Monday, June 6, 2022

హ్రిదయమ్


 

హ్రిదయం (మలయాళం)

ఇది ఒక ఫీల్ గుడ్ చిత్రం

ఈ చిత్రాన్ని ’హ్రి’దయం అని వ్రాశారు. నాకు ఏదోలాగ అనిపించింది. కానీ ఈ సినిమా పేరుని ఇలాగే ఉఛ్చరించాలిట మలయాళంలో.

****

చాలా బాగుంది. అలాగన్జెప్పి కళా ఖండం ఏమీ కాదు. చెప్పదలచుకున్న విషయాన్ని నిజాయితీగా చెప్పిన చిత్రం.

తప్పక చూడదగ్గది, కుటుంబ సమేతంగా.

* ఏ ఆస్కార్ అవార్డో, జాతీయ అవార్డో రాదగ్గ చిత్రం కాకున్నా, ఖచ్చితంగా ఒక చక్కటి చిత్రం . నిరాశ కల్గించదు. ఒకప్పుడు దేశాన్ని ఒక ఊపు ఊపిన నాగార్జున ’గీతాంజలి’ని ఇంకా క్లాస్ గా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అని చెప్పగలను.

చాలానే ప్రత్యేకతలు ఉన్నాయి ఈ చలన చిత్రానికి.

ప్రముఖ మలయాళ కథానాయకుడు మోహన్‍లాల్ పుత్రుడు ప్రణవ్‍లాల్ నటించిన ‍చిత్రం ఇది.

యూత్ ఫిల్మ్ కద అని చెప్పి పిచ్చి పిచ్చి పాటలు, కుప్పి గంతులు, ఫైట్లు లేవు.  , చౌకబారు సంభాషణలు లేవు.

***

మెర్రీలాండ్ స్టూడియోస్ కేరళలో ఒక పాత తరపు నిర్మాణ సంస్థ. 1950 ప్రాంతాలలో ఇది తన ప్రయాణం ప్రారంభించిది. మన విజయా సంస్థతో సరిపోల్చవచ్చు దీన్ని.  మెర్రీలాండ్ సినిమా అనే పేరిట వీళ్ళు మళ్ళీ ఈ హ్రిదయం చిత్రంతో తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడం ఒక మంచి పరిణామం.

బహుముఖ ప్రఙ్జాశాలి వినీత్ శ్రీనివాసన్ ఈ చిత్రానికి దర్శకుడు.

***

నేను సినిమాలు చూసేదే తక్కువ. అందులోనూ ప్రేమకథాచిత్రాలు ఇంకా తక్కువ.

నా వరకు నేను సినిమా చూడబోయే ముందు దర్శకుడు ఎవరా అని చూస్తాను.

గుల్జార్, మణిరత్నం, బాసూ ఛటర్జీ, హ్రిషికేష్ ముఖర్జీ, గురుదత్, మహేష్ భట్, ముఖేష్ భట్, పుట్టన్న కణగల్, కే బాలచందర్, దాసరి నారాయణ రావు, సంజయ్ లీలా భన్సాలీ, ఇమ్తియాజ్ ఆలీ, రాజ్ కపూర్, కుందన్ షా, రాజూ హీరానీ, శంకర్(తమిళ్), రాంగోపాల్ వర్మ, త్రివిక్రం శీనివాస్, పసలపూడి వంశీ, కే విశ్వనాథ్; ఇటీవలి యువదర్శకులలో చంద్రశేఖర్ ఏలేటి, సుకుమార్,  తదితర దర్శకులు తిసిన చిత్రాల్ని ముందు వెనుకలు ఆలోచించకుండా చూసేస్తాను.

అలాగే కొన్ని చిత్రాల్ని చిత్రనిర్మాణ సంస్థలని బట్టి ముందు వెనుకలు ఆలోచించకుండా చూసేయవచ్చు. అలాంటి సంస్థలలో హిందీలో రాజ్‍శ్రీ సంస్థ ఒకటి. స్వతహాగా ప్రేమ కథా చిత్రాలంటే బోర్ నాకు. ఒకటే రకం కథ, నాలుగు పాటలు, జోకులు, అపార్థాలు, విడిపోవడాలు, విరహాలు, అయితే విషాదాంతం, లేదా సుఖాంతం. మంచి దర్శకుడు తీసిన చిత్రమైతే తప్ప ప్రేమ కథా చిత్రాన్ని చూడటానికి మొగ్గు చూపను.

నాకు వ్యక్తిగతంగా సస్పెన్స్, థ్రిల్లర్స్, హారర్, అడ్వెంచర్ చిత్రాలు ఇష్టం.

 

నేను చూసిన ప్రేమ కథా చిత్రాలలో నాకు బాగా గుర్తుండిపోయినవి కొన్నే.

* గోరింటాకు (శోభన్ బాబు, సుజాత, వక్కలంక పద్మ, తెలుగు)

* హృదయం (మురళీ, హీరా. ’ఇదయం’ తమిళ్-తెలుగు శబ్దానువాదం)

* జానూ (సమంతా, శర్వానంద్ - ’ 96’ తమిళ్- తెలుగు పునర్నిమాణం)

* కలర్ ఫోటో (చాందినీ చౌదరీ, సుహాస్. తెలుగు చిత్రం)

* సితార ( భానుప్రియ, సుమన్ తెలుగు చిత్రం)

* నిఖా (సల్మా ఆఘా, రాజ్ బబ్బర్ హిందీ చిత్రం)

 

ఈ చిత్రాలన్నింటి ప్రత్యేకత ఏమిటి అంటే, సినిమా విజయం సాధిస్తుందా, అపజయం పాలవుతుందా అన్న ఆలోచన లేకుండా దర్శకుడు తనకు నచ్చిన కథని  మనసుపెట్టి ఇష్టంగా తీస్తే,  సినిమాలు ఎలా రూపుదిద్దుకుంటాయో , అలా తయారైన చిత్రాలు ఇవన్నీ.

ఈ హ్రిదయంలో కూడా సరిగ్గా అదే అంశం నన్ను ఆకట్టుకుంది. దర్శకుడు వినీత్ శ్రీనివాస్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఒక యువకుడి జీవితంలో అతని పదిహేడో ఏట నుండి ముపై అయిదవ ఏట వరకు జరిగిన పరిణామాలని వీలయినంత సహజంగా చూపించే ప్రయత్నం ఈ సినిమా.

అనవసరమైన పాటలు, ఫైట్లు, , మెరుపుపాటలు, సినిమాటిక్ అపార్థాలు గట్రాలు లేవు. ఈ సినిమాని ఎలాగైనా హిట్ చేయాలి అనే ఉద్దేశంతో పెట్టే ఏ ఫార్ములా అంశాలు లేకపోవటం వల్ల, ఒక జీవితాన్ని దగ్గరనుంచి చూసిన ఫీలింగ్ కలుగుతుంది ఈ  సినిమా చూసినంత సేపు.  ఆద్యంతం ఫ్రెష్ గా ఉంది. మనసుకు ఏదో హాయి కలుగుతూ ఉంటుంది ఈ సినిమా చూసినంత సేపు. మధ్య మధ్యలో కథానుగుణంగా బాధ, వేదన, దుఃఖం, కోపం, ఉత్సాహం తదితర భావాలు కలుగుతూ ఉంటాయి.

***

ఇంతకూ కథేంటి?

ప్రారంభ దృశ్యంలో అరుణ్ నీలకండన్ (ప్రణవ్ లాల్) మంగళూరు రైల్వే స్టేషన్‍లో చెన్నయ్ వెళ్ళే రైలు ఎక్కుతాడు.

ఈ టీనేజి కుర్రాడు కేరళ నుంచి వచ్చి చెన్నయి లోని కేసీ టెక్ అనే ఇంజినీరింగ్ కాలేజీలో చేరతాడు. ప్రారంభంలో చిన్న చిన్న కామెడీ దృశ్యాల అనంతరం హీరోని అతని మిత్రులని సీనియర్లు రాగింగ్ చేయటం అనే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా అతనికి దర్శన (దర్శన) అనే అమ్మాయి తారసపడుతుంది. ఆమెతో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అతి తక్కువ సమయంలోనే ఇద్దరూ బాగా ఆప్తులవుతారు. ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఇష్టం ఏర్పడుతుంది.

స్నేహితులు ఎంత వారించినా అరుణ్ ఒక విషయం దాచకుండా చెప్తాడు.  ఆ అమ్మాయికి ఇతని మీద చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. దాంతో ఆమె అతనికి దూరం అవుతుంది. దర్శనని పైకి ద్వేషిస్తాడే కానీ ఆమెని మరవలేకపోతుంటాడు. ఆమె పరిస్థితి కూడా అంతే.

కానీ ఇద్దరూ సవాల్ విసురుకుంటారు.

’నిన్ను మించిన జీవిత భాగస్వామిని పొందుతాను, నన్నునిన్ను తిరిగి జీవితంలో స్వీకరించే ప్రసక్తే లేదని’ ఛాలెంజ్ చేసుకుంటారు.

ఈ క్రమంలో అతను అందరి ముందు పలచన అవుతాడు, ఆ అవమాన భారంతో అతను త్రాగుడికి అలవాటు పడతాడు.

అతను క్రమంగా చదువులో వెనుకపడతాడు. అతని చుట్టూ నైతిక విలువలు పెద్దగా లేని స్నేహితులు చేరతారు. తనను ఎవ్వరూ పట్టించుకోకూడదు అన్న ఉద్దేశంతో, ఏదో కసితో అతను ఈ అప్రయోజకుల సమూహంలో ఎక్కువ తిరుగుతుంటాడు. ఈ పరిస్థితులలో దర్శనకి కేదార్ అనే ఇంకో కుర్రాడు పరిచయం అవుతాడు. అతను పైకి మంచిగా కనిపించే పయోముఖవిషకుంభం. అరుణ్ అతని బారి నుంచి దర్శనని కాపాడతాడు.

అరుణ్ చదువులలో వెనుకపడతాడు. పరీక్ష తప్పటం మామూలు అవుతుంది. అతనిలో ఏదో కసి.

ఈ క్రమంలో హటాత్తుగా అతనికి తన స్థితి పట్ల తనకే అసహ్యం వేసి, ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చే సెల్వ అనే ఒక మంచి కుర్రాడికి దగ్గర అవుతాడు. ఆ తరువాత కఠోర సాధన చేసి , సెల్వ వాళ్ళ స్నేహబృందంతో కలిసి కంబైన్డ్ స్టడీ చేసి ఒక్కసారిగా క్లాస్ టాపర్స్ లో ఒకడిగా మారిపోతాడు.

మెల్లిగా దర్శన కూడా ఇతనితో స్నేహంగా ఉండటం ప్రారంభిస్తుంది.

ఈ లోగా అరుణ్ ’మాయా’ అనే అమ్మాయికి దగ్గర అవుతాడు కానీ, ఆమె సూటిగా అడిగిన ప్రశ్నకి సమాధానంగా, ’తాను దర్శనని ప్రేమించానని’ చెప్పటంతో మాయ కూడా  దూరం అవుతుంది.

ఇక ఇంజినీరింగ్ కోర్స్ ముగుస్తుంది. రైల్వే స్టేషన్ లో అరుణ్ కి వీడ్కోలు పలకటానికి దర్శన కూడా వస్తుంది. అన్నీమరచి పోయి మళ్ళీ మనం కలిసి ఉండలేమా’ అని అడుగుతుంది. అరుణ్ ఏమీ సమాధానం చెప్పడు.

ఆ తర్వాత కథ ఎలా మలుపులు తిరిగింది చివరికి ఏమయింది అనేది తెలుసుకోవాలంటే చలనచిత్రాన్ని చూడాల్సిందే.

***

ఓవరాల్ గా ఈ చిత్రానికి మంచి మార్కులు వేయవచ్చు.

కథా కాలం ఓ పది పదిహేను సంవత్సరాలు అనుకోవచ్చు. ఫ్లాష్ బాక్ టెక్నిక్ వంటివేవీ వాడకుండా స్ట్రెయిట్ నేరేటివ్ టెక్నిక్ లో చెప్పుకుంటూ వెళతారు కథ.

కథా ప్రారంభ సమయంలో రైలు బోగిల రంగు, పాత్రలు వాడే కీపాడ్ సెల్ ఫోన్స్ ఆధారంగా మనం కనుక్కోవచ్చు ఈ కథ 2005 -2010 ల మధ్య ప్రారంభం అయింది అని.

ప్రస్తుత కాలంలో కథ ముగుస్తుంది.

***

ఈ చిత్రంలో నేను గమనించిన కొన్ని అంశాలు.

* ఆహ్లాదకరమైన సంగీతం ఆద్యంతం వీనుల్ని సోకుతూ ఉంటుంది.

* ’నగుమోము కనలేని నా జాలి తెలిసి...’ అనే త్యాగరాజ స్వామి కీర్తన చక్కగా తెలుగులో వినిపిస్తూ ఉంటుంది కీలక సన్నివేశాలలో. ఒక విధమైన తాదాత్య్మ స్థితికి ప్రేక్షకుడిని తీస్కువెళ్ళటంలో త్యాగరాజ కృతుల్ని చక్కగా ఉపయోగించుకున్నారు. యూత్ ఫిల్మ్ లో ఇలాంటి క్లాసికల్ సంగీతం వాడటం, (అదికూడా సరి అయిన విధంగా), దర్శకుడి అభిరుచిని సూచిస్తుంది.

* ఇప్పటి యువతరం తాలూకుజీవన శైలిని చూపించటంలో సఫలీకృతుడు అయ్యాడు దర్శకుడు. వారు ఉద్యోగ భద్రతకంటే తమ మనసుకు తృప్తి కలిగించే వృత్తిని ఎన్నుకుని తారాపథంలో దూసుకుపోవటాన్నిఆయన అద్దం పట్టినట్టు చూపించాడు.

* క్యాంపస్ జీవితం, రాగింగ్, స్నేహాలు, పరీక్షలు, పోటీలు, కాంపస్ సెలెక్షన్ లో ఉద్యోగాలు రావటం అన్ని అంశాలు చక్కగా సహజంగా చూపించారు.

* బహుముఖ ప్రఙ్జాశాలి అయిన ఈ చిత్ర దర్శకుడు వినీత్ శ్రీనివాస్ ఈ చిత్రంలో తన అద్భుత గాత్రంతో మన మనసుల్ని దోచే పాటలు కూడా పాడాడు. చిత్ర సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్ కూడా కొన్ని పాటలు పాడాడు.

* కొస మెరుపు ఏమిటి అంటే, ఏ ఆర్ రెహమాన్ ఈ పాటల్ని విని పరవశించి పోయి ఇటీవల ప్రతి వేదిక మీద ఈ సినిమా పాటలని తెగ మెచ్చుకుంటున్నాడు

* ముఖ్యంగా, ఈ చిత్రంలో హీరో తన నైరాశ్యం నుంచి, ఓటమి నుంచి తానే బయటపడి, కఠోర సాధన చేసి, విజేతగా నిలబడిన ఎపిసోడ్, యువతకి ప్రేరణగా నిలబడుతుంది. ఇలా చూపటం సినీ దర్శకుల సామాజిక బాధ్యత. చాలా చక్కగా ఉంది ఈ పాయింట్.

 

***

తారాగణం

అరుణ్ నీలకండన్ - ప్రణవ్ మోహన్ లాల్

దర్శన-దర్శన

నిత్య-కల్యాణీ ప్రియదర్శన్

కలేష్ రామానంద్ - సెల్వ

సాంకేతిక విభాగం

రచన, దర్శకత్వం - వినీత్ శ్రీనివాస్

నిర్మాత -విశాఖ సుబ్రమణియం

సంగీతం -హేషం అబ్జుల్ వహాబ్

ఫోటోగ్రఫీ - విశ్వజీత్ ఒడుక్కదిల్

 

 

 

 


No comments:

Post a Comment