Sunday, April 24, 2022

ఔటర్ రింగ్ రోడ్ -హైదరాబాద్

 

ఔటర్ రింగ్ రోడ్ -హైదరాబాద్

ఒక ఙ్జాపకం -62


ఎనభైవ దశకం వినియోగ దారుల ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న కాలం. ఆ రోజుల్లోనే వినియోగదారుల ఫోరం అనే పేరిట ప్రభుత్వం ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేసింది.

ఆ రోజుల్లో ఈనాడు దినపత్రిక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రత్యేకవ్యాసాలు కూడా వ్రాసేది. ఆ రోజుల్లో చదివిన వ్యాసాలలో నాకు బాగా గుర్తుండిపోయిన ఒక వాక్యం-

"నీకు ఏదైనా సంస్థ అందించే సేవలు (సర్వీసెస్) నచ్చకుంటే స్పందించి ఉద్యమించటం ఎంత ముఖ్యమో, అదే విధంగా ఏ సంస్థ అయినా చక్కటి సేవలు అందిస్తున్నప్పుడు వారిని ప్రశంసించటం కూడా అంతే ముఖ్యం"

ఆ వాక్యం అందించిన స్ఫూర్తితోనే ఈ వ్యాసం వ్రాయటం జరిగింది.

నాది హైదరాబాద్ నగరం అని సగర్వంగా చెప్పుకోవటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటన్నింటిలోనికి తలమానికమైనది ఔటర్ రింగ్ రోడ్ అని నిస్సందేహంగా చెప్పగలను. దేశంలో ప్రతి రోడ్ ఈ విధంగా ఉంటే ఎంతబాగుంటుంది కద అనిపిస్తుంది దీనిపై ప్రయాణించినప్పుడల్లా.

ఇది ఎనిమిది వరుసల (లేన్ల) సూపర్ ఎక్స్‌ప్రెస్ వే.  నేను ఈ వ్యాసం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ గూర్చి వివరాలు తెలపటానికి వ్రాయటం లేదు. వ్యాసంలో భాగంగా ఈ ఎక్స్‌ప్రెస్ వే గూర్చి సందర్భొచితంగా వివరాలు కూడా తెలుపుతాను.

మరి ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం ఏమిటంటె, మనిషి ప్రాణానికి, భద్రతకి ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఎంత ప్రాముఖ్యతని ఇస్తోందో తెలియజేయటం నా ప్రధాన ఉద్దేశం. ఈ రోడ్డుపై ప్రయాణించినప్పుడు నాకు కలిగే ఆనందాన్ని నలుగురికి తెలపటం నా ముఖ్యోద్దేశం.  ప్రయాణంలో సౌఖ్యానికి, వేగానికి ఎంతో పెద్ద పీట వేశారు వీరు. రోడ్డు నిర్మాణంలో చక్కటి సాంకేతికని వాడారు. చక్కటి అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న ఇలాంటి రోడ్ మన నగరంలో ఉండటం, నామమాత్ర రుసుముతో మనకందరికీ అందుబాటులో ఉండటం మన అదృష్టం అనిపించింది.

ముందుగా NH-44  గూర్చి వ్రాసి ఔటర్ రింగ్ రోడ్డు విషయానికి వస్తాను:

NH-44  దేశంలో కెల్లా అతి పొడవైన జాతీయ రహదారి. జమ్మూ కశ్మీర్ నుంచి, కన్యాకుమారి దాక విస్తరించి ఉంటుంది ఈ హైవే.

నేను హైదరాబాద్ నుంచి కర్నూలు తరచూ వెళుతుంటాను. ఈ దారిలో కర్నూలు దాటి నేరుగా కన్యాకుమారి దాకా వెళ్ళచ్చు. నగరానికి ఇటు వేపు ఈ దారిలో బాసర వరకు వెళ్ళాను తరచుగా.

మొదట ఎన్‍హెచ్ 7 గా ఉన్న ఈ నేషనల్ హైవే ఆ తరువాత ఎన్‍హెచ్ 44 గా మారింది. నేను తరచూ ఈ  NH-44 మీద ప్రయాణిస్తుంటాను. దీని గూర్చి కొన్ని విశేషాలు ముందుగా  వ్రాసి మన ఔటర్ రింగ్ రోడ్ విషయానికి వస్తాను. మొదట్లో  NH 7 (ఇప్పుడు 44) రోడ్ మధ్యలో మీడియన్ కూడా ఏమీ లేకుండా ఉత్తిగా టూ లేన్ హైవే గా ఉండేది. తూతూ మంత్రంగా తెల్లగీతలు వేసి ఉంచేవారు.

నేను కర్నూల్లో పదవతరగతి చదివే వయసు నుంచే నాకు ఎన్ హెచ్ 7 తో అనుబంధం. మిత్రులమంతా కలసి ఆ రోజుల్లో సాయంత్రాలు సైకిళ్ళు వేస్కుని బెంగళూరు రోడ్ లోని, కార్బైడ్స్ ఫాక్టరీ దాకా సరదాగా వెళ్ళే వారం. ఆదివారం వచ్చిందంటే ఇటు జగన్నాద గట్టు (గుట్ట)వైపో, అటు ఎస్‍ఏపీ(SAP) కాంప్ దాటి హైవే పై తుంగభద్ర వంతెన దాటి పసుపుల మలుపు దాకా సరదాగా వెళ్ళే వాళ్ళం.

 ఆ రోడ్ పై వెళ్ళే వివిధ సైజుల నేషనల్ పర్మిట్ లారీలని తెగ ఆశ్చర్యంతో చూసే వాళ్ళం. ఆ రోజుల్లో నేషనల్ పర్మిట్ అనీ, కాంపోజిట్ పర్మిట్ అనీ లారీలకి రకరకాల కలర్ కోడ్ కూడా ఇచ్చేవారు. లారీల కంపెనీలు, వాటి పుట్టుపూర్వోత్తరాలు కూడా తెగ అధ్యయనం చేసేవాడిని ఆ రోజుల్లో.  ఉన్నమాట చెప్పాలంటే పంజాబ్ లారీ డ్రైవర్లన్నా, తమిళనాడుకి చెందిన లారీ డ్రైవర్లన్నా ఒక విధమైన హీరోవర్షిప్ ఉండేది ఆ రోజుల్లొ. మొత్తమ్మీద లారీ డ్రైవర్లందరీ మీద ఒక విధమైన సానుభూతి ఏర్పడింది ఆ రోజుల్లో. నాకున్న ఈ అనధికార ప్రావిణ్యం చూసి, మా వాళ్ళందరూ నేనేదో ఆటోమొబైల్ ఇంజినీర్ అవుతాననుకునేవారు ఆ రోజుల్లో. కానీ ఆ లారీలపట్ల ఆకర్షణ, ప్రేమ అక్కడితో ఆగిపోయింది.  అంతకంటే ముందుకుపోలేదు ఎందుకో.

ఆ తరువాత నేను వృత్తి రిత్యా  దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు తిరిగిన సందర్భాలలో కూడా ఎక్కడోదగ్గర నాకు ఈ NH-44  తారసపడేది. నాకు మళ్ళీ స్వంత ఊరికి వచ్చిన అనుభూతి కలిగేది. పిల్ల తనం గుర్తు వచ్చేది.

ఇటీవల ఈ ఎన్‍హెచ్ 44 కాస్త ఆధునీకరింపబడింది.  మొత్తం 4 లేన్ల రోడ్ గా మార్చారు. ఎదురుగా వచ్చే వాహనాలు వేరే రోడ్ పై వెళతాయి. హైదరాబాద్ నుంచి, కర్నూలు చేరే లోగా మూడు టోల్ గేట్లు వచ్చాయి. రోడ్ మధ్యలో వెడల్పాటి మీడియన్ వచ్చింది. ఎదురుగా వచ్చే వాహనం మనకి ఇబ్బంది కలిగించే ప్రసక్తి లెదు. ప్రయాణం హాయిగా సాగిపోతుంది.

ఇదివరకటి  మీడియన్ కూడా లేని, టూ లేన్ హైవే తో పోలిస్తే ఇది ఖచ్చితంగా మంచి అభివృద్దే. ఇప్పుడు హైదరాబాద్ నుంచి కర్నూలు (దాదాపు 225 కిలోమీటర్ల దూరం) కార్లో దాదాపు మూడు గంటలలోపే చేరుకోగలుగుతున్నాము. టాప్ స్పీడ్ నూరు నుంచి నూటా ఇరవై నా సాధారణ వాగన్ ఆర్ లోనే అందుకోగలుగుతున్నాను. నా పక్కనుంచే ఇన్నొవా ఫార్చునర్, ఔడీ, బీఎండబ్యూ, మెర్సిడెస్ తదితర వాహనాలు సునాయాసంగా నూటా యాభై కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకుపోతుంటాయి. వోల్వో, మెర్సిడిసె బస్సులు కూడా ఈ రహదారి మీద నూటా యాభై కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్ళటం నేను గమనించాను.

కాకపోతే ఈ రోడ్ పై భద్రత శూన్యం. ఈ రోడ్ నిర్మాణంలో వేగంగా వెళ్ళటానికి ప్రాధాన్యత ఇచ్చారు కానీ, భద్రతకి తిలోదకాలిచ్చారు.

ముఖ్యంగా ఈ వ్యాసంలో నేను చెప్పదలచుకున్న ప్రధాన అంశం ఇదే. హైదరాబాద్ నుంచి కర్నూలు చేరే లోగా ఎన్నో ప్రమాదకరమైన అంశాలు ఉన్నాయి.

అవి ఏమిటో వివరంగా వ్రాస్తాను.

* శంషాబాద్ ఎయిర్‍పోర్ట్ దాటిన తర్వాత ప్రారంభం అవుతుంది ఈ ఎన్ హెచ్ 44. ఈ హైవే కి ప్రత్యేకమైన ఎంట్రీ టోల్ గేట్ లేదు. ఎవ్వరైనా ఎక్కడినుంచైనా ఎక్కవచ్చు. ఎక్కడో మలుపులలో తప్పనిచ్చి ఈ రోడ్‍కి ఫెన్సింగ్ వంటి నిర్మాణం కూడా ఏమీ లేదు.

* మోటార్ సైకిళ్ళు, ఆటోలు, వ్యవసాయ ట్రాక్ట్రర్లు, జేసీబీలు ఇలా ఎవరైనా ఇష్టారాజ్యంగా ఎక్కేయవచ్చు ఈ రహదారిపైకి

* ఈ రోడ్ పై గేదెలు, గొర్రెలు కూడా యధేచ్చగా వచ్చేస్తుంటాయి.

* కొత్తూరు, తిమ్మాపూరు, షాద్ నగర్ బైపాస్ లో రెండు మూడు జంక్షన్లు ఇలా ఎర్రవల్లి చౌరస్తా చేరేలోపల కనీసమంటే ఓ పది పదిహేను  రోడ్ జంక్షన్లు, చిన్న చిన్న ఊర్లు వస్తూ ఉంటాయి. ఆయా జంక్షన్ల వద్ద తూతూ మంత్రంగా తెల్ల పెయింట్ తో  రోడ్ పై గీతలు వేసి, రోడ్ పక్కన ఆరి వెలిగే ఎర్ర, నారింజ రంగు దీపాలు వేసి ’ప్రమాదాలు జరిగే జంక్షన్’ అని బోర్డ్ పెట్టి చేతులు దులుపుకున్నారు హైవే అథారిటీ వారు.

* ఈ రోడ్ పై వచ్చే చిన్న చిన్న ఊర్ల ప్రజలు హాయిగా ఈ రోడ్డుపై అటు ఇటూ నిర్భీతిగా నడుస్తూ ఉంటారు ఏదో స్వంత ఇంట్లో నడుచుకుంటూ వెళ్ళినట్టు.

* చిత్రంగా , రహదారి నిబంధనలనలని గాలికి వదిలేసి, మనం వెళ్ళే రోడ్డులో , ఎదుటి వైపు నుంచి వచ్చే వాహనాలు విపరీతమైన వేగంతో వస్తుంటాయి. వీటిని అడ్డుకుని, నియంత్రించే నాధుడె కరువు

* ఇవన్నీ ఒకెత్తు అయితే ఒకప్పుడు అద్భుతంగా కనిపించిన ఈ  ఫోర్ లేన్ రోడ్డు (ఒక వైపు దారి టూ లేన్ రోడ్డు మాత్రమే కద) ఇప్పుడు పరమ ఇరుకుగా అనిపిస్తోంది. మనం వెళ్ళే దిశగా ఈ రోడ్ కేవలం టూ లేన్ రోడ్ అవటం వల్ల, ఒక ప్రధానమైన ఇబ్బంది ఉంది. ఓ రెండు భారీ లారీలు ఒకదానిని ఒకటి దాటే ప్రయత్నం చేస్తుంటాయి. అది చెప్పుకోదగ్గ హైలైట్ ఈ రోడ్డు పై.

’దొందూ దొందేరా కొందప్పా’ అన్నట్టు అవి రెండూ ఇంచుమించు ఒకే వేగంతో వెళుతూ ఉంటాయి. అందువల్ల ఒకదానిని ఒకటి దాటటానికి సుమారైన సమయం పడుతుంది. ఈ లోగా ఈ రెండు లారిల వెనుక చాంతాండంత వాహానాల వరుస ఒక ఊరేగింపు లా వెళుతూ ఉంటాయి.

చిన్న చిన్న బ్రిడ్జిలు వచ్చినప్పుడు ఈ రోడ్ కాస్త వెడల్పు అవుతుంది. అలాంటి దగ్గర కొందరు ఉత్సాహ వంతులు, ఆ రెండు లారీలను దాటె ప్రయత్నం చేస్తుంటారు. అది మరింత ప్రమాద హేతువుగా మారుతుంది.

* వ్యవసాయ ట్రాక్టర్లు, ఆటోలు వంటి నిదానంగా వెళ్ళే వాహనాల వల్ల మరిన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఈ దారిపై.

* ఇవికాక ఈ రోడ్డు పై తరచూ ఏదో ఒక మరమ్మత్తులు జరుగుతూ కొన్ని కిలోమీటర్ల పాటు దూరాన్ని ఒకే లేన్ మీదకి మళ్ళించే సందర్భాలు కూడా ఎక్కువ జరుగుతుంటాయి ఇక్కడ.

* 2007 లో మొదటి సారిగా నేను కార్ వేసుకుని లాంగ్ డ్రైవ్ అనికుటుంబ సభ్యులని తీసుకుని కర్నూలుకి వెళ్ళినప్పటికి ఇప్పటికీ రోడ్ క్వాలిటీలో చాలా మార్పు వచ్చింది. విపరీతమైన కుదుపులు వస్తున్నాయి ఇటీవల

*ఈ రోడ్డుకి టోల్ చెల్లించటం దండగ. ఈ క్వాలిటీ మాకు నచ్చలేదు. మేము మామూలుగా వెళతాము అని అనుకునే వారికి వేరే ఆప్షన్ లేదు. నచ్చినా నచ్చకున్నా ఈ రోడ్ పై వెళ్ళాల్సిందే టోల్ కట్టల్సిందే. కర్నూలు చేరే లోగా దాదాపు మూడు వందలు టోల్ రూపంలో చెల్లించుకోవాలి.

వీరపాండ్య కట్టబొమ్మన్ వేషంలో మేజర్ చంద్రకాంత్ సినిమాలో ’ఎందుక్కట్టాలిరా శిస్తూ! నారు పోశావా, నీరు పోశావా? నీకు ఎందుకు కట్టాలి శిస్తూ’ అని ఆవేశంతో అన్న గారు ఊగిపోతారు.

అదిగో అంత ఆవేశం వస్తుంది ఈ రోడ్ పై వెళుతూ టోల్ కట్టేటప్పుడు.

వాళ్ళు మొత్తం కొత్త రోడ్ వేసింది ఏమీ లేదు. ఇదివరకు ఉన్న ఎన్ హెచ్ 7 కి అటూ ఇటూ కాస్తా చదును చేసి సమాంతరంగా రోడ్ వేశారు. సమాంతరంగా వంతెనలు కట్టారు. కాదనను. కానీ వీరు వేగానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు తప్పనిచ్చి ప్రయాణికుల భద్రతని గాలిలో దీపాలలా వదిలిపెట్టేశారు.

యూ టర్న్ వచ్చేదగ్గర మీడియన్ పల్చబడి రోడ్ వెడల్పు అవుతుంది. ఆ తర్వాత యూ టర్న్ అవంగానే ఎదురుగా టక్ మని మీడియన్ అడ్డువచ్చేస్తుంది. రోడు వెడల్పు అయిన దగ్గర యూటర్న్ తీసుకునే వాహనం మెయిన్ స్ట్రీం వాహనాలకు అడ్డురాకుండా ఒక పక్కకి ఒదిగి వెళ్ళాలని వీళ్ళ ఉద్దేశం అంత వరకు మంచిదే.

కానీ యూ టర్న్ తీసుకోకుండా నేరుగా వెళ్ళే వాహనదారుడు రోడ్ వెడల్పు అయింది కదాఅని భ్రమకి గురయి ఆ వెడల్పాటి మార్గంమీద నడుపుకుంటు వెళితే , సడన్ గా మీడియన్ దర్శనం ఇస్తుంది, దాన్ని తప్పించటంలో బోల్తా పడటం ఖాయం. ఇలాంటి ప్రయత్నంలోనే  మూడేళ్ళ క్రితం ఓ వోల్వో బస్సు దగ్ధమై దాదాపు ముఫై మంది ప్రయాణీకులు సజీవ దహనం అయ్యారు.

* అలాంటప్పుడు ఇంతోటి బోడి రోడ్ కి టోల్ కట్టడం ఎందుకు అని వైరాగ్యం కలగటం సహజం.

* రోడ్ మీద టోల్ వసూలు చేసే టప్పటికి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లాంటి నిర్మాణం ఉండాలి. అప్పుడు మనం కూడా ఆనందంగా టోల్ కడతాము.

ఇది వరకున్న రోడ్ ని వీళ్ళు ఆక్రమించి బలవంతపు బ్రాహ్మణార్థం అన్నట్టు మనకు ఈ లోపభూయిష్టమైన ఎన్ హెచ్ 44 ని అంటగట్టి, వేరే ఆప్షన్ కూడా లేకుండా చేసి, దానిమీదే ప్రయాణించటం అనివార్యం చేసి, ఇష్టారాజ్యంగా టోల్ వసూల్ చేయటమే కాక, ప్రాణాలతో చెలగాటమాడటం ముమ్మాటికి తప్పే.

ఈ రోడ్ మీద ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా ప్రాణాలు క్షణాలలో గాల్లో కలిసిపోతాయి.  కర్నూలు నుంచి హైదరాబాద్ చేరే లోగా వెంట్రుకవాసి లో తృటిలో తప్పే ప్రమాదాలు ఎన్నో.

ఇక్కడో హైలైట్ చెబుతాను:

ఏదైనా శుభకార్యాలలో కలిసినప్పుడు బంధు మిత్రులు మాటల మధ్యలో

’నాకు కర్నూలు నుండి హైదరాబాద్ చేరడంలో కేవలం మూడు గంటలు పట్టిం’దని ఒకరు

’ఒసోస్ నాకు అయితే అయితే రెండున్నర గంటలే పట్టిం’దని ఇంకోకరు

’హైదరాబాద్ నుంచి బెంగళూరు చేరుకోవటానికి మాకు కేవలం ఆరు గంటలే పట్టిం’దని ఒకరు కబుర్లు చెప్పుకోవటం విన్నాను. నూరు నూటాయాభై కిలో మీటర్ల వేగం అందుకోవడానికి ఈ రోడ్ నిర్మాణం అనుకూలంగా ఉంది అన్న మాట వాస్తవమే కానీ, భద్రతాపరంగా ఏ మాత్రం అనుకూలంగా లేని ఈ రోడ్ పై ఎనభై దాటి ప్రయణించటం అంటే ప్రాణాల్ని పణంగా పెట్టి పోవడమే అని నా అభిప్రాయం.

దీనితో పోలిస్తే, చెన్నై-కలకత్తా హైవే కాస్తా మెరుగైన భద్రతా ప్రమాణాలతొ ఉంటుంది. ఆ రోడ్ గూర్చి ఆ రోడ్ పై నా ప్రయాణాల గూర్చి మరోసారి చెప్పుకుందాం.

****

ఇప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గురించి చెప్పుకుందాం:

సినిమాలో విలన్ ఎంత బలవంతుడైతే , కథానాయకుడి గొప్పదనం అంత ఎలివేట్ అవుతుంది అంటారు కద. అందుకే ముందుగా మన ఘనత వహించిన ఎన్ హెచ్ 44 గూర్చి చెప్పుకొచ్చాను.

అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మింపబడ్డ మన హైదరాబాద్ రింగ్ రోడ్డు దేశంలోనే ఇలాంటి నిర్మాణాలలో మొట్టమొదటిది కావడం విశేషం.

రాజును చూసిన కంట మొగుణ్ణి చూస్తే మొట్టబుద్దేసిందట ఇది వరకు ఒకావిడకి.  అలాగే ఈ ఔటర్ రింగ్ రోడ్‍ని చూసిన కంటితో మామూలు జాతీయ రహదారులను చూస్తే అలాగే అనిపిస్తొంది.

ఇప్పుడు మన ఔటర్ రింగ్ రోడ్ గూర్చి తెలుసుకుందాం:

* హైదరాబాద్ నగరం చుట్టూ వృత్తాకారంలో ఉంటుంది ఈ ఔటర్ రింగ్ రోడ్డు. దీని పొడవు దాదాపూ నూటాయాభై కిలోమీటర్లు.

* ఎక్కడా కూడా మలుపులు ఉండవు.దాదాపు నేరుగా వెళుతున్నట్టె ఉంటుంది, వృత్తాకారంలో నిర్మాణమే అయినా ఆ మలుపు క్రమంగా ఉంటుందే తప్పనిచ్చి హఠాత్తుగా మలుపులు ఉండవు.

* దాదాపు నూటాయాభై కిలోమీటర్ల వేగంతో నడిపినా కూడా ఎటువంటి కుదుపులేకుండా ప్రయాణం చేయవచ్చు. అయినా కూడా ఈ రోడ్ పై వేగ పరిమితి నూరు కిలోమీటర్లకే అని నిబంధన విధించారు. మీరు హద్దు దాటి వెళితే సెన్సర్ల సహాయంతో మీ కారు నెంబరు, మీరు ప్రయాణించిన తేది, సమయం,ఎంత వేగంతో వెళ్ళారో తెలియజెపుతూ మీకు ఎస్సెమెస్ ద్వారా దాదాపూ వెయ్యి నుండి అయిదు వేల వరకు చలాన్ వస్తుంది. (దేవుని దయవల్ల నేను ఇలాంటి సన్మానం పొందలేదు)

* ఈ రోడ్డు మొత్తం ఎనిమిది లేన్ల రహదారి. దీనిని సూపర్ ఎక్స్‌ప్రెస్ హైవే అనే కేటగిరిలోకి వర్గీకరించవచ్చట అంతర్జాతీయ ప్రమాణాలప్రకారం.

ఈ ఎనిమిది లేన్లూ ప్రయాణించటానికి ఉపయోగించవచ్చు. ఇది కాక ఈ రెండింటిని విడదీస్తూ ఉన్న మీడియన్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఈ మీడియన్ పై ఎక్కడా కూడా యూ టర్న్ కి అనుమతించరు. ఈ మీడియన్ పై చక్కటి తోటలని అభివృద్ది చేస్తున్నారు.

రోడ్డుకి అటు ఇటు కూడా చక్కటి తోటల్ని అభివృద్ది చేస్తున్నారు.

ఇక మళ్ళీ రోడ్ విషయానికి వస్తే ఈ ఎనిమిది లేన్లే కాక, ఎమర్జెన్సీలో నిలుపుకోవటానికి ఇంచుమించు ఒక లేన్ అంత విశాలంగా  ఎడమవైపు చివర స్థలం ఉంటుంది.

* ఈ రోడ్ మీదకి ద్విచక్ర వాహనాలను, ఆటోలను, వ్యవసాయ ట్రాక్టర్లను అనుమతించరు

* ఎదురుగా వాహనం రావడం అన్నది కలలో మాట. ఎక్కడా కూడా యూ టర్న్ కి అనుమతించని కారణంగా ఎక్కడైనా సరే ఎగ్జిట్ పాయింట్ ద్వారా మాత్రమే ఈ ఎక్స్‌ప్రెస్ హైవె పై నుంచి దిగాలి, ఎంట్రి పాయింట్ ద్వారానే ఎక్కాలి. ఈ రహదారిలో ప్రయాణించే ఏ వాహనం అయినా సరే  ఎంట్రీ టోల్ దగ్గర ఫాస్టాగ్ ఆధారంగా ఆటోమేటిక్ గా వివరాల్ని నమోదు చేయబడ్డాకే రోడ్ ఎక్కుతుంది. ఆ తరువాత ఎగ్జిట్ పాయింట్ దగ్గర దిగాక అది ఎంత దూరం ప్రయాణించిందో నమోదు అయ్యాక, ఆటో మేటిక్ గా ఫాస్టాగ్ ద్వారా రుసుం అకౌంట్ నుంచి డబ్బు వాళ్ళ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది.

* ఇరవై నాలుగ్గంటలలోపు వెనక్కు వస్తే రిటర్న్ ట్రిప్ లో కేవలం యాబై శాతం మాత్రమే తీసుకుంటారు.

* డే పాసులు, మంత్లీ పాసులు కూడా ఉన్నాయట. నా వృత్తికి అంతలేసి ప్రయాణాలు ఉండవు. కాబట్టి వాటి గుర్చి నేను వివరాలు కనుక్కోలేదు.

* నేను ఈ ఔటర్ రింగు రోడ్డుని వివిధ సంధర్భాలలో మొత్తం తిరిగాను. ఈ రోడ్డు మీద మొత్తం 19 ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి. ఇది మొత్తం ఇరవై ప్రధాన రోడ్ జంక్షన్లని అనుసంధానిస్తుంది.

* ఈ రోడ్డు మొత్తం ప్రకాశవంతమైన ఎల్ ఈ డీ దీపాలు ఎత్తైన పోల్స్ పై అమర్చబడి ఉంటాయి. ఇది ఎంతో అందమైన దృశ్యం . రాత్రి పూట హాయిగా వెళుతూ ఉంటే స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది. చక్కటి సంగీతం వింటూ రాత్రి పూట ఈ ఔటర్ రింగు రోడ్ పై ప్రయాణం ఒక గొప్ప అనుభూతి.

* ఎంట్రీ పాయింట్ వద్ద టోల్ స్లిప్ తీస్కుని మనం ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కంగానే ప్రధాన ట్రాఫిక్ స్రవంతికి ఇబ్బంది కలిగించకుండా, ఆ వేగంగా వెళ్ళే ట్రాఫిక్ వల్ల మనకు ఇబ్బంది కలగకుండా దాదాపు ఒక కిలోమీటరు దూరం అదనంగా ఉన్న ఇంకో రెండు లేన్లు - నాలుగు లేన్లతో బాటు సమాంతరంగా ఉంటాయి. అంటే కొన్ని కొన్ని దగ్గర్ల ఈ ఎనిమిది లేన్ల రహదారి దాదాపు పన్నెండు లేన్ల రహదారిగా కూడా అవతారం ఎత్తుతుంది అన్నమాట. (ఇటు నాలుగు ప్లస్ రెండు, అటు నాలుగు ప్లస్ రెండు)

* అదే విధంగా ఎగ్జిట్ పాయింట్ రాబోతుండగా దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నుంచే పెద్దపెద్ద సైన్ బోర్డులు మనకు ఆ విషయాన్ని తెలియజేస్తుంటాయి.

ఓ అయిదు వందల మీటర్ల దూరం నుంచి  రహదారి మరింత విశాలమవుతుంది. అంటే ఆ ఫలాన ఎగ్జిట్ పాయింట్ దగ్గర దిగవలసిన వాహనం చక్కగా ఈ విశాలమైన ఎక్ట్ర్సా రహదారిలోకి వచ్చేసి నెమ్మదిగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి దిగి వచ్చేయవచ్చు

* ఔటర్ రింగ్ రోడ్డుకి సమాంతరంగా అటూ ఇటూ కూడా సర్వీస్ రోడ్ పేరిట విశాలమైన మామూలు రహదారులు వెళుతూ ఉంటాయి. వీటికి టోల్ ఏమీ ఉండదు. టోల్ వద్దు అనుకునే వారు హాయిగా ఆ సర్వీస్ రోడ్డు మీద వెళ్ళవచ్చు. కాకపోతె వారికి రోడ్ జంక్షన్‍లు వస్తూ ఉంటాయి. అటు, ఇటూ ఉండే సర్వీస్ రోడ్లని అనుసంధానిస్తూ, ఔటర్ రింగ్ రోడ్డు కింద నుంచి ప్రతి కిలోమీటర్ కి ఒక సారి అండర్ పాస్ ల నిర్మాణం ఉంది

* కొంతమంది ఈ రోడ్డు మీద ప్రమాదాలు ఎక్కువండీ అనీ అంటుంటారు.

*అదే విధంగా కొన్ని వార్తా పత్రికలు రక్తపుటేర్లు ప్రవహిస్తున్న ఔటర్ రింగ్ రోడ్ అని శీర్షికలు పెట్టి వార్తలు వ్రాస్తుంటాయి. ఇది కొంత మేరకు వాస్తవమే కానీ, నిర్మాణ పరంగా కానీ , నిర్వాహణ పరంగా కానీ ఒక ఎక్స్‌ప్రెస్ హైవేని ఇంతకన్నా అద్భుతంగా ఎవ్వరూ కొనసాగించలేరు. బాధ్యతారాహిత్యంతో నడిపే డ్రైవర్ల వల్లనే ఇప్పటిదాకా జరిగిన ప్రమాదాలన్నీ అని తెలుస్తోంది.  నూరు కిలోమీటర్లు మేగ్జిమం స్పీడ్ అని నియయం పెట్టినా కూడా దాన్ని తుంగల్లో తొక్కి నూటాయాభై  స్పీడ్ పోవడం, రహదారి నియమనిబంధనల్ని గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా లేన్ చేంజింగ్ తో నడపడం, మద్యపానం చేసి నడపడం ఇవన్నీ ప్రమాదాలకి కారణాలు. దీనికి అవుటర్ రింగ్ రోడ్ యొక్క లోపం ఎంతమాత్రం లేదని నేను ఘంటాపదంగా చెప్పగలను.

* మేము ఖచ్చితంగా ప్రమాదానికి గురవుతాము అని బలమైన నిర్ణయం తిస్కుని వచ్చే వారే ఇక్కడ ప్రమాదానికి గురవుతారు తప్పనిచ్చి రోడ్ నియమాలు పాటించే వారికి ఇది స్వర్గ ధామం.

* అదే విధంగా  బైకు రేసులు ఈ రోడ్ మీద పెట్టుకుని కొందరు ప్రాణాలకి తెచ్చుకుంటే ఎవరిది తప్పు? ఈ రోడ్ నిర్మాణం దశల వారిగా జరిగింది. ఇంకా నిర్మాణం పూర్తి కాని రోజుల్లో నిబంధనల్ని తుంగల్లో తొక్కి కొందరు ప్రముఖుల పిల్లలు ఈ రోడ్ మీదకి బైకులపై వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు ప్రతి ఎంట్రీ పాయింట్ వద్ద బలమైన టోల్ సిస్టం , నిఘా ఉండటం వల్ల ఇలాంటి ప్రమాదాలకి ఆస్కారం లేదు.

ఏ రకంగా తీస్కున్నా కూడా హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు దేశంలోకెల్లా అనేక విషయాలలో తలమానికంగా నిలుస్తుందనటంలో సందేహం లేదు.

ముంబాయి-పుణే ఎక్స్‌ప్రెస్ హైవే ని దీనితో ఇంచుమించు పోల్చవచ్చు. అయినప్పటికీ అది ఆరు లేన్ల హైవే మాత్రమే. కొన్ని కొన్ని దగ్గర్ల అది పదిలేన్ల హైవే గా ఉన్నప్పటికి హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ హైవేనే గొప్పటెక్నాలజీ కి తార్కాణంగా నిపుణులు పేర్కొంటారు.

పర్యాటక రంగం కోణంలో చూస్తే , దీని నిర్నాణంలో టన్నెల్స్ లేకపోవటం ఆకర్షణ పరంగా ఒక లోపం. అంతకు మించి నాకేమి లోపాలు కనపడలేదు దీని నిర్నాణంలో. దీనికి నెహ్రూ గారి పేరు పెట్టటమే నాకు పంటి కింద రాయిలా తోస్తుంది.

 

స్వస్తి.

డా.రాయపెద్ది వివేకానంద్

హైదరాబాద్

 

Outer ring road published in facebook on 30th March

https://m.facebook.com/story.php?story_fbid=10222248722067128&id=1237660552

 

                                                                                                                                                                          

No comments:

Post a Comment