Tuesday, May 3, 2022

డాన్స్ శీను

 డాన్స్ శీను

ఒక ఙ్జాపకం

 

ఈ ఙ్జాపకం లో ఒక విషాదభరితమైన ముగింపు ఉంటుంది.

ఇది వ్రాద్దామా వద్దా అని చాలా రోజులు విచికిత్సకి గురయి చివరికి వ్రాద్దామనే నిశ్చయం చేసుకుని వ్రాసేస్తున్నా. ఎందుకు విచికిత్స అని మీరు అడగవచ్చు. ఙ్జాపకం సిరీస్ మొదలెట్టే ముందే నేను ఒక నిర్ణయం తీస్కున్నాను. నా ఙ్జాపకాల ద్వారా ఎవరిని బాధ పెట్టకూడదు. వీలయినంత వరకు ఆనందం కలిగించే విషయాలు మాత్రమే వ్రాయాలి అని.

కానీ ఈ ఙ్జాపకం ద్వారా ఎవరినీ బాధ పెట్టబోవడం లేదు కానీ నాకే బాధవుతుంది ఇది తలచుకుంటే.

తమిళ్ లో ఒక పాట ఉంది, చేరన్ దర్శకత్వం వహించి హీరోగా నటించిన ఆటోగ్రాఫ్ అనే చిత్రంలో ’ఙ్జాపగం వరుదే, ఙ్జాపగం వరుదే..’ అనే పాట అది.

’మొదల్ మొదల్ అళుత్తా స్నేగిదన్ మరణం’ అని .(ఇది తెలుగులో కూడా రవితేజ అనుకుంటా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ అన్న సినిమా గా విడుదల అయింది)

అలా నేను ఊహ తెలిసిన తర్వాత చూసిన మొదటి మరణం అది. ఏమీ చేయలేక నిస్సహాయంగా ఏడ్చిన సందర్భం అది.

ఈ శీను ఎవరు? అతన్ని డాన్స్ శీను అని ఎందుకు అంటారు? అతనితో నా పరిచయం ఎలా అయింది? ఎందుగ్గాను అతను చనిపోయాడు? అతని మరణం సహజమైందా లేదా ఏదయినా ప్రమాద వశాత్తు జరిగిందా, ఈ ప్రశ్నలన్నింటికీ ఈ ఙ్జాపకంలో సమాధానాలు లభిస్తాయి.

అవి 1983-85 ప్రాంతాలు.

అవి నేను కడపలో ఉంటున్న రోజులు. మోచంపేటలో ఉన్న శ్రీ రామకృష్ణ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియేట్ చదువుకుంటున్నాను.  నేను ఆ రోజుల్లో బక్కగా గాలొస్తే ఎగిరిపోయేలా ఉండేవాడిని.

డాన్స్ శీను అనబడే ఈ  శీనివాస్ అనే కుర్రాడు నా కంటే ఒక సంవత్సరం సీనియర్. అతనికెందుకో నా పైన అకారణమైన అభిమానం. బహుశా నన్ను చూడంగానే జాలి కలిగి, జాలితో కూడిన అభిమానంతో కూడిన ఇష్టం అనుకుంటా.

ఆ రోజుల్లో అందరూ మాథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితర సబ్జెక్ట్స్ కి ట్యూషన్లకి వెళ్ళే వారు. అప్పటికి ఇంకా కార్పొరేట్ కల్చర్ రాలేదు. కడపలో ఇంటర్ మీడియేట్ చదవాలి అంటె, ఒకటి రామకృష్ణ జూనియర్ కాలేజి, లేదా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ప్రభుత్వ మెన్స్ కాలేజి లో చేరాలి. దాని వ్యవహార నామం ’గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజి’. పేరుకి అది మెన్స్ కాలేజీనే అయినప్పటికి, అది కో ఎడ్యుకేషన్ కాలేజీనే.

మా నాన్నగారు ఉండుకుని, "ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్ ఇంట్లో అక్కయ్యలు కూడా చెప్పిస్తారు, ఇంగ్లీష్ భాష చాలా ముఖ్యం. నువ్వు ఇంగ్లీష్ సబ్జెక్టు కు ట్యూషన్ కి వెళ్ళాలి" అని ఒక రోజు ప్రకటన చేశారు.

ఇంకేముంది, రెండో రోజే ఇంగ్లీష్ ట్యూషన్ లో చేరటం జరిగింది.  మా వెనుక వీధిలో ఉండే హేమలత అనే అమ్మాయి, రామశర్మ అనే కుర్రాడు, ఇంకా కొందరు మార్వాడి కుర్రాళ్ళు, రంగ అనే కుర్రాడు ఇలా ఒక పెద్ద టీమే ఉండేది మా బాచ్‍లో.

ఇక్కడొక గమ్మతైన విషయం చెప్పాలి.

గమ్మత్తైన విషయం ఏమిటి అంటే ఈ ఇంగ్లీష్ చెప్పే మేష్టారు గారు మా రామకృష్ణా జూనియర్ కాలేజిలోనే లెక్చరర్. ఆయన పేరు సీతారామయ్య గారు.అందులో పెద్ద వింతేమి లేదు, కానీ అసలు విషయం ఏమిటి అంటే, ఆయన మా కాలేజిలో తెలుగు లెక్చరర్.

ఆయన తెలుగు, ఇంగ్లీష్ లలో కూడా ఎమ్మే చేశారట. అందువల్ల ఆయనకి ఈ రెండుభాషల మీద సాధికారత ఉంది. కానీ నేను గమనించింది ఏమిటి అంటే, ’నేను పేరుకు తెలుగు లెక్చరర్నే గానీ నాకు ఇంగ్లీష్ కొట్టిన పిండి’ అన్నట్టు ఉండేది ఆయన ధోరణి, ఆయన తనకు ఇంగ్లీష్ బాగా వచ్చు అని ఎప్పటికప్పుడు గొప్పగా నిరూపణ చేసి చూపిచ్చుకుంటూ ఉండే వారు. కాలేజి లో మాకు పాఠం చెబుతున్న  ఇంగ్లీష్ లెక్చరర్ వద్దకు వచ్చి గట్టిగా ఇంగ్లీష్ లో కబుర్లు చెబుతూ ఉండేవారు. ఈ లక్షణాన్ని నేను ఆ తర్వాత చాలా మంది తెలుగు లెక్చరర్ల వద్ద గమనించాను వేరే వేరే ఊళ్ళలో కూడా. ఈ ఒక్క సరదా అంశం మినహాయిస్తే ఆయన చాలా మంచి వాడు.

ఈయన దగ్గర నేను నేర్చుకున్న పాఠాలలో నాకు బాగా గుర్తుండిపోయిన లెసన్ రవీంద్రనాధ్ టాగూర్ వ్రాసిన "ఏన్ ఐడిల్ మేన్ ఇన్ వర్కర్స్ పారడైజ్". ఈ లెసన్ ద్వారా బోలెడు కొత్త పదాలు నేర్చుకున్నాను.

రచయిత పరిచయం లో ప్రస్తావించబడ్డ వర్సటైల్ ఆర్టిస్ట్ అనే పదం ద్వారా, వర్సటైల్ అనే పదం మొదటి సారి తెలుసుకున్నాను. ఇలా ఒకటి కాదు, రెండు కాదు చాలా పదాలు తెల్సుకున్నాను ఆయన వద్ద.

ఈ సదరు సీతారామయ్య గారు కూడా ’వర్సటైల్’ అనే చెప్పవచ్చు.  తెలుగులో కవిత్వం వ్రాసేవారు, జాతకాలు చూడ్డంలో కూడా దిట్ట అని పేరు. ఇక ఇంగ్లీష్ గూర్చి మీకు తెలియంది కాదు.

ఆయన గైడీ మపాసా అన్న పేరుని మోప్పసెంట్ అని ఉఛ్ఛరించే వారు. మా నాన్నగారు తలపట్టుక్కూర్చున్నారు అది తెలిసి. మా నాన్నగారికి నన్ను ఆంగ్లంలో మహా మేధావిని చేయాలని ఒక స్వప్నం ఉండేది. అందుకే ఆయన జాగ్రత్తగా ప్రతి రోజు సరదాగా కబుర్లు చెబుతున్నట్టు మాట్లాడుతునే నా వొకాబులరీ అభివృద్ది చేసేవారు.

ఇదిగో ఇది పాఠం అనే ధోరణిలో చెప్తే నేను వినేవాడిని కాను అనుకుంటా. అందుకే ఆయన ఇలా సరదాగా కబుర్లు చెబుతూ నా వొకాబులరీ, గ్రామర్, ప్రనన్సియేషన్ తదితర అంశాలు సానబెట్టేవారు.

మొత్తమ్మీద ఈ సీతారామయ్యగారికి సమాజం లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఉభయభాషా ప్రావిణ్యం వల్ల ఆయనకి ఒక ప్రత్యేక గౌరవస్థానం లభించేది ఆయన ఎక్కడికి వెళ్ళినా.

మా నాన్న గారు కూడా ఈ అంశాన్నే హైలైట్ చేస్తూ నన్ను ఆయన దగ్గర చేర్పించారు. మా ఇంటి ఎదురుగా సరస్వతీ పుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు ఉండేవారు. ఆయనకి ఇరవై ఒక్క భాషలు కరతలామలకంగా వచ్చు అన్న ప్రశస్తి ఉంది. ఆ తర్వాత మన మాజీ ప్రధాన మంత్రి శ్రీ పీవీ నరసింహరావు గారికి కూడా ఇలా బహుళభాషలలో సాధికారత ఉంది అన్న విషయం తెలిసింది.

బహుశా ఇలాంటి వారినందరినీ గూర్చి చూడటం వల్ల, వినటం వల్ల ఒకటికంటె ఎక్కువ భాషలలో ప్రావిణ్యత సంపాయించాలనే స్వప్నం నాలో కలిగింది అనుకుంటా.

ఇక మళ్ళీ కథలోకి వస్తే,

మా బాచ్ సాయంత్రం పూట ఉండేది. కాలేజి అవంగానే మొహం కడుక్కుని, ఇంత అల్పాహారం స్వీకరించి, హాయిగా సైకిల్ వేస్కుని బయలుదేరేవారం. దారిలో మా క్లాస్ మేట్స్ హేమలత తదితరులు వెళుతూ కనిపించేవారు. మేము మాటలు ఆపేసి చాలా బుద్దిమంతులలాగా మొహాలు పెట్టుకుని వెళ్ళేవారం.

మేము వెళ్ళేటప్పటికి, సీనియర్స్ తాలూకు బాచ్ నడిచేది. వాళ్ళ బాచ్ అయ్యేవరకు మేము బయట అరుగుల మీద ఎదురుచూసేవారం. ఆ రోజుల్లో మేము అక్కడి ఎదురింటిలో వీసీపీ లో అప్పుడప్పుడూ వీడియోలు చూసే వారం. అది చాలా లగ్జరీ ఆ రోజుల్లో.

సీతారామయ్య గారి ఇల్లు కడప అమ్మవారి శాల దగ్గర గార్డెన్ కాఫీ వర్క్స్  యజమానుల ఇంటి ఎదురుగా ఉండేది. వారు చాలా స్థితిమంతులు. నాకు తెలిసి ఆ రోజుల్లో కడపలో కలర్ టీవి, వీసీఆర్ ఉన్న అతి కొద్ది మందిలో వారు ఒకరు.

వాళ్ళు దయగల వారు, వరండాలో నిలబడి మమ్మల్ని ఆ సినిమాలు చూడనిచ్చేవారు.

ఈ కలర్ టీవి ఆకర్షణ ని కూడా మించి మమ్మల్ని ఆకట్టుకునే అంశాలు కొన్ని ఉండేవి అ రోజుల్లో. సీతారామయ్య గారు సరదాగా విద్యార్థులతో డాన్స్ ప్రదర్శనలు, పాటలు పాడించటం చేసే వారు. మా బాచ్ లో అంతా నాకు తోడు బోయిన వారే ఉండెవారు.  ఈ డాన్స్‌లు పాటలకి మేము ఆమడ దూరం.

కానీ మాకు ముందు ఉన్న బాచ్ లో కుర్రాళ్ళు పాటలు పాడటం, డాన్స్ లు చేయటం చేసే వారు. అందరూ కాదు కానీ, సన్నగా పొడుగ్గా చలాకిగా ఉండె ఒక కుర్రాడు చాలా చక్కగా స్టెప్పులు వేసేవాడు. అతనే మన కథానాయకుడు శీను. డాన్స్ అంటే కూచి పూడో కథాకళో కాదు. సినిమా పాటలకు స్టెప్పులు వేయటం.

ఒక సారి, మేము అరుగుల మీద , వరండాలో, నిలబడి గ్రిల్ కడ్డీల మధ్యలోంచి,  వీడియోలు చూస్తుండగా మా సర్ వాళ్ళ ఇంట్లో నుంచి ఏదో కోలాహలం వినిపిస్తే వెళ్ళి చూస్తే ఏముందీ, ఈ శీను యమా చలాకీగా డాన్స్ చేస్తున్నాడు. అవి ఖైదీ, వేట తదితర చిత్రాలు ఒక ఊపు ఊపుతున్న సందర్భాలు.

మేము అసంకల్పితంగా చప్పట్లు కొట్టాము. కళాకారులకు చప్పట్లకంటే మించిన ప్రొత్సాహం ఏమి ఉంటుంది? అతను ఆనందంగా మాకు కళ్ళతోనే అభినందనలు తెలిపాడు.

ఇక మా బాచ్ మొదలవ్వాలి కద, వాళ్ళు వెళ్ళి పోవటానికి ఆయత్తమయ్యారు. అప్పుడు శీను నా వద్దకు వచ్చి, కాస్తా వంగి (నాకంటే చాలా పొడవు అతను) మెల్లిగా అడిగాడు ’నిజంగా బాగా చేశానా’ అని.

నేను కంగారు పడ్డాను. కంగారు పడ్డప్పుడు నాకు తెలియకుండానే ఇంగ్లీష్ మాట్లాడతానట. (ఇది నా సన్నిహిత స్నేహితుల అభిప్రాయం).’ అన్నా అదరగొట్టావు’ అనే అర్థంలో ఏదో చెప్పాను.

అబ్బ ఈ కుర్రాడు ఇంగ్లీష్ భలే మాట్లాడతాడు అని అతను నా గూర్చి అప్పటి నుంచి విపరీతమైన ప్రచారం మొదలెట్టాడు.

ఇది నాకు శీనుకి మొదటి పరిచయం ముచ్చట.

ఆ తర్వాత నేను డిగ్రీ చదవటానికి వేరే ఊరికి వెళ్ళటం వల్ల కడపతో టచ్ లో ఉండలేదు. ఈ శీను ముచ్చట్లు తెలియవు నాకు.

ఆ తర్వాత 1989-92 మధ్య ప్రాంతాలలో తిరిగి నేను కడపకి వచ్చి ఉంటున్న సందర్భంలో అతి యాధృచ్చికంగా కలిశాడు ఈ శీను.

పర్సనాలిటీ డెవలెప్ మెంట్ లెసన్స్ విషయంగా నాకు ఆదిగురువు అనదగ్గ సిండికేట్ బాంకు ఎంప్లాయి,  స్టాన్లీ విజయకుమార్ (ఈయన లైప్ ఆధారంగా నేను కల్పన జోడించి ’పునరాగమనం’ అనే కథ వ్రాశాను) ని తరచు కలిసేవాడిని. , ఇంకో సంగీతం మేష్టారు శ్రీ ఏడుకొండల వెంకటేశ్వరరావు  లను కూడా తరచు కలిసే వాడిని.

ఆ రోజుల్లో నేను పైచదువులకి వెళ్ళలేదు, ఇటూ ఉద్యోగ ప్రయత్నాలు చేయటం లేదు. ఒక్క్ ముక్కలో చెప్పాలంటే, ఎందుకో ఇంట్లో కూర్చుని బోలేడు కథలు వ్రాసే వాడిని.

నాకున్న ఇంకో బలహీనత చెప్పాలి మీకు. నాకు మనుషుల పేర్లు, ముఖాలు గుర్తుండవు. ఏదైనా ఒక విషయం ఙ్జాపకం లేకపోవడానికి ప్రధాన కారణం ఫోకస్ లేకపోవడమే అని మెమరీ ట్రెయినర్, మిత్రుడు జయసింహ చెబుతూ ఉంటాడు.

పైకి, ’క్కిక్కిక్కి’ అని నవ్వుతూ ఉంటాను కానీ,  బహుశా నేను నిరంతరం నా ఆలోచనల్లో నిమగ్నమయి ఉంటాను.

సరే ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, ఆ రోజుల్లో అటు స్టాన్లీ విజయ్ కుమార్ గారి వద్ద, ఇటు ఏడుకొండలు మేష్టార్ గారి వద్ద ఓ పొడగాటి కుర్రాడు కనిపించే వాడు. అతను అన్నమయ్య కీర్తనలకి , ఇతర జావళీలకి , జానపద గీతాలకి పిల్లలతో నృత్యాలు చేయిస్తూ కాలక్షేపం చేస్తున్నాడని తెలిసింది.

ఆ కుర్రాడు నన్ను పరిశీలనగా చూసి, ఒక రోజు "హేయ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్!" అనేశాడు. అతను ఏ ముహుర్తం లో అన్నాడో కానీ నాకు ఆ ఇంగ్లేషే భుక్తిని కల్పిస్తోంది. ఇంతకూ ఆ కుర్రాడు ఎవరో కాదు మన కథా నాయకుడు శీనునే.

అలా మా పరిచయం రెన్యూ అయింది. అతనికి అకారణమైన అభిమానం నా పై అని చెప్పాను కద.

ఆ రొజుల్లో నేను ఎవ్వరినీ కలిసే వాడిని కాదు. కేవలం బాంక్ పరీక్షలకి తయారు అయ్యేవాడిని, అక్కడ సాగర్ అనే కుర్రాడితో ఏర్పడ్డ  పరిచయం కారణంగా స్టాన్లీ, ఆ స్టాన్లీ ద్వారా ఏడుకొండలు గారు పరిచయం అయ్యారు.

అదిగో అక్కడ వారి నుంచి, ఈ పాత పరిచయస్తుడు శీను మళ్ళి పరిచయం అయ్యాడు.

ఇక ఈ శీను నన్ను వదిలే వాడు కాదు.  అదే పనిగా మా ఇంటికి సైకిల్ వేసుకుని వచ్చి, నన్ను మాట్లాడించే ప్రయత్నం చేసే వాడు.

కనీసం అంటే ఓ మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది వాళ్ళ ఇల్లు, అప్సరా టాకీస్ ఎదురుగా ఉన్న భాగ్యనగర్ కాలనీ లో ఉండేవాడు అతను. ఆ రోజుల్లో అది చాలా గొప్ప దూరం. కడప టవున్ లో ఉండే వాళ్ళు , ఇలా కాలనీలో ఉండేవారిని కాలనీ నుంచి వస్తున్నాడు పాపం చాలా దూరం

’నువ్వు ఎందుకు ఎప్పుడు నీలో నీవే ఉంటావు’ అని పట్టు పట్టి నన్ను సినిమాలకి తీస్కు వెళ్ళేవాడు.

ఆ రోజుల్లో నన్ను అనేక సినిమాలకి తీసుకువెళ్ళే వాడు. నేను టికెట్కి డబ్బులు ఇస్తానన్నా వద్దనే వాడు.

’నేను డాన్స్ లు చెప్పి సంపాయిస్తున్నాను బాస్. నువ్వు ఇంకా సెటిల్ అవలేదు కద. అయ్యాకా చూద్దాం’ అనే వాడు .

అతనితో కల్సి, హరీష్, ఛార్మిళ నటించిన "ప్రాణదాత", రాంగోపాల్ వర్మ "రాత్రి", కే బాలచందర్ "అక్టోబర్ రెండు" ఇలా చిత్ర విచిత్రమైన సినిమాలు చూసే వాడిని.

అతను తరచు మా ఇంటికి వచ్చి మా అమ్మానాన్నలతో కూడా బాగా కాలక్షేపం చేసే వాడు. నా స్నేహితులు ఎవరు వచ్చినా మా అమ్మానాన్నలు చాలా ప్రేమగా మాట్లాడేవారు. నా స్నేహితులు అందరూ కూడా మా అమ్మానాన్నలతో మాట్లాడటానికే ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చేవారు.

ఆ రోజుల్లోనే గాంగ్ లీడర్ సినిమా కూడా వచ్చింది. శీను ఆ డాన్స్ లు కూడా చక్కగా చేసి చూపే వాడు అందరికీ. అడగని వాడు పాపాత్ముడు.

ఇవన్నీ ఇలా ఉండగా,  నేను గమనించింది ఏమిటి అంటే, రోజులు గడిచే కొద్ది,ఈ శీను కి డాన్స్ పిచ్చి ముదిరిందే తప్పనిచ్చి తగ్గలేదు. నేను కడపలో లేని, ఈ అయిదేళ్ళ కాలంలో అతను సశాస్త్రీయంగా గురువు దగ్గర కూచిపూడి నృత్యం కూడా నేర్చుకుని ఏదో సర్టిఫికెట్ కూడా పొందాడు.

అతను బాంకు పరీక్షలు వ్రాయాలని కానీ, ఇతర కాంపిటీటివ్ పరీక్షలు వ్రాయలని కానీ అనుకునేవాడు కాదు. అతని ధ్యాస ఎంతసేపున్నా నృత్యం మీదనే ఉండేది.

వాళ్ళింటికి కూడా తీసుకువెళ్ళే వాడు అప్పుడప్పుడూ. వాళ్ళ నాన్న గారు ఉండేవారు కాదు. ఆ వివరం చెప్పలేదు అతను. ఆయన చనిపోయారా, ఏమిటి అన్నది తెలియదు. ఆ ప్రస్తావన వచ్చినపుడు మౌనం వహించేవారు.

అతనికి ఒక చెల్లెలు ఉండేది. ఆ అమ్మాయికి మహా అంటే పదిహేను ఏండ్లు ఉంటాయి. చాలా చక్కగా ఉండేది ఆ అమ్మాయి. అకారణంగా ఆ అమ్మాయిని చూడంగానే నాకు కలిగిన మొదటి భావన జాలి.

ఆ అమ్మాయి కూడా ’అన్నయ్యా’ అంటూ చక్కగా మాట్లాడేది నాతో.

తల్లి బాధ్యత, చెల్లి బాధ్యత ,చూసుకుంటూ తన జీవితాన్ని ఎలా చక్కదిద్దుకుంటాడో కద ఇతను, అనిపించేది నాకు. అతను చూస్తే అసలు కెరియర్ అనే మాటే ఎత్తుకునే వాడు కాదు.

ఎట్టకేలకు అతనికి కడపలో అప్పట్లో పేరెన్నికగన్న పెద్ద స్కూల్ నిర్మలా కాన్వెంట్ అనే స్కూల్లో టీచర్ గా ఉద్యోగం వచ్చింది. డాన్స్ టీచర్ గా అని గుర్తు.

ఆ తరువాత కొన్ని రోజులకి ఈతకి వెళ్ళి ఊబిలో ఇరుక్కుని అతను ప్రమాదవశాత్తు మరణించటం ఒక విషాదం.

 

ఇది డాన్స్ శీను ఙ్జాపకం.

రామ్ కీ బండీ

 ’రామ్ కీ బండీ’

ఒక ఙ్జాపకం – 67

***

హైదరాబాద్ వాసులందరికీ చిరపరిచితమైన పేరిది.  కాకపోతే నాకు ఇటీవలే తెలిసింది. ఓ అయిదారేళ్ళ క్రితం మా పిల్లలు, మేనల్లుళ్ళు మాట్లాడుకుంటుంటే మొదటి సారి విన్నాను ఆ పేరు.

 ’రాం కీ బండీ’ గూర్చి ’నాకు తెలియదని’ నేను చెప్పినప్పుడు వాళ్ళ ఆశ్చర్యానికి అంతే లేదు

’హైదారాబాద్లో ఉంటూ రాం కీ బండీ గూర్చి తెలియదా?’ అని ఆశ్చర్య పోయారు.

(సిగ్గు చేటు) ఈ మాటని వాళ్ళు పైకి అనలేదు కానీ వాళ్ళ కళ్ళలో ఆ భావన కనపడింది నాకు, అందుకే బ్రాకెట్స్ లో పెట్టాను సిగ్గుచేటుని .

ఇంతకూ ఏమా రాం కీ బండీ, ఏమా కథ అని అడిగాను. అప్పుడు చెప్పారు దాని గూర్చి వివరంగా.

ఇది వారు చిలవలు పలవలుగీ చెప్పిన దాని సారాంశం.

ఒక చిన్న తోపుడు బండిపై దోసలు వేసి అమ్ముతుంటారని, అక్కడి దోశలు తినటానికి ఐటీ ప్రొఫెషనల్స్, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు (అంటే ధనవంతులు), ప్రముఖులు (సెలబ్రిటీలు), యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఆధునిక యువత, ఇంకా సమాజంలో  ఆధునికులుగా భావింపబడుతూ క్రొంగొత్త పోకడలను అందిపుచ్చుకునే వారందరూ స్త్రీ పురుష భేదం లేకుండా, వయోపరిమితులకు లోబడక , వారు వీరు అని తేడా లేకుండా ఇలా ఎవరైనా సరే అక్కడికి వచ్చి అక్కడి దోశలను స్వీకరిస్తారని నాకు అర్థం అయింది.

గీతా సారంలా ఒక్క ముక్కలో చెప్పాలి అంటె,

లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అయ్యేవారు అక్కడ దోశె తింటారు

లేదా

అక్కడ దోశె తినేవారు లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అయ్యేవారు అని అర్థం. ఇదన్న మాట విషయం.

ఇక్కడ దోశలు మాత్రమే కాక ఇడ్లీలు కూడా లభిస్తాయి.

దోశెలలో రకాలు:

1

2

3

4

5

6

7

8

ఇక్కడి దోశెలు వంద నుంచి అయిదు వందల రూపాయలు వరకు ఉన్నట్టు తోస్తోంది ధరల విషయానికొస్తే.

 

ఏ మాట కామాటే చెప్పుకోవాలి నేను ఫుడీని కాను.

అదేంటి ఇంకో కొత్త మాట పట్టుకొచ్చాను అంటారా. అక్కడికే వస్తున్నా.

ఫుడీ అంటే, అచ్చ తెలుగులో చెప్పాలి అంటే తిండిపోతు అని చెప్పవచ్చు. కాకపోతే ఇప్పుడీ మాటని కాస్త కొత్త అర్థంలో గౌరవప్రదంగా వాడుతున్నారు. తిండిపోతుగా ఉండటం ఒక హాబీ (కాలక్షేపం) అనే అర్థంలో వాడుతున్నారు. అంటే రకరకాల ఊర్లలో, రకరకాల ప్రదేశాలలో,  వీలయినన్నిఎక్కువ హోటల్స్ లో,వీలయినంత వైవిధ్యభరితమైన తిండి తినటం ఒక కొత్త హాబీగా అమల్లోకి వచ్చినట్టు కనిపిస్తోంది. ఫుడ్ ఫెస్టివల్స్, ఫుడ్ టూరిజం (క్యులినరీ టూరిజం లేదా గాస్ట్రోనమీ టూరిజం ) ఇవన్నీ కూడా ఈ అలవాటు సమాజంలో ఎలా పెరిగిపోతున్నది అని తెలిపే కొన్ని నిదర్శనాలు.

ఈట్ టు లివ్ డోంట్ లివ్ టు ఈట్ అన్నది పాత మాటగా మారిపోయింది.

బ్రతకటానికి తిండి తినటం అనేది మారిపోయి, తినటానికే బ్రతకటం అనే సూత్రం ఒకటి లేటెస్ట్ ఫాషన్ స్టేట్‍మెంట్ గా చలామణిలోకి వచ్చినట్టు కనిపిస్తోంది.

పూర్వం ఎక్కడ పడితే అక్కడ తిండి తినటం తప్పనే భావన ఉండేది. ఇది మా పెద్దలు చెప్పి చెప్పి మా మనసులలో నాటుకు పోయింది. దేవుని దయ వల్ల నా శ్రీమతి కూడా ఇదే భావజాలం కలిగి ఉంది.

ఎక్కడ తినాలి, ఏ సమయంలో తినాలి, ఎంత తినాలి, ఏ పదార్థాలు తినాలి అన్న విషయంలో ఆరోగ్య శాస్త్ర రిత్యా మనకు వాగ్భటుడు  అనే సుప్రసిద్ద ఆయుర్వేద వైద్యుడు వ్రాసిన ఎన్నో సశాస్త్రీయమైన ఆయుర్వేద గ్రంధాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఎంతో విపులంగా ఆరోగ్యాన్ని ఆహారం ద్వారా ఎలా కాపాడుకోవచ్చో వివరించారు. ఇప్పటి జీవన శైలి ఇవన్నీ తుంగల్లో తొక్కి విచక్షణా రహితంగా తిండి తినటం, రోగాల బారిన పడి మళ్ళీ కార్పొరేట్ ఆసుపత్రుల జేబులు నింపటం అన్న చందంగా మారింది.

 

 

 

సిరీస్ కంపెనీ-Part 2

 

సిరీస్ కంపెనీ-పార్ట్ 2

ఒక ఙ్జాపకం-65

===============================

’అమరావతి లాడ్జి’

అసలు ఇలాంటి ఒక చక్కని లాడ్జి ఉండేది హైదరాబాద్‍లో అని చాలా మందికి తెలియదనుకుంటాను. కోటీ సర్కిల్ లో గుజరాతి గల్లీ అనే ఒక చిన్న ఇరుకు సందులో ఉండేది అది.

సిరీస్ బేసిక్ ట్రెయినింగ్ ప్రోగ్రాం కొరకు వచ్చినప్పుడు ఇక్కడే ఒక పది రోజులు స్టే చేశాను.

సిరీస్ కంపెనీ వారి ట్రెయినింగ్ పొందటానికి హైదరాబాద్‍వచ్చాను అని ఇదివరకే చెప్పాను కద. నాతో బాటు దాదాపు ఓ పదిహేను మంది ఉన్నారు మా జట్టులో. వారిలో అధిక భాగం పంజాబీ వారు, మహరాష్ట్రా వారు, తమిళనాడు వారు అన్నమాట. వారిలో భానోజీరావు ఒక్కడే తెలుగు వాడు. ఇతను విశాఖపట్నం నుంచి వచ్చాడు. అతను మెరీడియన్ ఫార్మాస్యూటికల్స్ అనే ఓ చిన్న కంపెనీలో పని చేస్తూ, ఇందులో అవకాశం రావడంతో చేరిపోయాడు.

భానోజీరావు నా మొదటి పరిచయంలోనే బాంబు పేల్చాడు.

"ఈ కంపెనీలో ఎందుకు చేరావు బాస్! ఇది ఇంకా మొదటి కంపెనీ నీకు, చిన్న వయసు నీది. ఇంకా నీకు ఎన్నో అవకాశాలు వస్తాయి. వీలయినంత త్వరగా ఈ కంపెనీ మానేసి వేరే ఏదైనా కంపెనీ చూసుకో" మొదటి పరిచయంలోనే భానోజీ రావు నా మొహం మీద చెప్పేశాడు.

నాకు ఏదోలాగా అనిపించింది. ఆ తర్వాత అతను చెప్పింది వాస్తవమే అని క్రమంగా అర్థం అయింది.

ఇక ట్రెయినింగ్ ప్రోగ్రాంలో ఉన్న టీం సభ్యులందరూ చాలా స్నేహపూర్వకంగా ఉండేవారు. నేను ఈ భానోజీరావు ఒక రూంలో ఉండేవారం. ఎక్కడికి వెళ్ళినా మేమంతా కలిసే వెళ్ళేవారం. ఒకరితో ఒకరం మాట్లాడుకోవటానికి మాకు ఇంగ్లీషే గతి. క్వాలిటీ ఆఫ్ ఇంగ్లీష్ ని పక్కన పెడితే, అందరం మా మనోభావాల్ని పంచుకోవటానికి ఇంగ్లీష్ మిదనే ఆధారపడేవారం.

మొదటి సారిగా ఓ పదిరోజులు వరుసగా ఇంగ్లీష్ లోనే మాట్లాడుకోవటానికి నాకు అలా అవకాశం వచ్చింది. భానోజీరావు నేను తెలుగులోనే మాట్లాడుకునేవారం అప్పుడప్పుడూ, కానీ మిగతా వారు నొచ్చుకునేవారు, ఏమిటి మీరు మాట్లాడుకునేది మాకు కూడా చెప్పండి అని. దాంతో, అందరి మధ్యలో ఉన్నప్పుడు మేము ఇంగ్లీష్‍లోనే మాట్లాడుకునేవారం.

ఈ అమరావతి లాడ్జి గురించి నాలుగు ముక్కలు చెప్పాలి. ఇక్కడ చాలా తక్కువ ధరకే గదులను ఇచ్చేవారు. మేనేజ్‍మెంట్ వారు మార్వాడీలు అనుకుంటా. నీట్‍నెస్ విషయంలో రాజీపడేవారు కాదు. అదే విధంగా చాలా చక్కటి సంస్కారవంతమైన వాతావరణం ఉండేది అక్కడ.

అక్కడ స్టే చేయటానికి వచ్చేవారు కూడా అధిక భాగం ఉత్తర హిందుస్తానీ వారే కావటం గమనించాను. చక్కగా కుటుంబాలతో సహా వచ్చి అక్కడ విడిది చేసేవారు. చిన్నచిన్న వ్యాపారులు, సేల్స్ ఫీల్డ్ లో ఉండేవారు, వీరేకాక హైదరాబాద్ చూడ్డానికి వచ్చే యాత్రీకులు ఇలా వివిధ వర్గాలకు చెందిన వారు ఉండేవారు. అక్కడ విధిగా హిందీ మాట్లాడేవారు అందరూ.

ఇక్కడ నా హిందీ ప్రతాపం గూర్చి రెండు ముక్కలు చెప్పాలి.

దక్షిణ భారత హిందీ ప్రచార సభ (ఖైరతాబాదు, హైదరాబాదు) వారు నిర్వహించిన మధ్యమ, రాష్ట్రభాష తదితర కోర్స్ లలో నన్నుమా అమ్మగారు చిన్నప్పటి నుంచి చేర్పించి ఉండటం వల్లనైతే నేమీ, దూరదర్శన్ ప్రసారాల వల్లనైతే నేమీ, నాకు హింది భాష అంటే భయం లెదు చిన్నప్పటి నుంచి.

మా అమ్మగారి పుట్టింటిలో అందరూ, అంటే మా మేనమామలు వాళ్ళ పిల్లలు అందరూ హిందీ పండితులే. సీతారామశాస్త్రి అనే ఒక మేనమామ అయితే హిందీ-తెలుగు, తెలుగు-హిందీ డిక్షనరీనే వ్రాశారు ఏకంగా.

మా పెద్ద మేనమామ శ్రీ శ్రీనివాస శాస్త్రి గారు కూడా వృత్తిరిత్యా హిందీ పండితులు, వారు తాడిపత్రిలో ఉండేవారు. ఆయన పౌరోహిత్య్ం కూడా చేసేవారు. ఆయన సంతానం లో అధికభాగం హిందీ ఆధారిత వృత్తిలో స్థిరపడ్డారు. ఈ కారణంగా కావచ్చు , మా అమ్మగారికి - తన పిల్లలందరికీ హిందీ బాగా రావాలనే తపన ఉండేది. మా నాన్నగారి విషయానికొస్తే, తన పిల్లలందరికీ ఇంగ్లీష్, సంస్కృతం కూడా చక్కగా రావాలనే తపన ఉండేది. నేను ఈ కారణాల వల్ల ఇంగ్లీష్, హిందీ లలో ప్రావిణ్యత సాధించాను కానీ, సంస్కృతం విషయంలో  నా పరిఙ్జానం గూర్చి చెప్పాలంటె, మంచు విష్ణు మాటల్లో, సంస్కృతంలో నా పరిఙ్జానం శూన్యం.

మా అన్నయ్య శ్రీ అప్పా శేష శాస్త్రి గారికి ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, కన్నడం లలో కూడా సాధికారత ఉంది.

సరే టాపిక్ డైవర్ట్ అవుతోంది. మళ్ళీ విషయానికి వస్తాను.

ఆ విధంగా నార్త్ ఇండియన్ కొలీగ్స్‌తో అయితేనేమీ, బయట వాళ్ళతోనయితే నేమీ, నేను హిందీ సాధికారికంగా మాట్లాడగలిగేవాడిని. కానీ స్త్రీలింగం, పుంలింగం తదితర వ్యాకరణ దోషాలు ఇబ్బడిముబ్బడిగా దొర్లుతాయి నా హిందీలో అని లాక్షణీకులు (అంటే ఎవరో కాదు, నా శ్రీమతి, మా అక్కయ్యలు) అభిప్రాయపడతారు. అన్నట్టు మా శ్రీమతి కూడా హిందీ పండితురాలే. ఈ దక్షిణ భారత ప్రచార సభవారి కోర్స్‌లన్నీ తుదకంటా ముగించింది తాను. మా అక్కయ్యలు కూడా హిందీ విషయంలో దిట్టలే.

ఇదిగో మళ్ళీ టాపిక్ లో డైవర్ట్ అవుతున్నాను.

ఈ సిరీస్ కంపెనీ వారి ట్రెయినింగ్ పొందిన పదిరోజులూ,

ఉదయాన్నే ఏడున్నరకల్లా స్నానం గట్రా పూర్తి చేసుకుని టై కట్టుకుని, రోడ్‍కి అటుపక్క ఉండే ఓ చిన్న గల్లీలో ఉండే సన్మాన్ హోటల్ చేరుకునే వారం. ఈ హోటల్ ఇప్పటి సుప్రీం ఆడియో పక్కన ఉన్నగల్లీ లో ఉండేది.

నాకు తెలిసి, ఇప్పుడు ఈ అమరావతి లాడ్జ్ కానీ, సన్మాన్ హోటల్ కానీ లేవు.

సన్మాన్ హోటల్లో బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసుకుని , కోటీ ఉమెన్స్ కాలేజి వరకు నడచుకుంటూ వెళ్ళి, కోటీ ఉమెన్స్ కాలేజి ఎదురుగా ఉండే బస్టాప్ లో బస్సు పట్టుకుని ఎల్ బీ నగర్ వైపు వెళ్ళే బస్సు పట్టుకుని కూర్చునే వారం. దాదాపు ఇరవై మంది యువకులు ఉదయాన్నే పులుకడిగిన ముత్యాల్లా తయారయిపోయి, షేవింగ్ చేసుకుని, షూశ్ నీట్ గా పాలిష్ కొట్టుకుని, చేతిలో మెడికల్ కిట్లు పట్టుకుని, టైలు కట్టుకుని, ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటూ బస్సులో కూర్చునేసరికి అందరూ కాస్త ఆసక్తిగా చూసేవారు మా వంక.

వెంకటాద్రి థియేటర్ లో చంటి ఆడేది అప్పట్లో. ప్రతి రోజు బస్సులోంచి వెంకటేష్‍ని, మీనాని చూసి ముందుకు వెళ్ళేవారం. ఇంచుమించు దిల్‍సుఖ్‍నగర్ దాటింది అంటే ఖాళీ ఖాళీగా ఉండేది రోడ్డు. దారికి అటు ఇటూ ఏమీ ఉండేది కాదు. ఇక ఎల్ బీ నగర్ సిరిస్ ఫాక్టరీ చేరుకున్నాం అంటే దాదాపు నగర శివార్లకి చేరుకున్నట్టే లెక్క.

సిరీస్ ఫాక్టరీ వద్ద మమ్మల్ని దింపేసి, మా మొహాన పొగ, దుమ్ము కొట్టేసి, బస్సు వెళ్ళింది అంటే అక్కడ నిర్మానుష్యంగా ఉండేది వాతావరణం . అప్పుడప్పుడూ రోడ్డు పై వెళ్ళే వాహనాలు మినహా ఇంకే సందడి ఉండేది కాదు. రోడ్దు వారగా లారిలు ఆగి ఉండేవి. అక్కడక్కడా ఈ లారి డ్రైవర్లకై చిన్న చిన్న బడ్డి కొట్లు, వాటి ముందు టీ కాచి అమ్మేవారు, పంచర్ షాపులు, లారీ బ్రొకర్ ఆఫీసులు ఉండేవి.

ఇక ఒళ్ళు విరుచుకుని సిరిస్ ఫాక్టరీలోకి ప్రవేశించేవారం.

సిరీస్ కంపెనీ వారి భవన సముదాయాలు చాలా ఉండేవి. ఇప్పుడు కొత్తపేటలో ఉన్న మినర్వా హోటల్, రిలయెన్స్ డిజిటల్ షాప్ వరకు వీరి భవనాలు ఉండేవి. అప్పట్లో వైట్ హవుసు ఉండేది కాదు. అది మధ్యలో వచ్చింది, మధ్యలో నే పోయింది.

వరుసగా ఉన్న ఈ భవనాల సముదాయంలో, మాకు ట్రెయినింగ్ ఒక్కోసారి ఒక్కో భవనం లో ఉండెది.

ట్రెయినింగ్ అంటే ఏమిటో అనుకునేరు. వాళ్ళ ప్రాడక్ట్స్ తాలూకు వివరాలు చెప్పి, వాటిని డాక్టర్ ముందు ఎలా ప్రజెంట్ చేయాలో చెప్పేవారు. విటాపెప్సిన్, బాక్టోస్టాబ్ డీ ఎస్, అస్కారెబ్స్, హిస్టాకార్ట్ తదితర మందులు ఒక ఇరవై ముఫై దాకా ఉండేవి. ఆ విజవల్ ఏయిడ్ శిక్షణ. ఇంతకు మించి ఏమీ ఉండేది కాదు.

ఆ శిక్షణ కూడా అనాసక్తిగా, యాంత్రికంగా ఉండేది. ఈ రెప్రజెంటేటివ్స్ ది ఏముందిలే, వస్తుంటారు పోతుంటారు. ఎంత కాలం ఉంటారులే. వీళ్ళు అతి త్వరలోనే కంపెనీ మానేసి వెళ్ళేవారేగా అన్నట్టు ఉండేది శిక్షకుల బాడీ లాంగ్వేజి.

ఎందుకిలా చెబుతున్నాను అంటే ఆ తర్వాత నేను పని చేసిన ఇతర పెద్ద కంపెనీలలో చూసిన శిక్షణా తరగతులు ఎంతో వైఙ్జానికంగా ఉండేవి. ఉత్తిగా ప్రాడక్ట్ ట్రెయినింగ్ మాత్రమే కాక, వ్యక్తిత్వాన్ని సానబట్టే విధంగా, మన భాషా పాటవాన్ని మరింత మెరుగులు దిద్దేవిధంగా ఉండేవి. ( ఈ ముచ్చట్లన్నీ తరువాత ఎప్పుడైనా చెబుతాను)

వీరి శిక్షణలో కావచ్చు, ఉద్యోగిని చూసుకునే విషయంగా కావచ్చు ఎన్నో లోపాలు కొట్టవచ్చినట్టు కనిపించేవి. నిజానికి టర్నోవర్ దృష్ట్యా, వనరుల దృష్ట్యా చాలా పెద్ద కంపెనీ ఇది. కానీ వారిలో ఏదో నిర్లక్ష్యం, అనాసక్తి కొట్టవచ్చినట్టు కనపడేది. ముఖ్యంగా రెప్రజెంటేటివ్స్ అంటే చాలా చులకన భావన ఉండేది ఈ కంపెనీలో.

శిక్షణ కార్యక్రమం జరిగిన ఈ యావత్తు  పది రోజుల ఖర్చులు యావత్తు ఎవరివి వాళ్ళే పెట్టుకున్నాం. ఖర్చులు అంటే, హైదరాబాద్ కి రావటానికి అయిన ఖర్చు, లాడ్జి ఖర్చులు, తిండి తిప్పలు ఇవన్నీ మేమే పెట్టుకున్నాం. శిక్షణ కాలం పూర్తయిన తర్వాత్ అప్పాయింట్ మెంట్ డేట్ వేసి అప్పాయింట్ మెంట్ లెటర్ ఇచ్చారు.

’కోట్రైమాక్సజోల్’ బల్స్ డ్రగ్ మాన్యుఫాక్చరింగ్ లో ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీ హోదా అనుభవిస్తున్నప్పటికీ, అంధ్రప్రదేశ్ లో ప్రారంభింపబడ్డ అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ అనే అరుదైన గుర్తింపు ఉన్నప్పటికీ ఈ కంపెనీ ఎందుకు చరిత్ర పుటల్లో కలిసి పోయింది అంటె అనేక కారణాలు ఉన్నాయనిపిస్తుంది.

వాటిల్లో ముఖ్యమైనది ఉద్యోగులని చులకనగా చూడటం అనేది ఒక కారణం. అలాగే సంస్థాగత నిర్వాహణాలోపాలు అనేకం ఉండేవి అనుకుంటా.

నాకు మొదట బ్రేక్ ఇచ్చి ఈ రంగంలో కాలూనుకోవటానికి నాకు అవకాశం ఇచ్చిన కంపెనీగూర్చి చెడ్డగా చెప్పటం నా ఉద్దేశం కాదు.

ఇక్కడ ఒకటి చెప్పాలి.  కెరియర్ గా మెడికల్ రెప్రెజెంటేటివ్ వృత్తినే ఎన్నుకోదలచుకున్న పక్షాన, సిరీస్ కంపెనీ ఎంతమాత్రం చేరదగ్గ కంపెనీ కాదని తెలియదు. గుడ్డిగా చేరిపోయాను.  నేను చదువుకునే రోజుల్లో కూడా గుడ్డిగా చదువుకుంటూ వెళ్ళామే కానీ ఒక స్పష్టమైన గోల్ ఏర్పరచుకుని ఆ దిశగా ప్రయత్నాలు చేసుకుంటు వెళ్ళటం అనేది ఉండేది కాదు. అలాంటి ధృక్పథం ఉండి ఉంటే చక్కగా కెరియర్ ప్లాన్ చేసుకుని ఉండేవాడిని అనుకుంటా.

చదువుకున్నదంతా చిన్న ఊర్లు. సరయిన లక్ష్యాలు ఏర్పరచుకునే అవకాశాలు లేవు.

అందుకే నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఎవ్వరూ ఎదుర్కోకూడదు అన్న విధంగా ఇప్పుడు నా శిక్షణ తరగతుల్లో గోల్ సెట్టింగ్ కి , కమ్యునికేషన్ స్కిల్స్ శిక్షణకి, ఇంగ్లీష్ ఫ్లుయెన్సీ శిక్షణకి, ఇంటర్వ్యూ స్కిల్స్ ట్రెయినింగ్ కి అధిక ప్రాధాన్యత ఇస్తుంటాను.

’సర్! ఎందరో ట్రెయినర్స్ ని చూశాం. కానీ మీలా జీవితాన్ని మలుపు తిప్పే ట్రెయినర్స్ ఎక్కడా తారసపడలేదు. మా విజయానికి మీరే కారణం’ అని ప్రతి రోజు నా పూర్వ విద్యార్థులు మెయిల్స్ ద్వారా, ఫోన్స్ ద్వారా చెబుతుంటే, నా లక్ష్యం నెరవేరిందన్న తృప్తి కలుగుతుంటుంది నాకు.

సరే, మళ్ళీ సిరీస్ కంపెనీ ట్రెయినింగ్ విషయానికి వద్దాం.

గుడ్డిలో మెల్ల అన్నట్టు తీరా ట్రెయినింగ్ పూర్తయి, హెడ్ క్వార్టర్స్ కి బయలుదేరేముందు ఒక నెల శాలరీ అడ్వాన్స్ ఇచ్చారు. రూం చూసుకొవటనికి బస్సు చార్జీలకి వాటికి అవసరం అవుతాయని.

చెప్పాను కద, ఇంకో పది రోజుల్లో ఈ కంపెనీకి రాజీనామా చేసి, ఇప్కాలో చేరిపోయానని.

అప్పుడు ఈ శాలరీ అడ్వాన్స్, సాంపిల్ కన్‍సైన్‍మెంట్ వెనక్కి ఇచ్చేసి, వాళ్ళ ట్రెయినింగ్ ని అభినందిస్తూ, ఒక చక్కటి రాజీనామా పత్రాన్ని సమర్పించి, శెనగలు తిని చెయి కడుక్కున్నట్టు, బొంబాయి రైలెక్కాను.

****

నేను చేరిన ఇప్కా లేబొరేటరీస్ గూర్చి మీకు చెప్పాలి.

ఇప్కాలో  ట్రెయినింగ్ ప్రోగ్రాం ఇరవై ఒక్క రోజులు జరుగుతుంది. కడప నుంచి బొంబాయికి రానూ పోనూ ఫస్ట్ క్లాస్ టికెట్స్ పంపించారు.బొంబాయి నగర నడిబొడ్డున బొంబాయి సెంట్రల్ కి కూతవేటు దూరంలో త్రీ స్టార్ హోటర్ ఫెసిలిటీస్ తో అకామిడేషన్ ఏర్పాటు చేసారు.

మేము బసలో దిగిన రోజు మధ్యాహ్నం సాక్షాత్తు కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ ప్రతి గదికి వచ్చి మాకు సౌకర్యంగా ఉందా అని ప్రేమగ పలకరించారు. ప్రయాణం క్షేమంగా జరిగిందా, వసతి సౌకర్యాలు బాగున్నాయా, ’ఆర్ యూ కంఫర్టబుల్?’ అని ఎంతో ప్రేమతో పలకరించారు.

ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు కద. మా ఇంట్లో కూడా ఫోన్ ఉండేది కాదు. మా పక్కింటి డాక్టర్ గారి ఇంటి ఫోన్ నెంబర్ ని పీపీ నెంబర్ కింద ఇచ్చాను, ఎండీ గారు అడిగితే.

ఆ తర్వాత మా ఇంటికి వారే ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మేము క్షేమంగా చేరామని చెప్పి, మమ్మల్ని ఆ కంపెనీలో చేర్చినందుకు మా అమ్మానాన్నలకి థాంక్స్ చెప్పారు.

ఆ ఇరవై ఒక్క రోజులు వారే బస, స్టార్ హోటల్ భోజన వసతి కల్పించినప్పటికీ మాకు మళ్ళీ ఎక్స్-స్టేషన్ అలవెన్స్ కూడా ఇచ్చారు. బట్టలు వాషింగ్, తదితర ఖర్చులు ఉంటాయి కద అన్న నెపంతో. నిజానికి ప్రతీ రోజు హోటల్ వారే మా బట్టల వాషింగ్ , ఇస్త్రీ కూడా చూసుకున్నారు.

ఇంతేకాక అపాయింట్‍మెంట్ లెటర్ ఇచ్చింది లగాయతు డైలీ అలవెన్స్ ఇస్తూ పేరోల్స్ లోకి తీసుకున్నారు మమ్మల్ని. దీనికి పెద్ద ఖర్చు కాకపోవచ్చు కానీ మా మనసుల్ని దోచుకున్నారు.

ఒక కంపెనీ యొక్క వ్యక్తిత్వం ఇలాంటి చిన్న చిన్న విషయాలలో తెలుస్తుంది అని చెప్పవచ్చు.

***

మళ్ళీ సిరిస్ కంపెనీ ముచ్చటకి వద్దాం.

మేము టీం అంతా ప్రతి రోజు కూడా ఖర్చులు షేర్ చేసుకునేవారం. ఈ పంజాబీ వాళ్ళలో ఒకడు బాగా మెయిన్‍టెయిన్ చేసేవాడు ఈ లెక్కా డొక్కా అంతా కూడా.

"బాసూ నీ డబ్బు  నాకు ఒక పైసా వద్దు,  నా డబ్బు కాస్తా ఎక్కువ ఖర్చయినా ఫర్వాలేదు. ఫ్రెండ్‍షిప్ నాకు ముఖ్యం" అంటూ ఉదయాన్నే ఒక యాభై రూపాయలు తీసుకుని, సాయంత్రానికంతా అంతా లెక్క చెప్పేవాడు. మిగిలితే వెనక్కు ఇచ్చేవాడు, పైన ఏమన్న ఖర్చు అయితే అడిగి తీసుకునే వాడు.

మాక్కూడా సుఖంగా ఉండేది ఈ పద్దతి వల్ల.

"బాసూ నీ డబ్బు......." అనేది అతని స్టాక్ డైలాగు. కానీ  చాలా మంచి వాడు.

ట్రెయినింగ్ మధ్యలో ఒక రోజు ఆదివారం విరామం ఇచ్చారు.

 ఆ రోజు మా టీం మేట్స్ నార్త్ ఇండియన్స్, తమిళ వాళ్ళూ దగ్గరుండీ మాకు టిపిన్ పెట్టి, మా బిల్లు కూడా వాళ్ళే పేచేసి, నన్నూ, భానోజీరావు ని తోడ్కొని చార్మినార్ కి తీసుకు వెళ్ళారు. ఆ రోజు మమ్మల్ని చాలా గౌరవంగా చూసుకుంటున్నారు వీరందరూ . మాకు విషయం అర్థం కాలేదు. మేము షేర్ చేయబోతే వద్దు వద్దంటూ తిరస్కరించారు.

అనుమానంగా చూస్తున్న మా వంక చూసి, ఒక రిక్వెస్ట్ చేశారు

"బాసూ! మాకు తెలుగు తెలియదు కద. ఈ రోజు షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. మా అమ్మ వాళ్ళకి, అక్కయ్యలకి, చెల్లెళ్ళకి గాజులు, ముత్యాలు, దండలు తీస్కుందాం అనుకుంటున్నాం. మేము ఇక్కడి వారం కాదని తెలిస్తే మమ్మల్ని మోసం చేస్తారు. మీరు చక్కగా తెలుగు మాట్లాడి బేరం చేసి, మాకు మంచి వస్తువలు తక్కువ ధరకి ఇప్పించండి" అన్నది వారి రిక్వెష్ట్ సారాంశం.

అప్పుడు నవ్వాము నేను, భానోజీ రావు.

"ఒరి మూర్ఖులారా! హైదరాబాద్‍లో, అందునా చార్మినార్ వద్ద తెలుగు మాట్లాడితేనే మోసం చేస్తారు. అసలు తెలుగు రాదు అక్కడ ఎవ్వరికి, మీ హిందీలోనే రెచ్చిపోండి, మిమ్మల్ని ఎవ్వడూ మోసం చేయరు" అనిచెప్పాము.

వారు మొదట నమ్మలేదు మా మాటల్ని.

ఆ తర్వాత వారికే అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది, మా పై జాలి పడ్డారు.

"మీ తెలుగుకి ఏమిటీ దురవస్థ?" అని.

"వద్దులే నాయన! కడుపు చింపుకుంటే కాళ్ళమీద పడుతుంది " అని ఇంగ్లీష్ లో చెప్పుకుని, షాపింగ్ కానిచ్చాం.

ఈ కంపెనీలో ట్రెయినింగ్ పూర్తి చేసుకుని, అనంతపురం హెడ్ క్వార్టర్స్ చేరుకుని ఫీల్డ్ లో నేను పడ్డ కష్టాలు తదితర అంశాలు మీకు పార్ట్-3 లో చెబుతాను.

సిరీస్ కంపెనీ Part 1

 సిరీస్ కంపెనీ

ఒక ఙ్జాపకం - 64

================================= 

ఎల్ బీ నగర్ మీదుగా దిల్ సుఖ్ నగర్ వెళ్ళే ప్రతీ సారి  రోడ్డుకు ఎడమ వైపు కనిపిస్తుంది ’సిరీస్’ ఫాక్టరి.

కాకతీయ రాజుల నిర్మాణ శైలిలో స్వాగత తోరణం ప్రధాన ద్వారం వద్ద ఒక ప్రత్యేక ఆకర్షణ ఈ ఫాక్టరీ భవనాలకి. కొన్నాళ్ళ క్రితం వరకు కనిపించేది ఈ కంపెనీ. ఇప్పుడు ఏదో రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు తీసేసుకుని  మొత్తం కూలగొట్టి భవనాలు నిర్మిస్తున్నారు.

సిరీస్ కంపెనీ నాకు ఉద్యోగం ఇచ్చిన మొదటి కంపెని.

సరిగ్గా ముఫై ఏళ్ళ క్రితం ఇదే కంపెనీలో మెడికల్ రెప్రజెంటేటివ్ గా చేరి , ఇదే కార్యాలయంలో ఓ పది రోజులు ప్రాడక్ట్ ట్రెయినింగ్ తీస్కుని అనంతపురం హెడ్ క్వార్టర్స్ కి విధి నిర్వాహణ నిమిత్తం వెళ్ళాను.

’మేరా నామ్ జోకర్’ లాగా పాంట్లోకి షర్ట్ టక్ చేసుకుని, మెడకి టై ఒకటి తగిలించుకుని,కాళ్ళకి మాత్రం చెప్పులతో ఇంటర్వ్యూకి వచ్చిన అనుభూతి ఇంకా గుర్తు ఉంది.

****

"కూర్చో! ఇక్కడ సైన్ చెయ్యి... మీరంతా పెద్దోళ్ళు ఇప్పుడు మాకు!" నాకు కుర్చీ చూపిస్తూ అన్నాడా వ్యక్తి.

నేను అవాక్కయ్యాను. ఏమిటి ఇంత అమర్యాద, ఎందుకింత తిరస్కార భావన?

నేను నిశ్శబ్దంగా కుర్చీ లాక్కుని కూర్చుని ఆయన చెప్పిన దగ్గర సంతకం చేసి మెడికల్ శాంపిల్స్ కన్సైన్‍మెంట్ తాలూకు ఎల్ ఆర్, అపాయింట్‍మెంట్ లెటర్ అందుకుని మౌనంగా బయటకి వచ్చాను.

ఆయన హెచ్చార్ మేనేజర్ కూడా ఏమీ కాదు. అడ్మిన్ సెక్షన్ లో ఒక సీనియర్ క్లర్క్. ఆ కంపెనీలో  వర్క్ కల్చర్ అంతేనని ఆ తర్వాత రోజులలో అర్థం అయింది నాకు.

ఈ సంఘటన 1991 డిశెంబర్ లో హైదరాబాద్ ఎల్‍బీ నగర్ సిరీస్ (SIRIS)  కార్పొరేట్ హెడ్ ఆఫీస్ లో జరిగింది. అది నా మొదటి ఉద్యోగం. ఎన్నో కలలు కని ఇష్టపడి మెడికల్ రెప్రెజెంటేటివ్ గా చేరాను. పది రోజుల శిక్షణ కార్యక్రమం అనంతరం చివరి రోజు ఈ గౌరవం లభించింది నాకు.

నాకు మెడికల్ రెప్రెజెంటేటివ్ ఉద్యోగం అంటే చాలా ఇష్టం ఉండేది ఆ రోజుల్లో. వారి వస్త్ర ధారణ కావచ్చు, మోటార్ సైకిల్ ఎక్కి ఆత్మ విశ్వాసం నిండిన కండ్లతో దూసుకుపోయే విధానం కావచ్చు, ముఖ్యంగా వారి మెడలో ఎప్పుడూ వేలాడే టై కావచ్చు, నోరు తెరిస్తే ఇంగ్లీష్ మంచినీళ్ళప్రాయంగా మాట్లాడే ధోరణి కావచ్చు, ఇలా వాటిలో ఏది నన్ను ఆకట్టుకుందో నాకే ఇదమిత్తంగా తెలియదు. కానీ నాకు చాలా క్రేజ్ అయితే ఉండేది ఆ వృత్తి పట్ల.

నిజానికి మా అప్పకి నేను సివిల్స్ చదివి చక్కగా కలెక్టర్ అవ్వాలనే ఆకాంక్ష ఉండేది. నేను ఏనాడు ఆ దిశగా ఆలోచన కూడా చేయలేదు. ఆయన నా పై ఒత్తిడి కూడా తీస్కురాలేదు. నా నిర్ణయాన్ని గౌరవించారు. కాకపోతే ఒక్కటె అనేవారు,

’నీకు తెలివి తేటలు ఉన్నాయి, చక్కటి భాషా ఙ్జానం ఉంది. నిన్ను చదివించగల స్థోమత నాకు ఉంది, డిప్యూటి కలెక్టర్ గా రిటైర్ అయిన హోదా ఉంది. నీవు ఇదే రంగంలో రాణిస్తే బాగుంటుంది కద." అని. నేను ఎందుకో ఆయన మాటలని సీరియస్గా తీసుకోలేదు.  నేను మా అమ్మానాన్నలని తీవ్రంగా నిరాశపరచిన అంశం ఇదొక్కటే అనుకుంటా.

నేను మెడికల్ రెప్ అవతారం ఎత్తే ముందు ఓ రెండు మూడు బాంక్ ప్రవేశ పరీక్షలు వ్రాసి , ఒక పరీక్షలో ఇంటర్వ్యూ వరకు వచ్చి, తీరా ఇంటర్వ్యూ సమయానికి తీవ్రమైన సైనసైటిస్ రావటం వల్ల గొంతులోంచి మాట పెగలక ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాను.

చెప్పాను కద, లోలోపల మెడికల్ రెప్ అవ్వాలనే స్వప్నం ఉండేదని. ఓ రోజు హిందూ దినపత్రికలో ’లుపిన్’ అనే కంపెనీ వారి ’వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనే ప్రకటన చూసి, ఇక ముందు వెనుకలు ఆలోచించకుండా ప్రయాణానికి సిద్దం అయిపోయాను. ఎక్కడ కడప, ఎక్కడ కోయంబత్తూరు. అయినా నా పట్టుదలే నెగ్గింది. రైలెక్కి కోయంబత్తూరు చేరుకున్నాను.

కదిలే రైల్లోంచి చూస్తూనే ఉన్నాను.

నన్ను రైలెక్కించటానికి వచ్చి ప్లాట్ ఫాం మీద నిలబడి, చేతులు ఊపుతూ నిలబడిన మా అప్ప రూపం  క్రమక్రమంగా మసకబారుతొంది .

నా కళ్ళలో నీళ్ళు నిండాయి అని నాకర్థం అయింది ఆ క్షణంలో. రోజుకి కొన్ని గంటలు స్థిమితంగా కూర్చుని గట్టిగా చదువుకుని ఉండుంటే ఆయన స్వప్నాన్ని సాకారం చేసి ఉండవచ్చు కద.

నేను చదివిన వామపక్ష పుస్తకాలు, కమల్ హాసన్ నటించిన ’ఆకలి రాజ్యం’ లాంటి చిత్రాల ప్రభావం వల్ల పెద్దలను ఎదిరించటం ఏదో గొప్ప అన్న భావన నాకు తెలియకుండా నా మీద బలంగా ఉండేదనుకుంటా ఆ రోజుల్లో. 

ఊరు కొత్త, భాష కొత్త. ఎలాగో అవస్తలు పడి కోయంబత్తూరు స్టేషన్ ఎదురుగా ఉన్న వైఢూర్య లాడ్జి అనే దాన్లో దిగి, మరుసటి రోజు ఉదయాన్నే, రేస్ కోర్స్ రోడ్ లో ఉన్న సూర్యా ఇంటర్నేషనల్ అనే హోటల్ కి ఇంటర్వ్యూకి వెళ్ళాను.

అంత పెద్ద హోటల్ చూడటం అదే మొదటి సారి.

ఏతావాతా ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యాను. వాళ్ళు నా ప్రయాణం ముచ్చట విని ఆశ్చర్య పడ్డారు. అడ్వర్టైజ్‍మెంట్ ఇవ్వటం అయితే ఇచ్చాం కానీ ఒక వ్యక్తి అంత దూరం నుంచి వస్తారా ఎక్కడైనా అని మందలించారు. నేను ఎన్నికైనట్టు ప్రకటించి, "మేము ఇక్కడ స్థానికులకే ప్రాధాన్యత ఇస్తున్నాము. నీకు భాష రాదు, వయసు కూడా చిన్నది, ఇక్కడ అవస్తలు పడతావు. నీవు ఎన్నుకోబడినప్పటికీ, నీకు మేము ఉద్యోగం ఇవ్వటం లేదు.  కాకపోతే కడపలో మా రెప్రజెంటేటివ్ చిరునామ ఇస్తాము. ఆయనతో టచ్ లో ఉండు. ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఖాళీలు ఏర్పడితే నీకే ప్రాధాన్యత ఇస్తాము" అని చెప్పి పంపారు.

ఆ ఇంటర్వ్యూ సంధర్భంగా నాకు పరిచయం అయిన నవీన్ కుంబ్లే ఇప్పటికీ నాతో టచ్ లో ఉన్నాడు. అతను ఫుడ్ అండ్ న్యూట్రిషన్ టెక్నాలజీ లో ఇంజినీరింగ్ చేసి, ప్రస్తుతం విదేశాలలో ఉన్నాడు.

లుపిన్ కంపెనీ వారిచ్చిన చిరునామా పట్టుకుని కడపలో వాళ్ళ రెప్ రాజు గారిని కలిశాను.

ఈ ఇంటర్వ్యూ పుణ్యమా అని కడపలో శ్రీ రాజు గారు పరిచయం అయ్యారు. ఆయనతో స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. వాళ్ళు మేము ఫామిలీ ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నాము. ఆయనకి మా అప్ప అంటే చాలా గౌరవం ఏర్పడింది.  ఆ తరువాత ఎన్నో సార్లు ఆయన తన కుటుంబాన్ని తీస్కుని వచ్చేవారు మా ఇంటికి.

****

సరే! మళ్ళీ సిరిస్ కంపెనీ విషయానికొద్దాం.

లుపిన్ కంపెనీ ఇంటర్వ్యూ ముగించుకుని కడపకి వచ్చిన కొన్ని రోజులకీ ఈ సిరీస్ కంపెనీ వేకెన్సీ గూర్చి తెలిసింది. ఇదివరకటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సారి టై తగిలించుకుని వెళ్ళాలని నిర్ణయం తీసుకుని మా వీధిలో ఉన్న సన్ ఫార్మా రెప్ లక్ష్మీ నారాయణ ని అడిగి టై ఇప్పించుకుని , కడప లో క్రిష్టియన్ లేన్ లో ఉన్న ప్రతాప్ లాడ్జికి వెళ్ళాను. అక్కడే సిరిస్ కంపెనీ ఏరియా మేనేజర్ గారు దిగారన్న మాట.

నేను ఇంకో మిత్రుడు గౌరీ శంకర్ అనే అతను ఇద్దరం కలిసి వెళ్ళాము. అతను నేను నెల్లూర్ కి యురేకా పోర్భ్స్ కంపెనీ ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు పరిచయం అతను. ఇతని గూర్చి ఓ ప్రత్యేక ఙ్జాపకం వ్రాయాలి. స్నేహానికి ప్రాణం ఇచ్చే మిత్రుడు ఈ గౌరీ శంకర్. ఇతను ఇప్పటికీ టచ్ లో ఉన్నాడు నాతో.

ఆ ప్రసాద్ గారు కాస్తా పొట్టిగా చలాకిగా ఉన్నారు. ఇద్దర్ని ఒకటే సారి రూంలోకి పిలిపించుకుని యధాలాపంగా నాలుగు మాటలు మాట్లాడి, ఏమనుకున్నాడో ఏమో "ఇద్దర్నీసెలక్ట్ చేస్తున్నాను. మీరు ఎల్లుండి ఈ పాటికల్లా విజయవాడలో ఉండాలి" అని ప్రకటించాడు

ఈ గౌరీ శంకర్ చాలా సిస్ఠమేటిక్. "ఉత్తినే అలా ఎలా వెళతాం. పద ఈ కంపెనీలో ఇదివరకు పని చేసి రిజైన్ చేసిన రెడ్డి అని ఒక రెప్ ఉన్నాడు. అతని దగ్గరకి వెళ్ళి మెళకువలు నేర్చుకుందాం" అని వాళ్ళ ఇంటికి లాక్కెళ్ళాడు.

అయన చాలా మంచి వాడు. దయతో మాకు ఎన్నో విషయాలు చెప్పాడు. తాను ఏవో వ్యక్తిగత కారణాల వల్ల మానేస్తున్నానని, సిరిస్ చాలా మంచి కంపెనీ అని చెప్పుకొచ్చారు. ఇంగ్లీష్ బాగా మాట్లాడండి అని, విజయవాడ ఆఫీస్ లో ఎవ్వరు కనపడ్డా రెస్పెక్ట్ ఇవ్వమని, అందరి పేర్ల ముందు మిష్టర్ అని తగిలించి మాట్లాడమని చెప్పి ఇలా ఓ గంట సేపు మాకు శిక్షణ శిబిరాన్ని నిర్వహించాడు.

పని పడి వెళ్ళినవారి మానసిక స్థితిని అర్థం చెసుకుని వారి కోసం సమయం కేటాయించి, వారిలో ధైర్యాన్ని నింపేలా మాట్లాడిన ఆయన సంస్కారం నాకు చాలా నచ్చింది.

ఇక సీన్ మారిస్తే మరుసటి రోజు విజయవాడలో ఉన్నాం. ఈ మారు వంటరి వాడిని కాను. ఈ గౌరీ శంకర్ తోడుంటం వల్ల  వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టయింది నాకు. స్నేహంలో ఉండే బలం అదేకద.

మేము ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. ఉత్సాహంగా షాపింగ్ చేశాం. నాకు తెలిసిన ఓ ఫార్మా మేనేజర్ గారింటికి వెళ్ళి ఆయన సలహాలు కూడా తీసుకున్నాం. విజయవాడ ఊరు మొత్తం మాదే అన్నట్టు తిరిగాం ఓ రోజంతా.

తరువాత మరుసటి రోజు ఉదయాన్నే ఇంటర్వ్యూకి వెళ్ళాం.

ఆ రెడ్డి గారు చెప్పినట్టు అందరి పేర్ల ముందు మిష్టర్ అని తగిలించాము, నక్క వినయాలు పోయాము, ఇంగ్లీష్ మంచి నీళ్ళ ప్రాయం మాకు అన్నట్టు బిల్డప్ ఇచ్చాం. చివరికి ఫలితమే తేడాగా వచ్చింది.

"కడప మార్కెట్ కి బలంగా ఉండే వ్యక్తి అవసరం. ఈ గొరీ శంకర్ ని ఎన్నుకుంటున్నాము. చూడంగానే సుకుమారంగా ఉన్న నిన్ను ఇప్పటికైతే ఎన్నుకోవటం లేదు" అని ప్రకటించారు.

***
ఆ తర్వాత ఓ పది రోజులకి గౌరీ శంకర్
, వాళ్ళ మేనేజర్ ప్రసాద్ గారు మా ఇంటికి వచ్చారు.

"ఆనంద్! నివ్వు కూడా సెలెక్టెడ్. నీకు అనంతపురం పోష్టింగ్ ఇచ్చారు. రేపే నీ ప్రయాణం హైదరాబాద్ కి. ఓ పది రోజుల ట్రైనింగ్ ఉంటుంది. ఇదిగో హైదరాబాద్ లో వారి కంపెనీ అడ్రస్"

 ప్రసాద్ గారు చిరునవ్వు నవ్వుతూ, షేక్ హాండిచ్చి "ఆల్ ది బెస్ట్" అన్నారు.

మిగతాది పార్ట్ టూ లో.