతగాడికి పెద్ద ఫాన్స్ అయిపోయారు. ఇతని రాకతో మాస్కూలు పరిస్థితి చాలా అరాచకంగా తయారయేటట్లు కనిపిస్తోంది. ఇతను నిప్పులో దూకమంటే దూకటానికి సిద్ధం అనేలా ఉన్నారు పిల్లలంతా.
ఖర్మ. ఇతను స్కూల్లోకి, నా జీవితంలోకి కూడా సునామిలా ప్రవేశించాడు.
ఇక మీకు ఒక విషయం చెప్పాలి. నాకు అనేక డిగ్రీలు, గోల్డ్ మెడల్స్, డాక్టరేట్లు వున్నప్పటికి ఇంగ్లీష్ లో అనర్ఘళంగా మాట్లాట్టానికి రాదు. ఏదో ఒక లాగ లాగిస్తూ వుంటాను.. ఉన్న మాట చెప్పుకోవటానికి మొహమాటం ఎందుకు చెప్పండి, అందులో మీ వంటి సహృదయుల దగ్గర. కాకపోతే పిల్లలంతా ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి అన్నది నా నిబంధన.
ఏమండీ మీరైనా చెప్పండి, మన పిల్లలు మనకంటే మెరుగ్గా వుండాలనే కదా ఆశిస్తాం? ఇంగ్లీష్ మాట్లాడే విషయం కూడా అలాగే అనుకోండి. మీరు ముసి ముసి గా ఎందుకు నవ్వుతున్నారో నాకైతే అర్థం కావటం లేదండి.
పిల్లలు చక్కగా చదువుకుని, హాయిగా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ వుంటే తప్పేమిటి? ఇందుకు గాను వారిని అనేకరకాలుగా మోటివేట్ చేస్తూ వుంటాము.
వారిలో వారికి పోలికలు తెచ్చి, కించ పరిచి, రెచ్చగొట్టేలాగా మాట్లాడి మా తంటాలు మేము పడుతూ వుంటాము. నా ఆందోళనంతా వారి భవిష్యత్తు గురించే సుమండి.
ఇకపోతే మీకు తెలిసిన విషయమే కద పిల్లల ప్రగతికి ప్రధాన శత్రువులు ఆట పాటలు, ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ అని నా నిశ్చితాభిప్రాయం. యోగా , ఆటపాటలు వంటి అల్పమైన విషయాలలో పడి చదువు సంధ్యలను ఎక్కడ దెబ్బతీసుకుంటారో అని నేను బెంబేలెత్తి పోతూ వుంటానంటే నమ్మండి.
మా టీచర్లందరికీ నా మాట శిలా శాసనమే. ఇక్కడ మా టీచర్ల గురించి కాస్తా చెప్పాలి. మా స్కూలు చుట్టు ప్రక్కల నివసించే గృహిణులు, అత్తెసరు మార్కులతో బి.టెక్ పూర్తి చేసి ఏ ఉద్యోగం దొరికే అవకాశంలేని యువతీ యువకులు వీళ్ళే టీచర్లంటే. మీరు మరీ ఎక్కువెక్కువ ఊహించేసుకోమాకండి మా టీచర్ల గురించి. ఈ విషయంలో కూడా మేనేజిమెంట్ తో నాకు ఏ అభిప్రాయ భేదం లేదు. ఇలాంటి టీచర్లయితే తక్కువ జీతానికి వస్తారు. అసలు టీచర్ ఎంత బాగా చెప్పినా బట్టీ పట్టకుంటే మార్కులు ఎలా వస్తాయి చెప్పండి. అందుకే ఇలాంటి టీచర్లతో మేము బండి నడిపిస్తున్నాము.
ఈ టీచర్లంతా నాతో మాట్లాడేటప్పుడు చక్కగా తెలుగులోనే మాట్లాడి తమ తమ పనులు చక్కబెట్టుకుని వెళుతూ వుంటారు. వారు నాకు చాలా గౌరవం ఇస్తారు. 
"మీ అంతటి వారితో ఇంగ్లీష్ లో మాట్లాడటానికి , మీ అంత బాగా మాకు ఇంగ్లీష్ రాదు సార్" అని సవినయంగా చెప్పుకుంటారు. వారిలోని ఆ వినయమే నాకు నచ్చేది.
ఈ కేశవుడితో ఈ విషయంలో కూడా నాకు తలనొప్పే. అతడికి చాలా భాషలు వచ్చు. ఇంగ్లీష్ నిజానికి మంచినీళ్ళ ప్రాయం అతనికి. ఏ బ్రిటిష్ వాడో వచ్చి మాట్లాడుతున్నాడేమో నన్నంత ఫ్లూయెంట్ గా అచ్చు అదే ఉచ్చారణతో మాట్లాడే వాడు. అతని మాటల్లొ కొన్ని అర్థమయి కూడా చావవు నాకు.
రూల్ పెట్టింది నేనే కద. మింగలేను, కక్కలేను. 
పిల్లలతో తెలుగు, నాతో ఇంగ్లీష్ మాట్లాడి చావగొడుతున్నాడు. నా చావు ఎవ్వరికి చెప్పుకోను?
లెసన్ ప్లాన్ ఎలా చేసుకోవాలి అన్న విషయంలో మిగతా టీచర్లంతా నా వద్దకు వచ్చి నా సలహామేరకు వాళ్ళ లెసన్ ప్లాన్ చేసుకోని వెళతారు. నేను చెప్పినట్టు తు.చ తప్పకుండా పాఠిస్తారు. 
ఈ విషయంలో కూడా కేశవుడిది అరాచక ధోరణే. లెసన్ ప్లాన్స్ నిశితంగా తయారు చేసుకుని వస్తాడు. పీ.డీ.ఎఫ్ ఫైల్స్, జే.పీ.జీ ఇమేజెస్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, కేస్ స్టడీస్, రోల్ ప్లేస్, నా పిండం, నా శ్రాద్ధం, ఇలా ఏవేవో తీసుకుని వస్తాడు, వాటిని వివరించి చెప్పేటప్పుడూ ఒక విధమైన ఆధిపత్య ధోరణి, ఇంగ్లీష్ లోనే నాకు వివరించి, నా సలహాలు అడుగుతాడు. తానా రోజు క్లాసులో ఏమేమి చెప్పబోతున్నాడో ఇంగ్లీష్ లోనే నాకు వివరించి నా అభిప్రాయం అడిగి, చక్కా క్లాసుకు వెళతాడు. పెద్దల్ని గౌరవించే పద్దతి ఇదేనా మీరే చెప్పండి. నాకు ఇంత అనుభవం వుంది కద, నన్ను ఆడిగి కద పెన్ను పేపర్ పై పెట్టాలి? అహంభావి. అహా, మీరైనా చెప్పండి, ఇదంతా అహంకారం కాకపోతే మరేంటి? వినయం లేదు, భక్తి లేదు, పెద్దలయందు ఉండాల్సిన భయంలేదు. సరే అతనే దారికి వస్తాడు అని ఎదురుచూస్తున్నాను.
ఉద్యోగంలో చేరిన మొదటి రోజే, అందరిలా నా ఆశీర్వాదం తీసుకోవటం మాట అటుంచి, రివర్స్లో తన గురించి ఒక అరగంట లెక్చర్ ఒకటి ఇచ్చాడు. అంతా ఆధిపత్య ధోరణే.
ఎవడడిగాడండి ఇతగాడి లెక్చర్? పెద్ద వాడిని కద, నా సలహా సంప్రదింపులు తీసుకోవాలా వద్దా?
" నా వరకు నాకు వృత్తే దైవం సార్. నాకప్పజెప్పబడిన పనిని సంపూర్ణంగా , శ్రద్ధగా చేయటమే నాకు అలవాటు. నా గురించి నా పని మాట్లాడాలి. ఒకవేళ మీరు మీ కారు తుడవమని నాకు అప్పజెప్పారనుకుందాం. కారు అప్పుడు ఎంత బాగా తుడుస్తాను అంటె, మీరు కారును చూసి ఇంప్రెస్ ఐపోయి అరె ఈ కుర్రాడికి డ్రైవర్ పని కూడా అప్పజెప్పుదామా అని మీకు అనిపించేలా తుడవాలి సార్. అదీ నా పద్దతి. పిల్లల అభివృద్ధి విషయంలో నేను అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తాను సార్.హోలిస్టిక్ అప్రోచ్ తో ముందుకు వెళతాను. నాకు మీ సలహాలు సూచనలు ఎప్పటికీ కావాలి సార్" అంటూ చక్కా క్లాసుకు పోయాడు. అతని మాటల్లో నాకు సగం అర్థం కాలేదు.
అది ప్రారంభం మాత్రమే.
ఇతగాడు స్కూల్లో చేరింది లగాయతు రోజుకొక వింత వార్త నా చెవుల్ని సోకుతోంది.
ఇతని ప్రవర్తన మా టీచర్లందరికీ ప్రధాన వినోదమైంది.  ఇంచుమించు అతగాడు ఒక ’లాఫింగ్ స్టాక’యిపోయాడు మా అందరికి.
ఉండుండి అతగాడి గురించిన ఏదో ఒక న్యూస్ ఇంచుమించు బ్రేకింగ్ న్యూస్ లాగా వస్తూనే వుంది.
"ఏమండోయ్ ఇది విన్నారా? అదేదో సంఘంలో సభ్యుడట ఇతగాడు, అందులో చిన్ననాడే భరతమాత పటం ముందు నిలబడి ప్రమాణం చేశాట్ట, ఆజన్మ బ్రహ్మచారిగ వుండిపోతానని" అని ఒక వార్త వస్తుంది ఒక రోజు, దాని తాలూకు ప్రభావం నుండి కోలుకొనే లోగా ఇంకో వార్త వస్తుంది.
"అన్నట్టు ఇది విన్నారా? మన స్కూలుకు దగ్గరలోనే ఓ పెద్ద ఇల్లు అద్దెకి తీసుకుని దిగిపోయాట్ట."
"భలే. అంత పెద్ద ఇంట్లో ఏ వస్తూ సామగ్రి లేకుండా, ఓ లారీడు పుస్తకాలు లోడుతో దిగి పోయాట్టటండీ. అతని ఇల్లు ఇంచుమించు ఒక లైబ్రరీ లాగా వుంటుందటండి"
"ఫర్నిచర్ కాదు కద చిన్నపాటి సామగ్రి కూడా లేదట, ఏదొ కాసిన్ని వంట పాత్రలు తప్పనిచ్చీ"
"మన స్కూలు పిల్లలు ఏ క్లాసువారయినా సరే ఎప్పుడు వెళ్ళినా సరె, విసుగు విరామం లేకుండా ఉచితంగా ట్యూషన్స్ చెబుతాడటండి. అంతే కాదు భోజనం కూడ వండి మరీ వడ్డిస్తాడటండి"
ఇవన్నీ ఒక ఎత్తయితే, స్కూలుకు లీవనేది పెట్టడు, ఒక క్షణం ఆలశ్యంగా రాడు. వంటరిగాడు పెళ్ళామా పిల్లలా, ఇందులో ఏమి పెద్ద గొప్ప వుంది? కాని అమాయకులైన మా టీచర్లలో కొందరికి ఇతగాడు అప్పుడే ఒక రోల్ మోడల్ , ఆరాధ్యపురుషుడు అయిపోయాడు.
ఇతనికేం వెర్రో గానీ, ఏ టీచరైనా ఎప్పుడైనా లీవు పెడితే, తనెళ్ళి ఆ క్లాసు తీసుకునే వాడు. తనకు ఆ పీరియడ్ ఖాళీ వుంటేముందు వెనుకలుఆలోచించకుండా ఆ క్లాసులో వాలిపోయి మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ,తెలుగు, హిందీ ఇలా ఒకటేమిటి ఆయా టీచర్ల సబ్జక్టును కంటిన్యుయిటి దెబ్బతినకుండా ఆ పాఠం చెప్పి వచ్చే వాడు.
ఘోరమేమిటంటే అసలు సబ్జక్టు టీచర్ కన్నా ఇతను బాగా చెప్పి వచ్చాడని పిల్లలు అనే వారు. ఇది ఏమయినా బాగుందా చెప్పండి. కీర్తి కండూతి ఇతనికి ఎక్కువ అనుకుంటాను.
పరీక్షలకు పనికి వచ్చేవిధమైన శిక్షణ మాత్రమే కాక ఆయా సబ్జక్టులు జీవితంలో ఏ విధంగా ఉపయోగపడతాయో అన్న విషయంలో లోతైన అవగాహన కల్పించాడని,పిల్లలు, వారి తలితండ్రులు చెప్పుకోవటం వినవచ్చింది.
ఇతన్ని ప్రత్యేకంగా చూడటానికి తలితండ్రులు వచ్చి ఆపిల్స్, స్వీట్స్ కూడా తీసుకు వచ్చి ఇవ్వటం అతన్ని ఆరాధనగా చూస్తూ మాట్లాడటం తరచుగా జరుగుతోంది. టిచర్లను గురించి ఏదో ఒక కంప్లయింట్ ఇవ్వటానికి తలితండ్రులు రావటమే మాకు తెలిసిన విషయం ఇప్పటిదాకా. 
ఈ విధంగా కూడా ఇతను వ్యక్తి ఆరాధనకి తెర ఎత్తి మా స్కూలు పరువు తీయటనికి సిద్ధపడి పోయాడు.
’కేశవుడు సారి కల్పించిన ఙ్గ్యానం ఇచ్చిన ఆనందం వల్ల , మనసులకు మస్తిష్కానికి రెక్కలు మొలిచిన అనుభూతి కల్గిందట" బడుద్ధాయిలు కవిత్వం వెలగబెడుతున్నారు.
పరీక్షలలో మార్కులు ఎలా తెచ్చుకోవాలి, ర్యాంకులు ఎలా తెచ్చుకోవాలి, తద్వారా వచ్చే సంవత్సరంలో స్కూలు అడ్మిషన్లు ఎలా పెంచుకోవాలి అని ఆలోచించకుండా ఇవన్నీ ఇతనికి అవసరమా చెప్పండి. ఏదో మీరు నా భావలతో మమేకం అయ్యే పెద్దమనసు వున్న వారు కాబట్టి ఇవన్నీ చెప్పుకొస్తున్నాను.
ఇంకో వెర్రి వేషం గురించి మీకు ఇక్కడ చెప్పాలి. చదువేస్తే ఉన్న మతి పోయింది అన్నట్టు,అసక్తి వున్న పిల్లలందరినీ ఓ గంట ముందే రమ్మనే వాడు. పోనీ చదివిస్తాడా అంటే అదీ లెదు. పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టండి అన్నాట్ట వెనుకటికి ఒకడు. ఇతను చేపట్టిన పని అంతకన్న మెరుగ్గా ఏమీ లేదు. 
పిల్లలందరినీ మొదట ఒక అరగంట వేగంగా నడిపించే వాడు. కాళ్ళూ, చేతులు బాగా కదిలిస్తూ వేగంగా నడిపించే ఈ ప్రక్రియకి ’బ్రిస్క్ వాక్’ అని పేరు పెట్టాడు. గాడిద గుడ్డేం కాదూ? "హెల్తీ బాడీ లీడ్స్ టు హెల్తీ మైండ్" అని పిచ్చి స్లోగన్ ఒకటి చెప్పిస్తూ పిల్లలందరితో సూర్య నమస్కారాలు, యోగా, ప్రాణాయామాలు చేయించి ఆపై క్లాసులకు వెళ్ళమనే వాడు. హతోస్మీ, చదువు చెప్పించకుండా ఇవేమీ వెర్రి మొర్రి వేషాలు చెప్పండి?
ఇక ఆసక్తి వున్న పిల్లలతో సాయంత్రాలు, వ్యక్తిత్వ వికాస శిక్షణ అని పేరు పెట్టుకుని ఏదో సుత్తి కొట్టి, ఆ తర్వాత ఓ అరగంట పిల్లలని వేదికపై నిలబెట్టి వాళ్ళతో చిన్నచిన్న ఉపన్యాసాలు ఇప్పించటం మొదలెట్టాడు. అయా ఇవన్నీ పిచ్చి పనులు కాక ఏమిటి మీరే చెప్పండి. ర్యాంకులు వస్తాయా, మార్కులు వస్తాయా, ఉత్తి టైం వేస్ట్ తప్ప.
కొత్తొక వింత అన్నట్టు, పిల్లల తల్లి తండ్రులు వచ్చి నన్ను అభినందిచటం మొదలు పెట్టారు, మంచి మేష్టారుని అపాయింట్ చేసారు అని. వాళ్ళ్ పిల్లలో చాలా మంచి మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయంట. ఉదయాన్నే నాలుగున్నర, అయిదు మధ్యన లేచిపోతున్నారట, తల్లి తండ్రుల పాదాలు మొక్కి, ఆ తర్వాత కాసేపు దైవధ్యానం చేసుకుని పుస్తకాలు తీసుకుని కూర్చుంటున్నారట. ఖర్మ, లేచింది లగాయతూ చదివితే ఇంకో అరగంట కలిసి వస్తుంది కద.  హతవిధి, మా స్కూలుకేదో చెడ్డ రోజులు ప్రారంభమయ్యాయని నాకు బలంగా అనిపిస్తోంది.
ఇప్పుడు పిల్లలందరూ పెద్దలకు గౌరవమర్యాదలు ఇస్తున్నారట. వీడియోలు, వీడియో గేమ్స్ తగ్గించారట. ఇంట్లో చిన్నచిన్న పనులకు సహాయ పడుతున్నారట. పిచ్చి పేరెంట్స్, రేప్పొద్దున టెన్త్ క్లాసులో పదికి పది గ్రేడింగ్ రాకుంటే నా పీక పట్టుకోరా అని నాకు భయం పట్టుకుంది. ఇల్లలుకగానే పండగ అనుకుంటున్నారు.
అతి సర్వత్ర వర్జయేత్ అని అన్నారు కద, ఇక నేనే నడుం బిగించి పిల్లలందరిని పూర్వ పద్ధతులలో క్రమశిక్షణలో వుంచాలి అని నిర్ణయం తీసుకున్నాను. నేనిలా అనుకుంటుండంగానే మరొక ఉపద్రవం జరిగింది.
ఒక మధ్యాహ్నం నేను నా చాంబర్ లో పని చేసుకుంటుండగా ఓ పదవ తరగతి విధ్యార్తిని , ఆపిల్ల తలితండ్రులు, మిఠాయిలు తీసుకువచ్చి ఓ బాంబు పేల్చారు. ’యునెస్కో’ వారు రక్షిత కట్టడాలు అన్న టాపిక్ పై నిర్వహించిన ఓ పోటీలో ఈ పిల్ల గీసిన ఛాయా చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో బహుమతి వచ్చిందట. తనలో అంతటి కళ దాగుందని ఆ పిల్లకే తెలియదట, యధాప్రకారం, మన కేశవుడే ఆ పిల్లలోని స్పార్క్ ని కనిపెట్టి, దగ్గరుండి ఆ పిల్లతో ఆన్ లైన్ లో అప్లై చేయించాడట. ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయించాడట. ఇంకేముంది, ప్రైజ్ రానే వచ్చింది. 
మేము పదవ తరగతి పిల్లలని రక్షిత కట్టడాలకంటే జాగ్రత్తగా కాపాడుకుంటాము, వారి విలువైన టైం ని మేము వృధా చేయనివ్వము. వారిని ఇంచుమించు జాగ్రత్తగా ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ యూనిట్ లోని పేషంట్ల లాగా కాపాడుతూ, పరీక్షల పట్ల వారిలో విపరీతమైన భయాన్ని కలిగించి, శ్రద్ధగా చదువుకొనేలాగా ప్రోత్సహిస్తాము. ఈ వ్యవస్థకి కూడా గండి కొట్టేశాడన్న మాట ఈ కేశవుడు. ఇలాంటివన్నీ నాకు తెలియకనా, నేనెందుకు ప్రొత్సహించలేదంటారు పిల్లలని ఇలాంటి వాటి పట్ల. ఏమి పనులండీ ఇవన్నీ, చదువులు అటకెక్కవా ఇలాంటి పనుల వల్ల? ఇక తప్పదు, ఇతని నిర్వాకాలన్ని, మా చైర్మన్ గారబ్బాయికి కాదు గాని, చైర్మన్ గారికే తెలియజేయాలి. ఆయన ఏదో విదేశీ యాత్రలకు వెళ్ళారట. రానివ్వండి చెపుతాను.
ఇది అంతం కాదు ఆరంభమే అని నాకు అర్థం అయిపోయింది. ఇది తుఫాను ముందటి మొదటి ప్రమాద హెచ్చరిక లాంటిదని నాకు త్వరలోనే అర్థం అయింది. ఇలాగే అనేక జాతీయ, రాష్ట్రీయ స్థాయి పోటీల్లొ మా స్కూలు పిల్లలకు బహుమతులు వచ్చాయి.  వీటన్నిటి వెనుక కేశవుడే వున్నాడన్నది బహిరంగా రహస్యం.  నా కళ్ళ ముందే పిల్లల చదువులని బ్రష్టు పట్టిస్తూ, తాత్కాలిక విజయాలకోసం,  బంగారులాంటి భవిష్యత్తు ని పణంగా పెడుతున్న ఈ కేశవుడిని ఏమి చేయాలి మీరే చెప్పండి.
నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి?
ఇతని దురాగతాలన్నీ ఒకెత్తు. మా స్కూల్ డే రోజు ఇతను చేసిన నిర్వాకం ఒక్కటీ ఒకెత్తు. ఇతని దౌష్ట్యాలన్నిటిలో కలికి తురాయి లాంటిది అని చెప్పుకోదగ్గ దుర్మార్గం ఒకటి చెపుతాను. మీకు కూడా బాగా కోపం వస్తుంది.
ప్రతి సంవత్సరం నగరంలో ఉన్న మా బ్రాంచీలన్నింటి పిల్లలని ఒక దగ్గర చేర్చి,  ఓ పెద్ద స్టేడియంలో స్కూల్ డే నిర్వహిస్తాం. మా చైర్మన గారికి రాజకీయాల్లో బాగా పలుకుబడి వుందిలేండి. ఎవరో ఒక మంత్రివర్యులు వస్తారు ముఖ్య అతిధిగా. మీడియా ప్రతినిధులు సరేసరి.
ఏ ఆర్ రెహమాన్ పాడిన వందేమాతరం వంటి దేశభక్తి గీతాల తర్వాత చక్కటి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. పిల్లలు చిన్న చిన్న బృందాలుగా వేదికపైకి వస్తారు. కాస్తా చిన్ని చిన్ని బట్టలు ధరించి, సినిమా పాటలకు అనుగుణంగా నడుం కదిలిస్తూ, చిలిపిగా హావభావాలు ఒలకబోస్తూ హుషారు కలిగించేలా డాన్సులు చేయటం మొదలెడతారు;. పిచ్చి పిల్లలు జన్మకో శివరాత్రిలా సంవత్సరానికి ఒక సారి ఏదో కాస్తా ఎంజాయ్ చేస్తే తప్పేమిటి మీరే చెప్పండి. ఈ సత్సాంప్రదాయానికి కూడా గండి కొట్టేశాడు మన కేశవుడు. 
ఈ సంవత్సరం మా బ్రాంచి తరఫున హుషారెత్తించే పాటలు లేకపోగా , పరమ బోరు కలిగించే స్కిట్స్ అంటూ ఏవో ప్రదర్శించటం జరిగింది. వీటిలో కూడా ’గోల్ సెట్టింగ్’, ’పాజిటివ్ థింకింగ్’, ’విన్-విన్ సిట్యుయేషన్’, ’360 డిగ్రీస్ థింకింగ్’, అంటూ నిరర్థకమైన నినాదాలు, నిరాసక్తమైన సందేశాలు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి చచ్చు కార్యక్రమాలు నా జన్మలో చూడలేదు నేను. మిగతా బ్రాంచీల పిల్లలు యధావిధిగా ఐటెం సాంగ్స్ కి చక్కగా నడుం కదిలిస్తూ డాన్సులు చేసి నన్ను ఆకట్టుకున్నారు. 
మా బ్రాంచి పిల్లల్నే కేశవుడు ఇలా దిగజార్జేశాడు. నా ఖర్మ ఏం చేద్దాం చెప్పండి? చిత్రంగా ఇతను నిర్వహించిన కార్యక్రమాలకు చప్పట్లు ఎక్కువగా వచ్చినట్టుగా అనిపించింది నాకు. 
ఇంకో చిత్రం చెప్పనా, చక్కటి డాన్సులన్నింటినీ త్రోసి రాజని మన కేశవుడి స్కిట్స్ కే అవార్డులన్నీ క్యూ కట్టుకుని మరీ వచ్చాయి.ఇలాంటి గొప్ప శిక్షకుడు ప్రతి బ్రాంచిలో వుండాలని మా చైర్మన్ గారి అబ్బాయి ప్రశంశా వాక్యాలొకటి.
విదేశాల నుంచి రాగానే చైర్మన్ గారితో కూలంకషంగా మాట్లాడాలని ఇక ధృఢంగా నిశ్చయించుకున్నాను.
తదుపరి పరిణామాలు మరింత ఘోరంగా పరిణమించాయి.
నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నట్టు , టీచర్లందరిపై తన దృష్టిని కేంద్రీకరించాడు కేశవుడు. సాధికారికంగా ఇంగ్లీష్ లో మాట్లాడే శిక్షణ ప్రారంభించేశాడు. ఆశువుగా మాట్లాడే వక్తృత్వ శిక్షణ, వ్యక్తిత్వ వికాస శిక్షణ, ప్రారంభమయిపోయాయి. ఇక ఇతగాడి ట్రేడ్ మార్క్ సూర్యనమస్కారాలు, యోగా, బ్రిస్క్ వాకింగ్, ప్రాణాయామాలు సరేసరి.
నాకు తెలియక అడుగుతా. ఎందుకండి ఇవన్నీ.
ప్రతీరోజు కనీసం ఒక్కసారన్నా ఇతగాడిని నా ఛాంబర్ కి పిలిచి, ’ ఈ పిచ్చి పనులు కట్టిపెట్టి, పిల్లలందరికీ పదికి పది స్కోరు వచ్చే దానిపై ఫోకస్ చేయమ’ని చెప్పటం  నా నిత్య కృత్యాల్లో ఒకటిగా మారిపోయిందంటే నమ్మండీ. ఇలా అనుభవం లేని అధ్యాపకులని మలచుకోవటమే కద ప్రిన్సిపాల్ గా నా విధి.
ఇక సంవత్సరం అంతంలో పరీక్షలు జరగటం, ఫలితాలు వెలువడటం చక చక జరిగి పోయాయి. మా బ్రాంచి చరిత్రలోనే కని విని ఎరుగని ఫలితాలు ఈ సంవత్సరం వచ్చాయి.
ఎక్కడ చూసినా అభినందనల వెల్లువ. కేశవుడిని అప్పాయింట్ చేయటం నా దార్శనికతకి ప్రతీక అని పేరెంట్స్ అందరూ కొనియాడుతున్నారు. ఖర్మ , ఇన్నేళ్ళూ నేను చేసిన శ్రమ ఫలించింది., క్రెడిట్ ఈ కేశవుడు కొట్టేస్తున్నాడు.
పోన్లెండి కనీసం కేశవుడికి అయినా అర్థమయి బుద్ది తెచ్చుకుని, ఇకనైనా నేను చెప్పినట్టు వింటాడని ఆశిద్దాం.
కానీ తానొకటి తలచిన దైవమొకటి తలచును అన్నట్టు , కేశవుడిని మా బ్రాంచికి ప్రిన్సిపాల్ గా అప్పాయింట్ చేస్తూ, నన్ను ఇంటి దారి పట్టమన్నారు.

***
పోన్లెండి. ఈ జ్యోస్యం టెక్నో స్కూలు ఒక్కటే కాదు కద. గోవిందా టెక్నో స్కూలు, వైప్లవ్య కాన్సెప్ట్ స్కూలు ఇలా బోలెడు స్కూళ్ళు నన్ను రమ్మని ఎప్పటినుండో పిలుస్తూనే వున్నాయి.  నేనంటూ వెళితే కళ్ళకద్దుకుని తీసుకుంటాయి.
కానీ ఈ కేశవుడి చేతిలో పడి ఈ స్కూలు గతి ఏమవుతుందో ఊహించుకుంటేనే జాలి కలుగుతుంది.





 Published in Koumudi Web Magazine. February 2020