కమలాపురం
ఈ ఎపిసోడ్ లో ఎటువంటి కొసమెరుపులు, మలుపులు ఉండవు. ఇది నా చిన్న నాటి ఙ్జాపకాల దొంతర, అంతే.
****
"ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే నీ దేశం పోరా" అనే పాట సాయంత్రం సమయంలో బిగ్గరగా
వినపడింది అంటే అర్థం ఇక మొదటి ఆట ప్రారంభం అవబోతోంది అని అన్నమాట.
ఇదొక్కపాటే కాదు, ఒక దాని తర్వాత ఒకటొకటిగా ఆణిముత్యాలలాంటి పాటలు వినపడటం
మొదలవుతుంది
"చెంగావి రంగు చీర కట్టుకున్న
చిన్నది...దాని జిమ్మ దీయ, అందమంతా చీరలోనే ఉన్నది"
"ఎర్రా బుగ్గల మీద మనసైతే
నీవు ఏమి చేస్తావోయి చినవాడ"
"చేతిలో చేయేసి చెప్పు బావా..
చేసుకున్న బాసలు మరచిపోనని" అని ఇలా శృంగార గీతాలు, ప్రేమ గీతాలు, విరహ గీతాల తర్వాత,
పోనిలే అన్చెప్పి కాస్త దేశభక్తి చూపిస్తూ,
"తెలుగు వీర లేవరా, దీక్ష బూని సాగరా...." అని కూడా వినిపిస్తారు.
ఇవన్నీ అయ్యాక, ఇక భక్తి రస పారవశ్యంలో మనల్ని ఓలలాడించటానికి ఘంటశాల గారు
నడుం బిగిస్తారన్నమాట.
"నమో..... వెంకటేశా!
నమో.... తిరుమలేశా!
నమో వెంకటేశా, నమో నమో తిరుమలేశా" అని ఘంటశాల గారు గంభీరంగా రాగం
అందుకున్నారంటే ఇక తెరలేస్తోంది అని అర్థం.
ఈ పాట మొదలైంది అంటే అప్పటిదాకా
బీడీలు, గోలీ సోడాలు, వడలు,
కారాలు (మురుకులు), బొరుగులు అమ్ముకుంటూ
తిరిగిన కుర్రాళ్ళు నెమ్మదిగా ఒక్కొక్కరూ నిష్క్రమిస్తారు.
ఆ తర్వాత ఇక నెమ్మదిగా సినిమా
మొదలవుతుంది.
థియేటర్ లో కూర్చున్న వారికే కాక
ఊరంతా ఈ పాటలు వినిపిస్తాయి. అంటే కమలాపుర గ్రామ ప్రజలని ఆకట్టుకుని సినిమా దిశగా
వారి దృష్టిని మరల్చేదానికి ఎత్తుగడ అన్నమాట్ ఇదంతా.
ఇవన్నీ డెబ్భైయవ దశకం తొలి భాగంలో కమలాపురంలో నాకు గుర్తున్న సినిమా
థియేటర్ తాలూకు ఙ్జాపకాలు.
ఈ కమలాపురం కడప జిల్లా లో
ఎర్రగుంట్ల వెళ్ళేదారిలో వస్తుంది. అలాగన్చెప్పి కడప-ఎర్రగుంట్ల మెయిన్ రోడ్ మీద
ఏమీ ఉండదు ఈ ఊరు. మెయిన్ రోడ్ మీద నుంచి దాదాపూ రెండు మూడూ కిలోమీటర్లు లోపలికి
వెళ్ళాలి.
ఏదో దారిలో వచ్చింది కద అని ఆ
ఉరికి విచ్చేసే వారితో కమలాపురవాసులకు గిట్టదు, పని
కట్టుకుని కమలాపురం చూడాలి అని కృతనిశ్చయులై వచ్చేవారే మా ఊరికి రావాలి సుమా అన్నట్టుంటుంది ఈ ఊరి
లొకేషన్.
నేను ఇందాక చెప్పిన సినిమా థియేటర్
ఒకటే ఒకటి ఉండేది ఆ రోజుల్లో. అది కాకుండా ఒకట్రెండు టెంట్లు కూడా ఉండేవి
అనుకుంటా.
వాటి ముందు ఈ సినిమా థియేటర్
రాజసమే వేరు. కడప - ఎర్రగుంట్ల మెయిన్ రోడ్ నుంచి కుడివైపు కి మలుపు తిరిగి ఓ
రెండు మూడు కిలోమీటర్లు ప్రయాణం చేశాక, రైలు
గేటు దాటి ముందుకు వెళితే , రోడ్డుకి కుడి వైపు ఉండేది ఈ
థియేటరు. పేరు కూడా గుర్తు లేదు నాకు సరిగ్గా.
మరీ పెద్దదేం కాదు ఈ ఊరు. నా
జీవితంలో ఈ కమలాపురంకి ఒక ప్రత్యేకత ఉంది. నా విద్యాభ్యాసం ప్రారంభం అయ్యింది
అక్కడనే. ’హరి ఓం’ అని నన్ను అక్కడ ఒకటో తరగతిలో చేర్చారు.
మా అప్ప (నాన్నగారి)కి మొదటి
సారిగా ప్రమోషన్ మీద డెప్యూటీ తహసిల్దారు
హోదాలో ఆ ఊరిలో పోస్టింగ్ రావటంతో మేము ఆ ఊరికి వచ్చామన్న మాట.
నేను పుట్టిన తరువాత ఆయన కెరియర్
ఉఛ్చ స్థితికి చేరుకుందని మా అమ్మ తరచూ అనే వారు. ఆ విధంగా ఒక ప్రత్యేకత నాకు
ఆపాదించి నన్ను ఆనందపరిచే వారు. ఆయన కృషి, పట్టుదల,
అనుభవం కారణంగా ఆయన తన వృత్తిలో ఎన్నో ఎత్తులు చవిచూశారు. నా
పుట్టుక తర్వాత అన్నది యాధృచ్చికం.
మా నాన్నగారి నీతి నిజాయితీల
గూర్చి, క్రమ శిక్షణ గూర్చి ఒక సిరీస్ వ్రాయాలి
నిజానికి నేను.
మా అన్నయ్య అప్పటికి తిరుపతిలో ఎంఏ
చేసేవాడు. మా ముగ్గురక్కయ్యలని కడపలోనే మా బామ్మ గారి వద్ద ఉంచి నన్ను తీసుకుని మా
అమ్మ అప్పలు కమలాపురం వచ్చారన్నమాట.
మరీ చిన్నతనంలో చూసినప్పటికీ నాకు
ఆ ఊరు బాగా గుర్తుండిపోయింది. అక్కడ ఇంతకూ ఉండింది మహా అంటె ఒక ఆరేడు నెలలు అంతే. ,
కమలాపురం అంటే నాకు బాగా గుర్తు
వచ్చే అంశాలు కొన్నే. మా మేడ ఎక్కితే దూరంగా కనపడే ఒక నీలం రంగు మేడ, ఇందాక నేను చెప్పిన సినిమా థియేటర్, రైలు
బ్రిడ్జి.
ఆ తరువాత నేను కమలాపురం చూసిందే
లేదు. ఆ తర్వాత కడప నుండి అనంతపురం, తాడిపత్రి, ఆదోని కి వెళ్ళే సందర్భాలలో
అనేక మార్లు బస్సులో వెళ్ళేటప్పుడు ఆ బస్సులు విధిగా కమలాపురం మీదుగా వెళ్ళేవి.
ఇందాక చెప్పినట్టు, మెయిన్ రోడ్ మీదనుంచి కమలాపురం ఊరిలోకి
వచ్చి మళ్ళీ యూటర్న్ తీస్కుని వెళ్ళేవి. కాకపోతే, కమలాపురం
రైల్వే గేట్ దాటకుండానే ఓ బస్టాండ్ లాంటి ఏర్పాటు ఉండేది. అక్కడ ఆగి అట్నుంచి అటే
బస్సులు మళ్ళీ వెనక్కు వెళ్ళిపోయే కారణంగా మళ్ళీ ఎప్పుడూ నేను కమలాపురం చూడలేదు.
కడప నుంచి ఆదోని, బొంబాయి (అప్పుడలానే అనేవారు) వెళ్ళే మార్గంలో విధిగా ఈ
కమలాపురం వచ్చేది. రైలు మార్గంలో కమలాపురం వస్తోంది అనంగా పాపాఘ్ని నదిపై ఉన్న
పెద్ద కటాంజనాల వంతెన పెద్ద ఆకర్షణ గా ఉండెది ఆ రోజుల్లో. ఇంజినీరింగ్
నైపుణ్యానికి ప్రతీకగా చెప్పుకునే వారు ఆ రోజుల్లో ఆ వంతెనని. ఆ వంతెనపై రైల్లో
వెళుతుంటె "ఠమాల్ ..ఠమాల్; ఠమాల్.. ఠమాల్" అని పెద్దగా వచ్చే చప్పుడు చిన్న తనంలో భీతి
గొల్పేది. మా అమ్మ ఒడిలో తల పెట్టుకుని కళ్ళు మూసుకుని ’శ్రీ రామ శ్రీ రామ’
అనుకుంటూ ఆ బ్రిడ్జి దాటే వరకు కళ్ళు తెరిచేవాడిని కాదు.
కమలాపురం అనంగానే ఈ కటాంజనాల రైలు
వంతెన మొదట గుర్తు వస్తుంది నాకైతే. ఈ రైలు మార్గానికి సమాంతరంగా ఎర్రగుంట్లకి
దారి తీసే రోడ్డు మార్గం తాలూకు వంతెన్ కనిపించేది.
కాకపోతే ఈ రోడ్డు వంతెన ఎత్తైన
రోడ్ వంతెన కాదు ఆ రోజుల్లో. కాజ్ వే లాగా నది మట్టానికి ఇంచుమించు సమానంగా
ఉండేది. కాకపోతే ఈ పెన్నా నదిలో నీళ్ళు అరుదుగా ఉంటాయి కాబట్టి బస్సుల రాకపోకలకి
ఇబ్బంది ఉండేది కాదు. వర్షాకాలంలో విధిగా ఈ రోడ్డు వంతెన మునిగిపోయేది. అప్పుడు
రవాణా వ్యవస్థ ఇంచుమించు స్తంభించి పోయేది. సాహసం చేసి మనషులు నడుచుకుంటూ రైలు
వంతెన మీదుగా నది దాటి అవతల ఒడ్డుకి చేరి
అక్కడి నుంచి బస్సో, బండో పట్టుకుని వెళ్ళేవారు.
లేదంటే అనేక కిలోమీటర్లు ఎక్కువగా
ప్రయాణించి చెన్నూరు మీదుగా వెళ్ళేవాళ్ళు బస్సుల్లో.
ఆ విధంగా ఉండేది ఆ రోజుల్లో.
కడప జిల్లా వాళ్ళ గూర్చి బాలివుడ్
సినిమా వారు తమకి ఇష్టం వచ్చినట్టు చూపించినా, కరడు
కట్టిన రాక్షసులు అన్నట్టు చూపించినా అసలు కడపవాళ్ళు ఎంత మంచి వాళ్ళు అన్నది దగ్గరుండి
కడప వారితో జీవించిన వారికే తెలుస్తుంది.
తమకు హక్కుగా రావలిసిన విశాలమైన
రోడ్లు, మంచి జీవిత విధానం, మంచి
విద్యా సంస్థలు, నదీజలాలు పొందటం ఇవన్నీ తమ హక్కు అన్న అంశం
కూడా తెలియనంత మంచి వారు.
ఆ తర్వాత కొన్నేళ్ళకి ’హై లెవల్ డబల్
లేన్’ వంతెన వచ్చింది. చాన్నాళ్ళు కడప
జిల్లా వాళ్ళు తమ అదృష్టానికి మురిసిపోయారు.
దురదృష్టవశాత్తు ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకి ఈ వంతెన కూలిపోయింది.
పాపాఘ్ని నది అనంగానే గుర్తు వచ్చే
ఇంకో ముచ్చట, దోసపండ్లు.
వీటిని హైదరాబాద్ లో తర్బూజాలు
అంటారు. ఇందాకే చెప్పాను కద, ఈ నదిలో ఎప్పుడూ
నీళ్ళు ఉండవని, అలాంటిది ఇక ఎండకాలంలో నీళ్ళెక్కడినుంచి
వస్తాయి. ఇలాంటి ఎండిపోయిన నది ఇసుకలో, రైతులు దోసపండ్ల పంట
పండిస్తారు. ఈ దోస పండ్ల తియ్యటి
తీపినివర్ణించటం అనితరసాధ్యం.
కడప నుంచి బద్వేలు వెళ్ళే మార్గంలో ఉండే సిద్దవటం లో కూడా దోసపండ్లు బాగా
పండుతాయి. కడప జిల్లాలో ఎక్కడ దోసపండ్లు పండినప్పటికీ వాటిని సిద్దవటం దోసపండ్లు
అని పిలవటం ఆనవాయితీ.
శ్రీరామనవమి పండగ కి ఈ దోసపండ్లు, పానకం, తిరుగువాత వేసిన మజ్జిగ, వెదురుతో చేసిన విసనకర్రలు,
వడపప్పు ఇచ్చిపుచ్చుకోవటాలు ఒక ప్రధాన అంశం కడపజిల్లాలో.
***
ఊరికి ఒక చివర, వేప చెట్ల నీడలో విశాలమైన ఆవరణలో ఒక చక్కటి రాతి భవనంలో
ఉండెది నా మొదటి స్కూలు. నల్లటి పలకపై చక్కటి అక్షరాలతో ’ఓ న మః’ అని అయ్యవారు
(టీచర్) వ్రాసి ఇస్తే ఆ అక్షరాల పైనే బలపంతో పదే పదే దిద్దుతూ నా ఓనమాలు
మొదలయ్యాయి.
నాకు ఇప్పటికీ 1-100 అంకెలు
తలచుకుంటె మనసులో ఆ పాఠశాలలో బోర్డు మీద వ్రాసిన అంకెలే మనసు తెరపై
ప్రత్యక్షమౌతాయి.
నాకు ఇప్పటికీ బాగా గుర్తు. అక్కడ
ఓ పెద్ద డ్రమ్ములో నీళ్ళుఉండేవి. మాటి మాటికి వెళ్ళి పలకని ఆ నీళ్ళ డ్రమ్ములో
ముంచి, ఆ నీళ్ళతో పలక కడిగి , ఆ తర్వాత చొక్కాతో పలకని తుడుచుకుని మళ్ళీ అయ్యవారి దగ్గరికి
పరిగెత్తేవారం. అయన తాజాగా మళ్ళీ అక్షరాలు వ్రాసి ఇవ్వడం, వాటిమీద
బలపంతో వ్రాస్తూ ఉండిపోవడం బాగా గుర్తు ఉంది. ఒకే అక్షరాన్ని దానిపైనే పదే పదే
వ్రాసే ఈ ప్రక్రియని ’రుద్ది రుద్ది రాసుకోవడం’ అని వ్యవహరించే వాళ్ళం.
ఇంకో ముచ్చట. ఈ పలక ఉపరితలం మరింత
నల్లటి రంగుని పొందటానికి అదేదో ఆకుని (బహుశా జిల్లేడు ఆకు అనుకుంటా) బొగ్గుతో
కలిపి నూరి ఆ మిశ్రమాన్ని పలక మీద పూస్తే పలక మరింత రంగు తేలుతుంది అనే మూఢ నమ్మకం
ఒకటుండేది. నలుపు రంగు రావటమేమో కానీ చేతులు, చొక్కా
నిక్కరు నల్లటి రంగు సంతరించుకునేవి.
నా అవతారం చూసి మా అమ్మ
మిడిగుడ్లేసేది.
ఇన్ని కాయకల్ప చికిత్సలు చేసినా
కూడా ఈ పలకలు తరచూ పగిలిపోతూ ఉండేవి. మళ్ళీ కొత్తవి కొనడం దానిపై మా అమ్మ శ్రీరామ
అని వ్రాసి మళ్ళీ స్కూలుకి పంపేది.
***
రాతితో నిర్మించిన ఓ భవంతి బాడుగ
కి దొరికింది . ఆ ఇంటి ఎదురుగా ఓ పెద్ద ఖాళీ కాంపౌండ్. అందులో పెద్ద పెద్ద వేప
చెట్లు, ఎవరో మోతుబరి రైతుల తాలూకూ గడ్డి వాములు,
ఓ పెద్ద బావి ఉండేవి.
డిప్యూటీ తహసిల్దారు హోదాలో మా
నాన్నగారికి చాలా గౌరవ మర్యాదలు లభించేవి ఆ ఊర్లో. ఇంటి దగ్గర సదా ఓ అటెండర్
ఉండేవాడు.
మా ఇంటి పక్కనే ఓ పెద్ద గుడిసే
ఉండేది. ఆ గుడిసెలో బాలనాగమ్మ అనే ఆవిడ ఉండే వారు. వాళ్ళది రైతు కుటుంబం.
రామాంజనేయులు అనుకుంటా వాళ్ళ అబ్బాయి , నాకు
బాగా దోస్తు. మేము ఆ ఊరు వదిలి వచ్చేశాక కూడా చాలా సంవత్సరాలు ఆ కుటుంబంతో మాకు
సాన్నిహిత్యం ఉండేది. వారు కూడా కొన్నేళ్ళయ్యాక కడపకి మకాం మార్చారు.
వారి కొట్టం ముందు ఓ నులక మంచం
వేసి దానిపై రకరకాల గాజు సీసాలలో పిప్పరమెంట్లూ, చాక్‍లేట్లు, చెగోడీలు, బీడీలు
తదితర వస్తువులు అమ్మేవారు వారు.
ఆ సెటప్ చూసి, నాక్కూడా చాలా రోజులు కోరిక ఉండేది అలాంటి అంగడి పెట్టాలి
అని. ’ఛ! నోర్ముయ్’ అని కేకలేసేవారు మా అమ్మా వాళ్ళు.
ఆ రోజుల్లో ఇంటి ముందు బస్సాట
ఆడేవాళ్ళం.
బస్సాట అంటే మరేమో కాదు. ఇటుక
పరిణామంలో ఉండే రాతి ముక్కని నేలపై తోసుకుంటూ ’ప్పిప్పీప్...ప్పిప్పీప్’ అనుకుంటూ
వేగంగా వెళ్ళటం అన్నమాట. ఈ ఆటలో ఓ సారి
ఆక్సిడెంట్ అయింది కూడా. వేగంగా ఆ బస్సుని (రాతి ముక్కని) తోసుకుంటూ వెళ్ళటంలో ఓ
కరెంట్ పోల్ కి గుద్దుకుని తల పగిలినంత పనయింది.
అదండి కమలాపురం కథ.
ఎందుకో ఈ రోజు ఈ ముచ్చట్లన్ని
గుర్తు వచ్చాయి.
Published in facebook on 23.04.2022
https://m.facebook.com/story.php?story_fbid=10222353238039962&id=1237660552
No comments:
Post a Comment