Monday, June 6, 2022

హ్రిదయమ్


 

హ్రిదయం (మలయాళం)

ఇది ఒక ఫీల్ గుడ్ చిత్రం

ఈ చిత్రాన్ని ’హ్రి’దయం అని వ్రాశారు. నాకు ఏదోలాగ అనిపించింది. కానీ ఈ సినిమా పేరుని ఇలాగే ఉఛ్చరించాలిట మలయాళంలో.

****

చాలా బాగుంది. అలాగన్జెప్పి కళా ఖండం ఏమీ కాదు. చెప్పదలచుకున్న విషయాన్ని నిజాయితీగా చెప్పిన చిత్రం.

తప్పక చూడదగ్గది, కుటుంబ సమేతంగా.

* ఏ ఆస్కార్ అవార్డో, జాతీయ అవార్డో రాదగ్గ చిత్రం కాకున్నా, ఖచ్చితంగా ఒక చక్కటి చిత్రం . నిరాశ కల్గించదు. ఒకప్పుడు దేశాన్ని ఒక ఊపు ఊపిన నాగార్జున ’గీతాంజలి’ని ఇంకా క్లాస్ గా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అని చెప్పగలను.

చాలానే ప్రత్యేకతలు ఉన్నాయి ఈ చలన చిత్రానికి.

ప్రముఖ మలయాళ కథానాయకుడు మోహన్‍లాల్ పుత్రుడు ప్రణవ్‍లాల్ నటించిన ‍చిత్రం ఇది.

యూత్ ఫిల్మ్ కద అని చెప్పి పిచ్చి పిచ్చి పాటలు, కుప్పి గంతులు, ఫైట్లు లేవు.  , చౌకబారు సంభాషణలు లేవు.

***

మెర్రీలాండ్ స్టూడియోస్ కేరళలో ఒక పాత తరపు నిర్మాణ సంస్థ. 1950 ప్రాంతాలలో ఇది తన ప్రయాణం ప్రారంభించిది. మన విజయా సంస్థతో సరిపోల్చవచ్చు దీన్ని.  మెర్రీలాండ్ సినిమా అనే పేరిట వీళ్ళు మళ్ళీ ఈ హ్రిదయం చిత్రంతో తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడం ఒక మంచి పరిణామం.

బహుముఖ ప్రఙ్జాశాలి వినీత్ శ్రీనివాసన్ ఈ చిత్రానికి దర్శకుడు.

***

నేను సినిమాలు చూసేదే తక్కువ. అందులోనూ ప్రేమకథాచిత్రాలు ఇంకా తక్కువ.

నా వరకు నేను సినిమా చూడబోయే ముందు దర్శకుడు ఎవరా అని చూస్తాను.

గుల్జార్, మణిరత్నం, బాసూ ఛటర్జీ, హ్రిషికేష్ ముఖర్జీ, గురుదత్, మహేష్ భట్, ముఖేష్ భట్, పుట్టన్న కణగల్, కే బాలచందర్, దాసరి నారాయణ రావు, సంజయ్ లీలా భన్సాలీ, ఇమ్తియాజ్ ఆలీ, రాజ్ కపూర్, కుందన్ షా, రాజూ హీరానీ, శంకర్(తమిళ్), రాంగోపాల్ వర్మ, త్రివిక్రం శీనివాస్, పసలపూడి వంశీ, కే విశ్వనాథ్; ఇటీవలి యువదర్శకులలో చంద్రశేఖర్ ఏలేటి, సుకుమార్,  తదితర దర్శకులు తిసిన చిత్రాల్ని ముందు వెనుకలు ఆలోచించకుండా చూసేస్తాను.

అలాగే కొన్ని చిత్రాల్ని చిత్రనిర్మాణ సంస్థలని బట్టి ముందు వెనుకలు ఆలోచించకుండా చూసేయవచ్చు. అలాంటి సంస్థలలో హిందీలో రాజ్‍శ్రీ సంస్థ ఒకటి. స్వతహాగా ప్రేమ కథా చిత్రాలంటే బోర్ నాకు. ఒకటే రకం కథ, నాలుగు పాటలు, జోకులు, అపార్థాలు, విడిపోవడాలు, విరహాలు, అయితే విషాదాంతం, లేదా సుఖాంతం. మంచి దర్శకుడు తీసిన చిత్రమైతే తప్ప ప్రేమ కథా చిత్రాన్ని చూడటానికి మొగ్గు చూపను.

నాకు వ్యక్తిగతంగా సస్పెన్స్, థ్రిల్లర్స్, హారర్, అడ్వెంచర్ చిత్రాలు ఇష్టం.

 

నేను చూసిన ప్రేమ కథా చిత్రాలలో నాకు బాగా గుర్తుండిపోయినవి కొన్నే.

* గోరింటాకు (శోభన్ బాబు, సుజాత, వక్కలంక పద్మ, తెలుగు)

* హృదయం (మురళీ, హీరా. ’ఇదయం’ తమిళ్-తెలుగు శబ్దానువాదం)

* జానూ (సమంతా, శర్వానంద్ - ’ 96’ తమిళ్- తెలుగు పునర్నిమాణం)

* కలర్ ఫోటో (చాందినీ చౌదరీ, సుహాస్. తెలుగు చిత్రం)

* సితార ( భానుప్రియ, సుమన్ తెలుగు చిత్రం)

* నిఖా (సల్మా ఆఘా, రాజ్ బబ్బర్ హిందీ చిత్రం)

 

ఈ చిత్రాలన్నింటి ప్రత్యేకత ఏమిటి అంటే, సినిమా విజయం సాధిస్తుందా, అపజయం పాలవుతుందా అన్న ఆలోచన లేకుండా దర్శకుడు తనకు నచ్చిన కథని  మనసుపెట్టి ఇష్టంగా తీస్తే,  సినిమాలు ఎలా రూపుదిద్దుకుంటాయో , అలా తయారైన చిత్రాలు ఇవన్నీ.

ఈ హ్రిదయంలో కూడా సరిగ్గా అదే అంశం నన్ను ఆకట్టుకుంది. దర్శకుడు వినీత్ శ్రీనివాస్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఒక యువకుడి జీవితంలో అతని పదిహేడో ఏట నుండి ముపై అయిదవ ఏట వరకు జరిగిన పరిణామాలని వీలయినంత సహజంగా చూపించే ప్రయత్నం ఈ సినిమా.

అనవసరమైన పాటలు, ఫైట్లు, , మెరుపుపాటలు, సినిమాటిక్ అపార్థాలు గట్రాలు లేవు. ఈ సినిమాని ఎలాగైనా హిట్ చేయాలి అనే ఉద్దేశంతో పెట్టే ఏ ఫార్ములా అంశాలు లేకపోవటం వల్ల, ఒక జీవితాన్ని దగ్గరనుంచి చూసిన ఫీలింగ్ కలుగుతుంది ఈ  సినిమా చూసినంత సేపు.  ఆద్యంతం ఫ్రెష్ గా ఉంది. మనసుకు ఏదో హాయి కలుగుతూ ఉంటుంది ఈ సినిమా చూసినంత సేపు. మధ్య మధ్యలో కథానుగుణంగా బాధ, వేదన, దుఃఖం, కోపం, ఉత్సాహం తదితర భావాలు కలుగుతూ ఉంటాయి.

***

ఇంతకూ కథేంటి?

ప్రారంభ దృశ్యంలో అరుణ్ నీలకండన్ (ప్రణవ్ లాల్) మంగళూరు రైల్వే స్టేషన్‍లో చెన్నయ్ వెళ్ళే రైలు ఎక్కుతాడు.

ఈ టీనేజి కుర్రాడు కేరళ నుంచి వచ్చి చెన్నయి లోని కేసీ టెక్ అనే ఇంజినీరింగ్ కాలేజీలో చేరతాడు. ప్రారంభంలో చిన్న చిన్న కామెడీ దృశ్యాల అనంతరం హీరోని అతని మిత్రులని సీనియర్లు రాగింగ్ చేయటం అనే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా అతనికి దర్శన (దర్శన) అనే అమ్మాయి తారసపడుతుంది. ఆమెతో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అతి తక్కువ సమయంలోనే ఇద్దరూ బాగా ఆప్తులవుతారు. ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఇష్టం ఏర్పడుతుంది.

స్నేహితులు ఎంత వారించినా అరుణ్ ఒక విషయం దాచకుండా చెప్తాడు.  ఆ అమ్మాయికి ఇతని మీద చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. దాంతో ఆమె అతనికి దూరం అవుతుంది. దర్శనని పైకి ద్వేషిస్తాడే కానీ ఆమెని మరవలేకపోతుంటాడు. ఆమె పరిస్థితి కూడా అంతే.

కానీ ఇద్దరూ సవాల్ విసురుకుంటారు.

’నిన్ను మించిన జీవిత భాగస్వామిని పొందుతాను, నన్నునిన్ను తిరిగి జీవితంలో స్వీకరించే ప్రసక్తే లేదని’ ఛాలెంజ్ చేసుకుంటారు.

ఈ క్రమంలో అతను అందరి ముందు పలచన అవుతాడు, ఆ అవమాన భారంతో అతను త్రాగుడికి అలవాటు పడతాడు.

అతను క్రమంగా చదువులో వెనుకపడతాడు. అతని చుట్టూ నైతిక విలువలు పెద్దగా లేని స్నేహితులు చేరతారు. తనను ఎవ్వరూ పట్టించుకోకూడదు అన్న ఉద్దేశంతో, ఏదో కసితో అతను ఈ అప్రయోజకుల సమూహంలో ఎక్కువ తిరుగుతుంటాడు. ఈ పరిస్థితులలో దర్శనకి కేదార్ అనే ఇంకో కుర్రాడు పరిచయం అవుతాడు. అతను పైకి మంచిగా కనిపించే పయోముఖవిషకుంభం. అరుణ్ అతని బారి నుంచి దర్శనని కాపాడతాడు.

అరుణ్ చదువులలో వెనుకపడతాడు. పరీక్ష తప్పటం మామూలు అవుతుంది. అతనిలో ఏదో కసి.

ఈ క్రమంలో హటాత్తుగా అతనికి తన స్థితి పట్ల తనకే అసహ్యం వేసి, ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చే సెల్వ అనే ఒక మంచి కుర్రాడికి దగ్గర అవుతాడు. ఆ తరువాత కఠోర సాధన చేసి , సెల్వ వాళ్ళ స్నేహబృందంతో కలిసి కంబైన్డ్ స్టడీ చేసి ఒక్కసారిగా క్లాస్ టాపర్స్ లో ఒకడిగా మారిపోతాడు.

మెల్లిగా దర్శన కూడా ఇతనితో స్నేహంగా ఉండటం ప్రారంభిస్తుంది.

ఈ లోగా అరుణ్ ’మాయా’ అనే అమ్మాయికి దగ్గర అవుతాడు కానీ, ఆమె సూటిగా అడిగిన ప్రశ్నకి సమాధానంగా, ’తాను దర్శనని ప్రేమించానని’ చెప్పటంతో మాయ కూడా  దూరం అవుతుంది.

ఇక ఇంజినీరింగ్ కోర్స్ ముగుస్తుంది. రైల్వే స్టేషన్ లో అరుణ్ కి వీడ్కోలు పలకటానికి దర్శన కూడా వస్తుంది. అన్నీమరచి పోయి మళ్ళీ మనం కలిసి ఉండలేమా’ అని అడుగుతుంది. అరుణ్ ఏమీ సమాధానం చెప్పడు.

ఆ తర్వాత కథ ఎలా మలుపులు తిరిగింది చివరికి ఏమయింది అనేది తెలుసుకోవాలంటే చలనచిత్రాన్ని చూడాల్సిందే.

***

ఓవరాల్ గా ఈ చిత్రానికి మంచి మార్కులు వేయవచ్చు.

కథా కాలం ఓ పది పదిహేను సంవత్సరాలు అనుకోవచ్చు. ఫ్లాష్ బాక్ టెక్నిక్ వంటివేవీ వాడకుండా స్ట్రెయిట్ నేరేటివ్ టెక్నిక్ లో చెప్పుకుంటూ వెళతారు కథ.

కథా ప్రారంభ సమయంలో రైలు బోగిల రంగు, పాత్రలు వాడే కీపాడ్ సెల్ ఫోన్స్ ఆధారంగా మనం కనుక్కోవచ్చు ఈ కథ 2005 -2010 ల మధ్య ప్రారంభం అయింది అని.

ప్రస్తుత కాలంలో కథ ముగుస్తుంది.

***

ఈ చిత్రంలో నేను గమనించిన కొన్ని అంశాలు.

* ఆహ్లాదకరమైన సంగీతం ఆద్యంతం వీనుల్ని సోకుతూ ఉంటుంది.

* ’నగుమోము కనలేని నా జాలి తెలిసి...’ అనే త్యాగరాజ స్వామి కీర్తన చక్కగా తెలుగులో వినిపిస్తూ ఉంటుంది కీలక సన్నివేశాలలో. ఒక విధమైన తాదాత్య్మ స్థితికి ప్రేక్షకుడిని తీస్కువెళ్ళటంలో త్యాగరాజ కృతుల్ని చక్కగా ఉపయోగించుకున్నారు. యూత్ ఫిల్మ్ లో ఇలాంటి క్లాసికల్ సంగీతం వాడటం, (అదికూడా సరి అయిన విధంగా), దర్శకుడి అభిరుచిని సూచిస్తుంది.

* ఇప్పటి యువతరం తాలూకుజీవన శైలిని చూపించటంలో సఫలీకృతుడు అయ్యాడు దర్శకుడు. వారు ఉద్యోగ భద్రతకంటే తమ మనసుకు తృప్తి కలిగించే వృత్తిని ఎన్నుకుని తారాపథంలో దూసుకుపోవటాన్నిఆయన అద్దం పట్టినట్టు చూపించాడు.

* క్యాంపస్ జీవితం, రాగింగ్, స్నేహాలు, పరీక్షలు, పోటీలు, కాంపస్ సెలెక్షన్ లో ఉద్యోగాలు రావటం అన్ని అంశాలు చక్కగా సహజంగా చూపించారు.

* బహుముఖ ప్రఙ్జాశాలి అయిన ఈ చిత్ర దర్శకుడు వినీత్ శ్రీనివాస్ ఈ చిత్రంలో తన అద్భుత గాత్రంతో మన మనసుల్ని దోచే పాటలు కూడా పాడాడు. చిత్ర సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్ కూడా కొన్ని పాటలు పాడాడు.

* కొస మెరుపు ఏమిటి అంటే, ఏ ఆర్ రెహమాన్ ఈ పాటల్ని విని పరవశించి పోయి ఇటీవల ప్రతి వేదిక మీద ఈ సినిమా పాటలని తెగ మెచ్చుకుంటున్నాడు

* ముఖ్యంగా, ఈ చిత్రంలో హీరో తన నైరాశ్యం నుంచి, ఓటమి నుంచి తానే బయటపడి, కఠోర సాధన చేసి, విజేతగా నిలబడిన ఎపిసోడ్, యువతకి ప్రేరణగా నిలబడుతుంది. ఇలా చూపటం సినీ దర్శకుల సామాజిక బాధ్యత. చాలా చక్కగా ఉంది ఈ పాయింట్.

 

***

తారాగణం

అరుణ్ నీలకండన్ - ప్రణవ్ మోహన్ లాల్

దర్శన-దర్శన

నిత్య-కల్యాణీ ప్రియదర్శన్

కలేష్ రామానంద్ - సెల్వ

సాంకేతిక విభాగం

రచన, దర్శకత్వం - వినీత్ శ్రీనివాస్

నిర్మాత -విశాఖ సుబ్రమణియం

సంగీతం -హేషం అబ్జుల్ వహాబ్

ఫోటోగ్రఫీ - విశ్వజీత్ ఒడుక్కదిల్

 

 

 

 


Monday, May 23, 2022

పుళు (మలయాళ చిత్రం)


 

పుళు (మలయాళ చిత్రం)

మమ్ముట్టి నటనా జీవితంలో మరో మైలు రాయి.

సోనీ లైవ్ ఓటీటీ లో లభ్యం - 115 నిమిషాలు.

****

ఈ చలన చిత్రం తెలుగులో ’పురు’ అనే పేరుతో శబ్దానువాదం చేయబడింది. ’పురు’ అంటే ఏమిటో మనకు తెలియదు. దర్శకుడికైనా తెలుసో లేదో మనకు తెలియదు.

మలయాళంలో ’పుళు’ అంటే ’పురుగు’ అని అర్థం.

 

ఈ చలన చిత్రాన్ని మీరు సంపూర్ణంగా ఆస్వాదించాలి అంటే ఈ కింది రెండింటిలో ఒక వర్గానికి చెందిన వారయి ఉండాలి. అప్పుడే ఈ చలన చిత్రాన్ని మీరు పూర్తిగా ఇష్టపడతారు.

ఒకటవ వర్గం: సినిమాని సినిమాగా చూస్తున్నాం అని అనుకునే మంచివారు

రెండవ వర్గం: అభ్యుదయవాదులుగా చలామణి అవుతున్న బ్రాహ్మణద్వేషులు

 

మీరు మొదటి వర్గానికి చెందిన వారయితే, ఒక చిన్న హెచ్చరిక.

ఈ చలన చిత్ర దర్శకులు మిమ్మల్ని నెమ్మదిగా రెండో వర్గములోకి మార్చేదానికి ఈ చిత్రాన్ని ఒక ఆయుధంగా ఎన్నుకున్నాడు అని తెలుసుకోవాలి అలాగన్చెప్పి ఎక్కడా బ్రాహ్మణులను నేరుగా కించపరచలేదు ఆయన. చిత్రాన్ని చివరిదాక చూస్తే, చిత్రంలోని ప్రతి పాత్రని మలచిన తీరు సనాతనవాదులని పరమ దుర్మార్గులుగా, అనాలోచిత నిర్ణయాలు తీసుకునేవారిగా చూపించారు. అదే విధంగా సనాతన ధర్మాన్ని తుంగల్లో తొక్కేవారిని, బ్రాహ్మణ్యాన్ని, దేవతలని కించపరిచేవారిని అతి ఉత్తములుగా చిత్రీకరించటంలో దర్శకులు ఎటువంటి సంకోచం చూపలేదన్నది స్పష్టమవుతుంది.

 

మీరు రెండో వర్గానికి చెందిన వారయితే చింతే లేదు. హాయిగా ఈ సినిమా చూసేయవచ్చు.

****

ఇది నిస్సందేహంగా ఒక చక్కటి చలన చిత్రం. కథ ఆద్యంతం నత్త నడక నడిచినా, ఎక్కడా బోర్ కొట్టకుండా తీయగలిగారు. కథ ఎటుదారి తీస్తోందో ఎంతకీ అర్థం కాదు. ఆ తరువాత ఒక్క సారిగా షాక్ మీద షాక్ తగులుతుంది మనకు. 

మొదట స్థూలంగా ఈ చలన చిత్రం కథ చెప్పుకుందాం.

కథ ఏమిటి అంటే:

కుట్టన్ (మమ్ముట్టీ) ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ఆయన సద్బ్రాహ్మణుడు. ఆయన రాష్ట్ర స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించిన ఆఫీసర్ అని మనకు అర్థం అవుతు ఉంటుంది. ఆయన భార్య చనిపోయుంటుంది. కానీ ఆవిడ ఎక్కడా కనిపించదు కథలో. మామూలు ఫార్ములా చిత్రాలలో లాగా గోడకి ఫోటో వేసి, దండ వేసే విధంగా కూడా ఏమి ఉండదు. పాత్రల సంభాషణలని బట్టి అర్థం చెసుకోగలం మనం.

ఈయన చాలా ఖరీదైన బంగళాలో అతి సౌకర్యవంతమైన, సంపన్నమైన జీవితం జీవిస్తుంటాడు.

ఆయనకి హైస్కూల్ కి వెళ్ళే వయసున్న కొడుకు ఉంటాడు. వాడి పేరు రిషికేష్ / కిచ్చు (వాసుదేవ్ సాజిష్). ఈ కుర్రాడిని మమ్ముట్టి అత్యంత క్రమశిక్షణతో పెంచుతుంటాడు. అలాగన్చెప్పి కొట్టడు, తిట్టడు. కేవలం కనుసైగతో ఆ కుర్రాడిని శాశిస్తుంటాడు. వాడి బాగు కోసం తాను మరో పెళ్ళి చేసుకోకుండా, వాడిని చాలా చక్కగా పెంచుకుంటున్నాను అని అనుకుంటాడే కానీ , వాడికి తల్లి ప్రేమ లేదు, ఇటు ఈయన క్రమ శిక్షణ కారణంగా తండ్రితో ప్రేమగా దగ్గర అవలేకపోతుంటాడు. వాడికి స్వేఛ్ఛ మృగ్యం. ఆయన తన పోలీస్ శిక్షణ తాలూకు అనుభవాన్నంతా రంగరించి ఆ కుర్రాడిని క్రమశిక్షణతో పెంచుకుంటున్నానని అనుకుంటుంటాడు కానీ వాడికి మానసికంగా దూరం అవుతున్నాను అని తెలుసుకోడు.

ఆయన క్రమ శిక్షణ ఎలాగుంటుందంటే, ఆయన బయటనుంచి రాగానే, ఈ కుర్రాడు చదువుకుంటూ కనిపించాలి. డస్ట్ బిన్ వద్ద ఏదయినా చిన్న చిత్తు కాగితం కనిపిస్తే, ఆయన గంభీరంగా ఒక సారి గొంతు సవరించుకుంటాడు.

కార్ ఎక్కి కూర్చోగానే తను సీట్ బెల్ట్ తగిలించుకుని, ఈ కుర్రాడి వంక సాభిప్రాయంగా చూస్తాడు. అంతే, వాడు కిక్కురుమనకుండా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి.

ప్రతి రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకునేటప్పుటు, నిలువుగా ఎన్ని సార్లు, అడ్డంగా ఎన్ని సార్లు బ్రష్ చేసుకోవాలో ఆయన ఒక సారి చెబుతాడు గంభీరంగా.

ఆ కుర్రాడు ఏమీ చేయలేక తరచు తండ్రిని పొడిచి చంపేసినట్టు ఊహించుకుని తృప్తి పడుతుంటాడు (??), ప్రతి రాత్రి పడుకునే ముందు.

ఈ మమ్ముట్టి గారికి భారతి (పార్వతి తిరువోతు) అని  ఓ చెల్లెలు ఉంటుంది. ఈ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి, తనకంటే పెద్ద వాడైన ఒక నాటక కళాకారుడు కుట్టప్పన్ (అప్పుణ్ణీ శశి)తో సహజీవనం చేస్తుంటుంది. ఈ పెద్ద మనిషి ఒక దళితుడు. అతనికి ఇది వరకే పెళ్ళీ అయిఉంటుంది. మరి ఆవిడని ఈయన వదిలేశాడా, ఆవిడ ఈయన్ని వదిలేసిందా తెలియదు, కానీ ఈయన గారు శంబూక వధ, తదితర నాటకాలు, అభ్యుదయనాటకాల పేరిట హిందూ ధర్మాన్ని కించపరిచే నాటకాలు, బ్రాహ్మణ వాదాన్ని విమర్శిస్తూ కవితలు గట్రా వ్రాస్తూ బోలెడు అవార్డులు తెచ్చుకుంటూ ఉంటాడు. ఈయన్ని ఆకాశానికెత్తేసే పత్రికలు, మీడియా హవుసులకూ కొదవలేదు. ఏతావాతా ఆయన పెద్ద సెలబ్రిటీగా చెలామణి అవుతుంటాడు.

వీరు మమ్ముట్టి ఉండే ఊరికే వచ్చి సహజీవన కాపురంపెట్టాలనుకుంటారు. ఇంటి యజమానులు, వీరిద్దరి మధ్య వయోబేధాన్ని గమనించి, మేరేజ్ సర్టిఫికెట్ చూపించండి అంటూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ దశలో వీరు, ఒక మిత్రుడి సాయంతో, మమ్ముట్టి నివసించే అపార్ట్‌మెంట్ లోనే ఇంకో ఫ్లాట్ లోకి వచ్చి స్థిరపడతారు. మమ్ముట్టి వారి ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడడు. ఆ అమ్మాయి తరచు వచ్చి మేనల్లుడిని (కిచ్చు) తమింటికి తీస్కు వెళ్ళటం, వాడికి రకరకాల కథలు చెప్పటం , వాడికి ఇష్టమైన తిండి పదార్థాలు వండిపెట్టడం చేస్తూ ఉంటుంది. తన భర్త నటించే నాటకాలకి కూడా తరచు తిస్కువెళుతుంటుంది.  సహజంగానే మమ్ముట్టికి ఇవన్నీ నచ్చవు. కానీ ఏమీ అనడు. దిగమింగుకుని జీవిస్తుంటాడు.

ఇదిలా ఉండగా, ఇంకో పారలెల్ కథ నడుస్తూ ఉంటుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మమ్ముట్టి మీద తరచు హత్యా యత్నాలు జరుపుతూ ఉంటారు. ఇది ఒక ఉపకథ. తన చెల్లెల్ని, బావగారిని, చివరికి స్వంత టీనేజి కొడుకుని కూడా అనుమానిస్తాడు మమ్ముట్టి.

చివరకు కథ ఎలా అంతమైంది అనేది తెలుసుకోవాలంటె, మీరు "పుళు" చూడాల్సిందే. మీ మనోభావాలు గాయపడితే నాది బాధ్యత కాదు.

****

ఇక ఈ సినిమా లో ముఖ్యమైన కొన్ని ముఖ్యాంశాలు.

* తన కెరియర్ లో అన్ని రకాల పాత్రలను పోషించిన మమ్ముట్టి ఈ చలన చిత్రంలొ విలనీ షేడ్స్ ఉన్న పాత్ర బహు సునాయాసంగా పోషించాడు.  మన తెలుగులో ’స్వాతి కిరణం’ లో ఆయన ఇలా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర నటించిన విషయం మీకు తెలిసే ఉంటుంది.

* మమ్ముట్టి నటన అద్భుతం. పెదవి విరుపుతోనూ, కను రెప్పలు కదిలించటం ద్వారానూ, ముఖం చిట్లించుకోవడం ద్వారానూ ఆయన తన ఏహ్యతని చూపిన విధానం అద్భుతం.

* కొడుకుతో అతను అనే మాటలు విని మమ్ముట్టి పాత్ర మిద జాలి కలుగుతుంది. "నేను నిన్ను ఎంత ప్రేమగా చూస్కుంటున్నాను, మీ తాత నన్ను కొట్టినట్టు ఏనాడైనా నిన్ను కొట్టానా?, నీ మంచి కోసమే కద నేను తపన పడుతున్నది’ అంటాడు. కాకపోతే,  ఆయనకి పోలీస్ డిపార్ట్‌మెంట్ తాలుకు కాఠిన్యం అలవాటయిపోయి ఇంట్లోని సభ్యుల పట్ల ప్రేమ ఎలా చూపాలో కూడా తెలియని విధంగా తయారయి పోయాడు అన్న కోణం భలే చూపించారు.

* ఏడు పదుల వయస్సులో కూడా ముఫై ఏళ్ళ కుర్రాడిలా ఉండగలగడం ఆయనకే చెల్లింది. యువకుడిలా కనిపిస్తున్న ఆయన్ని అలా ఆరోగ్యంగా, అందంగా చూస్తుంటే, ఒకటి గుర్తు వచ్చింది. స్వాతి కిరణం సినిమాలో ఆయన చెప్పిన డైలాగే ఆయనతో చెప్పాలనిపిస్తుంది "ఏమి వరం పొంది వచ్చావు నివ్వు? అమృతం త్రాగి వచ్చావా?" అనే అర్థం లో డైలాగు చెప్తాడు ఆయన మాష్టర్ మంజునాథ్ తో.

* చివరి పదిహేను నిమిషాలు ఊపిరి బిగపట్టి చూడాల్సిందే సినిమాని. మన కళ్ళని మనమే నమ్మలేము. మనుషులు ఇలా కూడా ప్రవర్తిస్తారా అనిపిస్తుంది. ఎవ్వర్నీ తప్పుపట్టాలనిపించదు. 

* అబ్బ మమ్ముట్టి ఇలాంటి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కూడా చేయగలడా అనిపిస్తుంది.

* ఈ సినిమా చూసిన గంట వరకు ఈ సినిమా తాలూకు ఆలోచనలే. ఆ దిగ్భ్రమ అంత తేలిగ్గా వదలదు ప్రేక్షకులను.

***

మమ్ముట్టి చర్యలని సమర్థించటానికి ఎవరికైనా బోలేడు కారణాలు కనిపిస్తాయి ఈ చిత్రంలో.

సంప్రదాయ వాది ఆయన. ఆయన చెల్లెలు, ఆయన్ని కాదని ఇంట్లోంచి వెళ్ళీపోయి తనకన్నా వయసులో పెద్దవాడైన వ్యక్తితో పెళ్ళికూడా చేసుకోకుండా సహజీవనం చేస్తు, తన అలవాట్లకి భిన్నంగా ఆహారాన్ని వండి, వడ్డిస్తూ, తానూ తింటూ , ఇలాంటి జీవితం మమ్ముట్టి ఎదురుగా  గడుపుతూ ఉంటే, మమ్ముట్టి కోణంలో ఒక సారి ఆలోచించండి, ఆయనకి ఎంత ఆక్రోశం కలుగుతుందో

ఎవరికి నచ్చిన ఆహారాన్ని వారు తినవచ్చు. అది వారి వ్యక్తిగత అభిరుచి. అలాంటి వ్యక్తి తన పిల్లల్ని తన అభిరుచులకి అనుగుణంగా పెంచుకోవచ్చు, అది ఆయన వ్యక్తిగత స్వేఛ్ఛ.

అభ్యుదయవాది అయిన మేనత్త, క్రమ శిక్షణలో పెరుగుతున్న టీనేజి కుర్రాడిని, మందు, మాంసం తో కూడిన పార్టీకి తీస్కువెళితే, ఆ కుర్రాడి తండ్రి మనసు ఎలా తల్లడిల్లి పోతుంది , ఒక సారి మమ్ముట్టి కోణంలో ఆలోచించండి.

***

’నీ స్వేచ్చ ఎంత వరకు? నా స్వేఛ్చకి అడ్డు తగలనంత వరకే’, అలాంటిది, నువ్వు నా జీవితంలోకి చొచ్చుకువచ్చి, నా నమ్మకాలని, నా సంప్రదాయాలని, నా మనో భావాలని కించపరిస్తే నేనేం చేయాలి? నేను నీకు అడ్డు రాలేదు. నీవే ప్రతి అడుగులో నాకు అడ్డు వస్తున్నావు. నన్ను ధిక్కరిస్తున్నావు. నన్ను రెచ్చగొడుతున్నావు. నన్ను ఏం చేయమంటావు?’ ఈ మాటలు ఏవీ మమ్ముట్టి అనడు.

ఆయన పాత్రని చిత్రీకరించిన విధానంలో దర్శకులు మనకు ఎన్నో కోణాలని ఆవిష్కరిస్తారు ఆ పాత్రలో. ఆయన విచిత్రమైన పరిస్థితులలో అడకత్తెరలో పోక చెక్కలాగా చిక్కుకుపోతాడు. ఆయన పరిస్థితులకి లొంగి పోతాడు.

ఇలాంటి సంఘర్షణే రాంగోపాల్ వర్మ శిష్యుడు ఆనంద్ చంద్ర, మిర్యాలగూడా లో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా తీసిన ’మర్డర్’ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రలో చూపిస్తాడు. కానీ ఈ ’పుళు’ లో ఎంతో సున్నితంగా భావ సంఘర్షణలు చూపారు.

మళ్ళీ మమ్ముట్టి పాత్ర గూర్చి.

ఈ చలన చిత్రంలో,

అసలే ఆయన సంప్రదాయవాది.

అసలే ఆయన అహంకారి.

అసలే ఆయనకి రాజసం ఎక్కువ.

అసలే ఆయనకి అధికారం వల్ల వచ్చిన మత్తు ఇంకా దిగలేదు.

అసలే ఆయనకి క్రమశిక్షణ ఎక్కువ

డబ్బుకి కొదవలేదు ఆయనకి.

ఉదాత్తుడైన ఆయన , కొడుకు కోసం త్యాగం చేసి, రెండో పెళ్ళి చేసుకోలేదు. ఇలా రూపు దిద్దారు ఆ పాత్రని.

’ఎందుకు నాలా అందరూ ఉదాత్తంగా ఉండరు?’

ఎందుకు నాలాగా అందరూ సంప్రదాయబద్దంగా ఉండరు?’

ఎందుకు నాలా అందరూ విలువలతో కూడిన జీవితాన్ని జీవించరు?’

ఎందుకు అందరూ క్రమశిక్షణని ఉల్లఘించి జీవిస్తూ ఉంటారు?’

ఈ మాటలు ఆయన ఎక్కడా బయటకి చెప్పడు. కానీ ఆయన నటన ద్వారా తెలుపుతూ ఉంటాడు.

ఒక సందర్భంలో ఆయన తన చెల్లి ఇంటికి విందుకు వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఆయన పక్కనే కూర్చున్న అతిథులు (వామపక్ష వాదులు) ప్లేట్లలో మాంసాహారం భుజిస్తూ ’ఆయన వంక చూస్తూ”మీకు ఓకే కద’ అంటారు. అప్పుడు ఆయన నటన చూడాలి.

ఆ తర్వాత ఆయన వాష్ బేసిన్ వద్ద చేతులు, మొహం కడుక్కుని పుక్కిలించి అక్కడ ఉన్న టవల్ ని యధాలాపంగా అందుకుని, ఉత్తర క్షణమే దాన్ని అక్కడ పారేసిన వైనం మన కండ్లారా చూడాల్సిందే.

నటన అంటే ఇలాంటి చిన్నచిన్న హావభావాలే కద. మన బాలయ్యకి చూపించాలి ఈ సినిమాని ఈ విషయంగా అని అనిపించింది.

 

మమ్ముట్టి పాత్రని మలచిన తీరు అద్భుతం. ఒక కొత్త దర్శకుడు తన మొదటి ప్రయత్నంలో ఇలాంటి చిత్రం తీశాడు అంటే అది నిజంగా ఒక గొప్ప విషయం.

మమ్ముట్టికి నూటికి వెయ్యి మార్కులు వేయవచ్చు ఈ పాత్ర పోషణకి.

ఒక సందర్భంలో తన బావగారిని లిఫ్ట్ లోకలుస్తాడు మమ్ముట్టి. ఆ సందర్భంగా ఆయన మాట తూలి చెల్లెలి మొగుడి కులాన్ని వారి  పూర్వీకుల కులవృత్తి ని ప్రస్తావిస్తూ కించపరుస్తాడు.

ఈ సీన్ తీయటం వెనుక దర్శకుడి ఉద్దేశాలు సుస్పష్టం. ఏ బ్రాహ్మణుడు ఇప్పటి సమాజంలో అలా మాట్లాడడు. కానీ ఈ దర్శకుడి టార్గెట్ బ్రాహ్మణద్వేషాన్ని రగల్చటమే కద.

 

***

ఈ చిత్రం  షూటింగ్ 2021 లో ప్రారంభం అయింది. నేరుగా థియేటర్లలో విడుదల చేద్దామనుకుని కూడా  చివరి నిమిషంలో వారు మే 12 , 2022 న సోనీ లైవ్ ఓటీటీ ప్లాట్‍ఫాం పై విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హింది, కన్నడ లోకి కూడా శబ్దానువాదం చేశారు. ప్రధానంగా ఇది మలయాళ చిత్రం.

***

పాత్రలు పాత్రధారులు:

కుట్టన్ - మమ్ముట్టి

భారతి - పార్వతి తిరువోతు

కుట్టప్పన్ - అప్పుణ్ణీ శశి

వాసుదేవ్ సాజిష్ - కిచ్చు

మోహన్ - నెడుమూడి వేణు

****

సాంకేతిక బృందం:

దర్శకత్వం - రతీన (తొలి ప్రయత్నం)

రచన - హర్షద్

నిర్మాత- ఎస్ జార్జ్

ఫోటోగ్రఫీ -తేనీ ఈశ్వర్

సంగీతం-జేక్స్ బిజోయ్

 

 

 

 

 

 


Tuesday, May 17, 2022

 


హృదయాల్ని పిండేసే

దొంగాట

ఆహా ఓటీటీ ప్లాట్‍ఫాం లో తెలుగులో లభ్యం

=================================================

"అమ్మా! దొంగ అంటే ఎట్లుంటాడమ్మా? నేను దొంగను ఎప్పుడు చూడలేదు" దాదాపు ప్రతి పిల్లాడు తన చిన్న తనంలో ఈ ప్రశ్నని తప్పకుండా తన తల్లిని అడిగే ఉంటాడు.

ఈ చిత్రంలో దొంగ పాత్రలో నటించిన/జీవించిన ఫహద్ ఫాజిల్‍ని చూపించవచ్చు ప్రతి చిన్నపిల్లాడికి. అప్పుడు ఆ చిన్న పిల్లాడికి దొంగ అంటే సానుభూతి, జాలి కలుగుతాయి.  దొంగలగూర్చి మానవత్వంతో ఆలోచించకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది ఓ క్షణం.

****

ఒక మంచి చలన చిత్రాన్ని చూసినతర్వాత నాలుగుముక్కలు వ్రాయకుండా ఉండలేని బలహీనత నాది. ’దొంగాట’ ఒక మంచి చలన చిత్రం. కుటుంబ సమేతంగా అందరూ చూడదగ్గ చిత్రం.

కథేమీ లేకున్నా ఎక్కడా బోర్ కొట్టకుండా ఆకట్టుకునే కథనం, హృదయాన్ని ద్రవింపజేసే ఆర్ద్రమైన దృశ్యాలు, చివరి వరకు వచ్చాక ఆలోచింపజేసే విధంగా తీసిన విధానం ఇవన్నీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు.

రెండే రెండు వాక్యాలలో వ్రాయదగ్గ కథ ఇది. అసలీ కథతో ఇంతలా ఆకట్టుకునేలా చిత్రాన్ని తీయటానికి సాధ్యమా అని ఆశ్చర్యం కలుగక మానదు.

ఇంతకీ కథేంటంటే:

ఒక యువజంట (శ్రీజ, ప్రసాద్) ఉంటుంది.

మొదట చిన్న అపార్థంతో మొదలైన పరిచయం, వారిద్దరి మధ్యా ఓ చిన్నపాటి గొడవకి దారి తీసినా చివరికి ఇద్దరూ ఒకర్ని విడిచి ఒకరు ఉండలేని ప్రేమలో కూరుకుపోతారు. ఇద్దరూ పారిపోయి వేరే ఊర్లో స్థిరపడతారు. ఆర్థిక కష్టాలనుండి బయటపడి జీవితంలో స్థిరపడటానికి, ఆ కుర్రాడు తమ వ్యవసాయ క్షేత్రంలో బోర్ వెల్ వేసి పంటలు పండించుకుందాం అని అనుకుంటాడు. ఆ బోర్‍వెల్ వేయాటానికి అవసరమైన డబ్బుల కోసం ఆ అమ్మాయి తన రెండు తులాల తాళి బొట్టు గొలుసుని అమ్మి అతనికి  సాయపడటానికి సిద్ధపడుతుంది. ఆ పరంపరలో వాళ్ళు దగ్గరలో ఉండే ఊరికి బస్సులో ప్రయాణం అవుతారు.

ఇక్కడ కథ కీలక మలుపుతిరుగుతుంది.

ఆ బస్సులో ప్రయాణం చేస్తున్న చిల్లరదొంగ, ఈ అమ్మాయి  వెనుక సీట్లో కూర్చుంటాడు. ఆమె నిద్రపోగానే లాఘవంగా గొలుసు కత్తిరించి జేబులో వేసుకోబోతాడు. బస్సు కుదుపులకి ఈ అమ్మాయికి మెలకువ వచ్చి వాడి హస్తలాఘవాన్ని పసిగట్టి ’దొంగ దొంగ’ అని అరవబోయేలోగా వాడు మెరుపువేగంతో అ అమ్మాయి చూస్తుండగానే ఆ గొలుసుని మింగేస్తాడు. సాక్ష్యం ఎవ్వరూ లేరు, ఎవరి పనిలో వారు ఉంటారు. ఈమె ఒక్కటే సాక్ష్యం.

ఆ తరువాత రక్షకభటులకి ఫిర్యాదు చేయటం, వారు  తమదైన బాణిలో వాడ్ని విచారించటం ఇత్యాది సంఘటనలు వరుసగా జరిగిపోతాయి.

చివరికి ఏమైంది అన్నది చిత్రాన్ని చూసి తెలుసుకోవలసిందే.

ఇంతే కథ.

అసలు ఇలాంటి ఓ అప్రాముఖ్యమైన చిన్న కథతో హృదయాల్ని పిండేసే చిత్రాన్ని తీయవచ్చు అన్న ఆలోచన వచ్చిన దర్శకుడు అభినందనీయుడు.

****

మా చిన్న తనంలో మా అమ్మ  ఓ వెండి చెంబు చూపించి ఓ సంగతి చెబుతూ ఉండేది.  అలా చెప్పేటప్పుడు అప్రయత్నంగా తను కంట తడిపెట్టేసేది. నేనింకా పుట్టక ముందు, ఆ వెండి చెంబుని ఓ దొంగ దొంగిలించాడాట. కాని వాడి ఆచూకి కనుగొని రక్షకభటులు నాలుగు తగిలించి మా వాళ్ళకి అప్పజెప్పారట. కానీ ఆ దొంగని కొట్టిన వైనాన్ని తలచుకుని మా అమ్మగారు కంటతడిపెట్టే వారు. ఇదిగో ఈ చలన చిత్రంలో కూడా మీకు ఇలాంటి దృశ్యం కనిపిస్తుంది.

***

ఇది ’తొండముదిలుమ్ ద్రిక్సాక్షియుం’ అనే మలయాళ చిత్రానికి శబ్దానువాదం చేయబడ్డ చలన చిత్రం. 2017 లో మలయాళం లో విడుదల అయిన ఈ చిత్రానికి అనేక జాతీయ పురస్కారాలు లభించాయి.

మహేషింట ప్రతీకారం అనే చిత్రాన్ని తీసిన దర్శకుడి రెండవ చిత్రం ఇది. ఇందులో కూడా అదే బాణిలో భావొద్వేగాలకి పెద్ద పీట వేశారు.

***

ఈ చిత్రంలో నాకు కనిపించిన ప్రత్యేకతలు చెబుతాను.

ఏదైనా చిన్న ఊరికెళ్ళి ఒక ఇంటికిటికీ తలుపు తీసి బయటకి చూస్తే ఎలాంటి వాతావరణం కనిపిస్తుందో అలాంటి వాతావరణం చక్కగా చూపించారు దర్శకుడు. సినిమా చూస్తున్నాము అనే భావనకంటే నిజ జీవిత వాతావరణాన్ని చూస్తున్నాము అనే భావనే కలుగుతుంది ఆద్యంతం.

భారీ మేకప్పులు, భారీ శబ్దముతో కూడిన సంగీతం, పంచ్ డైలాగులు, హీరో ఇమేజిని ఎలివేట్ చేసే దృశ్యాలు ఇవేవి లేకుండా హాయిగా నిజ జీవితాన్ని ఒడిసి పట్టి చూపించినట్టు ఉంది.

మానవత్వం, కరుణ ఈ రెండు భావాలు ఈ సినిమాని ఆద్యంతం నడిపిస్తాయి. ఎవ్వరూ చెడ్డవారు కాదు, ఎవ్వరూ మంచి వారు కాదు. పరిస్తితులు మనల్ని నడిపిస్తాయి. ఈ భావన కలుగుతుంది మనకు చివరకి.

ఇంతకు మించి ఏ మాత్రం చెప్పినా మీకు సస్పెన్స్ విడదీసి చెప్పిన వాడిని అవుతాను. కాబట్టి ఇంకేమి చెప్పను.

***

* పారిపోతున్న దొంగని వెంటాడే సందర్భంగా నిరాయుధుడైన ప్రసాద్ (భర్త) దొంగని ఒక నీటి కాలువలో ముఖాముఖి ఎదుర్కొంటాడు. అతనికి ప్రాణభయం లేదు, అలాగన్చెప్పి దొంగకి హాని తలబెట్టే ఉద్దేశం కూడా లేదు. కేవలం తన నగని తిరిగి తెచ్చుకోవాలనే తపనే అతనిది. పారిపోవాలనే ప్రయత్నమే తప్ప, ప్రసాద్‍కి హాని తలపెట్టే ఉద్దేశం లేదు దొంగకి.

’మీకు భయం వేయదా’ అని  రమణ మహర్షిని ఎవరో అడిగితే, అనన్య భావన ఉంటే ఎవ్వరికీ భయం కల్గదు అని చెప్తారు. ఆ  సంగతి అసంకల్పితంగా గుర్తొచ్చింది ఈ దృశ్యంలో.

దొంగని వెనుకపాటుగా వాటేసుకుని పారిపోకుండా ప్రసాద్ పట్టుకున్నప్పుడు, వారిద్దరి ముఖాలలో భావాలని వర్ణించటానికి మాటలు చాలవు.

పట్టుకున్న పెద్ద బండ రాయిని జారవిడిచేస్తాడు దొంగ ఆ క్షణంలో. ఫాజిల్ కేవలం దొంగతనం చేస్తాడే కానీ ప్రసాద్‍కి హాని చేయాలని ప్రయత్నం చేయడు. పారిపోవాలని చూస్తాడు, ఆ సమయంలో అడ్డుపడ్డ ప్రసాద్ ని వదిలించుకోవాలని చూస్తాడు కానీ గాయపరచాలని అనుకోడు.

ఇక చిక్కక తప్పదు అనుకున్నప్పుడు కూడా భావ రహితంగా ఉండిపోతాడు.

* ప్రసాద్ కూడా అతన్ని పట్టుకోవాలనే చూస్తాడు తప్పనిచ్చి, గాయపర్చాలని గానీ, కొట్టాలని గానీ చూడడు. ’నా గొలుసు నాకివ్వరా’ అని అర్థిస్తాడు. ఆ దృశ్యం చూసేటప్పుడు మనకు కన్నీరు వస్తుంది

* ఇది చిన్న కేసే కద అని పోలీసులు తేలిగ్గా చూడరు. వాళ్ళ శాయశక్తులా వారు ప్రయత్నించిన విధానం అబ్బురపరుస్తుంది. ఎక్స్ రే తీయిస్తారు. ప్రతి రోజు ఉదయాన్నే వాడు టాయిలెట్ కి వెళ్ళినప్పుడు గొలుసు బయటకి వచ్చిందేమో అని చూస్తారు. కొద్దిపాటి పోలీసు హింస ఉంది. ఆ సమయంలో దొంగ మీద జాలి కలుగుతుంది మనకు.

* వాడు బాధగా కేకలు పెట్టే దృశ్యాల సందర్భంగా భార్యాభర్తలు ’మేము కేసు వెనక్కు తీస్కుంటాం, వాడ్ని వదిలేయండి’ అనేస్తారు.

* నాక్కూడా మీలా గౌరవంగా బ్రతకాలని ఉంటుంది అని దొంగ అన్నప్పుడు మనకు గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అవుతుంది.

* దొంగ పాత్రలో అనేక షేడ్స్ కనిపిస్తాయి. చిలిపిదనం, శాడిజం, హస్తలాఘవం, దయనీయమైన చూపులు, బాధతో ఆక్రందనలు చేసే అరుపులు, యువజంటని చూసి కాస్త అసూయగా చూసి ’అరె నా జీవితం ఇలా లేదే’ అని బాధపడే చూపులు, ’నా జీవితం మీ చేతిలో ఉంది’ అని వేడుకునేటప్పుడు దైన్యం, ఎక్స్ రే లో గొలుసుకనిపించేదాకా బుకాయింపు ధోరణి, ఎక్స్ రే లో గొలుసు కనిపించగానే చిలిపిగా నవ్వుతూ ’నేను దొంగతనం చేశాను’ అని ఒప్పుకున్న విధానం ఇవి మామూలు నటుడు చేయలేడు, ఈ పాత్ర కోసమే ఫహద్ ఫాజిల్ పుట్టాడు అన్నట్టుగా నటించాడు. అందుకే అతనికి జాతీయ అవార్డ్ దక్కింది ఈ పాత్ర పోషణకి.

నిజాయితీగా చెబుతున్నాను. తెలుగులో ఒక వేళ్ రీమేక్ చేస్తే ఈ పాత్రకి ఎవరు సరిపోతారు అని ఆలోచిస్తే నాకు ఇద్దరి పేర్లు తట్టాయి.

ఇప్పుడు కాదు కానీ, వయసులో ఉన్నప్పటి రాజేంద్రప్రసాద్, ఇప్పటి నటుల్లో అయితే సత్యదేవ్ మాత్రమే ఈ పాత్రకి న్యాయం చేయగలరు అనిపించింది.

***

ఈ చిత్రం గూర్చి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం. సాధారణంగా ఇటీవలి మలయాళ చిత్రాలలో ముస్లింలు, క్రైస్తవులు మాత్రమే ప్రధాన పాత్రలుగా ఉంటూ,  ఆ తరహా వాతావరణాన్ని గ్లామరైజ్ చేసి చూపిస్తూ, కేరళ మొత్తంలో హిందూ సమాజం లుప్తం అయిపోయిందేమోఅన్నట్టు భ్రమ కలగజేస్తున్నారు.

తద్విరుద్ధంగా ఈ చిత్రంలో, పాత్రలన్నీ హిందూ మతానికి చెందినవి. చక్కగా శివపార్వతుల పటానికి శ్రీజ దీపం వెలిగించి హారతి ఇస్తుంది. గ్రామంలో జాతర జరుగుతూ ఉంటుంది. గుడి వాతావరణాన్ని, జాతర ఉత్సవాలని అద్భుతంగా నేపథ్యంలో చూపించారు. భగవాధ్వజం (కాషాయ జండాలు), కాషాయ తోరణాలు ఆద్యంతం గ్రామంలో కనిపిస్తు ఉంటాయి, బస్ స్టాప్ గోడలమీద ఏబీవీపీ, వీహెచ్ పీ, ఆరెస్సెస్ అనే గ్రాఫిటీలు కనిపిస్తాయి.

తాళి బొట్టు  తాలుకు ప్రాశస్త్యాన్ని పోలీసులు వివరిస్తూ ఉంటారు, సంభాషణలలో భాగంగా.

***

పాత్రలు - పాత్రధారులు

ప్రసాద్ (దొంగ)- ఫహాద్ ఫాజిల్

శ్రీజ-నిమిష సాజయన్

ప్రసాద్(అమ్మాయి భర్త)-సూరజ్ వెన్‍జార్‍మూడ్)

ఎస్ ఐ- సిబీ థామస్

కానిస్టేబులు-ఆలెన్చియర్ లే లోపెజ్

సాంకేతిక శాఖలు:

దర్శకత్వం - దిలీష్ పోతన్

తెర కథ - సాజీవ్ పళూర్

సంగీతం -బిజ్‍బాల్