Sunday, April 24, 2022

“స్ఫూర్తిని ఇచ్చే నాగమోహన్ ప్రస్థానం”

 

“స్ఫూర్తిని ఇచ్చే నాగమోహన్ ప్రస్థానం”

ఒక ఙ్జాపకం-61

- డా.రాయపెద్ది వివేకానంద్



--------

 

"చూచి నేర్చుకోండయ్యా!" ఈ మాటలు నా ఆధ్యాత్మిక గురువు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి బోధనల్లో ఒకటి.

అదే విధంగా వ్యక్తిత్వ వికాస శిక్షకులు బ్రియాన్ ట్రేసీ, జిమ్ రాన్లు కూడా తరచు చెప్పే మాట ఇదే.

అంటే ఒక విజేత జీవితాన్ని చూసి అతను చేసిన పనులను మనం కూడా ఫాలో అయితే విజేతగా ఎదగవచ్చు అనేది ఈ మాటల సారం.

****

"మైలేజి ఎంతిస్తోంది?" అడిగాను అతన్ని.

ఆ రోజుల్లో హీరో హోండా మోటార్ సైకిల్ నడిపే వ్యక్తిని అందరూ అడిగే ప్రశ్న అది.

కానీ అతనిచ్చిన సమాధానం విని నాకు పొలమారింది. ఖంగు తిన్నాను అతని సమాధానం విని.

అతనేమన్నా వెటకారంగా మాట్లాడుతున్నాడేమో అన్నట్టు కంగారుగా చూశాను.

ఎవరా వ్యక్తి, ఏమా కథ అని అనుకుంటున్నారా. చదవండి మీకే తెలుస్తుంది.

*****

ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను ఈ మాటలన్నీ అంటే, నా మిత్రుడు నాగమోహన్ జెయినిల్ ఫార్మా అనే ఒక చిన్న కంపెనీలో, సాధారణ మెడికల్ రెప్రజెంటేటివ్ గా గుంటూరులో జీవితాన్ని మొదలెట్టి, ఇప్పుడు భారతదేశంలోని నెంబర్ వన్ స్థానంలో ఉన్న కంపెనీ సన్ ఫార్మా వారి ’అవెస్టా’ డివిజన్ కి ఆల్ ఇండియా హెడ్ గా ఉన్నాడంటే, ఆ ప్రస్థానం స్ఫూర్తిదాయకం కద.

అతనేదో ఐఐఎంలోనో లేక ఏదో ప్రీమియర్ బీ స్కూల్స్‌లోనే చదువుకోలేదు కూడా. సాధారణ తెలుగు మీడియం విద్యార్థిగా మొదలుపెట్టి బీ.ఎస్సీ చదివి ఎంబీఏ  చదువుకున్నాడు అందరిలాగానే.

కానీ అతని అనూహ్యామైన విజయానికి ఏమిటి కారణం అనే దిశగా చూద్దాం. అది ఎంతో స్పూర్తిదాయకంగా ఉంటుంది.

అతని ఫార్ములా ఒకటే- కష్టపడి పనిచేయటం.

అవరోధాల్ని అవకాశాలుగా మలచుకోవటం.

అతని గూర్చి ఓ నాలుగు మాటలు చెబుతా. ఇవి యువతకి ఎంతైనా స్పూర్తిని ఇస్తాయనటంలో సందేహం లేదు.

****

కొత్తగా నేను మెడికల్ రెప్రజెంటేటివ్‍గా ’ఇప్కా ’లో కడప పట్టణంలో పని చేస్తున్న రోజులవి.

అప్పుడే డాక్టర్ ఈవీ రామమోహన రెడ్డి గారిని కలిశాక ఆ పక్కనే ఉన్న ఉడుపి సెల్ఫ్ సర్వీస్ రెస్టారెంట్ లో టీ త్రాగుతూ ఉన్నాను.

ఉదయం దాదాపు పదకొండున్నర అయి ఉంటుంది.

కడప ఎండలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. ఊండుండి పల్చగా వీస్తున్న వేడి గాలి. ఆ వేడిమికి  చెమటలు ధారాపాతంగా కారిపోతున్నాయి.

ఆ రెస్టారెంట్ ముందు ఎండలో నా కైనెటిక్ హోండా వెండిరంగులో మిల మిల మెరుస్తోంది. దాని మైలేజి గూర్చే నా దిగులల్లా. ఎక్కడ 100 సీసీ మోటార్ సైకిల్ కనపడ్డా దాన్ని చూసేవాడిని.

అది మండుటెండ గానీ, జడివాన గానీ సర్వకాల సర్వావస్థల యందు కాఫీ,టీలు  త్రాగటం ఒక ప్రధాన విధిగా ఉండేది నాకు ఆ రోజుల్లో.

హోటల్ బయట  వరండాలో గుండ్రంగా ఉండే నిలువెత్తు టేబుల్ వేసి ఉంటారు. దాని పక్కన నిలబడి టీ త్రాగుతూ రోడ్ వంక చూస్తూ ఉంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేము. ఇంకా నాకు పెద్దగా పరిచయాలు ఏర్పడలేదు. టీ త్రాగుతూ ఒక్కణ్ణే రోడ్ జంక్షన్ వైపు చూస్తున్నాను.

కడప పట్టణం భలే గమ్మత్తుగా ఉంటుంది.

ప్రముఖ జంక్షన్ గా భావింపబడే ఏడు రోడ్ల జంక్షన్ కి అతి దగ్గరలోనే అనేక చిన్న చిన్న రోడ్ జంక్షన్లు ఉంటాయి అలాంటి వాటిలో ఒకటి  ఈ చిన్ని జంక్షన్.  ఈ జంక్షన్ నుంచి ఒక రోడ్ క్రిష్టియన్ లేన్‍కి, ఇంకో రోడ్ ఏడు రోడ్ల వైపుకి, మరో రోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి, ఒక రోడ్ ఎస్ ఎఫ్ స్ట్రీట్‍కి, మరో రోడ్ రమేష్ థియేటర్ వైపుకి దారి తీస్తాయి. (అప్పట్లో ప్రభుత్వ ఆసుపత్రి ఈ జంక్షన్ దగ్గర్లోనే ఉండేది. ఇప్పుడు రిమ్స్ గా మారి తిరుపతి రోడ్డులొ నగర శివార్లలోకి మారిందట. )

ఈ క్రిష్టియన్ లేన్ కి చుట్టు పక్కల ఉన్న రోడ్లన్నీ కడప పట్టణంలోని ప్రముఖ డాక్టర్లకి చిరునామా అని చెప్పవచ్చు.

ఈ రోడ్ జంక్షన్ పక్కన ఉన్న రెస్టారెంట్ ముందరే నేను నిలబడి తేనీరు సేవిస్తున్నాను.

అప్పుడు నా దృష్టిని ఆకర్షించాడు ఓ యువకుడు.ఎర్రరంగు హీరో హోండ మోటార్ సైకిల్ పై వచ్చి నా కైనెటిక్ హోండా పక్కనే ఆపి తను కూడా అదే రెస్టారెంట్ కి టీ త్రాగటానికి వచ్చాడు. అతను మరీ పొడగరి కాదు. అతని నడకలో ఆత్మ విశ్వాసం కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది.

అతన్ని చూడగానే మెడికల్ రెప్రజెంటేటివ్ అని అర్థం అయిపోయింది బండికి తగిలించి ఉన్న మెడికల్ కిట్గా వ్యవహరింపబడే తోలు బ్యాగును చూడంగానే.

అతను టీ తెచ్చుకుని నా పక్కనే నిలబడ్డాడు.

ఈ బయట ఉన్న టేబుళ్ళయొక్క ప్రాధమిక ఉద్దేశం- ధూమపానం అలవాటున్న వ్యక్తులు బయటే సిగరెట్, టీ రెండు త్రాగి వెళ్ళి పోవాలని. నాకు సిగరెట్ త్రాగే అలవాటు లేకున్నా రోడ్డు చూస్తూ టీ త్రాగటం ఇష్టం అందుకే అక్కడ నిలబడి టీ త్రాగుతున్నాను.

ఈ యువకుడికి  సిగరెట్ త్రాగే అలవాటుందేమో, ఇక  సిగరెట్ తీసి త్రాగటం మొదలెడతాడు అనుకున్నాను. కానీ అతను కూడా నాలాగే సిగరెట్ త్రాగే అలవాటు లేని వాడనుకుంటా చక్కగా టీ మాత్రమే తాగుతున్నాడు.

అయ్యప్ప భక్తులు ఒకరికొకరు పరిచయం లేకున్నా వారి నల్ల డ్రస్ చూసి గ్రీట్ చేసుకుంటారు కద, అదే విధంగా గడ్డంపెంచుకుని టోపీలు పెట్టుకున్న సాహెబ్ గార్లు అపరిచితులైనా సరే ఒకరినొకరు పలకరించుకుంటారు కద,  అలాగే మా మెడికల్ రెప్రజెంటేటివ్స్ మధ్య కూడా అలాటి అలిఖిత ఒప్పందం ఒకటి అమల్లో ఉండేది.

పరిచయం ఉన్నా లేకున్నా చిరునవ్వుతో గ్రీట్ చేసుకునేవారం.

’హలో’ అతను నన్ను చూసి పరిచయ పూర్వకంగా నవ్వుతూ చేయి కలిపాడు.

అతనే నాగమోహన్ మన కథా నాయకుడు.

మా మొదటి పరిచయంలోనే అతను భేషజాలు లెని వ్యక్తి అని, చక్కటి స్నేహశీలి అని, నేను అంచనా వేయగలిగాను. అదేలాగంటారా చెబుతాను. ఉత్తిగా చిరునవ్వు చిందిస్తారు కానీ, పరిచయం పెంచుకోవాలి అంటే, ముందుగా ఎదుటివ్ రెప్‍ని పలకరించే ముందు సాధారణంగా మెడికల్ రెప్రజెంటేటివ్స్ చేసే పని అతని మెడికల్ కిట్ పై నున్న కంపెనీ లోగోని చూసి అతనే కంపెనీనో తేల్చుకుని అది ఒక స్థాయి గల కంపెనీ అయితేనే చేయి చాచి పరిచయానికి నాంది పలుకుతారు. నేను ఆ కొద్ది రోజుల అనుభవంలో కనుగొన్న విషయాల్లో అదొకటి.

నిజానికి నేను పని చేస్తున్న ’ఇప్కా’  కంపెనీ దేశంలోని మొదటి పది అత్యుత్తమ కంపెనీలలో ఒకటి అప్పటికే. కానీ అతను నా కంపెనీ పేరు తెలుసుకుని పరిచయం పెంచుకునే ప్రయత్నం చేశాడు అని చెప్పలేం. ఎందుకంటే, నా మెడికల్ కిట్ అప్పుడు బయట ఉన్న నా స్కూటర్ కి ముందు భాగంలో ఉంది, దానిపై లోగో కనిపించే అవకాశం లేదు.

అతని పేరు నాగమోహన్ అని బీఈ (BE- Biological Evans) కంపెనీ రెప్ గా పని చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు.

’ఓ! బీఈ నాగమోహన్ అంటే మీరేనా’ అని నేను ఆనందాశ్చార్యాలతో కళ్ళు పెద్దవి చేసి చూశాను అతని వంక. నా ఆశ్చర్యానికి కారణం లేకపోలేదు.  ఆ కొద్ది రోజుల ఫీల్డ్ వర్క్‌లో అతని కంపెనీ ప్రాడక్ట్స్ నాకు అనేకం చాలా దగ్గర్ల తారసపడ్డాయి, అతని గూర్చి చాలా మంది మంచిగా చెప్పారు, ఇంకొందరైతే ఒకడుగు ముందుకేసి, ’కొత్తగా కెరియర్ ప్రారంభించావా, గుడ్, బీఈ నాగమోహన్ని ఆదర్శంగా తీసుకో’ అని చెప్పారు.

మన కడప మార్కెట్ లో కష్టపడి పనిచేస్తున్న కొందరు వ్యక్తులలో నాగమోహన్ ఒకరు అని, అలాంటి వ్యక్తులతో సాన్నిహిత్యం పెంచుకోమని కూడా సలహా ఇచ్చి ఉన్నారు కొందరు’

అందువల్ల ఇంచుమించు ఒక సెలబ్రిటీ స్థాయిలో  ఆ పేరు నా మనసులో నమోదు అయి ఉంది అప్పటికే.

అదే మాట చెప్పాను అతనితో. అతను కాస్త మొహమాట పడ్డాడు.

ఇతన్ని మెడికల్ షాప్స్ వాళ్ళు ముద్దుగా తుఫాన్ అని పిలుచుకునే వారు.

’ఏమీ లేదు బాస్ కష్టపడి పని చేయటమొక్కటే నాకు తెలిసింది’ దానికి పోయి ఇంత ప్రశంసలు అవసరమా అని తేలిగ్గా కొట్టి పడేశాడు ఆ విషయాన్ని.

నిర్మొహమాటంగా చెప్పాలి అంటే,  అతని కంపెనీ ’బీఈ’ అనేది ఏదైతే ఉందో, అది మంచి కంపెనీనే కానీ దేశవ్యాప్త రాంకింగ్, టర్నోవర్, ఉద్యోగుల సంఖ్య తదితర అంశాల ఆధారంగా చూస్తే మరీ పెద్దదేంకాదు.  కానీ మన తెలుగు నేలకి గర్వకారణమైన పెద్ద కంపెనీలలో ఒకటి.

ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, కడపలో బీఈ వైభవం చూస్తే ఈ రంగం లోతులు తెలియని కొత్త వారికి ఇది చాలా పెద్ద కంపెనీ ఏమో అనే అభిప్రాయం కల్గుతుంది. దాని వెనుక ఒకే ఒక కారణం ఆ రోజుల్లో ఈ కుర్రాడు చేసిన కృషి అని నిర్వివాదంగా చెప్పవచ్చు.

హెచ్చార్ మేనేజర్లు చెప్పే మాట అదే. ఫీల్డ్‌లో మీ ప్రవర్తన ద్వారా కంపెనీకి ఒక ఇమేజి, గుర్తింపు ఏర్పడుతుంది.

’యూ ఆర్ ది ఫేస్ ఆఫ్ ది కంపెనీ’ అనేది కంపెనీ యాజమాన్యం చెప్పే మొదటి మాట.

క్షేత్ర స్థాయిలో నీకు తారస పడే ఒక వ్యక్తి నీ కంపెనీ గూర్చి మంచిగా కానీ చెడుగా కానీ ఒక అభిప్రాయం ఏర్పరచుకోవటానికి నీ యొక్క ప్రవర్తన మాత్రమే కారణం. ఎక్కడో బొంబాయిలోనే, అమెరికాలోనే ఉండే కంపెనీ ఎలాంటిది, ఆ కంపెనీ యొక్క స్థాయి ఏమిటి అనే  వివరాలు క్షేత్ర స్థాయిలో ఉండే ప్రజలకి  తెలియదు కద. కాబట్టి కంపెనీలో ఆ పర్టిక్యులర్ జిల్లాకి సంబంధించినంతవరకు నువ్వే ఫేస్ ఆఫ్ ది కంపెనీ.

ఇవి ఏ హెచ్చార్ మేనేజర్ అయినా చెప్పే సాధారణమైన మాటలే. కానీ ఈ మాటల్ని నిజం చేసి చూపించిన ఘనత మన నాగమోహన్‌దే.

***

అప్పట్లో హీరో హోండా స్ప్లెండర్, ఇండ్ (టీవీఎస్)సుజుకీ, యమహా ఆరెక్స్ 100, కవసాకి బజాజ్ 4s  తదితర మోటార్ సైకిళ్ళు ఎన్ని ఉన్నప్పటికి హీరోహోండా బండ్లు మైలేజి ఎక్కువ ఇస్తాయని ఒక నమ్మకం ఉండేది.

 హీరో హోండా కంపెనీ వారు హోండా తమ నుంచి విడిపోతే స్వంతంగా బ్రతకడానికి సిద్ధంగా ఉండటానికా అన్నట్టు హొండా అన్న పేరుని ఎక్కువ వాడకుండా స్ప్లెండర్ అనే మోడల్ మీద తమ సర్వశక్తులని ఒడ్డి ప్రమోట్ చేస్తున్న రోజులవి.

మన నాగమోహన్ మాత్రం పాత మోడల్ అయిన హీరోహోండా సీడీ 100  మోడల్నే వాడుతూ కనిపించాడు. అది రెడ్ కలర్ లో ఉండేది నాకు బాగా గుర్తు.

హీరో హోండా యజమానుల్ని అందరూ అడిగే ప్రశ్నే నేను యధాలాపంగా అడిగేశాను "మైలేజి ఎంతిస్తోంది?"

కానీ అతనిచ్చిన సమాధానం విని నాకు పొలమారింది. ఖంగు తిన్నాను అతని సమాధానం విని.

అతనేమన్నా వెటకారంగా మాట్లాడుతున్నాడేమో అన్నట్టు కంగారుగా చూశాను. ఇంతకూ అతనేమి చెప్పాడో మీరు కూడా వినండి.

"నేను మైలేజి గురించి ఎప్పుడూ ఆలోచించను ఆనంద్! జస్ట్ ఫిల్ ఇట్, షట్ ఇట్, ఫర్గెట్ ఇట్. నా ఆలోచనంతా వర్క్ గూర్చే ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని గూర్చి ఆలోచించను"

’ఫిల్ ఇట్,

షట్ ఇట్,

ఫర్గెట్ ఇట్’ అనేది అప్పట్లో హీరోహోండా వారి ఫేమస్ స్లోగన్.

నేను అతని వంక అయోమయంగా చూస్తూ వెర్రి నవ్వు నవ్వాను.

అతనికి ఓ క్షణంలో అర్థం అయిపోయింది, తన మాటలవల్ల ఎదుటివారు హర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని.

అప్పుడు నా భుజం మీద చేయి వేసి చెప్పాడు ’సారీ ఆనంద్. ఏదో గొప్ప కోసం చెప్పలేదు అలా. నిజంగానే నేను ఫాలో అవుతున్న పద్దతి అది. నాకసలు ఇవన్నీ చూసుకోవటానికి టైం ఉండదు. నందలూరు, రాజంపేట, కోడూరు, ప్రొద్దటూరు ఇలా ఒకటేమిటి అన్నీ ఊర్లూ ఈ బండి మీదనే తిరుగేస్తా. ఎక్కడ పెట్రోల్ అయిపోతే అక్కడ పట్టించేస్తా,మళ్ళీ నా పనిలో నేను మునిగిపోతా’

’హే కమాన్! నో వర్రీస్’ అనేసి నేను కూడా సర్దుకున్నాను.

అదీ మా మొదటి పరిచయం.

ఆ తర్వాత అతన్ని నాకు తెలియకుండానే అబ్జర్వ్ చేయటం మొదలెట్టాను.

గణాధ్యక్ష పదవికి వినాయకుడితో స్కందుడు పోటీకి వస్తే, శివపార్వతులు వారిద్దరికి భూలోకంలోని తీర్థాలన్నీ చుట్టి రావాలని ఓ పోటీ పెడతారు కద. ఆ కథ మీకు తెలిసిందే. కుమార స్వామి ఎక్కడికి వెళ్ళినా, అప్పటికే వినాయకుడు అక్కడికి వెళ్ళి వెనక్కి తిరిగి వస్తూ కనపడుతాడు కద. 

నాకు అతనితో ఇంచుమించు అలాంటి అనుభవమే ఎదురయ్యేది ఆ రోజుల్లో.

అతనికి నాకు ప్రత్యక్ష పోటీ ఏమీ లేకున్నా,  ప్రతి ఊరికి నేను వెళ్ళే సరికి ఆయా డాక్టర్ల ఛాంబర్స్‌లో అతని పోస్టర్లు, సాంపిల్స్, స్టికర్స్ నాకు స్వాగతం పలికేవి.

రైల్వే కోడూరు, రాజంపేట, పులివెందుల, నందలూరు, పోరు మామిళ్ళ, మైదుకూరు, రాయచోటి, ఎర్రగుంట్ల, ప్రొద్దటురు, జమ్మలమడుగు ఇలా ఎక్కడికి వెళ్ళీనా అతనక్కడికి అందాకే వచ్చి పని చేసి వెళ్ళాడన్న ముద్రలు కనిపించేవి.

ఒక్కోసారి ప్రొద్దటూరులో బస చేసినప్పుడు కాస్త కుదురుగా కబుర్లు చెప్పుకోటానికి వీలయ్యేది.

****

ఆ తరువాత కొద్ది నెలలకే అతనికి పదోన్నతి మీద కేరళకి బదిలి అయింది. అతి తక్కువ ఎక్స్పీరెయెన్స్ తో బీఈలో ప్రమోషన్ పొందిన వ్యక్తిగా ఇది ఒక రికార్డ్ అని అతనే చెప్పాడు ఇటీవల.

పదోన్నతి, చక్కటి ప్రకృతికి ఆలవాలమయిన కేరళ లాంటి పదాలువినటానికి బాగున్నా అది ఒకరకంగా  అతని ముందున్న పెనుసవాల్ అనిచెప్పవచ్చు.

ఎందుకంటే ఒక మేనేజర్గా కేరళలో విజయవంతంగా పని చేయటం  అనేది దాదాపు అసాధ్యం. అక్కడి ఆవేశపరులైన ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు మూడు హడ్తాళ్ళు, నాలుగు ఘెరావ్లు అన్నట్టు మేనేజర్ పనికి అడ్డు తగులుతుంటారు. మెమొరాండంలు స్వీకరించమంటారు. ఫీల్డ్ వర్క్ చేయనివ్వరు. ఏదో ఒక ఆటంకం కల్పిస్తారు.

’ఎందుకు ఈ ప్రమోషన్ పొందామురా భగవంతుడా’ అని తిట్టుకునేలాంటి పరిస్థితులు కల్పిస్తారు.

దేశంలో ఎక్కడో ఏదో కంపెనీ ఎవరికో ఇబ్బంది కలిగిస్తే, ఇక్కడ కేరళలో మేనేజర్ల ని ఘెరావ్ చేస్తారు.

మొహమాటం లేకుండా చెప్పాలి అంటే, చాలా మంది అతను అతి త్వరలోనే బ్రతుకు జీవుడా అని, గోడకు కొట్టిన బంతిలా వెనుకకి వస్తాడు అని భావించారు.

ఈ లోగా నాకు కూడా ప్రమోషన్ మీద కోయంబత్తూర్ కి ట్రాన్స్పర్ కావటం నా కెరియర్ లో నేను బిజీ అయిపోవడంతో అతనితో టచ్ లో ఉండటం కుదరలేదు.

వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాలు ఉండేవి కావు ఆ రోజుల్లో.

ఇటీవల అతనే నా నెంబర్ పాత మిత్రులద్వారా సంపాయింది మమ్మల్నందర్నీ మళ్ళీ ఓ వాట్సప్ గ్రూప్ లో పెట్టాడు.

ఆ విధంగా అతని గూర్చి తెలుసుకోవటానికి వీలయింది మళ్ళీ.

****

చెప్పాను కద, నాకు అతని మీద నమ్మకం  ఉండేది అని. అతను ఆ నమ్మకాన్ని వమ్ము కానివ్వలేదు.

అదేదో సినిమాలో అల్లు అర్జున్ ఒక డైలాగు చెబుతాడు చూడండి ’నేను తెలుగు లెక్క, ఆడా ఉంటా ఈడా ఉంటా’ అని. సరిగ్గా అదే విధంగా, అతను కడపలో ఉండగా కంపెనీ పనులెంత చక్కగాచేసేవాడో, ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్ లో కూడా అంత చురుకుగా పాల్గొనే వాడు. తనే స్వయంగా ధర్నాలలో పాల్గొనేవాడు. ఈ క్రియాశీలక అనుభవం కారణంగా కావచ్చు, అతను కేరళలో కూడా విజేతగా నిలిచాడు.

ఆ తర్వాత ’టీడీపీఎల్’ అనే తమిళనాడుకి చెందిన ఒక కంపెనీలో  చేరి మరో పదోన్నతిపై హైదరాబాద్‌కి వచ్చాడు.

కష్టపడేవ్యక్తికి అదృష్టం కూడా కల్సి వస్తుంది అంటారు చూడండి, అలాగా ఈ టీడీపీఎల్ అనే కంపెనీని ఇండియాలో అతి వేగంగా ఎదుగుతున్న సన్ ఫార్మా వారు కొనుగోలు చేయటం జరిగింది. ఈ విధంగా అతను ఆటోమేటిగ్గా సన్ ఫార్మా ఎంప్లాయి గా మారిపోవటం జరిగిపోయాయి.

ఆ తరువాత అతను సన్ ఫార్మాలో జోనల్ మేనేజర్ హోదాలో మరో పదోన్నతి పొంది కలకత్తాకి వెళ్ళాడు. మేనేజర్లకి సింహ స్వప్నం, యూనియన్ ఆక్టివిస్టులకి స్వర్గధామం అని చెప్పుకోదగ్గ పశ్చిమబెంగాల్ కి ప్రమోషన్ రూపంలో అతనికి ట్రాన్స్ఫర్ అయింది.

ఈ పశ్చిమ బెంగాల్ మార్కెట్ కేరళకి తాత వంటిది యూనియన్ యాక్టివిటీస్ విషయంలో.

ఇందాక చెప్పుకున్నట్టు అతను తనకు వచ్చిన కష్టసాధ్యమయిన సవాళ్ళని అవకాశాలుగా మలచుకుని విజేతగా నిలబడ్డాడు. కేరళలో, పశ్చిమబెంగాల్ రాష్టాలలో మేనేజర్ హోదాలో విజేతగా నిలబడటం ఆషామాషికాదు.

హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ లతో పాటు మానవీయ విలువలతో కూడిన నాయకత్వ లక్షణాలు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటే కానీ ఇది సాధ్యం కాదు.

ఎమోషనల్ కోషంట్ (ఈక్యూ), ఇంటెలిజెన్స్ కోషంట్( ఐక్యూ)  ఈ రెండిటితో పాటు ఆధ్యాత్మిక ధోరణి (స్పిరుచ్యువల్ కోషంట్ )కూడా సమృద్దిగా ఉంటేనే ఇది సుసాధ్యం అవుతుంది. ఎవరినీ విరోధులుగా భావించకుండా అందరినీ తనతో కలుపుకుపోగల్గిన గుణం ఈ విజయానికి కారణం.

పూర్వం ఘంటశాల గారి పాట ఉంది కద, ’ద్వేషించే కూటమిలోనా నిలచి, ప్రేమించే మనిషే కద మనిషి’ అన్నట్టు.

ఈ రెండు రాష్ట్రాల యూనియన్ ఆక్టివిటీస్ని కించపరచటం నా ఉద్దేశం కాదు కానీ, వారు తత్వతః పై అధికారిని ఎదిరించి సహాయ నిరాకరణం చేయటమే తమ విధి అన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఇది నేను ప్రత్యక్ష్జంగా చవిచూశాను.

ఆ తర్వాత అతను ఎకా ఎకి ఆల్ ఇండియా హెడ్ గా అదే సన్ ఫార్మాలో ఆప్థాల్మిక్ డివిజన్  లో ముంబాయి కేంద్ర స్థానంగా పని చేస్తున్నాడు ప్రస్తుతం.

****

నాగమోహన్ వయస్సు  ప్రస్తుతం యాభై ఆరు సంవత్సరాలు. భార్య శ్రీమతి బబిత, ఒకే కొడుకు విహార్ భరధ్వాజలతో ముంబాయిలో ఉంటున్నారు. విహార్ ప్రస్తుతం ఎంబీబీఎస్ పూర్తి చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు

నాగమోహన్ తండ్రి  శ్రీ కృష్ణమూర్తిగారు పంచాయితీ ఆఫీస్‍లో ఒక చిన్న గ్రామంలోగుమాస్తాగా పనిచేసే వారు, తల్లి శ్రీమతి రాజ్యలక్ష్మీ గారు.

తమ కొడుకు ఈ స్థాయికి చేరుకుంటారని వారు ఎన్నడూ ఊహించి ఉండరు.

***

నాగ మోహన్ లో పత్యేకతలు

కడపలో అప్పట్లో అతని  రూం మేట్ బిడిల్ సాయర్ రెప్ ప్రసాద్ మాటల్లో విందాం

"అతను తన జీవితాన్ని చాలా ప్లాన్డ్ గా రూపుదిద్దుకోవడంలో విశ్వసిస్తాడు. నెల రోజుల ముందుగానే తన టూర్ ప్రోంగ్రాంని రూపుదిద్దుకునే వాడు. ఆ తరువాత ఇక ఆరు నూరయినా నూరు ఆరయినా ఆ ప్లాన్ ని మీరి ప్రవర్తించేవాడు కాదు"

 

అతను విశ్వసించే విషయాలు

-హార్డ్ వర్క్

-స్మార్ట్ వర్క్

-ప్లానింగ్

-గోల్ సెట్టింగ్

-అచీవింగ్ ది గోల్

-డ్రీం బిగ్ -నెవర్ సెటిల్ విత్ ఆవరేజ్ రిజల్ట్స్.

***

ఇదండీ ఇతని ప్రస్థానం .

 

Published in Sanchika.com  dynamic web magazine

The link: https://sanchika.com/sphoortini-ichche-nagamohan-prasthanam/

 

 

 

ఔటర్ రింగ్ రోడ్ -హైదరాబాద్

 

ఔటర్ రింగ్ రోడ్ -హైదరాబాద్

ఒక ఙ్జాపకం -62


ఎనభైవ దశకం వినియోగ దారుల ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న కాలం. ఆ రోజుల్లోనే వినియోగదారుల ఫోరం అనే పేరిట ప్రభుత్వం ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేసింది.

ఆ రోజుల్లో ఈనాడు దినపత్రిక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రత్యేకవ్యాసాలు కూడా వ్రాసేది. ఆ రోజుల్లో చదివిన వ్యాసాలలో నాకు బాగా గుర్తుండిపోయిన ఒక వాక్యం-

"నీకు ఏదైనా సంస్థ అందించే సేవలు (సర్వీసెస్) నచ్చకుంటే స్పందించి ఉద్యమించటం ఎంత ముఖ్యమో, అదే విధంగా ఏ సంస్థ అయినా చక్కటి సేవలు అందిస్తున్నప్పుడు వారిని ప్రశంసించటం కూడా అంతే ముఖ్యం"

ఆ వాక్యం అందించిన స్ఫూర్తితోనే ఈ వ్యాసం వ్రాయటం జరిగింది.

నాది హైదరాబాద్ నగరం అని సగర్వంగా చెప్పుకోవటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటన్నింటిలోనికి తలమానికమైనది ఔటర్ రింగ్ రోడ్ అని నిస్సందేహంగా చెప్పగలను. దేశంలో ప్రతి రోడ్ ఈ విధంగా ఉంటే ఎంతబాగుంటుంది కద అనిపిస్తుంది దీనిపై ప్రయాణించినప్పుడల్లా.

ఇది ఎనిమిది వరుసల (లేన్ల) సూపర్ ఎక్స్‌ప్రెస్ వే.  నేను ఈ వ్యాసం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ గూర్చి వివరాలు తెలపటానికి వ్రాయటం లేదు. వ్యాసంలో భాగంగా ఈ ఎక్స్‌ప్రెస్ వే గూర్చి సందర్భొచితంగా వివరాలు కూడా తెలుపుతాను.

మరి ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం ఏమిటంటె, మనిషి ప్రాణానికి, భద్రతకి ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఎంత ప్రాముఖ్యతని ఇస్తోందో తెలియజేయటం నా ప్రధాన ఉద్దేశం. ఈ రోడ్డుపై ప్రయాణించినప్పుడు నాకు కలిగే ఆనందాన్ని నలుగురికి తెలపటం నా ముఖ్యోద్దేశం.  ప్రయాణంలో సౌఖ్యానికి, వేగానికి ఎంతో పెద్ద పీట వేశారు వీరు. రోడ్డు నిర్మాణంలో చక్కటి సాంకేతికని వాడారు. చక్కటి అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న ఇలాంటి రోడ్ మన నగరంలో ఉండటం, నామమాత్ర రుసుముతో మనకందరికీ అందుబాటులో ఉండటం మన అదృష్టం అనిపించింది.

ముందుగా NH-44  గూర్చి వ్రాసి ఔటర్ రింగ్ రోడ్డు విషయానికి వస్తాను:

ఈ NH-44  దేశంలో కెల్లా అతి పొడవైన జాతీయ రహదారి. జమ్మూ కశ్మీర్ నుంచి, కన్యాకుమారి దాక విస్తరించి ఉంటుంది ఈ హైవే.

నేను హైదరాబాద్ నుంచి కర్నూలు తరచూ వెళుతుంటాను. ఈ దారిలో కర్నూలు దాటి నేరుగా కన్యాకుమారి దాకా వెళ్ళచ్చు. నగరానికి ఇటు వేపు ఈ దారిలో బాసర వరకు వెళ్ళాను తరచుగా.

మొదట ఎన్‍హెచ్ 7 గా ఉన్న ఈ నేషనల్ హైవే ఆ తరువాత ఎన్‍హెచ్ 44 గా మారింది. నేను తరచూ ఈ  NH-44 మీద ప్రయాణిస్తుంటాను. దీని గూర్చి కొన్ని విశేషాలు ముందుగా  వ్రాసి మన ఔటర్ రింగ్ రోడ్ విషయానికి వస్తాను. మొదట్లో  ఈ NH 7 (ఇప్పుడు 44) రోడ్ మధ్యలో మీడియన్ కూడా ఏమీ లేకుండా ఉత్తిగా టూ లేన్ హైవే గా ఉండేది. తూతూ మంత్రంగా తెల్లగీతలు వేసి ఉంచేవారు.

నేను కర్నూల్లో పదవతరగతి చదివే వయసు నుంచే నాకు ఎన్ హెచ్ 7 తో అనుబంధం. మిత్రులమంతా కలసి ఆ రోజుల్లో సాయంత్రాలు సైకిళ్ళు వేస్కుని బెంగళూరు రోడ్ లోని, కార్బైడ్స్ ఫాక్టరీ దాకా సరదాగా వెళ్ళే వారం. ఆదివారం వచ్చిందంటే ఇటు జగన్నాద గట్టు (గుట్ట)వైపో, అటు ఎస్‍ఏపీ(SAP) కాంప్ దాటి హైవే పై తుంగభద్ర వంతెన దాటి పసుపుల మలుపు దాకా సరదాగా వెళ్ళే వాళ్ళం.

 ఆ రోడ్ పై వెళ్ళే వివిధ సైజుల నేషనల్ పర్మిట్ లారీలని తెగ ఆశ్చర్యంతో చూసే వాళ్ళం. ఆ రోజుల్లో నేషనల్ పర్మిట్ అనీ, కాంపోజిట్ పర్మిట్ అనీ లారీలకి రకరకాల కలర్ కోడ్ కూడా ఇచ్చేవారు. లారీల కంపెనీలు, వాటి పుట్టుపూర్వోత్తరాలు కూడా తెగ అధ్యయనం చేసేవాడిని ఆ రోజుల్లో.  ఉన్నమాట చెప్పాలంటే పంజాబ్ లారీ డ్రైవర్లన్నా, తమిళనాడుకి చెందిన లారీ డ్రైవర్లన్నా ఒక విధమైన హీరోవర్షిప్ ఉండేది ఆ రోజుల్లొ. మొత్తమ్మీద లారీ డ్రైవర్లందరీ మీద ఒక విధమైన సానుభూతి ఏర్పడింది ఆ రోజుల్లో. నాకున్న ఈ అనధికార ప్రావిణ్యం చూసి, మా వాళ్ళందరూ నేనేదో ఆటోమొబైల్ ఇంజినీర్ అవుతాననుకునేవారు ఆ రోజుల్లో. కానీ ఆ లారీలపట్ల ఆకర్షణ, ప్రేమ అక్కడితో ఆగిపోయింది.  అంతకంటే ముందుకుపోలేదు ఎందుకో.

ఆ తరువాత నేను వృత్తి రిత్యా  దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు తిరిగిన సందర్భాలలో కూడా ఎక్కడోదగ్గర నాకు ఈ NH-44  తారసపడేది. నాకు మళ్ళీ స్వంత ఊరికి వచ్చిన అనుభూతి కలిగేది. పిల్ల తనం గుర్తు వచ్చేది.

ఇటీవల ఈ ఎన్‍హెచ్ 44 కాస్త ఆధునీకరింపబడింది.  మొత్తం 4 లేన్ల రోడ్ గా మార్చారు. ఎదురుగా వచ్చే వాహనాలు వేరే రోడ్ పై వెళతాయి. హైదరాబాద్ నుంచి, కర్నూలు చేరే లోగా మూడు టోల్ గేట్లు వచ్చాయి. రోడ్ మధ్యలో వెడల్పాటి మీడియన్ వచ్చింది. ఎదురుగా వచ్చే వాహనం మనకి ఇబ్బంది కలిగించే ప్రసక్తి లెదు. ప్రయాణం హాయిగా సాగిపోతుంది.

ఇదివరకటి  మీడియన్ కూడా లేని, టూ లేన్ హైవే తో పోలిస్తే ఇది ఖచ్చితంగా మంచి అభివృద్దే. ఇప్పుడు హైదరాబాద్ నుంచి కర్నూలు (దాదాపు 225 కిలోమీటర్ల దూరం) కార్లో దాదాపు మూడు గంటలలోపే చేరుకోగలుగుతున్నాము. టాప్ స్పీడ్ నూరు నుంచి నూటా ఇరవై నా సాధారణ వాగన్ ఆర్ లోనే అందుకోగలుగుతున్నాను. నా పక్కనుంచే ఇన్నొవా ఫార్చునర్, ఔడీ, బీఎండబ్యూ, మెర్సిడెస్ తదితర వాహనాలు సునాయాసంగా నూటా యాభై కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకుపోతుంటాయి. వోల్వో, మెర్సిడిసె బస్సులు కూడా ఈ రహదారి మీద నూటా యాభై కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్ళటం నేను గమనించాను.

కాకపోతే ఈ రోడ్ పై భద్రత శూన్యం. ఈ రోడ్ నిర్మాణంలో వేగంగా వెళ్ళటానికి ప్రాధాన్యత ఇచ్చారు కానీ, భద్రతకి తిలోదకాలిచ్చారు.

ముఖ్యంగా ఈ వ్యాసంలో నేను చెప్పదలచుకున్న ప్రధాన అంశం ఇదే. హైదరాబాద్ నుంచి కర్నూలు చేరే లోగా ఎన్నో ప్రమాదకరమైన అంశాలు ఉన్నాయి.

అవి ఏమిటో వివరంగా వ్రాస్తాను.

* శంషాబాద్ ఎయిర్‍పోర్ట్ దాటిన తర్వాత ప్రారంభం అవుతుంది ఈ ఎన్ హెచ్ 44. ఈ హైవే కి ప్రత్యేకమైన ఎంట్రీ టోల్ గేట్ లేదు. ఎవ్వరైనా ఎక్కడినుంచైనా ఎక్కవచ్చు. ఎక్కడో మలుపులలో తప్పనిచ్చి ఈ రోడ్‍కి ఫెన్సింగ్ వంటి నిర్మాణం కూడా ఏమీ లేదు.

* మోటార్ సైకిళ్ళు, ఆటోలు, వ్యవసాయ ట్రాక్ట్రర్లు, జేసీబీలు ఇలా ఎవరైనా ఇష్టారాజ్యంగా ఎక్కేయవచ్చు ఈ రహదారిపైకి

* ఈ రోడ్ పై గేదెలు, గొర్రెలు కూడా యధేచ్చగా వచ్చేస్తుంటాయి.

* కొత్తూరు, తిమ్మాపూరు, షాద్ నగర్ బైపాస్ లో రెండు మూడు జంక్షన్లు ఇలా ఎర్రవల్లి చౌరస్తా చేరేలోపల కనీసమంటే ఓ పది పదిహేను  రోడ్ జంక్షన్లు, చిన్న చిన్న ఊర్లు వస్తూ ఉంటాయి. ఆయా జంక్షన్ల వద్ద తూతూ మంత్రంగా తెల్ల పెయింట్ తో  రోడ్ పై గీతలు వేసి, రోడ్ పక్కన ఆరి వెలిగే ఎర్ర, నారింజ రంగు దీపాలు వేసి ’ప్రమాదాలు జరిగే జంక్షన్’ అని బోర్డ్ పెట్టి చేతులు దులుపుకున్నారు హైవే అథారిటీ వారు.

* ఈ రోడ్ పై వచ్చే చిన్న చిన్న ఊర్ల ప్రజలు హాయిగా ఈ రోడ్డుపై అటు ఇటూ నిర్భీతిగా నడుస్తూ ఉంటారు ఏదో స్వంత ఇంట్లో నడుచుకుంటూ వెళ్ళినట్టు.

* చిత్రంగా , రహదారి నిబంధనలనలని గాలికి వదిలేసి, మనం వెళ్ళే రోడ్డులో , ఎదుటి వైపు నుంచి వచ్చే వాహనాలు విపరీతమైన వేగంతో వస్తుంటాయి. వీటిని అడ్డుకుని, నియంత్రించే నాధుడె కరువు

* ఇవన్నీ ఒకెత్తు అయితే ఒకప్పుడు అద్భుతంగా కనిపించిన ఈ  ఫోర్ లేన్ రోడ్డు (ఒక వైపు దారి టూ లేన్ రోడ్డు మాత్రమే కద) ఇప్పుడు పరమ ఇరుకుగా అనిపిస్తోంది. మనం వెళ్ళే దిశగా ఈ రోడ్ కేవలం టూ లేన్ రోడ్ అవటం వల్ల, ఒక ప్రధానమైన ఇబ్బంది ఉంది. ఓ రెండు భారీ లారీలు ఒకదానిని ఒకటి దాటే ప్రయత్నం చేస్తుంటాయి. అది చెప్పుకోదగ్గ హైలైట్ ఈ రోడ్డు పై.

’దొందూ దొందేరా కొందప్పా’ అన్నట్టు అవి రెండూ ఇంచుమించు ఒకే వేగంతో వెళుతూ ఉంటాయి. అందువల్ల ఒకదానిని ఒకటి దాటటానికి సుమారైన సమయం పడుతుంది. ఈ లోగా ఈ రెండు లారిల వెనుక చాంతాండంత వాహానాల వరుస ఒక ఊరేగింపు లా వెళుతూ ఉంటాయి.

చిన్న చిన్న బ్రిడ్జిలు వచ్చినప్పుడు ఈ రోడ్ కాస్త వెడల్పు అవుతుంది. అలాంటి దగ్గర కొందరు ఉత్సాహ వంతులు, ఆ రెండు లారీలను దాటె ప్రయత్నం చేస్తుంటారు. అది మరింత ప్రమాద హేతువుగా మారుతుంది.

* వ్యవసాయ ట్రాక్టర్లు, ఆటోలు వంటి నిదానంగా వెళ్ళే వాహనాల వల్ల మరిన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఈ దారిపై.

* ఇవికాక ఈ రోడ్డు పై తరచూ ఏదో ఒక మరమ్మత్తులు జరుగుతూ కొన్ని కిలోమీటర్ల పాటు దూరాన్ని ఒకే లేన్ మీదకి మళ్ళించే సందర్భాలు కూడా ఎక్కువ జరుగుతుంటాయి ఇక్కడ.

* 2007 లో మొదటి సారిగా నేను కార్ వేసుకుని లాంగ్ డ్రైవ్ అనికుటుంబ సభ్యులని తీసుకుని కర్నూలుకి వెళ్ళినప్పటికి ఇప్పటికీ రోడ్ క్వాలిటీలో చాలా మార్పు వచ్చింది. విపరీతమైన కుదుపులు వస్తున్నాయి ఇటీవల

*ఈ రోడ్డుకి టోల్ చెల్లించటం దండగ. ఈ క్వాలిటీ మాకు నచ్చలేదు. మేము మామూలుగా వెళతాము అని అనుకునే వారికి వేరే ఆప్షన్ లేదు. నచ్చినా నచ్చకున్నా ఈ రోడ్ పై వెళ్ళాల్సిందే టోల్ కట్టల్సిందే. కర్నూలు చేరే లోగా దాదాపు మూడు వందలు టోల్ రూపంలో చెల్లించుకోవాలి.

వీరపాండ్య కట్టబొమ్మన్ వేషంలో మేజర్ చంద్రకాంత్ సినిమాలో ’ఎందుక్కట్టాలిరా శిస్తూ! నారు పోశావా, నీరు పోశావా? నీకు ఎందుకు కట్టాలి శిస్తూ’ అని ఆవేశంతో అన్న గారు ఊగిపోతారు.

అదిగో అంత ఆవేశం వస్తుంది ఈ రోడ్ పై వెళుతూ టోల్ కట్టేటప్పుడు.

వాళ్ళు మొత్తం కొత్త రోడ్ వేసింది ఏమీ లేదు. ఇదివరకు ఉన్న ఎన్ హెచ్ 7 కి అటూ ఇటూ కాస్తా చదును చేసి సమాంతరంగా రోడ్ వేశారు. సమాంతరంగా వంతెనలు కట్టారు. కాదనను. కానీ వీరు వేగానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు తప్పనిచ్చి ప్రయాణికుల భద్రతని గాలిలో దీపాలలా వదిలిపెట్టేశారు.

యూ టర్న్ వచ్చేదగ్గర మీడియన్ పల్చబడి రోడ్ వెడల్పు అవుతుంది. ఆ తర్వాత యూ టర్న్ అవంగానే ఎదురుగా టక్ మని మీడియన్ అడ్డువచ్చేస్తుంది. రోడు వెడల్పు అయిన దగ్గర యూటర్న్ తీసుకునే వాహనం మెయిన్ స్ట్రీం వాహనాలకు అడ్డురాకుండా ఒక పక్కకి ఒదిగి వెళ్ళాలని వీళ్ళ ఉద్దేశం అంత వరకు మంచిదే.

కానీ యూ టర్న్ తీసుకోకుండా నేరుగా వెళ్ళే వాహనదారుడు రోడ్ వెడల్పు అయింది కదాఅని భ్రమకి గురయి ఆ వెడల్పాటి మార్గంమీద నడుపుకుంటు వెళితే , సడన్ గా మీడియన్ దర్శనం ఇస్తుంది, దాన్ని తప్పించటంలో బోల్తా పడటం ఖాయం. ఇలాంటి ప్రయత్నంలోనే  మూడేళ్ళ క్రితం ఓ వోల్వో బస్సు దగ్ధమై దాదాపు ముఫై మంది ప్రయాణీకులు సజీవ దహనం అయ్యారు.

* అలాంటప్పుడు ఇంతోటి బోడి రోడ్ కి టోల్ కట్టడం ఎందుకు అని వైరాగ్యం కలగటం సహజం.

* రోడ్ మీద టోల్ వసూలు చేసే టప్పటికి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లాంటి నిర్మాణం ఉండాలి. అప్పుడు మనం కూడా ఆనందంగా టోల్ కడతాము.

ఇది వరకున్న రోడ్ ని వీళ్ళు ఆక్రమించి బలవంతపు బ్రాహ్మణార్థం అన్నట్టు మనకు ఈ లోపభూయిష్టమైన ఎన్ హెచ్ 44 ని అంటగట్టి, వేరే ఆప్షన్ కూడా లేకుండా చేసి, దానిమీదే ప్రయాణించటం అనివార్యం చేసి, ఇష్టారాజ్యంగా టోల్ వసూల్ చేయటమే కాక, ప్రాణాలతో చెలగాటమాడటం ముమ్మాటికి తప్పే.

ఈ రోడ్ మీద ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా ప్రాణాలు క్షణాలలో గాల్లో కలిసిపోతాయి.  కర్నూలు నుంచి హైదరాబాద్ చేరే లోగా వెంట్రుకవాసి లో తృటిలో తప్పే ప్రమాదాలు ఎన్నో.

ఇక్కడో హైలైట్ చెబుతాను:

ఏదైనా శుభకార్యాలలో కలిసినప్పుడు బంధు మిత్రులు మాటల మధ్యలో

’నాకు కర్నూలు నుండి హైదరాబాద్ చేరడంలో కేవలం మూడు గంటలు పట్టిం’దని ఒకరు

’ఒసోస్ నాకు అయితే అయితే రెండున్నర గంటలే పట్టిం’దని ఇంకోకరు

’హైదరాబాద్ నుంచి బెంగళూరు చేరుకోవటానికి మాకు కేవలం ఆరు గంటలే పట్టిం’దని ఒకరు కబుర్లు చెప్పుకోవటం విన్నాను. నూరు నూటాయాభై కిలో మీటర్ల వేగం అందుకోవడానికి ఈ రోడ్ నిర్మాణం అనుకూలంగా ఉంది అన్న మాట వాస్తవమే కానీ, భద్రతాపరంగా ఏ మాత్రం అనుకూలంగా లేని ఈ రోడ్ పై ఎనభై దాటి ప్రయణించటం అంటే ప్రాణాల్ని పణంగా పెట్టి పోవడమే అని నా అభిప్రాయం.

దీనితో పోలిస్తే, చెన్నై-కలకత్తా హైవే కాస్తా మెరుగైన భద్రతా ప్రమాణాలతొ ఉంటుంది. ఆ రోడ్ గూర్చి ఆ రోడ్ పై నా ప్రయాణాల గూర్చి మరోసారి చెప్పుకుందాం.

****

ఇప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గురించి చెప్పుకుందాం:

సినిమాలో విలన్ ఎంత బలవంతుడైతే , కథానాయకుడి గొప్పదనం అంత ఎలివేట్ అవుతుంది అంటారు కద. అందుకే ముందుగా మన ఘనత వహించిన ఎన్ హెచ్ 44 గూర్చి చెప్పుకొచ్చాను.

అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మింపబడ్డ మన హైదరాబాద్ రింగ్ రోడ్డు దేశంలోనే ఇలాంటి నిర్మాణాలలో మొట్టమొదటిది కావడం విశేషం.

రాజును చూసిన కంట మొగుణ్ణి చూస్తే మొట్టబుద్దేసిందట ఇది వరకు ఒకావిడకి.  అలాగే ఈ ఔటర్ రింగ్ రోడ్‍ని చూసిన కంటితో మామూలు జాతీయ రహదారులను చూస్తే అలాగే అనిపిస్తొంది.

ఇప్పుడు మన ఔటర్ రింగ్ రోడ్ గూర్చి తెలుసుకుందాం:

* హైదరాబాద్ నగరం చుట్టూ వృత్తాకారంలో ఉంటుంది ఈ ఔటర్ రింగ్ రోడ్డు. దీని పొడవు దాదాపూ నూటాయాభై కిలోమీటర్లు.

* ఎక్కడా కూడా మలుపులు ఉండవు.దాదాపు నేరుగా వెళుతున్నట్టె ఉంటుంది, వృత్తాకారంలో నిర్మాణమే అయినా ఆ మలుపు క్రమంగా ఉంటుందే తప్పనిచ్చి హఠాత్తుగా మలుపులు ఉండవు.

* దాదాపు నూటాయాభై కిలోమీటర్ల వేగంతో నడిపినా కూడా ఎటువంటి కుదుపులేకుండా ప్రయాణం చేయవచ్చు. అయినా కూడా ఈ రోడ్ పై వేగ పరిమితి నూరు కిలోమీటర్లకే అని నిబంధన విధించారు. మీరు హద్దు దాటి వెళితే సెన్సర్ల సహాయంతో మీ కారు నెంబరు, మీరు ప్రయాణించిన తేది, సమయం,ఎంత వేగంతో వెళ్ళారో తెలియజెపుతూ మీకు ఎస్సెమెస్ ద్వారా దాదాపూ వెయ్యి నుండి అయిదు వేల వరకు చలాన్ వస్తుంది. (దేవుని దయవల్ల నేను ఇలాంటి సన్మానం పొందలేదు)

* ఈ రోడ్డు మొత్తం ఎనిమిది లేన్ల రహదారి. దీనిని సూపర్ ఎక్స్‌ప్రెస్ హైవే అనే కేటగిరిలోకి వర్గీకరించవచ్చట అంతర్జాతీయ ప్రమాణాలప్రకారం.

ఈ ఎనిమిది లేన్లూ ప్రయాణించటానికి ఉపయోగించవచ్చు. ఇది కాక ఈ రెండింటిని విడదీస్తూ ఉన్న మీడియన్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఈ మీడియన్ పై ఎక్కడా కూడా యూ టర్న్ కి అనుమతించరు. ఈ మీడియన్ పై చక్కటి తోటలని అభివృద్ది చేస్తున్నారు.

రోడ్డుకి అటు ఇటు కూడా చక్కటి తోటల్ని అభివృద్ది చేస్తున్నారు.

ఇక మళ్ళీ రోడ్ విషయానికి వస్తే ఈ ఎనిమిది లేన్లే కాక, ఎమర్జెన్సీలో నిలుపుకోవటానికి ఇంచుమించు ఒక లేన్ అంత విశాలంగా  ఎడమవైపు చివర స్థలం ఉంటుంది.

* ఈ రోడ్ మీదకి ద్విచక్ర వాహనాలను, ఆటోలను, వ్యవసాయ ట్రాక్టర్లను అనుమతించరు

* ఎదురుగా వాహనం రావడం అన్నది కలలో మాట. ఎక్కడా కూడా యూ టర్న్ కి అనుమతించని కారణంగా ఎక్కడైనా సరే ఎగ్జిట్ పాయింట్ ద్వారా మాత్రమే ఈ ఎక్స్‌ప్రెస్ హైవె పై నుంచి దిగాలి, ఎంట్రి పాయింట్ ద్వారానే ఎక్కాలి. ఈ రహదారిలో ప్రయాణించే ఏ వాహనం అయినా సరే  ఎంట్రీ టోల్ దగ్గర ఫాస్టాగ్ ఆధారంగా ఆటోమేటిక్ గా వివరాల్ని నమోదు చేయబడ్డాకే రోడ్ ఎక్కుతుంది. ఆ తరువాత ఎగ్జిట్ పాయింట్ దగ్గర దిగాక అది ఎంత దూరం ప్రయాణించిందో నమోదు అయ్యాక, ఆటో మేటిక్ గా ఫాస్టాగ్ ద్వారా రుసుం అకౌంట్ నుంచి డబ్బు వాళ్ళ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది.

* ఇరవై నాలుగ్గంటలలోపు వెనక్కు వస్తే రిటర్న్ ట్రిప్ లో కేవలం యాబై శాతం మాత్రమే తీసుకుంటారు.

* డే పాసులు, మంత్లీ పాసులు కూడా ఉన్నాయట. నా వృత్తికి అంతలేసి ప్రయాణాలు ఉండవు. కాబట్టి వాటి గుర్చి నేను వివరాలు కనుక్కోలేదు.

* నేను ఈ ఔటర్ రింగు రోడ్డుని వివిధ సంధర్భాలలో మొత్తం తిరిగాను. ఈ రోడ్డు మీద మొత్తం 19 ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి. ఇది మొత్తం ఇరవై ప్రధాన రోడ్ జంక్షన్లని అనుసంధానిస్తుంది.

* ఈ రోడ్డు మొత్తం ప్రకాశవంతమైన ఎల్ ఈ డీ దీపాలు ఎత్తైన పోల్స్ పై అమర్చబడి ఉంటాయి. ఇది ఎంతో అందమైన దృశ్యం . రాత్రి పూట హాయిగా వెళుతూ ఉంటే స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది. చక్కటి సంగీతం వింటూ రాత్రి పూట ఈ ఔటర్ రింగు రోడ్ పై ప్రయాణం ఒక గొప్ప అనుభూతి.

* ఎంట్రీ పాయింట్ వద్ద టోల్ స్లిప్ తీస్కుని మనం ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కంగానే ప్రధాన ట్రాఫిక్ స్రవంతికి ఇబ్బంది కలిగించకుండా, ఆ వేగంగా వెళ్ళే ట్రాఫిక్ వల్ల మనకు ఇబ్బంది కలగకుండా దాదాపు ఒక కిలోమీటరు దూరం అదనంగా ఉన్న ఇంకో రెండు లేన్లు - నాలుగు లేన్లతో బాటు సమాంతరంగా ఉంటాయి. అంటే కొన్ని కొన్ని దగ్గర్ల ఈ ఎనిమిది లేన్ల రహదారి దాదాపు పన్నెండు లేన్ల రహదారిగా కూడా అవతారం ఎత్తుతుంది అన్నమాట. (ఇటు నాలుగు ప్లస్ రెండు, అటు నాలుగు ప్లస్ రెండు)

* అదే విధంగా ఎగ్జిట్ పాయింట్ రాబోతుండగా దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నుంచే పెద్దపెద్ద సైన్ బోర్డులు మనకు ఆ విషయాన్ని తెలియజేస్తుంటాయి.

ఓ అయిదు వందల మీటర్ల దూరం నుంచి  రహదారి మరింత విశాలమవుతుంది. అంటే ఆ ఫలాన ఎగ్జిట్ పాయింట్ దగ్గర దిగవలసిన వాహనం చక్కగా ఈ విశాలమైన ఎక్ట్ర్సా రహదారిలోకి వచ్చేసి నెమ్మదిగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి దిగి వచ్చేయవచ్చు

* ఔటర్ రింగ్ రోడ్డుకి సమాంతరంగా అటూ ఇటూ కూడా సర్వీస్ రోడ్ పేరిట విశాలమైన మామూలు రహదారులు వెళుతూ ఉంటాయి. వీటికి టోల్ ఏమీ ఉండదు. టోల్ వద్దు అనుకునే వారు హాయిగా ఆ సర్వీస్ రోడ్డు మీద వెళ్ళవచ్చు. కాకపోతె వారికి రోడ్ జంక్షన్‍లు వస్తూ ఉంటాయి. అటు, ఇటూ ఉండే సర్వీస్ రోడ్లని అనుసంధానిస్తూ, ఔటర్ రింగ్ రోడ్డు కింద నుంచి ప్రతి కిలోమీటర్ కి ఒక సారి అండర్ పాస్ ల నిర్మాణం ఉంది

* కొంతమంది ఈ రోడ్డు మీద ప్రమాదాలు ఎక్కువండీ అనీ అంటుంటారు.

*అదే విధంగా కొన్ని వార్తా పత్రికలు రక్తపుటేర్లు ప్రవహిస్తున్న ఔటర్ రింగ్ రోడ్ అని శీర్షికలు పెట్టి వార్తలు వ్రాస్తుంటాయి. ఇది కొంత మేరకు వాస్తవమే కానీ, నిర్మాణ పరంగా కానీ , నిర్వాహణ పరంగా కానీ ఒక ఎక్స్‌ప్రెస్ హైవేని ఇంతకన్నా అద్భుతంగా ఎవ్వరూ కొనసాగించలేరు. బాధ్యతారాహిత్యంతో నడిపే డ్రైవర్ల వల్లనే ఇప్పటిదాకా జరిగిన ప్రమాదాలన్నీ అని తెలుస్తోంది.  నూరు కిలోమీటర్లు మేగ్జిమం స్పీడ్ అని నియయం పెట్టినా కూడా దాన్ని తుంగల్లో తొక్కి నూటాయాభై  స్పీడ్ పోవడం, రహదారి నియమనిబంధనల్ని గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా లేన్ చేంజింగ్ తో నడపడం, మద్యపానం చేసి నడపడం ఇవన్నీ ప్రమాదాలకి కారణాలు. దీనికి అవుటర్ రింగ్ రోడ్ యొక్క లోపం ఎంతమాత్రం లేదని నేను ఘంటాపదంగా చెప్పగలను.

* మేము ఖచ్చితంగా ప్రమాదానికి గురవుతాము అని బలమైన నిర్ణయం తిస్కుని వచ్చే వారే ఇక్కడ ప్రమాదానికి గురవుతారు తప్పనిచ్చి రోడ్ నియమాలు పాటించే వారికి ఇది స్వర్గ ధామం.

* అదే విధంగా  బైకు రేసులు ఈ రోడ్ మీద పెట్టుకుని కొందరు ప్రాణాలకి తెచ్చుకుంటే ఎవరిది తప్పు? ఈ రోడ్ నిర్మాణం దశల వారిగా జరిగింది. ఇంకా నిర్మాణం పూర్తి కాని రోజుల్లో నిబంధనల్ని తుంగల్లో తొక్కి కొందరు ప్రముఖుల పిల్లలు ఈ రోడ్ మీదకి బైకులపై వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు ప్రతి ఎంట్రీ పాయింట్ వద్ద బలమైన టోల్ సిస్టం , నిఘా ఉండటం వల్ల ఇలాంటి ప్రమాదాలకి ఆస్కారం లేదు.

ఏ రకంగా తీస్కున్నా కూడా హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు దేశంలోకెల్లా అనేక విషయాలలో తలమానికంగా నిలుస్తుందనటంలో సందేహం లేదు.

ముంబాయి-పుణే ఎక్స్‌ప్రెస్ హైవే ని దీనితో ఇంచుమించు పోల్చవచ్చు. అయినప్పటికీ అది ఆరు లేన్ల హైవే మాత్రమే. కొన్ని కొన్ని దగ్గర్ల అది పదిలేన్ల హైవే గా ఉన్నప్పటికి హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ హైవేనే గొప్పటెక్నాలజీ కి తార్కాణంగా నిపుణులు పేర్కొంటారు.

పర్యాటక రంగం కోణంలో చూస్తే , దీని నిర్నాణంలో టన్నెల్స్ లేకపోవటం ఆకర్షణ పరంగా ఒక లోపం. అంతకు మించి నాకేమి లోపాలు కనపడలేదు దీని నిర్నాణంలో. దీనికి నెహ్రూ గారి పేరు పెట్టటమే నాకు పంటి కింద రాయిలా తోస్తుంది.

 

స్వస్తి.

డా.రాయపెద్ది వివేకానంద్

హైదరాబాద్

 

Outer ring road published in facebook on 30th March

https://m.facebook.com/story.php?story_fbid=10222248722067128&id=1237660552

 

                                                                                                                                                                          

కమలాపురం

కమలాపురం

ఒక ఙ్జాపకం - 63 

ఈ ఎపిసోడ్ లో ఎటువంటి కొసమెరుపులు, మలుపులు ఉండవు. ఇది నా చిన్న నాటి ఙ్జాపకాల దొంతర, అంతే.

****

"ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే నీ దేశం పోరా" అనే పాట సాయంత్రం సమయంలో బిగ్గరగా వినపడింది అంటే అర్థం ఇక మొదటి ఆట ప్రారంభం అవబోతోంది అని అన్నమాట.

ఇదొక్కపాటే కాదు, ఒక దాని తర్వాత ఒకటొకటిగా ఆణిముత్యాలలాంటి పాటలు వినపడటం మొదలవుతుంది

"చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది...దాని జిమ్మ దీయ, అందమంతా చీరలోనే ఉన్నది"

"ఎర్రా బుగ్గల మీద మనసైతే నీవు ఏమి చేస్తావోయి చినవాడ"

"చేతిలో చేయేసి చెప్పు బావా.. చేసుకున్న బాసలు మరచిపోనని" అని ఇలా శృంగార గీతాలు, ప్రేమ గీతాలు, విరహ గీతాల తర్వాత, పోనిలే అన్చెప్పి కాస్త దేశభక్తి చూపిస్తూ,

"తెలుగు వీర లేవరా, దీక్ష బూని సాగరా...." అని కూడా వినిపిస్తారు.

ఇవన్నీ అయ్యాక, ఇక భక్తి రస పారవశ్యంలో మనల్ని ఓలలాడించటానికి ఘంటశాల గారు నడుం బిగిస్తారన్నమాట.

"నమో..... వెంకటేశా!

నమో.... తిరుమలేశా!

నమో వెంకటేశా, నమో నమో తిరుమలేశా" అని ఘంటశాల గారు గంభీరంగా రాగం అందుకున్నారంటే ఇక తెరలేస్తోంది అని అర్థం.

ఈ పాట మొదలైంది అంటే అప్పటిదాకా బీడీలు, గోలీ సోడాలు, వడలు, కారాలు (మురుకులు), బొరుగులు అమ్ముకుంటూ తిరిగిన కుర్రాళ్ళు నెమ్మదిగా ఒక్కొక్కరూ నిష్క్రమిస్తారు.

ఆ తర్వాత ఇక నెమ్మదిగా సినిమా మొదలవుతుంది.

థియేటర్ లో కూర్చున్న వారికే కాక ఊరంతా ఈ పాటలు వినిపిస్తాయి. అంటే కమలాపుర గ్రామ ప్రజలని ఆకట్టుకుని సినిమా దిశగా వారి దృష్టిని మరల్చేదానికి ఎత్తుగడ అన్నమాట్ ఇదంతా.

ఇవన్నీ డెబ్భైయవ దశకం  తొలి భాగంలో కమలాపురంలో నాకు గుర్తున్న సినిమా థియేటర్ తాలూకు ఙ్జాపకాలు.

ఈ కమలాపురం కడప జిల్లా లో ఎర్రగుంట్ల వెళ్ళేదారిలో వస్తుంది. అలాగన్చెప్పి కడప-ఎర్రగుంట్ల మెయిన్ రోడ్ మీద ఏమీ ఉండదు ఈ ఊరు. మెయిన్ రోడ్ మీద నుంచి దాదాపూ రెండు మూడూ కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. 

ఏదో దారిలో వచ్చింది కద అని ఆ ఉరికి విచ్చేసే వారితో కమలాపురవాసులకు గిట్టదు, పని కట్టుకుని కమలాపురం చూడాలి అని కృతనిశ్చయులై వచ్చేవారే  మా ఊరికి రావాలి సుమా అన్నట్టుంటుంది ఈ ఊరి లొకేషన్.

నేను ఇందాక చెప్పిన సినిమా థియేటర్ ఒకటే ఒకటి ఉండేది ఆ రోజుల్లో. అది కాకుండా ఒకట్రెండు టెంట్లు కూడా ఉండేవి అనుకుంటా.

వాటి ముందు ఈ సినిమా థియేటర్ రాజసమే వేరు. కడప - ఎర్రగుంట్ల మెయిన్ రోడ్ నుంచి కుడివైపు కి మలుపు తిరిగి ఓ రెండు మూడు కిలోమీటర్లు ప్రయాణం చేశాక, రైలు గేటు దాటి ముందుకు వెళితే , రోడ్డుకి కుడి వైపు ఉండేది ఈ థియేటరు. పేరు కూడా గుర్తు లేదు నాకు సరిగ్గా.

మరీ పెద్దదేం కాదు ఈ ఊరు. నా జీవితంలో ఈ కమలాపురంకి ఒక ప్రత్యేకత ఉంది. నా విద్యాభ్యాసం ప్రారంభం అయ్యింది అక్కడనే. ’హరి ఓం’ అని నన్ను అక్కడ ఒకటో తరగతిలో చేర్చారు.

మా అప్ప (నాన్నగారి)కి మొదటి సారిగా ప్రమోషన్ మీద డెప్యూటీ తహసిల్దారు  హోదాలో ఆ ఊరిలో పోస్టింగ్ రావటంతో మేము ఆ ఊరికి వచ్చామన్న మాట.

నేను పుట్టిన తరువాత ఆయన కెరియర్ ఉఛ్చ స్థితికి చేరుకుందని మా అమ్మ తరచూ అనే వారు. ఆ విధంగా ఒక ప్రత్యేకత నాకు ఆపాదించి నన్ను ఆనందపరిచే వారు. ఆయన కృషి, పట్టుదల, అనుభవం కారణంగా ఆయన తన వృత్తిలో ఎన్నో ఎత్తులు చవిచూశారు. నా పుట్టుక తర్వాత అన్నది యాధృచ్చికం.

మా నాన్నగారి నీతి నిజాయితీల గూర్చి, క్రమ శిక్షణ గూర్చి ఒక సిరీస్ వ్రాయాలి నిజానికి నేను.

మా అన్నయ్య అప్పటికి తిరుపతిలో ఎంఏ చేసేవాడు. మా ముగ్గురక్కయ్యలని కడపలోనే మా బామ్మ గారి వద్ద ఉంచి నన్ను తీసుకుని మా అమ్మ అప్పలు కమలాపురం వచ్చారన్నమాట.

మరీ చిన్నతనంలో చూసినప్పటికీ నాకు ఆ ఊరు బాగా గుర్తుండిపోయింది. అక్కడ ఇంతకూ ఉండింది మహా అంటె ఒక ఆరేడు నెలలు అంతే. ,

కమలాపురం అంటే నాకు బాగా గుర్తు వచ్చే అంశాలు కొన్నే. మా మేడ ఎక్కితే దూరంగా కనపడే ఒక నీలం రంగు మేడ, ఇందాక నేను చెప్పిన సినిమా థియేటర్, రైలు బ్రిడ్జి.

ఆ తరువాత నేను కమలాపురం చూసిందే లేదు.  ఆ తర్వాత కడప నుండి అనంతపురం, తాడిపత్రి, ఆదోని కి వెళ్ళే సందర్భాలలో అనేక మార్లు బస్సులో వెళ్ళేటప్పుడు ఆ బస్సులు విధిగా కమలాపురం మీదుగా వెళ్ళేవి. ఇందాక చెప్పినట్టు, మెయిన్ రోడ్ మీదనుంచి కమలాపురం ఊరిలోకి వచ్చి మళ్ళీ యూటర్న్ తీస్కుని వెళ్ళేవి. కాకపోతే, కమలాపురం రైల్వే గేట్ దాటకుండానే ఓ బస్టాండ్ లాంటి ఏర్పాటు ఉండేది. అక్కడ ఆగి అట్నుంచి అటే బస్సులు మళ్ళీ వెనక్కు వెళ్ళిపోయే కారణంగా మళ్ళీ ఎప్పుడూ నేను కమలాపురం చూడలేదు.

కడప నుంచి ఆదోని, బొంబాయి (అప్పుడలానే అనేవారు) వెళ్ళే మార్గంలో విధిగా ఈ కమలాపురం వచ్చేది. రైలు మార్గంలో కమలాపురం వస్తోంది అనంగా పాపాఘ్ని నదిపై ఉన్న పెద్ద కటాంజనాల వంతెన పెద్ద ఆకర్షణ గా ఉండెది ఆ రోజుల్లో. ఇంజినీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా చెప్పుకునే వారు ఆ రోజుల్లో ఆ వంతెనని. ఆ వంతెనపై రైల్లో వెళుతుంటె  "ఠమాల్ ..ఠమాల్; ఠమాల్.. ఠమాల్" అని పెద్దగా వచ్చే చప్పుడు చిన్న తనంలో భీతి గొల్పేది. మా అమ్మ ఒడిలో తల పెట్టుకుని కళ్ళు మూసుకుని ’శ్రీ రామ శ్రీ రామ’ అనుకుంటూ ఆ బ్రిడ్జి దాటే వరకు కళ్ళు తెరిచేవాడిని కాదు.

కమలాపురం అనంగానే ఈ కటాంజనాల రైలు వంతెన మొదట గుర్తు వస్తుంది నాకైతే. ఈ రైలు మార్గానికి సమాంతరంగా ఎర్రగుంట్లకి దారి తీసే రోడ్డు మార్గం తాలూకు వంతెన్ కనిపించేది.

కాకపోతే ఈ రోడ్డు వంతెన ఎత్తైన రోడ్ వంతెన కాదు ఆ రోజుల్లో. కాజ్ వే లాగా నది మట్టానికి ఇంచుమించు సమానంగా ఉండేది. కాకపోతే ఈ పెన్నా నదిలో నీళ్ళు అరుదుగా ఉంటాయి కాబట్టి బస్సుల రాకపోకలకి ఇబ్బంది ఉండేది కాదు. వర్షాకాలంలో విధిగా ఈ రోడ్డు వంతెన మునిగిపోయేది. అప్పుడు రవాణా వ్యవస్థ ఇంచుమించు స్తంభించి పోయేది. సాహసం చేసి మనషులు నడుచుకుంటూ రైలు వంతెన మీదుగా నది  దాటి అవతల ఒడ్డుకి చేరి అక్కడి నుంచి బస్సో, బండో పట్టుకుని వెళ్ళేవారు.

లేదంటే అనేక కిలోమీటర్లు ఎక్కువగా ప్రయాణించి చెన్నూరు మీదుగా వెళ్ళేవాళ్ళు బస్సుల్లో.

ఆ విధంగా ఉండేది ఆ రోజుల్లో.

కడప జిల్లా వాళ్ళ గూర్చి బాలివుడ్ సినిమా వారు తమకి ఇష్టం వచ్చినట్టు చూపించినా, కరడు కట్టిన రాక్షసులు అన్నట్టు చూపించినా అసలు కడపవాళ్ళు ఎంత మంచి వాళ్ళు అన్నది  దగ్గరుండి  కడప వారితో జీవించిన వారికే తెలుస్తుంది.

తమకు హక్కుగా రావలిసిన విశాలమైన రోడ్లు, మంచి జీవిత విధానం, మంచి విద్యా సంస్థలు, నదీజలాలు పొందటం ఇవన్నీ తమ హక్కు అన్న అంశం కూడా తెలియనంత మంచి వారు.

ఆ తర్వాత కొన్నేళ్ళకి ’హై లెవల్ డబల్ లేన్’ వంతెన వచ్చింది.  చాన్నాళ్ళు కడప జిల్లా వాళ్ళు తమ అదృష్టానికి మురిసిపోయారు.  దురదృష్టవశాత్తు ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకి ఈ వంతెన కూలిపోయింది.

పాపాఘ్ని నది అనంగానే గుర్తు వచ్చే ఇంకో ముచ్చట, దోసపండ్లు.

వీటిని హైదరాబాద్ లో తర్బూజాలు అంటారు. ఇందాకే చెప్పాను కద, ఈ నదిలో ఎప్పుడూ నీళ్ళు ఉండవని, అలాంటిది ఇక ఎండకాలంలో నీళ్ళెక్కడినుంచి వస్తాయి. ఇలాంటి ఎండిపోయిన నది ఇసుకలో, రైతులు దోసపండ్ల పంట పండిస్తారు.  ఈ దోస పండ్ల తియ్యటి తీపినివర్ణించటం అనితరసాధ్యం.

కడప నుంచి బద్వేలు వెళ్ళే  మార్గంలో ఉండే సిద్దవటం లో కూడా దోసపండ్లు బాగా పండుతాయి. కడప జిల్లాలో ఎక్కడ దోసపండ్లు పండినప్పటికీ వాటిని సిద్దవటం దోసపండ్లు అని పిలవటం ఆనవాయితీ.

శ్రీరామనవమి పండగ కి ఈ దోసపండ్లు, పానకం, తిరుగువాత వేసిన మజ్జిగ,  వెదురుతో చేసిన విసనకర్రలు, వడపప్పు ఇచ్చిపుచ్చుకోవటాలు ఒక ప్రధాన అంశం కడపజిల్లాలో.

***

ఊరికి ఒక చివర, వేప చెట్ల నీడలో విశాలమైన ఆవరణలో ఒక చక్కటి రాతి భవనంలో ఉండెది నా మొదటి స్కూలు. నల్లటి పలకపై చక్కటి అక్షరాలతో ’ఓ న మః’ అని అయ్యవారు (టీచర్) వ్రాసి ఇస్తే ఆ అక్షరాల పైనే బలపంతో పదే పదే దిద్దుతూ నా ఓనమాలు మొదలయ్యాయి.

నాకు ఇప్పటికీ 1-100 అంకెలు తలచుకుంటె మనసులో ఆ పాఠశాలలో బోర్డు మీద వ్రాసిన అంకెలే మనసు తెరపై ప్రత్యక్షమౌతాయి.

నాకు ఇప్పటికీ బాగా గుర్తు. అక్కడ ఓ పెద్ద డ్రమ్ములో నీళ్ళుఉండేవి. మాటి మాటికి వెళ్ళి పలకని ఆ నీళ్ళ డ్రమ్ములో ముంచి, ఆ నీళ్ళతో పలక కడిగి , ఆ తర్వాత చొక్కాతో పలకని తుడుచుకుని మళ్ళీ అయ్యవారి దగ్గరికి పరిగెత్తేవారం. అయన తాజాగా మళ్ళీ అక్షరాలు వ్రాసి ఇవ్వడం, వాటిమీద బలపంతో వ్రాస్తూ ఉండిపోవడం బాగా గుర్తు ఉంది. ఒకే అక్షరాన్ని దానిపైనే పదే పదే వ్రాసే ఈ ప్రక్రియని ’రుద్ది రుద్ది రాసుకోవడం’ అని  వ్యవహరించే వాళ్ళం.

ఇంకో ముచ్చట. ఈ పలక ఉపరితలం మరింత నల్లటి రంగుని పొందటానికి అదేదో ఆకుని (బహుశా జిల్లేడు ఆకు అనుకుంటా) బొగ్గుతో కలిపి నూరి ఆ మిశ్రమాన్ని పలక మీద పూస్తే పలక మరింత రంగు తేలుతుంది అనే మూఢ నమ్మకం ఒకటుండేది. నలుపు రంగు రావటమేమో కానీ చేతులు, చొక్కా నిక్కరు నల్లటి రంగు సంతరించుకునేవి.

నా అవతారం చూసి మా అమ్మ మిడిగుడ్లేసేది.

ఇన్ని కాయకల్ప చికిత్సలు చేసినా కూడా ఈ పలకలు తరచూ పగిలిపోతూ ఉండేవి. మళ్ళీ కొత్తవి కొనడం దానిపై మా అమ్మ శ్రీరామ అని వ్రాసి మళ్ళీ స్కూలుకి పంపేది.

***

రాతితో నిర్మించిన ఓ భవంతి బాడుగ కి దొరికింది . ఆ ఇంటి ఎదురుగా ఓ పెద్ద ఖాళీ కాంపౌండ్. అందులో పెద్ద పెద్ద వేప చెట్లు, ఎవరో మోతుబరి రైతుల తాలూకూ గడ్డి వాములు, ఓ పెద్ద బావి ఉండేవి.

డిప్యూటీ తహసిల్దారు హోదాలో మా నాన్నగారికి చాలా గౌరవ మర్యాదలు లభించేవి ఆ ఊర్లో. ఇంటి దగ్గర సదా ఓ అటెండర్ ఉండేవాడు.

మా ఇంటి పక్కనే ఓ పెద్ద గుడిసే ఉండేది. ఆ గుడిసెలో బాలనాగమ్మ అనే ఆవిడ ఉండే వారు. వాళ్ళది రైతు కుటుంబం. రామాంజనేయులు అనుకుంటా వాళ్ళ అబ్బాయి , నాకు బాగా దోస్తు. మేము ఆ ఊరు వదిలి వచ్చేశాక కూడా చాలా సంవత్సరాలు ఆ కుటుంబంతో మాకు సాన్నిహిత్యం ఉండేది. వారు కూడా కొన్నేళ్ళయ్యాక కడపకి మకాం మార్చారు.

వారి కొట్టం ముందు ఓ నులక మంచం వేసి దానిపై రకరకాల గాజు సీసాలలో పిప్పరమెంట్లూ, చాక్‍లేట్లు, చెగోడీలు, బీడీలు తదితర వస్తువులు అమ్మేవారు వారు.

ఆ సెటప్ చూసి, నాక్కూడా చాలా రోజులు కోరిక ఉండేది అలాంటి అంగడి పెట్టాలి అని. ’ఛ! నోర్ముయ్’ అని కేకలేసేవారు మా అమ్మా వాళ్ళు.

ఆ రోజుల్లో ఇంటి ముందు బస్సాట ఆడేవాళ్ళం.

బస్సాట అంటే మరేమో కాదు. ఇటుక పరిణామంలో ఉండే రాతి ముక్కని నేలపై తోసుకుంటూ ’ప్పిప్పీప్...ప్పిప్పీప్’ అనుకుంటూ వేగంగా వెళ్ళటం అన్నమాట. ఈ ఆటలో  ఓ సారి ఆక్సిడెంట్ అయింది కూడా. వేగంగా ఆ బస్సుని (రాతి ముక్కని) తోసుకుంటూ వెళ్ళటంలో ఓ కరెంట్ పోల్ కి గుద్దుకుని తల పగిలినంత పనయింది.

అదండి కమలాపురం కథ.

ఎందుకో ఈ రోజు ఈ ముచ్చట్లన్ని గుర్తు వచ్చాయి.

 

Published in facebook on 23.04.2022

https://m.facebook.com/story.php?story_fbid=10222353238039962&id=1237660552