Wednesday, July 13, 2022

రుమటాయిడ్ ఆర్థరయిటీస్


 

రుమటాయిడ్ ఆర్థరయిటీస్

ఒక ఙ్జాపకం

ఈ వ్యాసంలో మిమ్మల్ని ఉత్తేజపరిచే అంశాలు లేవు సుమా. ఇందులో ఒక వ్యాధి గూర్చి, దాని తాలూకూ చికిత్స గూర్చి వ్రాశాను. వ్రాయాలని వ్రాయలేదు, ఎక్కడో మొదలెట్టి ఎక్కడికో వెళ్ళిపోయను.

****

కళ్యాణదుర్గం.

ఈ పేరు మొదటిసారిగా విన్నప్పుడు నాకు కలిగిన భావన -’అరే ఈ కళ్యాణదుర్గం అన్న పేరు భలే ఉందే. చందమామ కథలో ఏదో రాజు తాలూకు రాజ్యం పేరులాగా’ అని అనిపించింది.

నేను కళ్యాణదుర్గాన్ని మొదటి సారిగా చూసింది నా ఆరో ఏట. అక్కడ అక్కడ ఇంచుమించు ఒక సంవత్సరం ఉన్నామనుకుంటా. అసలు ఈ కళ్యాణదుర్గంకి ఎలా వచ్చామో చెబుతాను. అక్కడికి వచ్చే ముందు నేను కడపలో ఒకటో తరగతి చదువుకుంటూ ఉండేవాడిని.

కమలాపురంలో ఒకటవతరగతిలో చేరి విద్యాభ్యాసం ఆరంభించిన కొన్నాళ్ళకే మళ్ళీ నేను కడపకి స్కూల్ మారాల్సి వచ్చింది.  దానికి కారణం మా అవ్వకి (మా నాన్నగారి సవతి తల్లి) చేయి విరగడం. మా నాన్నగారికి డిప్యూటీ తహసిల్దారుగా కమలాపురంకి పోస్టింగ్ రావటంతో ఆయన అక్కడ బాడుగకి ఇల్లు తీసుకుని, నన్ను, మా అమ్మగారిని మాత్రమే తీసుకువెళ్ళారు.

కడపలో మా అవ్వగారి పర్యవేక్షణలో మా ముగ్గురు అక్కయ్యలు, అన్నయ్య ఉండే విధంగా ఏర్పాటు అయింది. నేను ఇంకా చిన్నపిల్లాడిని అవడం వల్ల నన్ను తమతో తీస్కుని వెళ్ళారు కమలాపురానికి.

ఒక రోజు మా అవ్వకి చేయి విరిగింది అన్న వార్త రావటం వల్ల ఎకాఎకిన మళ్ళీ ముగ్గురం కడపకి వచ్చేశాం. చేయి విరగటం అన్న పద ప్రయోగాన్ని అప్పుడే నేను మొదటి సారిగా వినటం. చేయి విరగటమంటే, కత్తితో కోసేసినట్టు శరీరం నుండి చేయి విడివడి వచ్చేసి ఉంటుంది అని భయపడుతూ ఆ దృశ్యాన్ని చూడ్డానికి ఎంతో ధైర్యం కూడకట్టుకుని కడపకి చేరాను మా అమ్మానాన్నలతో కలిసి.

కానీ చూడ్డానికి ఆవిడ చేయి మామూలుగానే ఉండటంతో నాకేమీ అర్థం కాలేదు కాసేపు. ఆ తర్వాత మరుసటి రోజు మా అమ్మానాన్నలు పెద్దావిడని పుత్తూరుకి తీస్కువెళ్ళారు.

ఈ పుత్తూరు అనే ఊరి పేరు వినటం కూడా అదే మొదటి సారి నేను.

అక్కడ ఆవిడకి పుత్తూరు కట్టు కట్టిచ్చుకుని వచ్చారు ఓ రెండ్రోజుల్లో. ఇదంతా 1975 ప్రాంతాలలో జరిగింది, ఎప్పుడో మధ్య యుగాలలో కాదు. అప్పటికి ఆర్థోపెడిక్ నిపుణులు కడపలో ఉండేవారు కాదు అని తెలుస్తోంది ఈ ఉదంతాన్ని బట్టి. ఏ మాటకామాట చెప్పుకోవాలి. ఈ పుత్తూరు శల్యవైద్యులు ఎంబీబీఎస్; ఎంఎస్; ఎండీ; డీఎం తదితర సంప్రదాయ (?) విధానాలలో చదువుకున్న వారు కాదు. వీరు వంశపారంపర్యంగా పుత్తూరు కట్టు పేరిట విరిగిన ఎముకలని అతికిస్తూ కట్టు కట్టే విధానాన్ని పాఠిస్తున్నారు. కేశవరాజు అనే ఆయన 1881 లో దైవికంగా ఈ విద్యపై పట్టుసాధించారు, ఇప్పటికీ ఆ పరంపర వారి నాలుగోతరం వారసులు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ లో చేపమందుతో ఉబ్బసం చికిత్స చేసే బత్తిని సోదరులలాగా వీరు కూడా చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు.

అప్పట్లో కడపలో అలోపతిలో ఎముకల విభాగం లో వైద్యులు లేరన్నాను కద, కానీ, ఆ తర్వాత మరో ఇరవై ఏళ్ళకి కడపలో బోలెడు మంది ఆర్థోపెడిక్ సర్జన్స్ వెలిశారు, అది వేరే సంగతి.

చదువుకున్న వాడికంటే, ఫలానా వాడు మేలు అని ఒక సామెత ఉంది కద. అదే విధంగా, పుత్తూరు కట్టు కట్టే రాజుగారి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది అని కొందరు ఇప్పటికీ విశ్వసిస్తారు. వీరు ఎక్స్-రే గిక్స్ రే ఏవీ లేని కాలంనుంచి కూడా సరిఅయిన విధంగా చికిత్స చేస్తూ వస్తున్నారు.

ఆ తరువాత ఇరవై ఏళ్ళకి మా అమ్మగారికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చి కడపలోని ఈ ఆర్థోపెడిక్ నిపుణులని సంప్రదించటం జరిగింది. వారు తమకి చేతనైనంత మేరకు ఎక్స్-రేలు తదితర పరీక్షలు చేసి, వీలయినన్ని మందులు ఎవరికి తోచినవి వారు వ్రాసి, కీళ్ళలోకి నేరుగా స్టెరాయిడ్ ఇంజక్షన్స్ కూడా చేసి, వైసోలోన్ అనే కార్టికో స్టెరాయిడ్ , పెయిన్ కిల్లర్స్ వాడి

ఈ విధంగా తమకి తోచినంత మేరా, చేతనయినంత మేరా చికిత్స చేసి, హైదరాబాద్ లో ఉన్న రుమటాలజిస్టులని సంప్రదించమని చెప్పి చేతులు ఎత్తేశారు.

వైద్యశాస్త్రం అభివృద్ది అవటం పేరిట క్రమంగా, రుమటాలజి అనే విభాగం,  ఆ విభాగంలో నిపుణులైన రుమటాలజిస్టులు కూడా తయారయ్యారు. వీరు రుమటాయిడ్ ఆర్థరైటీస్ కి సంబంధించి వైద్యం చేస్తారు. మీరు ఇక్కడ కరెక్టుగా చదవాలి.వారు కేవలం రుమటాయిడ్ ఆర్థరైటీస్‍కి సంబంధించి వైద్యం చేస్తారు అన్నాను అంతే. తగ్గిస్తారు అనలేదు. ఎందుకంటే అల్లోపతిలో అనేక వ్యాధులకి మందులేనట్టే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి కూడా మందు లేదు.

భానుమతి గారి కథలలో ’అత్తగారి సెంటిమెంట్’ అని ఒక హాస్య కథ ఉంది.

కొత్తగా ఇంటికి వచ్చిన కోడలు బిచ్చగాడితో ’చేయి ఖాళీలేదు వెళ్ళబ్బాయి’ అని చెప్పివాణ్ణీ పంపేస్తుంది. అత్తగారికి సహజంగానే కోపం వచ్చి, బయటకి వచ్చి నాలుగయిదిండ్ల అవతలికి వెళ్ళిన బిచ్చగాడిని కేకేసి పిలిచి, తాను మళ్ళీ ఇంటి గుమ్మం ముందు నిలబడి, ’చేయి ఖాళీ లేదు, వెళ్ళబ్బాయి’ అని వాడిని పంపేస్తుంది.

అంటే ఏమిటీ అర్థం? ’హన్న! అత్తగారైన తాను నిర్ణయం తీస్కోవాలికానీ కొత్తగా వచ్చిన కోడలు నిర్ణయం తీస్కుని బిచ్చగాడిని వెళ్ళమని చెప్పటమేమిటి’ అని అన్నమాట.

ఇది అత్తగారి సెంటిమెంట్ అన్నమాట.

అదిగో సరిగ్గా ఇలాగే , ఈ రుమటాయిడ్ ఆర్థరయిటీస్ కి వైద్యం చేసే రుమటాలజిస్టులు

"’ఆర్థోపెడిషియన్లు విరిగిన ఎముకలకి కట్లు కట్టాలి. ఇది రుమటాయిడ్ ఆర్థరయిటీస్ ఏమో అనే మాట వారు ఎలా చెబుతారు" అని గట్టిగా కోప్పడి, మళ్ళీ అన్ని రకాల పరీక్షలు చేసి, అది రుమటాయిడ్ ఆర్థరయిటీసే అని తీర్మానం చేశారు.

ఇది వరికటి ఆర్థోపెడిషియన్లు వ్రాసిచ్చిన మందులే వేరే కంపెనీలవి వ్రాసి, దానికి తోడు వీరు కూడా వైసోలోన్ అనే కార్టికో స్టేరాయిడ్ వ్రాసి ఇచ్చి చికిత్సప్రారంభించారు.

మళ్ళి నెల- రెండు నెలలకి రమ్మంటారు కద. అలా ఈ మారు వెళ్ళినప్పుడు మళ్ళీ అనేక రకాలైన పరీక్షలు చేసి ఈ మారు సోడియం ఆరోథయోమలేట్ అనే ఇంపోర్టెడ్ ఇంజక్షన్ ని వ్రాసి ఇచ్చారు.

దీనికి తోడు గ్లూకొసమైన్ అనే ఔషధాన్ని వ్రాసి ఇచ్చారు.

ఈ రెండింటి గూర్చి కాస్త వివరంగా వ్రాస్తాను.

ఈ సోడియం ఆరోథయోమలేట్   ఇది అన్ని ఊర్లలో దొరకదు, కేవలం ఎంపిక చేసిన కొన్ని అధీకృత దుకాణాలలో మాత్రమే దొరుకుతుంది అని చెప్పారు. అది 3 ఎం.ఎల్ లేదా 5 ఎం.ఎల్ ఆంప్యూల్ రూపంలో ఉండే ఇంజక్షన్, అందులో ప్రధానంగా ఉండే ఔషధం బంగారు నుంచి తయారు చేయబడ్డ కాంపౌండ్.

అప్పట్లోనే ఒక ఆంప్యూల్ వెల పదమూడు వందలు పైచిలుకు.

ఇవి కాక, గ్లూకొసమైన్ పౌడర్. ఇంతా చేస్తే ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్. ఈ ఫుడ్ సప్లిమెంట్స్ డీసిజిఐ పరిధిలోకి రావు. (డీసిజీఐ అంటె డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా). అంటే మామూలు మాటల్లో చెప్పాలి అంటె, ఇవి ఔషదం అనే కాటగరీలోకి రాదు. దీనివల్ల దీని ధరని వాళ్ళిష్టం వచ్చినట్టు పెట్టుకునే అధికారం మందులకంపెనీకి ఉంటుంది.

ఈ తరహా మందులని వ్రాయాలంటే చాలామంది వైద్యులకి ఇష్టం. వాటిని అమ్మటం చాలా మందుల షాపులవారికి ఇష్టం. ఇంతకు మించి నేను వివరించను.

వైద్యులు యమ సీరియస్ గా లాబ్ రిపోర్ట్స్ చూసిఆ తరువాత యండమూరి వీరేంద్రనాధ్ గారి నవలలోని ఒక  మంచి డాక్టర్  గారిలా కిటికీ వద్దకి వెళ్ళిమాలతీతీవె మీదుగా బయటకి తేరిపారా చూసిఆ తరువాతఒకసారి పైకప్పు కేసి చూసితల పంకించి - ఏదో అర్థమయినట్టు గంభీరంగా పెన్ను పట్టుకుని’ఇక ఏం చేద్దాం తప్పదు’ అన్నట్టు భంగిమ పెట్టిప్రిస్క్రిప్షన్ పాడ్‍పై  వ్రాసేస్తూ ఉంటేఇకనేం మన వ్యాధి తగ్గిపోతుంది అని మనకు ఒక నమ్మకం ఏర్పడి పోతుంది.

సరే తప్పదు కద. "వైద్యో నారాయణో హరి" అన్నారు కద పెద్దలు. ’కత్తి తో పాటు డోలు వచ్చె డుం డుం డుం’ అని పాడుకుంటూ, ఇదివరకటి మందులకి తోడుగా వీటిని కూడా  ఒక నెలకి సరిపడా కొని కడపకి బయలు దేరాం, మరేం చేయలేక.

కానీ వాస్తవానికి ఇంగ్లీష్ వైద్య విధానంలో రుమటాయిడ్ ఆర్థరయిటీస్ కి చికిత్స లెదు. అది ఆటో ఇమ్యునో డిజార్డర్. అది మనకు చెప్పరు. తీవ్రమైన చివరి అంచె చికిత్స మొదలెట్టినట్టు గంభీరంగా లుక్ ఇస్తారు.

ఇంగ్లీష్ వైద్యంలో కాన్సర్ కి, జాండీస్ కి, చివరికి చుండ్రు కి, కడుపులోవచ్చే అల్సర్ కి  ఇలా ఒకటి కాదు రెండు కాదు, అనేకానేక వ్యాధులకి చికిత్స లేదు.

అల్సర్ విషయమే తీస్కుందాం. కడుపులో అల్సర్ తగ్గటానికి మందు లేదు. కేవలం కడుపులో స్రవించే హైడ్రోక్లోరిక్ ఆసిడ్ ని నియంత్రించి మంటని తగ్గిస్తారు. ఈ ఆసిడ్ ని ఎలా నియంత్రించాలనే దానికి వేరు వేరు పద్దతులని పాటిస్తారు. ఆ పద్దతిని బట్టి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్లు అని, హెచ్ టూ రిసెప్టార్ బ్లాకర్స్ అని అనేకానెక మందులు లభిస్తాయి తప్పనిచ్చి, అల్సర్ ని తగ్గిచ్చే విధానం అంటూ లేదు. ఎక్కడికీకాకుంటే ఆపరేషన్ చేసి కోసి అవతలపారేస్తారు.

మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఆసుపత్రికి వెళితే సంపూర్ణంగా ఆరోగ్యం లభిస్తుంది అని అనుకుంటాం.

ఒక యోగా మాష్టార్ చెప్పినట్టు, ఆరోగ్యం అన్నది ఒక సహజ సిద్ద స్థితి. అది దైవదత్తం. ఏ  డాక్టర్ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వడు. అనారోగ్యాన్ని తగ్గించే ప్రయత్నంలో శరీరానికి సహకరిస్తాడు అంతే. శరీరం తనంతట తానే అనారోగ్యాన్ని నియంత్రించుకుంటూ ఆరోగ్యంగా ఉండేందుకు నిత్యం ప్రయత్నం చేస్తు ఉంటుంది.

అందుకే ధార్మికులైన డాక్టర్లు "ఐ ట్రీట్ - హీ (భగవంతుడు) క్యూర్స్" అని చెబుతుంటారు.

ఇక్కడ డాక్టర్స్ ని కించపరచడం నా ఉద్దేశం కాదు. మీడియా వల్ల అయితేనేమీ, విశ్వాసం వల్ల అయితేనేమీ, కొన్ని సామెతల వల్ల అయితేనేమి మనం డాక్టర్లని దైవాంశ సంభూతులుగా భావిస్తుంటాము. దానివల్ల ఒక్కోసారి నిరాశపడిపోయి వాళ్ళని నిందిస్తూ  ఉంటాము నయం చేయలేకపోయాడని. పాపం వాళ్ళు కూడా మానవమాత్రులే కద అన్న ఇంగీతం కోల్పోతాము.

కొందరు వైద్యులు కూడా నిజాయితి గా ఈ వ్యాధికి ఇంగ్లీష్ వైద్యంలో చికిత్స లేదు  మా ప్రయత్నం మేము చేస్తున్నాం ,అని చెప్పి చికిత్స చేస్తే ఏ తంటా ఉండదు.

ప్రతి వృత్తిలో మంచి వాళ్ళు ఉన్నట్టు, వైద్యులలో కూడా మంచి వాళ్ళు ఉంటారు. ఇలాంటి మంచి వైద్యులు అన్ని విషయాలు కూలంకషంగా మనకు చెప్పి మనకు చికిత్స చేస్తుంటారు.

చివరికి కోయంబత్తూరు లో ఒక నిజం తెలిసింది. ఫార్మా కంపెనీ వృత్తి కారణంగా నాకు కోయంబత్తూరు‍లో పరిచయం అయిన, విశాఖకి చెందిన మన తెలుగు వారు కేఎంసీహెచ్ కి చెందిన సిటీ సెంటర్ విభాగంలో పని చేసేవారు, ఆయన నాకు కొన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలు చెప్పారు.

ఆయన రుమటాలజీలో సూపర్ స్పెషలైజేషన్ (ఎండీ,డీఎం -రుమటాలజీ) చేశారు. ఆయనే నవ్వుతూ, చికిత్సే లేని ఈ వైద్య విభాగంలో నేను సూపర్ స్పెషలిష్ట్‌ని అని వైరాగ్యంగా చెప్పారు.

"ఇంగ్లీష్ వైద్యంలో చికిత్స లేని ఎన్నో వ్యాధులలో ఈ రుమటాయిడ్ ఆర్థరయిటిస్ ఒకటి, చివరి దశగా కీళ్ళ వ్యవస్థ క్రమక్రమంగా క్షీణించి శారీరిక స్థితి కుప్పకూలుతుంది. ఏ జాయింట్ దీనికి బలిఅవుతుంది అనేది పేషంట్ యొక్క అదృష్టదురదృష్టాల పై ఆధారపడి ఉంటుంది. దీనికి చికిత్స లేదు.

దీని తీవ్రతని తగ్గించుకుంటూ, నొప్పి తగ్గే మందులద్వారా తాత్కాలిక ఉపశమనం పొందుతూ జీవితం గడపాల్సిందే" అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు.

అయినా మా ప్రయత్నాలని మేము మానలేదు.

అదివరకే ప్రయత్నం చేసిన కేరళకి చెందిన కోట్టక్కల్ ఆయుర్వేద విధానాన్ని తిరిగి ప్రయత్నిద్దాం అని చూశాం.

వారు నిజాయితిగా చెప్పారు. మీరు చాలా చివరిదశలో వచ్చారు. ప్రారంభదశలో వచ్చి ఉంటే మేము ఏమైన చేయగలిగి ఉండేవారం అని. నిజానికి ప్రారంభంలో సంప్రదించింది వారినే. ఎప్పుడైతే ఆర్థోపెడిషియన్లు చేతులెత్తేసి ఇది రుమటాయిడ్ ఆర్థరయిటిసీ ఉండవచ్చు అని చెప్పారో అప్పుడు, కడపనుండి నేరుగా రైల్లో కోట్టక్కల్ కి వెళ్ళి మొదటి ప్రయత్నం చేశాం. వాళ్ళు ఏవో తైలాలు వ్రాశారు కానీ అవి ఫలించలేదు.

చివరికి నొప్పి తగ్గేదానికి మా అమ్మగారి వత్తిడి వల్ల వైసొలోన్ అనే స్టిరాయిడ్ వాడుతూనే ఉండాల్సి వచ్చింది. దాని వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలిసినా , తప్పని సరి పరిస్థితులలో, వైద్యుల పర్యవేక్షణలో వారి సలహాలతో డోస్ సరి చేసుకుంటు వాడుతూ ఉండిపోయాం.

తన ఈ ప్రయాణంలో ఎన్నో మజిలీలు. ఎందరో డాక్టర్లు. ఎన్నో అనుభవాలు.

మంచిని మాత్రమే తలచుకుంటే మనసుకు శాంతి లభిస్తుంది. డాక్టర్లు కూడా దేవుళ్ళేం కాదు. పాపం వాళ్ళు కూడా మామూలు మనుషులే అని అనుకుంటే మనకు ఒక విధమైన నిశ్చింత కలుగుతుంది.

అతిగా ఏదైనా ఆశిస్తే కద నిరాశ కలుగుతుంది.

ఆశ లేకుండా నిష్కామ కర్మ చేయటమే మన విధి.

 

చివరికి మా అమ్మగారు 2006 లో మరణించారు.

****

కళ్యాణదుర్గం గూర్చి చెప్పాలని మొదలెట్టి , పుత్తూరు వైద్యం ప్రసక్తి రాగానే నేను ఏవేవో విషయాలు చెప్పేశాను కద. వస్తున్నా, వస్తున్నా. కళ్యాణదుర్గం కబుర్లు చాలా సరదాగా ఉంటాయి.

అన్ని చెపుతాను ఉండండి.

.

 

Friday, July 8, 2022

"రహదారులు నాగరికతకి చిహ్నాలు"

 "రహదారులు నాగరికతకి చిహ్నాలు"

-డా.రాయపెద్ది వివేకానంద్


"రహదారులు నాగరికతకి చిహ్నాలు" రహదారుల పక్కన ఈ బోర్డ్ మీరు గమనించే ఉంటారు.

ఇప్పటి మన జాతీయరహదారుల స్థాయిని బట్టి చూస్తే మనంత అనాగరికులు ఎవరూ ఉండరేమో.

****

హైవే పై మనం వెళ్తుండగా, దూరంగా వరుసగా వాహనాల బారు కనపడి, ఆ వరుసలో మన వాహనం చివర్లో ఆగవలసి వస్తే,

"ఏదో ఆక్సిడెంట్ అయి ఉంటుంది" అని భీతి మనల్ని నిలువెల్లా ఆవరిస్తుంది.

ఆక్సిడెంట్ అయిన దృశ్యం కనపడుతున్నప్పుడు, ఆ పక్కగా మనం వాహనంలో వెళుతున్నప్పుడు, కలిగే బాధ, వేదన కొన్ని గంటలు మనల్ని వదలదు.

నిర్జీవంగా పడి ఉన్న దేహాలు

గాయాలై రోదిస్తున్న బాధితులు

అయోమయంలో దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తున్న చిన్నారులు

చెల్లా చెదురుగా పడి ఉన్న వాహనాల తాలూకు శకలాలు

పగిలి ముక్కలైన అద్దం ముక్కలు

దూరం వరకు చెల్లాచెదురుగా పడి ఉన్న శరీర అవయవాలు

’కుయ్..కుయ్...కుయ్’ మని కూత పెడుతూ వచ్చి నిలుచున్న ఆంబులెన్స్ లు

ఈ దృశ్యాలు కొన్ని రోజుల వరకు మన స్మృతి పథం నుంచి దూరం అవవు.

****

ఎక్కడైనా ప్రమాదం జరిగింది అంటే కారణం ఒక్కటే ఒక్కటి.

 

" నిర్లక్షం"

 

==> రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం

==> వాహనం నడపటంలో నిర్లక్ష్యం

==> వాహనం తయారీలో నిర్లక్ష్యం

==> వాహన నిర్వాహణలో నిర్లక్ష్యం

 

ఇంతకు మించి వేరే ఏ కారణం నాకు కనిపించదు.

 

*****

అదేదో సినిమాలో చిరంజీవి చెప్పారు గుర్తుంది కద, "ఇంగ్లీష్ భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం థాంక్స్" అన్నట్టు హైవేల పక్కన  నాకు నచ్చని ఒకే ఒక బోర్డ్ "ప్రమాదములు జరుగు స్థలము".

ఎన్నో బోర్డులు ఉంటాయి హైవే పై

***

’ఫలానా జిల్లాకి స్వాగతం’

’టోల్ గేట్ ఇంకా ఒక కిలోమీటర్’

’ఎత్తు ఎక్కే వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వండి’

’పెట్రోల్ బంకు ఇంకా ఫలాన అన్ని కిలోమీటర్లు’

’రిఫ్రెష్‍మెంట్స్ అండ్ రెస్టారెంట్ ఫలానాన్ని కిలోమీటర్లు’

ఇలా రకరకాల బోర్డులు దర్శనమిస్తుంటాయి.

ఈ బోర్డులతో ఏమీ చింత లేదు. ఇవి అవసరమే కూడా.

ఇవి కాకుండా

’డోంట్ మిక్స్ డ్రింక్ అండ్ డ్రైవ్’

’అతివేగం ప్రమాదం’

’అత్యవసరమైన సమయంలో ఫలాన నంబర్‍కి ఫోన్ చేయండి’

’ఎడమవైపుకే ప్రయాణించండి’

’సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకండి’

’సీట్ బెల్ట్ పెట్టుకోండి’

ఈ తరహా బోర్డులు కూడా అవసరమే.

 

కానీ

’స్పీడ్ బ్రేకర్లు ఉన్నవి జాగ్రత్త’

’ఇరుకైన రహదారి’

’దగ్గర్లో స్కూలు ఉంది’

 ’ప్రమాదకరమైన మలుపు ఉన్నది జాగ్రత్త’

’ప్రమాదములు జరుగు ప్రదేశము’

ఈ తరహా బోర్డులు అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనాలు అని నేను భావిస్తాను.

అంటే వాళ్ళ దృష్టిలో వాహనదారుల ప్రాణాలకి కనీ, పాదచారుల ప్రాణాలకి కానీ గడ్డిపోచకంటే ఎక్కువ విలువలేనట్టే గా.

అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనీ, ఇదివరకు అక్కడ ప్రమాదాలు ఎక్కువగా జరిగాయని తెలిసినప్పుడు అధికారులు ఏమి చేయాలి వాస్తవానికి?

అక్కడ ప్రమాదాలు జరిగే దానికి కారణం అన్వేషించి, దానికి అనుగుణంగా రహదారి నిర్మాణంలో ఉన్న లోటుపాట్లని సరిజేయాలి కద.

స్కూల్ ఉన్న దగ్గర ఫుటు ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయటం,

రోడ్డు వెడల్పు చేయటం, రెండు దారులకి మధ్యన విభాగిని (డివైడర్) ఏర్పాటు చేయటం, లేదా ఏదైనా రోడ్ వచ్చి అక్కడ ప్రమాదకరంగా కలుస్తొంది అంటే, రక్షణ చర్యలు చేపట్టి, అక్కడ సబ్ వే గానీ, ఫ్లై ఓవర్ కానీ ఏర్పాటు చేయటం. లేదంటే అక్కడ ఆ చిన్న దారిని కలువనీయకుండా చేసి, ప్రధాన రహదారికి సమాంతరంగా ప్రయాణం చేసేలా చేసి, ఒక దగ్గర కలిసి, ఆ తర్వాత యూ టర్న్ తీసుకునే లాగా ఏర్పాటు చేయలేరా?

హైదరాబాద్ నగరంలో మెట్రో స్టేషన్ల వద్ద నిర్మాణాన్ని ఎప్పుడైనా గమనించారా? స్టేషన్ తాలూకు ప్రయాణీకులు రోడ్డుకి ఇబ్బంది కలగజేయకుండా, రోడ్ ట్రాఫిక్ వల్ల  మెట్రో స్టేషన్ కి వెళ్ళి వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఎంత చక్కటి ఏర్పాట్లు చేశారో మీరే స్వయంగా చూడండి ఒకసారి.

మనిషి ప్రాణాలకి విలువ ఇస్తే నిర్మాణాలు ఇలాగే చేస్తారు.

అలా కాకుండా, ’ప్రమాదములు జరుగు ప్రదేశము’ అని ఒక బోర్డ్ పెట్టి, వీలయితే నాల్గయిదు వేగ నిరోధకాలు( స్పీడ్ బ్రేకర్లు) ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవడం పరిష్కారం కానే కాదు.

ఇటీవల ఎన్‍హెచ్ 44 పై ఇంకో కొత్త పోకడ గమనించాను. చిన్న చిన్న ఊర్ల దగ్గర అడ్డంగా హైవేని ఖండిస్తూ వెళ్ళే చిన్న దారి ఉన్న దగ్గర, ’ప్రమాదములు జరుగు ప్రదేశము’  అని ఇలా బోర్డ్ పెట్టి, రోడ్డు మీద మందంగా తెల్ల పెయింట్ తో స్పీడ్ బ్రేకర్ల లాంటివి ఏర్పాటు చేసి , ఆ జంక్షన్ దగ్గర ’జిగి జిగి జిగి జిగి’ అని వెలిగి ఆరే ఎరుపు, నీలం, పసుపు రంగు దీపాలు ఏర్పాటు చేసి నిర్భీతిగా చేతులు దులుపుకుంటున్నారు.

ఇది నిస్సందేహంగా దేశద్రోహమే.

ఒక ప్రాణం ఎంత విలువైందో వారికి తెలియదనా అర్థం? లేదా తొక్కలో ప్రాణంలే అన్న నిర్లక్షమా?

అంతర్జాతీయ నిభందనల ప్రకారం ఎక్స్ ప్రెస్ హైవేలపై స్పీడ్ బ్రేకర్స్ ఉండరాదు. కారణం విదితమే. నూరు నూట ఇరవైల వేగంతో వెళ్ళే వాహనం సడన్ గా బ్రేక్ వేస్తే అనేక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.  అందుకే ఘనత వహించిన మన జాతీయ రహదారి అధికారులు, ఇలాంటి ప్రమాదకర , చౌకబారు ఏర్పాట్లు చేసి, తమ గౌరవాన్ని తాము పోగొట్టుకోవటమే కాక, నిండు ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు.

ఒక్కో దగ్గర వారు ఇంకా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంటారు.

అవేంటంటే, అయిదారు నిలువెత్తు తారు డ్రమ్ములను వరుసగా ఒక దానిపక్కన ఒకటి  రోడ్డుకు ఎడం వేపునుంచి, రోడ్డుకి సగం దాకా ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత కొన్ని అడుగుల దూరం వెళ్ళాక ఇందాకట్లాగే తారు డ్రమ్ములను ఈ మారు రోడ్డుకి కుడి వేపు నుంచి ఏర్పాటు చేస్తారు.

ఆ విధంగా కొన్ని అడుగుల తేడాతో, కుడి  ఎడమ వైపుల నుండి సగం దారిని, మూసేస్తారు. ఇప్పుడు రహదారి మీద వెళ్ళే వాహనం పాములాగా మెలికలు తిరిగి వెళ్ళాలి. ఇలాంటి ఏర్పాట్లతో భారీ లారీలు బోల్తా పడిన సందర్భాలు ఎన్నో. ఎక్కడో నక్సలైట్స్ సంచరించే అడవి రహదారులపై పోలీసులు ఇలాంటి ఏర్పాట్లు చేసి, వాహనాల వేగం తగ్గించి ఆపై తనిఖీ చేసే వారు. ఎక్స్‌ప్రెస్ హైవేలపై కూడా ఇలాంటి కాలం చెల్లిన విధానాలేనా?

ఇలాంటి ప్రమాదకరమైన రహదారులని జాతీయ రహదారులగా భ్రమించి, నూరూ నూటా యాభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటారు కొంతమంది.

’మేము కర్నూలు నుంచి బెంగళూరుకి అత్యంత వేగంతో ప్రయాణించి మూడు గంటల్లో చేరామ’ని ఒకరు,

’రెండున్నర గంటల్లో చేరామ’ని ఒకరు ఇలా పోటీలు పడి కబుర్లు చెప్పే బంధుమిత్రులని చూశాను. వారిని ప్రోత్సహించే మిత్రులని చూశాను.

మన రహదారులని గమనిస్తే ఇవి సాక్షాత్తు మృత్యుకుహురాలే అని మీకు అర్థం అవుతుంది

 

** హైవేపై సైతం, ఎదురుగా అతి వేగంతో దూసుకువచ్చే ఆటోలు, ట్రాక్టర్లు, లారీలు, మోటార్ సైకిళ్ళూ మీకు సర్వ సాధారణంగా కనిపిస్తాయి. వీళ్ళు ఏ మాత్రం తడబాటు లేకుండా నిర్భీతిగా వచ్చేస్తూ ఉంటారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే మన న్యూస్ పేపర్లు కూడా ఇలాంటి వాటిని ఖండించకుండా, తప్పు ఎవరిది అన్న విషయం రాయకుండా సరైన దారిలోవెళ్తున్న పెద్ద వాహనందే తప్పు అన్నట్టు వ్రాస్తారు. ’నుపుర్ శర్మ విషయంలో గౌరవ న్యాయస్థానం వారి తీర్పు’ లాగే ఉంటాయి ఈ వార్తా పత్రికల కథనాలు.

** అడ్డంగా దూసుకు వచ్చే ద్విచక్రవాహనాలు

** నిర్భీతిగా రోడ్డుపై సంచరించే పశువులు

** రోడ్డు పై ధాన్యం  ఆరబెట్టటం తదితర పంట నూర్పుళ్ళకి సంబంధించిన వ్యవహారాలు

** వాహనం నుంచి బయటకి పొడుచుకుని వచ్చిన పొడగాటి ఇనుప చువ్వలు, ఇనుప కంబాలు ఇలాంటి దరిద్రాలన్నీ హైవేలపై కూడా ఉన్నాయి.

****

ప్రతి వాహనం కొనేటప్పుడు లక్షల రూపాయలు రహదారి పన్ను అని ప్రతి వాహన దారుడు కడతాడు. ఎందుకు కట్టాలి, ఇటువంటి రక్షణ లేని రహదారుల మీద ప్రయాణం చేయటానికి పన్ను?

అదికాక ఇటీవల టోల్‍గేట్లు అనే పేరు పెట్టుకుని నిస్సంకోచంగా వాహనదారుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు.

పూర్వం టోల్ గేట్ వంటి ఆధునిక పోకడలు లేని రోజుల్లో ఉన్న దరిద్రాలన్నీ ఇప్పటికీ హైవేలపు ఉన్నాయి. కానీ టోల్ గేట్ పెట్టి వసూలు చేయటం మాత్రం ఆపరు.

ఒక రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాలి అంటే, కనీసమంటే ఓ మూడు నాలుగు టోల్ గేట్లు వస్తాయి మధ్యలో. ఒక్కొక్క టోల్ గేట్ వద్ద రమారమి నూరు రూపాయలు వసూలు చేస్తారు ఒక వైపు ప్రయాణానికి. అంటే కార్లో,  హైదరాబాద్ నుంచి కర్నూలు చేరే లోగా (రెండు వందల ముఫై కిలోమీటర్లు)లోగా, దాదాపు మూడు వందల రూపాయలు ఈ టోల్ గేట్లకి కట్టాల్సి వస్తుంది.

ఆల్రెడీ కార్ కొనేటప్పుడు లక్ష, లక్షన్నర దాకా రహదారి పన్ను కట్టాలి.

ప్రతి ప్రయాణంలో ఇలా రెండు వందలకిలోమీటర్ల దూరానికి దాదాపు మూడు వందల దాకా టోల్ కట్టాలి.

ఇంతా చేస్తే, ప్రయాణంలో భద్రత ఉంటుందా అంటె అది నేతి బీరకాయలో నెయ్యి వంటిదే.

***

నాయకత్వ లక్షణాలని గూర్చి చెబుతూ, "ఉత్తిగా విమర్శించటం ఎవరైనా చేస్తారు, పరిష్కారాలు చెప్పగలిగినవాడే సరిఅయిన నాయకుడు" అంటాడు చాణక్యుడు.

పేజీడు విమర్శలు గుప్పించి,  పరిష్కారం చెప్పకుంటే నా వ్యాసం అసంపూర్ణంగా ఉన్నట్టె లెక్క.

నేను నాకు తోచిన కొన్ని పరిష్కారాలు చెబుతాను ఇక్కడ.

పూర్తి రక్షణతో కూడిన జాతీయ రహదారి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే, మన నాయకులు విదేశియాత్రలు చేయాల్సిన అవసరం లేదు.

మన హైదరాబాద్ చుట్టు ఉన్న ’ఔటర్ రింగు రోడ్డుని అధ్యయనం చేస్తే చాలు’

** ఎనిమిది లేన్ల సూపర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఇది. దీనిపైకి ఎవరు పడితే వారు ఎలా పడితే అలా ఎక్కేందుకు వీలు లేదు. నిర్ణీత ఎంట్రీ పాయింట్స్ దగ్గర మాత్రమే ఎక్కగలం, నిర్ణీత ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర మాత్రమే దిగగలం.

** ఎదురుగా ఏదో వాహనం వ్యతిరేక దిశలో వస్తుందన్న భయం ఏ మాత్రం ఉండదు దీనిపై. కళ్ళు మూసుకుని నడపవచ్చు (ఇది మాటవరుసకి అన్నమాట. నిద్రపోరాదు డ్రయివింగ్ చేసేటప్పుడు)

** ఏ ఎనిమిది లేన్ల రహదారి పది లేన్ల (10  Lanes)  రహదారిగా మారిపోతుంది, ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్ అర కిలోమీటర్  ముందు నుంచి. ఇంత పకడ్బందీగా నిర్మిస్తే ఎందుకు ప్రమాదాలు జరుగుతాయి.

** ఈ యావత్తు ఔటర్ రింగ్ రోడ్డు రాత్రి పూట కూడా పట్టపగలల్లే మెరిసి పోయేలా సౌరవిద్యుత్ తో దీపాలు వెలుగుతాయి

** ఎగ్జిట్ పాయింట్ ఇంకా రెండు కిలోమీటర్లు ఉందనంగా పెద్ద పెద్ద బోర్డులు మనల్ని హెచ్చరిస్తాయి ఫలానా గమ్యం వస్తోంది అని.

** ఎక్కడా కూడా రోడ్ ఇంటర్ సెక్షన్లు ఉండవు. దీనిని అడ్డంగా ఖండించే ప్రతి రహదారి కూడా ఈ రోడ్డు కిందనుంచి వెళతాయి సాఫీగా, ఏ అడ్డూ రాకుండా.

** దీనికి తోడు ఈ ఎనిమిది / పది లేన్ల సూపర్ ఎక్స్‌ప్రెస్ హైవే కి సమాంతరంగా అటూ ఇటూ కూడా సర్వీస్ రోడ్డు అనే పేరుతో, మరో నాలుగు లేన్ల రహదారులు ఏర్పాటు చేశారు కొనా మొదలు. టోల్ కట్టే ఉద్దేశం లేని వారు వీటిపై ప్రయాణీంచవచ్చు, అది ఒక ప్రయోజనం, ఇంకొక ప్రయోజనం ఏమిటంటె, ఒక ఎగ్జిట్ దగ్గర ఎక్స్‌ప్రెస్ హైవే దిగిన  వారు ఈ సర్వీస్ రోడ్డు పై ముందుకో వెనక్కో, ప్రయాణించి తమ గమ్యాన్ని అందుకోవచ్చు

***

ప్రతి జాతీయరహదారి ఈ విధమైన ఏర్పాట్లతో ఉండాలి. అపుడే వాటిని జాతీయరహదారి అని చెప్పవచ్చు.

కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి?

ఎప్పుడో మధ్య యుగాలనాటి పద్దతులతొ నిర్మించిన రహదార్లను జాతీయరహదార్లు అనే పేరు పెట్టుకుని, వాటికి టోల్ చెల్లించుకుంటూ, ప్రాణాలని అరచేత్తో పెట్టుకుని ప్రయాణిస్తున్నాము. ఇంకా చిత్రం ఏమిటంటే, టోల్ గేట్ వద్ద డబ్బు కడుతున్నాం కాబట్టి ఈ జాతీయరహదారులు క్షేమకరమేఅని భ్రమకి గురయి నూరూ నూటాయాభై కిలోమీటర్ల వేగంతో వెళుతున్నాం మనం.

***

కొసమెరుపు:

ఇంత పద్దతిగా నిర్మించిన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కూడా భయంకరమైన ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయినవారికి కొదవలేదు.

అధికారులు వాళ్ళ వైపు నుంచి ఎటువంటి లోపం లేకుండా నిర్మాణాలు చేసినా, నిర్లక్షంగా డ్రైవ్ చేసే అల్పాయుష్కులైన వారిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. డ్రైవర్లు కూడా అన్ని విధాలుగా సేఫ్ గా డ్రైవ్ చేయాలి కద.

 -డా.రాయపెద్ది వివేకానంద్

8.07.2022 Thursday.

Monday, June 6, 2022

కాఫీ ప్రియుడు

 


కాఫీ ప్రియుడు

డా.రాయపెద్ది వివేకానంద్

-------------------------------------------------------------------------------------------------

 ఓ పెద్ద బాంక్ ఫ్రాడ్‍ని నేను అరికట్టగలిగాను.

అదెలాగంటారా చెబుతాను. అది చెప్పాలి అంటే ముందుగా మీకు మదన్ గూర్చి చెప్పాలి.

మదన్ గూర్చి చెప్పాలంటే ఒకటా రెండా ఎన్నో సంగతులు చెప్పాలి , అతని గూర్చి ఎక్కడి నుంచి మొదలెట్టాలి అని ఆలోచిస్తే, ఎంతకూ ఆలోచనలు తెగటం లేదు. మా పరిచయం కాఫీతో మొదలయ్యింది కాబట్టి కాఫీ గూర్చిన విషయాల దగ్గర మొదలెట్టడమే సబబు.

మదన్ కాఫీ ప్రియుడు.

ఇతను కాఫీ ప్రియుడు అని ఒకే మాటలో చెప్పి వదిలేస్తే సరిపోదు, ఇతను నిరంతర కాఫీ దాత కూడాను.

కాఫీ దాతలు ఉంటారా ఎక్కడైనా అని మీకనుమానం రావచ్చు. మదన్‍ని చూసే వరకు ఇలాంటి పదప్రయోగం ఒకటి చేయాలి నాకు కూడా అనిపించలేదు.

ఇంతకీ అతన్ని కాఫీ దాత అని ఎందుకన్నానంటే, అతను తాను మాత్రమే కాఫీ త్రాగి ఊరికే ఉండే రకం కాదు. ప్రతీ రోజు కనీసం ఓ వందమందికి కాఫీ తాగించే వాడు అని నా అంచనా.

మీరు అన్న దానం గూర్చి విని ఉంటారు, వస్త్రదానం గూర్చి వినిఉంటారు. భూదానం, గోదానం ఇలా రకరకాల దానాల గూర్చి వినిఉంటారు.

అన్న సంతర్పణల గూర్చి కూడా వినే ఉంటారు మీరు. కానీ మీరు ఖచ్చితంగా కాఫీ సంతర్పణ గూర్చి విని ఉండరనుకుంటా.

మదన్ అనే ఈ కాఫీ ప్రియుడ్ని కలిసే వరకు నాకు కూడా తెలియదు ఇలాంటి ఒక వ్యక్తి ఉంటాడని, ఉచితంగా ఇలా వందలమందికి కాఫీలు త్రాగిస్తారని నాకు కూడా తెలియదు.

ఇటీవల కడపకి వెళ్ళినప్పుడు గుర్తు వచ్చాయి ఈ సంగతులన్నీ.

ఈయన ఒక పిల్ల జమిందార్ అని చెప్పవచ్చు. దగ్గర్లో ఉన్న కాజీపేట అనే ఊరి నుంచి వచ్చేవాడు రోజు కడపకి. ఈయన ఒక్కోసారి కైనెటిక్ హోండాలో, ఒక్కోసారి ప్రీమియర్ 118 ఎన్ ఈ అనే కారులో వచ్చేవాడు. ఆయనకి డబ్బుకి కొదవలేదు అన్నది నిర్వివాదాంశం. మంచి మాటకారి. కనుముక్కు తీరుగా, చూడంగానే చక్కగా ఆకర్షణీయంగా ఉండేవాడు.

అంత చక్కగా ఉండే ఆయనలో ఒక అవకరం చూసి నిజంగా అవాక్కయ్యాను ఒకసారి.

ఓ రోజు ఆయన స్కూటర్ పార్క్ చేసి, కాఫీ హోటల్ వంక వచ్చేటప్పుడు చుసి అవాక్కయ్యాను. ఆయనకి పోలియో. ఒక కాలు ఈడుస్తూ నడుస్తాడు.

దేవుడు ఎందుకు ఇలా అన్యాయం చేస్తాడు కొందరికి అని అనిపించింది నాకు క్షణంలొ.

 

తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేమి కోరేది

కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది

 

తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది

బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది

ఎంత బాధపడకుంటే సీతారామ శాస్త్రి గారు ఈ తరహా  పాట వ్రాసి ఉంటారు. ఇలాంటి ఏదో సంఘటన ఆయనతో ఆ పాట రాయించి ఉంటుందనుకుంటా.

మదన్  వయస్సు దాదాపు ముఫై ఉంటుంది, అప్పటికి. నాకు తెలిసి ఆయనకి పెళ్ళి కాలేదు.

ఆయనికి ఆటోమొబైల్స్ అంటే పిచ్చి. వాహనాల గుర్చి ఆయనకి తెలియని విషయాలు ఉండేవి కావు. టూ స్ట్రోక్, ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ల గూర్చి, ఆటో స్టార్ట్ , ఆటో గేర్, జర్మన్ డిజైన్, జపనీస్ డిజైన్ ఇలా ఆటోమొబైల్ ఇంజినీరింగ్ కి సంబంధించి కూలంకషంగా మాట్లాడుతూ ఉండేవాడు నాతో. నాక్కూడా ఆటోమొబైల్స్ అంటే ఇష్టం కాబట్టి అతనితో జోరుగా మాట్లాడేవాడిని.

ఆ తర్వాత  నేను గమనించింది ఏమిటి అంటే, ఎవరికి ఏ విషయం ఆసక్తో గమనించి వారితో సాధికారికంగా ఆ విషయం గూర్చి లోతుగా మాట్లాడేవాడు. పొలాల్లో నాట్లు, ఎరువులు, విత్తనాలు, బ్యాంకింగ్ ఇండస్ట్రీ, క్రికెట్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ , టెలికాం ఇండస్ట్రీలో రాగల పెనుమార్పులు ,ఇలా ఆయన మాట్లాడే మాటల్లో వివిధ అంశాలు దొర్లేవి.

అప్పటికింకా ఇంటర్ నెట్ విప్లవం రాలెదు దేశంలో . ఇంకా బీఎస్‍ఎన్‍ఎల్ మాత్రమే రాజ్యం చేస్తున్న రోజులు అవి. భారత్ లో రాగల పెనుమార్పుల గూర్చి ఆయన చేసిన ఊహలు చాలా మట్టుకు నిజం అయ్యాయి.

ఈయన రాయలసీమ గ్రామీణ బ్యాంకులో పని చేసి, వాలంటరీ రిటయిర్మెంట్ తీస్కుని, ఏదో వ్యాపారాలు చేసే వాడు. రిజైన్ కాదు-పాడు కాదు ఏదో ఫ్రాడ్ లో ఇరుక్కున్నాడు ఆయన్ని సస్పెండ్ చేశారు అని గిట్టని వాళ్ళు చెవులు కొరుక్కునే వారు. ఏది ఏమైనా అతని ముందు అందరూ చాలా తీయగా మాట్లాడి అతనందించే తియ్యటి కాఫీ త్రాగి వెళ్ళే వారు.

ఆ రోజుల్లో సెల్ ఫోన్లు అవీ ఉండేవి కావు. కానీ ఈయన్ని కలుసుకోవాలి అంటే ఎక్కడ ఉంటాడబ్బా అని కంగారు పడాల్సిన పని లేదు.. కడప  పట్టణం  నడిబొడ్డున మద్రాసు రోడ్డులో ఉండే మిధున్ రెఫ్రెష్‍మెంట్స్ అనే రెస్టారెంట్ ఇతని అడ్డా.

నేను ఆ రోజుల్లో కడపలో మెడికల్ రెప్రజెంటేటివ్ గా పని చేస్తూ ఉండేవాడిని.

నెను మిత్ర బృందంతో తరచు అక్కడికి వెళ్ళే వాడిని. అక్కడ కాఫీ చాలా బాగా ఉంటుంది.

కడపలో ఈ మిథున్ రెఫ్రెష్ మెంట్ లోనే కాదు, మణీ హోటల్, సుజాత హోటల్, అశోకా హోటల్, మయురా టిఫిన్స్ , ఇలా ప్రతి చోటా కాఫీ బాగా ఉండేది. అప్పట్లో గవర్నమెంట్ హాస్పిటల్ సందు ఎదురుగా క్రిష్టియన్ లేన్ ప్రారంభం మలుపులో,ఒక హోటల్  ఉండేది, పేరు గుర్తు లేదు, అక్కడ కూడా కాఫీ చాలా బాగా ఉండేది.

ఇన్ని హోటళ్ళు ఉన్నా మన మదన్ మాత్రం మిధున్ రిఫ్రెష్‍మెంట్స్ వద్దనే ఉండేవాడు. ఈ మిధున్ రిఫ్రెష్‍మెంట్స్ అనే హోటల్ కి ఇతను మహరాజ పోషకుడు అని చెప్పవచ్చు. ఇక్కడ కాఫీ, టీ, టిపిన్స్ మాత్రమే దొరికేవి. భోజన సౌకర్యం లెదు.  అక్కడ దొరికే పదార్థాలు అన్నీ ఆరగిస్తూ , ఆరారా కాఫీ సేవనం చేస్తు కులాసాగా గడిపే వాడు. లోపల టేబుల్ వద్ద కాసేపేమన్నా కూర్చుంటాడేమో, అధిక భాగం,. బయట రోడ్డు కనపడేలా నిలుచుని కాఫీ త్రాగే వాడు. నిలువెత్తు రౌండ్ టేబుల్స్ రెండు ఉండేవి బయట.  ఆయన చుట్టూ ఎప్పుడు మిత్రులు ఉండేవారు. ఆయన ఎన్ని సార్లు కాఫీ త్రాగుతాడో లెక్కలేదు.  ఎప్పటి లెక్క అప్పుడే తేల్చేసేవాడు, అప్పు గిప్పు వంటి తలకాయ నొప్పులు ఏమి పెట్టుకునే వాడు కాదు. అందుకే హోటల్ వారు కూడా ఆయన్ని గౌరవంగా చూసుకునేవారు.

కొత్త వారితో పరిచయం చేసుకోవడంలో నేను పెద్ద నైపుణ్యం ఉన్న వాడిని కాను. ఆయనతో నా పరిచయం కూడా ఆయన స్నేహశీలత వల్లనే సాధ్యమయింది అని చెప్పటంలో సందేహం లేదు.

మెడికల్ రెప్రెజెంటేటివ్స్ అంటే ఆయనకి ప్రత్యేక అభిమానం కద్దు.

అందునా అతనికి నేనంటే చాలా అభిమానం ఎందుకో. ఒక సారి ఆ రహస్యం కూడా బయట పెట్టేశాడు. ’మీ కులపోళ్ళు అంటే నాకు చాలా గొరవం , మీరు గురువులు సర్’ అని అనేశాడు  అందరి ముందూ ఒకసారి. ఆ మాట తరచు అనే వాడు. నాకు ఇబ్బందిగా అనిపించేవి అతని ఆ మాటలు.

నేననే కాదు, రోడ్డు మీద మిత్రులు ఎవ్వరు వెళుతూ కనిపించినా "అన్నా, అన్నా, ఇది అన్యాయం...చూడకుండా వెళుతున్నావు" అన్బి కేకలు వేసి మరీ పిలిచే వాడు. వారు మోటార్ సైకిల్ పార్క్ చేసి వచ్చేలోగా కౌంటర్లో వ్యక్తికి సైగ చేసి కాఫీ కి ఆర్డర్ ఇచ్చేవాడు. మనం ఆ రోడ్డు గుండా ఎన్ని సార్లు వెళ్ళీనా ఇలా బలవంతంగా కాఫీ ఇప్పించే వాడు

వద్దంటే వినడు. అలుగుతాడు. మనం డబ్బివ్వబోతే "ఏదీ ఇవ్వు చూద్దాం" అని చిలిపిగా నవ్వుతూ అనేవాడు. మనం ఇవ్వబోయినా ఆ కౌంటర్ లో వ్యక్తి తీస్కునే వాడు కాదు.

వయసుతో నిమిత్తం లెదు అందర్నీఅన్నా అనే పిలిచే వాడు, పెద్దవారినీ, చిన్నవారిని కూడా అన్నా అని పిల్చే వాడు.

ఇలా ఉదయం నుంచి, సాయంత్రం దాకా కాఫీ సంతర్పణ జరిగేది మదన్ ఆధ్వర్యంలో.  మధ్యాహ్నం ఏదయినా హోటల్లో స్నేహితులకు, లంచ్ పెట్టించి, తానూ లంచ్ ముగించి ఏదయినా మాటినీ ఆట చూసుకుని, మళ్ళీ సాయంత్రానికల్లా మిధున్ రిఫ్రెష్‍మెంట్స్ ముందు వాలిపోయేవాడు. రాత్రి తొమ్మిది గంటల  ప్రాంతంలో ఇంటి ముఖం పట్టే వాడు. ఇది అతని దినచర్య.

ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐనిస్టీన్ గాంధీ మహాత్ముడి గూర్చి ఇలా చెప్పాడు అంటారు "గాంధీ అనే వ్యక్తి ఈ భూమ్మీద నడయాడాడు అని చెప్పినా రాబోయే తరాల వారు అసలు  నమ్మరేమో అని నేను బాధపడుతున్నాను" అని.

నేను మదన్ గూర్చి ఇంచుమించు ఇలాగే చెప్పాల్సి వస్తుంది. ఇలా జనాలకు ఉచితంగా నిరంతరం కాఫీలు వితరణ చేసే ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఎవ్వరూ నమ్మరేమో. ఇలా నిరంతర కాఫీ యఙ్జానికి అతను ఎంత డబ్బు తగలేసేవాడో నాకు అర్థం కాదు ఎప్పటికీ.

కడపలో ఫాక్షనిస్టులు ఉన్నారు అని చెప్పి, సినిమాలు తీసే దర్శకులకు ఈ మదన్ ని చూపాలి అనిపిస్తు ఉంటుంది.

ఇతని గూర్చి తెలియని మిత్రులకు నేను మదన్‍ని గూర్చి, అతని జీవిత శైలి గూర్చి చెబితే నమ్మలేక దిగ్భ్రాంతి చెందారు. ఆహా, ఇది కద లైఫ్ అంటే ఆని తెగ ఎక్సైట్ అయిపోయారు.

ఈ సంతర్పణ లో కాఫీ కప్పు ఎవరి చేతిలో అయినా  వాలాలంటే, వారు మదన్‍కి పరిచయస్తులే అయి ఉండనక్కరలేదు. నాతో బాటు ఎవరైనా స్నేహితులు ఉన్నారంటే, నేను మొహమాటంగా మెహం అటు చేసి రోడ్డు మీద వెళుతుంటే కూడా వదిలే వాడు కాదు. ’అన్నా ... అన్నా’ అని కేకలేసి మరీ పిలిచే వాడు. మేము మోటార్ సైకిళ్ళు  పార్క్ చేసి వచ్చే లోగా మేం ఎంత మందిమి ఉన్నామో అన్ని కాఫీలు బయట ఉన్న నిలువెత్తు గుండ్రటి బల్ల మీద వాలి పోయేవి. ఆయన మనం వచ్చే లోగానే కౌంటర్ లోని వ్యక్తికి ఫలాన అన్ని కాఫీలు కావాలని ముందే సైగల భాషలో చెప్పేస్తాడు.

నాతో పాటు వచ్చిన ఓ మిత్రుడు  ఓ పెద్ద మాటనేశాడు ఒకసారి.

"నీకు శాశ్వతంగా ఒక విగ్రహం పెట్టించాలి మదన్, అది కూడా ఎలాగంటె అంబేద్కర్ గారి విగ్రహం లా ఒక వేలు  పైకెత్తి చూపుతూ ఉండాలి. ఆయన లాగా నీకు అందరూ ఒక్కటే, అలాగ కూడా సెట్ అవుతుంది విగ్రహం, అదే విధంగా ఒకటి కాఫీ అని ఆర్డర్ ఇస్తున్నట్టు ఉంటుంది" అని

ఏదో కాఫీ త్రాగి వెళ్ళకుండా ఈ విధమైన అప్రస్తుత ప్రసంగం చేస్తున్న మిత్రుడి వంక చూస్తూ తలపట్టుక్కూర్చున్నాను.

కానీ ఈ భోళా శంకరుడు తెగ ఆనందపడిపోయాడు అ ప్రశంశకి.

"ఏదో అన్న మీ అభిమానం, ఇంకో కాఫీ చెప్పమంటావా" అని అడిగాడు ఆ అనందంలో. ఖర్మ.

ఈయన అభిమానం చల్లగుండా.  తప్పించుకుని పోబొతే పోనీడు. బిల్లు కట్టబోతే కట్టనీడు. వద్దు అంటె వినడు. మనం బండి పార్క్ చేసి అతని దగ్గరికి వెళ్ళేలోగా టేబుల్ పై కాఫీ రేడీగా ఉంటుంది.  మనం వద్దు అంటే, ’సరేలే అన్నా పారేద్దాము’ అంటూ నిష్టూరం చేస్తాడు. మనం కాఫీ త్రాగితే ఆయనకి తృప్తి. టీ త్రాగే వారంటే ఆయనకి ఒక విధమైన చిన్న చూపుకూడా కద్దు.  ఆ హోటల్లో టీ రేటు కూడా తక్కువ నిజానికి.

"అసలు మనిషనే వాడు టీ ఎలా త్రాగుతాడు అన్నా!" అని అనేశాడు ఒకసారి. నిజానికి నాకు వ్యక్తిగతంగా టీ త్రాగటమే ఇష్టం. కానీ కాఫి పట్ల అయిష్టత లేదు. కానీ మదన్ అలా మధ్యే మార్గం ఎన్నుకున్నవాడు కాదు. టీ త్రాగే వారి పట్ల చిన్న చూపు, కాఫీ తాగేవారి పట్ల గౌరవభావం బాహటంగానే వ్యక్త పరిచేవాడు.

మొత్తానికి కొన్ని వందల కాఫీలు త్రాగి ఆయనకి ఋణపడి ఉన్నాను నేను. సరే ఆయన ఋణం తీర్చుకునే అవకాశం రానే వచ్చింది ఒక సారి.

నాకు తెలియకుండానే నేను ఆయనకి ఒక సాయం చేశాను. సామాన్యమయిన సాయం కాదు నేను చేసింది. కాకపోతే అది అనుకోకుండా జరిగింది.

ఒక పెద్ద బ్యాంకు ఫ్రాడ్ కి కుట్ర జరిగింది ఈయన వెనుక అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంత మంచి మనిషిని ముంచేందుకు తెగబడిన వారు ఊరికి చెందిన దగ్గరి బంధువులే కావడం విశేషం.

నాకు సిండికేట్ బ్యాంకులో స్టాన్లీ అని ఒక మిత్రుడు ఉండేవాడు. ఆయన్ని కలవటానికి తరచు స్టేషన్ రోడ్డు లోని సిండికేట్ బ్యాంకు కి వెళ్ళే వాడిని.

ఇలాగే ఒకసారి సిండికేట్ బ్యాంక్ కి నేను వెళ్ళగా, మదన్ తో ఎప్పుడు కలిసి తిరిగే ఇద్దరు మిత్రులు అక్కడ తారస పడ్డారు.

వాళ్ళిద్దరూ మదన్ వాళ్ళ ఊరి వాళ్ళే. నిజానికి వారు మిత్రులు కాదు, ఆయన దగ్గర బంధువులు అని తర్వాత తెలిసింది. . వీళ్ళిద్దరు బ్యాంకులో,  శర్మ అనే మేనేజర్ తో ఏదో సీరియస్ గా మాట్లాడ్తూ కనిపించారు వారు.

నాకు ఈ శర్మ గారు పరిచయమే. నేను ఊరకే ఉంటే ఏ ఇబ్బంది ఉండకపోయేది.శర్మ గారిని చిరునవ్వుతో పరామర్శించి, వీరిద్దరి వంక చూస్తూ  "హలో మదన్ గారు రాలేదా" అని అడిగాను.

చచ్చిన ఎలకను  మ్రింగిన వారిలా మొహం పెట్టారు వారిద్దరూ తక్షణం.

నేను  ఆ సమయంలో అక్కడికి రావడం వారు అస్సలు ఊహించలేదు. నా రాక వారికి ఏ మాత్రం నచ్చలేదన్నది అర్థం అయింది. దానికి తోడు నా మాటలతో వాళ్ళ పై ప్రాణాలు పైనే పోయాయి. వాళ్ళ భంగిమ చూస్తూనే నాకర్థం అయింది ఆ విషయం. కత్తి వేటుకు నెత్తురు చుక్కలేదు వారిద్దరి మొహాలలో.

వారిద్దరూ తెగ కంగారు పడ్డారు నా పలకరింపుతో. నేను ఏమంత తప్పు మాట అన్నానబ్బా అని మరొక్కసారి నా మాటలని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేశాను.

ఎవ్వరూ ఊహించని విధంగా అప్పుడు జరిగింది ఆ సంఘటన.

బ్యాంకు మేనేజర్ శర్మ గారు పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కి పడి, కళ్ళు పెద్దవి చేసి, వారిద్దరిలో బక్క పలచటి వ్యక్తి వంక చూస్తూ "ఏమిటి, మీరు మదన్ కాదా?" అని కీచుగా అరిచారు.

ఆయన చటుక్కున వారి చేతిలోంచి పత్రాలు లాక్కుని, "ఏమిటి ఈయన మదన్ కాదా?"  నా వంక చూస్తూ స్టీరియో ఫోనిక్ సౌండ్ తో అదే ప్రశ్నని సంధించారు.

నా అయోమయం పతాక స్థాయికి చేరుకుంది. "ఈయన మదన్ ఏమిటి నాన్సెన్స్. ఈయన సంజయ్ రెడ్డి కద" అని అన్నాను నేను నింపాదిగా.

ఆ సదరు సంజయ్ రెడ్డి మొహంలో కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు. దొరికి పోయిన దొంగలా అతను నీళ్ళు నమలడం మొదలెట్టాడు.

తాను మదన్ అని బొంకి, అకౌంటు తెరిచే ప్రయత్నానికి తెర ఎత్తాడు పిల్లికి ఎలక సాక్ష్యం అని, ఇతనికి తోడుబోయిన మరొక బంధువు వచ్చి సాక్షి సంతకం పెట్టబోతున్నాడు.

అదిగో సరిగ్గా ఆ టైంకి నేను అడుగుపెట్టాను అక్కడికి.

ఇంతకూ విషయం ఏమిటి అంటే, మదన్ పేరిట వచ్చిన ఒక లక్ష రూపాయల చెక్కుని చేతబట్టుకుని వచ్చి వీరు, బ్యాంకు అకౌంటు ఓపెన్ చేయబోతున్నారు. ఫోటో ఐడీ, అడ్రెస్ ప్రూఫ్ ఇలా ఏవో  దొంగ డాక్యుమెంట్లు పట్టుకుని వచ్చి పని మొదలెట్టారు. ఇంతకూ చెక్కు వచ్చింది మదన్ కి. వీళ్ళు దానిని తస్కరించి పెద్ద పన్నాగమే పన్నారు.

నిజానికి అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ కంటే ముందరి  డేట్ తో జారీ చేయబడ్డ  చెక్కుని స్వీకరించకూడదు. వీరు ఏదో కల్లబొల్లి కబుర్లు చెప్పి అకౌంటు ఓపెన్ చేసి చెక్ ని కూడా డిపాజిట్ చేయబోతున్నారు. అప్పట్లో ఇలా అధార్ కార్డ్, పాన్ కార్డ్ గట్రాలు ఏమీ ఉండేవి కావు. ఇంటర్ నెట్ లేదు.

బాంక్ వారు అసలైన మదన్ ఎక్కడుంటాడో నన్ను అడిగి కనుక్కున్నారు.

చూస్తుండగానే మేనేజర్ గారు, ఇతర స్టాఫ్ అలర్ట్ అయిపోయారు. సెక్యూరిటీ ని పిలిపించారు. ఎవరో వెళ్ళి మదన్ ని పిలుచుకు వచ్చారు.

ఆయన వద్ద స్టేట్ మెంట్ తీసుకున్నారు ఆయనే మదన్ అని. డ్రైవింగ్ లైసెన్స్ వగైరా పత్రాల ద్వారా నిర్దారించుకున్నారు. క్షణాలలో పోలీసులు వచ్చారు. వారందరినీ  వ్యాన్ ఎక్కించుకుని వెళ్ళారు. ఆ ఇద్దరికీ కటకటాలు తప్పవని నిర్దారణ అయింది.

నన్ను ఆ ఇద్దరూ గుర్రు గుర్రు మని చూస్తూ వెళ్ళీపోయారు రక్షక భటుల వెంబడి.  నాకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది.

బ్యాంకు స్టాఫ్ అంతా నన్ను అభినందనలతో ముంచెత్తారు, ఓ పెద్ద మోసాన్ని అరికట్టడంలో నేను ప్రముఖ పాత్ర పోషించానని. రిటైర్ అవబోతున్న శర్మ గారి ఉద్యోగ జీవితంలో ఏర్పడబోయిన పెద్ద ఇబ్బంది ని నా చాకచక్యం వల్ల తప్పించానని, అసలు సరైన టైం కి  నేను అక్కడికి రావడం దైవ లీల అని ... ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆనందం వ్యక్తం చేశారు.

వీళ్ళ అభినందనలు నన్ను ఆనందపరచలేదు, చూపులతో బెదిరిస్తూ వెళ్ళీన ఆ ఇద్దరి చూపులు భయపెట్టలేదు. ఒక విధమైన అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయాను నేను.

****

ఇవన్నీ ఒకెత్తు అయితే,  మదన్ చేసిన ఒక పని గూర్చి చెప్పాలి.

ఈయన్ని మంచి మనిషి అనాలా , పిచ్చి మనిషి అనాలా నాకైతే ఏమీ అర్థం కాలేదు.

"అన్నా అసలు ఇంత ద్రోహం ఎట్లా చేస్తారన్నా, మనుషులు ఎందుకు అందరూ మంచివాళ్ళుగా ఉండరన్నా. నన్ను అడిగితే ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేనే ఇస్తా కద అన్న ఇలా ఎందుకు చేశారన్నా?" అని వాపోయాడు ఈ కాఫీ దాత. పోలిసు వాళ్ళ ఫార్మాలిటీస్ ప్రకారం స్టేషన్ లో సాక్ష్యం చెప్పటానికి వ్యాన్ ఎక్కే ముందు అయోమయంలో అతనన్న మాటలు అవి.

నేను కూడా వెళ్ళాను స్టేషన్ కి. ఈయన అసలే షాక్ లో ఉన్నాడన్చెప్పి.

వ్యాన్ స్టేషన్ చేరే వరకు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు.

ఒన్ టవున్ పోలీస్ స్టేషన్ లో నన్ను వరండలోనే ఉండమన్నారు. కానీ నాకు లోపలి నుండి వాళ్ళ మాటలు వినిపిస్తునే ఉన్నాయి.

వాళ్ళ మీదకి నింద రాకుండా అక్కడ మదన్ చూపిన ఔదార్యం చూసి నాకు కళ్ళు చెమర్చాయి.

తానే వాళ్ళని చెక్ మార్చుకుని రమ్మని పంపానని, వాళ్ళదేమి తప్పు లెదని, బ్యాంకు లో ఏదో కమ్యూనికేషన్ గాప్ ఏర్పడింది అని, తాను వాళ్ళ మీద కేసు పెట్టటం లేదని, వాళ్ళని వదిలియ్యమని చెప్పి, బయటకు వచ్చేశాడు ఈ కాఫీ దాత.

నేను గుడ్లప్పజెప్పి ఆయన్నే చూస్తూ ఆయన వెనకే మిధున్ రెఫ్రెష్‍మెంట్స్ కి వచ్చి చేరుకున్నాను.

మా వెనుకే వచ్చారు చెక్కుతో కుట్ర పన్నిన ఆ ఇద్దరు.

"డబ్బు అవసరం ఉంటే నన్ను అడగవచ్చు కద సంజయ్ రెడ్డి నేను ఇచ్చే వాడిని కద, ఇప్పుడు కేసయ్యుంటే నీకు ఎంత నామార్దా?"

ఇంత జరిగినా సంజయ్ రెడ్డి కి చెడ్డ పేరు వస్తుందేమో అని  బాధపడుతున్నాడు ఈ బుద్ది మంతుడు.

నిర్లిప్తంగా పై మాటలని అనేసి "నాలుగు కాఫీ" అని ఆర్డర్ ఇచ్చాడు.

వాటిలో ఒక కాఫీ నాకు అన్నది ప్రత్యేకంగా చెప్పే పనే లేదు కద.

కాఫీ రాకముందే గుటకలు మింగాను ఈయన వింత ప్రవర్తనతో.

మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈయనకి చెక్ ఈయన ఇదివరకు పని చేసి రిజైన్ చేసిన బాంక్ వారు పంపారు. అది రిజైన్ కాదు ఆయన సస్పెన్షన్ కి గురయ్యాడు అని ప్రచారం చేసింది కూడా ఈ సంజయ్ రెడ్డి , అతని మిత్రులే అన్న విషయం నాకు ఆ తర్వాత మదన్ ద్వారానే తెలిసింది.

"అందరూ మంచి వాళ్ళుగా లేరని మనం కూడా మంచితనం వదిలేద్దామా అన్నా! మన తత్వం మనం మానద్దు. వాళ్ళ తత్వం వాళ్ళు మార్చుకోవాలని ఆశిద్దాం" ఇవి ఏ ప్రవచనకారుడో వేదిక మీద నుంచి చెబితే వింటానికి బాగుంటాయి.

కానీ ఒక సామాన్యుడు తన జీవిత విధానం ద్వారా ఈ మాటల్ని పాటించి చూపుతున్నాడంటే నమ్మలేము కద.

*******

 

Published in Sanchika Web Magazine: 05.06.2022 Sunday