Friday, October 8, 2021

కిడ్నాప్ (గో తెలుగు డాట్ కామ్ లో ప్రచురితం)

 

కిడ్నాప్   - డాక్టర్. రాయపెద్ది వివేకానంద్

 

"కిడ్నాప్ చేశాము మిమ్మల్ని ఇద్దర్నీ"

కరకు గొంతుతో అతను చెప్పిన ఆ మాటల్నిజీర్ణం చేసుకోవటానికి ఆ చిన్నారులిద్దరి కాస్తా సమయం పట్టింది. కాలనీ రోడ్డు పై కారు నిశ్శబ్దంగా వెళుతోంది.

"మీరు గట్టిగా అరిచినా, ఏడ్చి గోల చేసినా అద్దాలు మూసి ఉంచిన కారు లోంచి బయట ఎవ్వరికీ వినిపించదు. పైగా నల్ల రంగు అద్దాలు ఉండటం వల్ల మేము ఏమి చేస్తున్నది ఎవ్వరికి అర్థం కాదు. మీరు నోరు మూసుకుని ఉంటే మీకే మంచిది. ఎక్కువ అల్లరి చేస్తే ఇక్కడే నరికి పారేస్తాము" కరకు గొంతు వాడు తీవ్రమయిన పదజాలంతో హెచ్చరించాడు.

కార్లో వెనుక సీట్లో ఈ ఇద్దరు పిల్లలు, వారితో పాటుగాఈ కరకు గొంతు వాడు.

కారు డ్రయివ్ చేస్తున్న సూటి ముక్కున్న, తెల్లటి వ్యక్తి తలెత్తి అప్పుడప్పుడు అద్దంలో వెనుక సీట్లో ఏమి జరుగుతోందో అని ఒక కన్నేసి ఉంచాడు. అతని పక్కనె కూర్చున్న సన్నటి రివట లాంటి వ్యక్తి భావ రహితంగా కూర్చుని ఉన్నాడు.

ఇలాంటి వ్యవహారంలో చాలా అనుభవుమున్న వారివలే చాలా నింపాదిగా ఉన్నారు ఆ ముగ్గురు  యువకులు.

ఇంకో రెండు మలుపులు తిరిగితే, దిల్‍షుక్‍నగర్ మెట్రో స్టేషన్ వద్ద విజయవాడ హైవే ఎక్కేస్తుంది కారు. ఆ ఒక్క సిగ్నల్ అధిగమిస్తే ఇక ఏ అడ్డు లేకుండా నగరాన్ని దాటేయవచ్చు.

కౄరమృగానికి  చిక్కిన కుందేలు పిల్లల్లా బిక్క చచ్చి పోయారు ఆ పిల్లలు. వారిలో ముద్దులొలికే చిన్నమ్మాయి వయసు ఆరేడేళ్ళూ ఉంటాయి, ఆమె పేరు శ్రావణి అని స్కూలు బ్యాగు మీద ఉన్న లేబుల్ పై వ్రాసి ఉంది, పెద్దవాడు అబ్బాయి.  మహా అంటే ఆ చిన్నారి కంటే ఓ రెండేళ్ళు పెద్ద వాడుంటాడు. వాడి పేరు రాజేష్. ఇద్దరూ స్కూలు యూనిఫాంలో ముద్దొస్తున్నారు.

తాము ఎలా ప్రతిస్పందించాలి అన్న విషయం కూడా అర్థం కానంత అయోమయంలో మునిగిపోయారు ఆ ఇద్దరు పిల్లలు.

స్కూలు నుంచి వచ్చేటప్పుడు మూసారాంభాగ్ వద్ద బ్రిడ్జి దాటంగానే  మలుపులో ఈ కారు ని లిప్ట్ అడిగి ఎక్కటం గొప్ప పొరపాటు అయింది అన్న విషయం వాళ్ళకు ఆలశ్యంగా బోధపడింది.

వాళ్ళ ఇల్లు చాలా దగ్గర స్కూలుకి. నడచి వెళ్ళి , నడచి వచ్చేస్తారు. కాకపోతే మెయిన్ రోడ్ వెంబడి కాస్తా నడవాలి. ట్రాఫిక్ తో నిండిన మెయిన్ రోడ్ ని అట్నుంచి ఇటు దాటవలసిన పని లేదు.  రోడ్డు వెంబడే నడచుకుంటూ వచ్చి మలుపు తిరిగితె వచ్చేస్తుంది వాళ్ళ ఇల్లు. 

ప్రతి రోజు స్కూలు నుంచి వచ్చేటప్పుడు ఆ చిన్న కుర్రాడు ఒకటి గమనించాడు.

రోడ్డుపై వెళ్ళే కొందరు చేతి బొటన వేలిని ’థంప్స్ అప్’ లాగా చూపితే రోడ్డు పై వెళ్ళే మోటార్ సైకిళ్ళూ , ఒక్కోసారి కార్లు ఆగి వారిని ఎక్కించుకుని వెళ్ళటం చూశాడు.

ఇంట్లో ఒకసారి వాళ్ళ నాన్నగారిని అడిగితే ఆయన యధాలాపంగా చెప్పారు ఆ పద్దతిని ’లిఫ్ట్ అడగటం అంటారు అని’ స్వంత వాహనాలు లేని వారు ఎక్కడికైనా త్వరగా వెళ్ళాలి అంటే అలా రోడ్డుపై వెళ్ళే వాహనాల్ని ఆపి ’లిఫ్ట్’  అడిగి వెళుతుంటారని, లిఫ్ట్ ఇచ్చేవారు మానవత్వంతో  అలాంటి వారిని ఎక్కించుకుంటారని, అది చాలా మంచి పని అని చెప్పుకోచ్చారు ఒక రోజు.

ఆ కుర్రాడి మనసులో ఎలాంటి ఆలోచనతో ఈ ప్రశ్న అడిగాడో తెలిసుంటే ఆయన తన సమాధానం ఇచ్చే విధానంలో కాస్తా జాగ్రత్తపడి ఉండేవాడేమో.

ఈ అంశం వాడి చిన్ని బుర్రలో బాగా నాటుకుపోయింది. అదే వాడి కొంపముంచబోతోంది అన్న విషయం వారెవ్వరికీ చూచాయగా కూడా తెలియదు ఆ క్షణం.

 

మెయిన్ రోడ్డు మీద బ్రిడ్జి దాటాకా మలుపు తిరిగి, పిల్లలు ఉండే  కాలనిలోకి ప్రవేశించింది కారు. 

"అంకుల్ మా ఇల్లు దాటి వచ్చేశాం. కార్ ఆపండి" నెమ్మదిగా చెప్పాడు రాజేష్.

అప్పుడు చెప్పాడు కరకు గొంతుతో "మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నాం" అని

కార్ శాలివాహన నగర్ పార్క్, దిల్‍సుఖ్‍నగర్ అంధుల హాస్టల్ దాటి మూసీ నదికి సమాంతరంగా పయనిస్తూ చైతన్యపురి వైపుగా వెళ్ళ సాగింది.

వాళ్ళు చాలా పకడ్బందీ ప్రణాళికతో ఉన్నారని అర్థం అవుతోంది.

అలాగే నేరుగా వెళ్ళి పండ్ల మార్కెట్ వెనుకగా వెళ్ళి, బీఎస్‍ఎన్‍ఎల్ మలుపు వద్ద రోడ్డెక్కి మలుపు తీసుకుంటే ఒక్క సిగ్నల్ కూడా రాకుండా నేరుగా విజయవాడ హైవే ఎక్కవచ్చు అని వాళ్ళ ప్రణాళిక.

కానీ అక్కడ ట్రాఫిక్ జాం అవటం వల్ల తప్పని సరి పరిస్థితులలో దిల్‍సుఖ్‍నగర్ మెట్రో వద్ద మెయిన్ రోడ్ లోకి ఎక్కారు.

కళ్ళలోంచి ఉబికి ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ’అన్నయ్యా! ఇప్పుడెలా’ అన్నట్టు వాడి వంక బేలగా చూస్తోంది ఆ పిల్ల. ఆ అమ్మాయికి ఒక భరోసా ఏమిటి అంటే, పక్కన అన్నయ్య ఉంటే ఏ ఆపద రాదని.

 

దిల్‍సుఖ్‍నగర్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎర్రదీపం వెలగటం తో కార్ ఆపాల్సొచ్చింది. ఇక్కడ నిజానికి రోడ్ జంక్షన్ ఏమీ లేదు. నిరంతరం రద్దీగా ఉండే ఆ రోడ్డులో పాదచారులు రోడ్ దాటటానికి వీలుగా  సిగ్నల్ ఏర్పాటు చేసి వాహనాలను ఆపుతుంటారు.  అక్కడ ఒక వారగా ట్రాఫిక్ పోలీసులు మోటార్ సైకిళ్ళను ఆపి హెల్మెట్ లేని వారికి చలాన్లు రాస్తున్నారు ఆ సమయంలో.

ఒక ఆఫీసర్ లాంటి వ్యక్తి మారుతి జిప్సీ బానెట్ మీద  చలాన్ల బుక్ పెట్టి వ్రాస్తున్నాడు. క్రింది స్థాయి కానిస్టేబుల్స్ ఓ ముగ్గురు చురుకుగా రోడ్డ్ మీదకు వచ్చి హెల్మెట్ లేని యువకులను పట్టేసి వాళ్ళ మోటర్ సైకిళ్ళని రోడ్డు పక్కకు మళ్ళిస్తున్నారు.

ఈ పరంపరలో ఒక బక్కపలచటి పోలీసు కానిస్టేబుల్ వీరి కార్ పక్కన నడవసాగాడు.

వెనుక సీట్లో డ్రైవర్ వెనుక ఉన్న సీట్లో కిటికీ పక్కన శ్రావణి, మధ్యలో రాజేష్, ఇటు చివర కిటికి ప్రక్కగా కరకు కంఠం వాడు కూర్చున్నారు.

కానిస్టేబుల్  దృష్టిని ఆకర్షించటానికి కిటికి అద్దం మీద దబ దబ మని బాదటం మొదలెట్టాడు రాజేష్ చెల్లి వైపున్న కిటికి అద్దం వద్దకు జరిగి.

అతని ప్రయతం వృధా ప్రయాసే అవుతుంది అనుకున్నాడు వెనుక సీట్లోని కిడ్పాపర్. ట్రాఫిక్ రద్దీలో ఇంజన్ల శబ్దాలు, హారన్ల శబ్దాలు వీటి మధ్య ఈ చప్పుడు వినిపించదని అతని భరోసా. ముందు సీట్లోని వ్యక్తులు కూడా నిబ్బరంగానే ఉన్నారు.

ఈ లోగా అనుకోకుండా అప్పుడు జరిగింది ఆ సంఘటన.

ఒక మోటార్ సైకిల్ ని ఆపడంలో భాగంగా వేగంగా పరిగెత్తుకుంటు వచ్చిన ఆ ట్రాఫిక్ కానిస్టేబులు ఎందుకో అనుమానంగా ముందు అద్దం లోంచి కార్లోకి పరిశీలనగా చూశాడు.

’హెల్ప్ హెల్ప్’ రాజేష్, శ్రావణి చేతులు చాచి ఊపుతూ కేకలు వేశారు. వాళ్ళను ఆపే ప్రయత్నం కూడా ఏమి చేయలేదు ఆ కరకు గొంతు వాడు. వాళ్ళను అణిస్తే పోలీసుల దృష్టిలో పడతాము అన్నది అతని ఉద్దేశం కావచ్చు.

కానీ ఆ కానిస్టేబుల్ దృష్టి ఎంతసేపున్నా ఎవరన్నా సీట్ బెల్ట్ పెట్టుకున్నారా లేదా అన్నది చూడ్డం మీదనే ఉంది. ముందు సీట్లో ఉన్న ఇద్దరూ సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండటంతో తృప్తిగా తలూపి ముందుకు కదిలి వెళ్ళిపోయాడు ఆ కానిస్టేబుల్. అతని దృష్టి వెనుక సీట్ వైపు ప్రసరించలేదు అసలు.  

ఈ లోగా ఆకుపచ్చ దీపం వెలగడంతో కార్ బయలు దేరింది.

****

"మా పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు"

ప్రిన్సిపాల్ గది విశాలంగా ఉంది. ఎయిర్ కండిషనర్ ఉండటం వల్ల చల్లగా ఉంది. టీచర్ల మీటింగ్ ముగించి, కంప్యూటర్ మానిటర్ పై ఏదో ఫైల్స్ చూసుకుంటున్న ప్రిన్సిపాల్, ఆందోళనగా నిండిన వేదా మాటలతో తలెత్తి వేదా వంక చూసింది.

 

"మా ఇల్లు స్కూలుకి చాలా దగ్గర. స్కూలు వదలంగానే పదే పది నిమిషాల్లొ ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళు రోజు వచ్చే టైం దాటి అరగంట పైగానే అయింది. ఇంకా ఇంటికి రాలేదు. నాకేదో ఆందోళనగా ఉంది" ఆందోళనగా చెపుతున్న వేదా వంక సాలోచనగా చూసింది ప్రిన్సిపాల్.

"నిజమే. మేము పిల్లల్నందరిని పంపించేసి అరగంట పైనే అయింది. స్కూల్ డే లాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఏదన్నా సాంస్కృతిక కార్యక్రమాలకోసం ప్రాక్టీస్ చేయించటానికి కొన్ని సందర్భాలలో పిల్లల్ని ఎక్కువ సేపు ఉంచుకుంటాము కానీ ఇప్పుడు అలాంటి ఈవెంట్స్ కూడా ఏమీ లేవే? ఉండండి, సెక్యూరిటీని పిలుస్తాను" అంటు ప్రిన్సిపాల్ ఇంటర్ కాం లో సెక్యూరిటికి ఫోన్ చేసి రమ్మంది.

స్కూల్ బస్సులన్నీ వెళ్ళిపోయాయి. స్కూలు ఆవరణ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇక ప్రినిపాల్ గారు బయలుదేరి ఆవిడ కారు కూడా వెళ్ళిపోతె గేట్లు తాళం వేసుకోవచ్చు అని ఎదురు చూస్తూ, ఆవిడ కార్ డ్రైవర్ తో కబుర్లు చెపుతూ కూర్చున్నాడు సెక్యూరిటీ గార్డ్.

ఇంటర్ కాంలో పిలుపు రావడంతో లోపలికి వచ్చాడు

వేదా ఆ సెక్యూరిటీ గార్డ్ వంక ఆందోళనగా చూడసాగింది.

పాల మీగడలో కాస్తా కుంకుమ పువ్వు కలిపితే వచ్చే రంగు లాంటి లేత గులాబీ రంగు

శరీర ఛాయ వేదాది. మరీ సన్నం మరీ లావు కానీ అందమైన శరీర సౌష్టవం ఆమెది. రాజేష్, శ్రావణిల  వయసున్న పెద్ద పిల్లలకి తల్లి ఆమె అంటే నమ్మదగిన విధంగా ఉండదు ఆమె ఆకృతి. ప్రిన్సిపాల్  కూడా మొదట అదే అనుకున్నది ఆమె అందాన్ని చూసి, ఇప్పుడు ఆమె అందాన్ని అభినందించాల్సిన సందర్భం కాదు కాబట్టి తమాయించుకుని, సెక్యూరిటీ గార్డ్ ని ప్రశ్నించటం ప్రారంభించింది.

వేదా కంప్యూటర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, ఒక  కంప్యూటర్ ట్రెయినింగ్ సెంటర్లో కొన్నాళ్ళుగా పార్ట్ టైం ఉద్యోగం చేస్తోంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పూర్తి సమయం పిల్లలకే వెచ్చించేది. ఎప్పుడు అయితే పిల్లలు స్కూలు కు వెళ్ళటం మొదలెట్టారో తను కాలక్షేపంగా ఉంటుందని ఉద్యోగం చేస్తోంది.

పిల్లలు స్కూలు నుండి వచ్చే సమయానికి ఇంటికి వచ్చే లాగా తన ఉద్యోగ వేళలను ముందే మాట్లాడి ఒప్పించుకుంది యాజమాన్యంతో.

సెక్యూరిటి సెల్యూట్ చేసి పిల్లలందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోయారని చెప్పాడు.  బస్సుల్లో వెళ్ళే పిల్లల గూర్చి అయితే ఆయా బస్సు సిబ్బందిని కనుక్కోమని చెబుతూ, నడిచి వెళ్ళే పిల్లలు, తలి తండ్రులు వచ్చి తీసుకువెళ్ళే పిల్లలు అయితే అందరు తనకు గుర్తే అని, రాజేష్ శ్రావణీ ’టాటా అంకుల్’ చెప్పి వెళ్ళటం తనకు బాగా గుర్తు ఉందని, వాళ్ళు తమ ఇంటికి వెళ్ళే వైపే వెళ్ళారని, తనకు తెలిసి అనుమానించాల్సిన పరిస్థితి ఏదీ తలఎత్తలేదని గట్టిగా చెప్పాడు.

ప్రిన్సిపాల్ కూడా తన వంతుగా వారి క్లాస్ మేట్స్ ఎవరివైనా పుట్టినరోజులు ఉన్నాయా, ఏదయినా అలాంటి ఫంక్షన్లకు వెళ్ళుంటారా అన్న దిశగా వాళ్ళ క్లాస్ టీచర్లకు ఫోన్లు చేసి కనుక్కుంది.

రాజేష్, శ్రావణీల దగ్గరి మిత్రుల ఇళ్ళకు ఫోన్స్ చేసి కనుక్కుంది. ఏ విధమైన చెప్పుకోదగ్గ ఆధారాలు కనిపించలేదు.

ప్రిన్సిపాల్ చెప్పారు ఇలా "వేదా గారు, మీరొక పని చెయ్యండి. మీరు వీలయినంత త్వరగా ఇంటికి వెళ్ళండి  ఈ పాటికి పిల్లలు ఇంటికి వచ్చి ఉండవచ్చు. ఏదైనా వినోదాలు చూస్తూ రోడ్డు మీద ఎక్కడైనా ఆగి ఉండి ఆలశ్యంగా ఇల్లు చేరుకుని ఉండొచ్చు. మీరు ఇంట్లో లేకుంటే కంగారు పడవచ్చు పిల్లలు.

నా వంతుగా నేను కూడా టీచర్లందరితో టచ్ లో ఉంటాను. మనం పిల్లలు దొరికే వరకు ఫోన్లో టచ్ లో ఉందాము." అని భరోసా ఇచ్చి, ’ఇంతకు మించి నేను మాత్రం ఏమి చేయగలను చెప్పండి’ అన్న ధ్వనిలో తన మాటల్ని ముగించింది.

అంతటి ఏసీ గదిలో కూడా వేదా వదనం చెమటతో తడిసిపోయింది. ఒక్కసారిగా ప్రపంచం అంతా గిర్రున తిరిగినట్టు అనిపించసాగింది వేదాకి.

ఎప్పుడూ ఉత్సాహంతో ఉండే ఆమె ఒక్కసారిగా గాలి తీసేసిన బూరలాగా అయిపోయింది.

ప్రిన్సిపాల్ చెప్పిన మాటలు సబబుగా అనిపించటంతో చేయగలిగింది ఏమీ లేక వేద నిరాశగా లేచి బయలు దేరింది. ఈ లోగా తన భర్తకి కూడా ఫోన్ చేసింది.

తీరా ఇల్లు చేరుతున్నప్పుడు, అనుకోకుండా ఆమెకి ఒక సంఘటన ఎదురు అయ్యింది.

"మీ కొత్త కారు బాగుంది మేడం" అన్న మాటకి తలెత్తి చూసింది.

ఎదురుగా టీవీఎస్ ఎక్సెల్ మీద కూర్చుని తమ కిరాణా షాప్ డోర్ డెలివరీ కుర్రాడు. వాడి వంక అయోమయంగా చూసింది.

"కొత్త కారేంటీ" కీచుగా అరిచింది

"ఇందాక మూసారాంభాగ్ మలుపు దగ్గర ఒక ఇంటికి డోర్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళి వస్తూ ఉంటే మీ పిల్లలిద్దరూ స్కూలు నుండి వస్తూ స్కూలు యూనిఫాం,  స్కూలు బాగు తో సహా కనిపించారు.  

పలకరిద్దాము అనుకునే లోగా మీ కారు కాకుండా వేరే ఏదో కారు ఎక్కి వెళ్ళారు. మీ కారు నాకు గుర్తే. అప్పుడనుకున్నాను మీరు కొత్త కారు తీస్కున్నారేమొ అని." చెప్పాడు ఆ కుర్రాడు

అయోమయాన్ని పటాపంచలు చేస్తూ ఇప్పుడు కొంత స్పష్టత వస్తోంది ఆమెకి. వెంటనే తన భర్తకి ఫోన్ చేసి ఈ విషయం కూడా చెప్పింది. అంటే ఖచ్చితంగా పిల్లలు ఏదో ప్రమాదంలో పడ్డారన్న మాట.

కార్ నెంబర్ చూడలేదన్నాడు ఆ కుర్రాడు. వాడిని అడిగి కారు రంగు, ఇతర వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు మొదలెట్టింది.

విషయం తెలిసి ఆ కుర్రాడు కూడా అవాక్కయ్యాడు.

"అయ్యో నా కళ్ళ ముందరే పిల్లలు కిడ్నాప్ కి గురయ్యారా?" ఆ కుర్రాడికి నోటెంబడి మాటలు రావడం లేదు.

 

*****

కార్ దిల్‍సుఖ్‍నగర్ సిగ్నల్ దాటి  ఏ ఆడ్డు లేకుండా దూసుకుపోతోంది. పీవీటీ మాల్ దగ్గర సిగ్నల్ ఉన్నప్పటికీ నేరుగా  వెళ్ళే వాహనాలు ఆగే పని లేదు కాబట్టి ఇక ఎక్కడా ఆగకుండా ఎల్‍బీ నగర్ వైపు వెళ్ళసాగింది.

ముందు సీట్లో కూర్చున్న రివట లాంటి కుర్రాడు, కారు నడుపుతున్న కుర్రాడి వంక చూసి అస్పష్టంగా ఏదో మాట్లాడాడు.

ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ దాటి, కొత్తగా నిర్మించిన ఫ్లై ఓవర్ దాటి హయత్‌నగర్ మీదుగా హైవే పై వెళ్లసాగింది. అక్కడ ఒక వారగా కారు ఆపాడు. హైవే పై వేగంగా వెళుతున్న వాహనాలు మినహాయిస్తే జన సంచారం చాలా తక్కువ ఉంది అక్కడ.

ఏవో ఒకటి రెండు లారీలు ఆగి ఉన్నాయి ఆ దాబా వద్ద.

"ఇదిగో పిల్లలూ ఇప్పుడే టీ త్రాగి వస్తాము. మీరు అతి వేషాలు వేశారా చాలా కష్ట పడతారు. మీతోటి ఈ అంకుల్ కార్లోనే ఉంటాడు" పిల్లలిద్దరి వంక చూస్తూ కారు నడిపిన కుర్రాడు హెచ్చరిక జారి చేసి టీ త్రాగటానికి వెళ్ళాడు.  ముందు సీట్లో కుర్చున్న కుర్రాడు కూడా అతనితో వెళ్ళాడు.

కార్లో ఆ పిల్లలిద్దరూ, కరకు కంఠం వాడి అధీనంలో బిక్కు బిక్కు మంటూ కూర్చున్నారు.

మధ్యలో ఉన్న రాజేష్, ఇటు చివర ఉన్న శ్రావణికి సైగ చేశాడు. రాజేష్ సైగని అర్థం చేసుకుని ,శ్రావణి కార్ డోర్ తెరవటానికి ప్రయత్నం చేసింది. కాని చైల్డ్ లాక్ వేసి ఉండటం వల్ల డోర్ తెరచుకోలేదు.

దూరంగా టీ త్రాగుతూ వాళ్ళిద్దరూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ కనిపించారు.

***

ఇక్కడ ఇదంతా జరుగుతుండగా వేదా స్కూల్లో మాట్లాడి బయటకు రావడం, ఇంతలో కిరాణా షాపు డోర్ డెలివరీ కుర్రాడు తారసపడితే అతనితో మాట్లాడటం జరిగిపోయాయి.

ఆ కిరాణా షాపు  కుర్రాడు కూడా  వేదాతో బాటుగా ఇంటి వరకు  వచ్చాడు.

అప్పుడు మ్రోగింది వేదా బ్యాగులో ఉన్న ఫోన్.

బ్యాగు తెరచి ఫోన్ అందుకుని కాల్ అందుకుంది వేద. కాల్ చేస్తున్న అవతలి వ్యక్తి తన కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఓనర్.  అతను పాతికేళ్ళ కుర్రాడు నిజానికి. వాళ్ళ నాన్న గారి నుండి వారసత్వంగా అందిపుచ్చుకున్న వ్యాపారాలలో ఒకటైన వేదా పని చేస్తున్న కంప్యూటర్ ట్రెయినింగ్ సెంటర్ నిర్వాహణ చూస్తుంటాడు అతను.

చిన్న వయసులోనే వ్యాపార దక్షుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

కాస్తా ఇబ్బందిగా కదిలింది వేదా. ఇతను  ఈ సమయంలో ఫోన్ చేస్తున్నాడేమిటబ్బా అని ఆలోచిస్తూ, హలో అని చెప్పి, అవతల నుంచి అతను చెప్పే మాటలు వినసాగింది.  

అతను మాట్లాడుతూ ఉంటే వేద మొహంలో రంగులు మారసాగాయి.

ఈ లోగా గేట్ తెరచుకుని వేదా భర్త కూడా రంగ ప్రవేశం చేశాడు. వేదా ఫోన్లో మాట్లాడుతున్నాను అన్నట్టుగా భర్త వంక సంఙ్జ చేసింది.

కిరాణా షాప్ డెలివరీ బాయ్ వేదా భర్తకి విషయం మొత్తం వివరించాడు.

ఆ ఫోన్లో అవతలి వినిపించిన మాటలు ఆమెపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఆమె విపరీతమైన ఉద్వేగానికి గురయింది. నుదుటిపై స్వేదాన్ని చీర కొంగుతో తుడుచుకుంటూ కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది.

తన బాస్ ఏంటి ఇలా మాట్లాడాడు అన్న భావన ఆమె వదనంలో కనిపిస్తోంది.

"ఏమిటి విషయం?" ఆమె భర్త అడిగాడు

 

భావ రహితంగా చూస్తూ వేదా కిరాణా షాప్ కుర్రాడిని వెళ్ళి పొమ్మని నెమ్మదిగా చెప్పింది.

ఆ తర్వాత భర్తతో తాను ఫోన్లో అందుకున్న సమాచారాన్ని నెమ్మదిగా చెప్పటం ప్రారంభించింది. ఆ క్షణంలో ఆమె వదనంలో ఎన్నో భావాలు.

***

టీ త్రాగటం ముగించుకుని వచ్చారు ఆ ఇద్దరు. వస్తూ వస్తూ మూడో వ్యక్తికి కూడా టీ తీసుకు వచ్చారు. అలాగే పిల్లలకి చిప్స్ పాకెట్స్, బిస్కట్స్ కూడా తీసుకు వచ్చారు.

రాజేష్, శ్రావణి వాటిని కన్నెత్తి కూడా చూడలేదు.

ఆ ముగురు వ్యక్తులు గుంభనంగా నవ్వుకున్నారు.

కార్ తిరిగి బయలుదేరింది. చిత్రంగా కారు ముందుకు వెళ్ళే బదులు, యూ టర్న్ తీసుకుని తిరిగి నగరం వైపుకు బయలు దేరింది.

రాజేష్ , శ్రావణి కారు వెళుతున్న దిశను గమనిస్తూనే ఉన్నారు. ఒక అరగంటలో మళ్ళీ దిల్‍సుఖ్‍నగర్ కే వచ్చింది కారు. మలుపులు తిరుగుతూ తిరిగి శాలివాహన నగర్ పార్క్ వద్దకు వచ్చింది.

’అరె ఇదేమిటి మళ్ళీ మన కాలనీకే వెళుతోందే కార్’ అన్న ఆశ్చర్యం వారి మొహాల్లో కనిపిస్తోంది.

***

వరండాలో కూర్చుని సీరియస్ గా చర్చించుకుంటున్న భార్యా భర్తలు తమ ఇంటి ముందు ఆగిన కార్ ని చూసి గేట్ వద్దకు వచ్చారు.

కార్ డోర్ తెరవంగానె రాజేష్, శ్రావణి పరుగున వెళ్ళి వేదాని కౌగిలించుకున్నారు. వేదా భర్త ఆ ముగ్గురినీ ఇంటిలోనికి ఆహ్వానించాడు.

కార్ నడిపిన ఆ సూటి ముక్కు కుర్రాడే వేదా వాళ్ళ బాస్.

అందరూ సోఫాల్లో సుఖాసీనులు అయ్యాక ఆయన చెప్పటం ప్రారంభించారు.

"నేను ఆఫీసు నుంచి వెళ్ళే సమయానికి ప్రతి రోజు ఆ మార్గంలో ఈ పిల్లలు ఇటీవల లిఫ్ట్ అడగటం గమనించాను మేడం. వాళ్ళు మీ పిల్లలు అని నాకు తెలుసు. మీరు ఇటీవల ఆఫీస్ ఫంక్షన్ కి తీసుకువచ్చారు పిల్లలని అప్పుడు చూసాను.

కొన్ని సందర్భాలలో మోటార్ సైకిళ్ళ వాళ్ళూ, కొన్ని సందర్భాలలో కార్ల వాళ్ళు లిఫ్ట్ ఇవ్వటం గమనించాను. ఆ దృశ్యం చూసిన ప్రతీ సారి నాకు చాలా టెన్షన్ అనిపించేది. రోజులన్నీ మనవే ఉండవు కద అని నా భయం. మీకు చెప్పి పిల్లలకు చెప్పండి అందామని అనుకున్నాను. కానీ వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే వాళ్ళు ఈ లిఫ్ట్ ఆట లో చాలా థ్రిల్ అనుభవిస్తున్నారని అర్థం అయింది. మీరు వాళ్ళకు చెప్పినా మీ మాట వినే పరిస్థితిలో వారు లేరని నాకు అనిపించింది. వారికి ఒక సారి షాక్ లాగా తగిలితే తప్ప ఈ ప్రమాదకరమైన ఆటని ఆపేయ్యరని నాకు తోచి, ఈ విధంగా ప్రాక్టికల్ గా వారికి భయం అనేది ఎలాగుంటుందో రుచి చూపించాల్సి వచ్చింది.

వాస్తవానికి చిన్నతనంలో అందర్నీ మంచివారే అని పిల్లలు నమ్ముతారు. నిజానికి సమాజం అలా మంచి వారితో నిండి ఉంటే ఎంత బాగుంటుందో కద. మనం వాళ్ళకు జాగ్రత్త అనే పేరుతో సాటి మనిషి మీద అనుమానం కలిగేలా పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది నిజంగా దురదృష్టకరం.

రవీంద్రనాధ్ టాగోర్ వ్రాసిన గీతాంజలిలోని కవితలో లా సమాజం ఉంటే ఎంత బాగుంటుందో

"ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో

ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో

ఎక్కడ ఙ్జానం విరివిగా వెలుస్తుందో

ఎక్కడ స్వఛ్చమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో

ఆ స్వేఛ్చా స్వర్గానికి, తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు"

 

 అలా ఆ కవితలో లా మన దేశ పరిస్థితులు నెలకొనాలని ఆశిస్తాను.  మిమ్మల్ని అనవసరంగా కంగారు పెట్టాను , మన్నించండి" అంటూ వేదా భర్త గారి చేతులు పట్టుకుని మన్నింపు కోరాడు కారు నడిపిన ఆ సూటి ముక్కు కుర్రాడు.

పిల్లలిద్దరూ చనువుగా వచ్చి ఆయనకి ఇరుపక్కలా నిలబడి "మాకర్థం అయింది అంకుల్. ఇంకెప్పుడు అలా కొత్తవాళ్ళని లిఫ్ట్ అడగం" అని అన్నారు.

 

చమర్చిన కళ్ళతో వారినే చూస్తూ ఉండి పోయింది వేదా.

 

***************

(published in go telugu.com) the link: https://www.gotelugu.com/telugustories/view/10032/kidnap 

"లోనికి రావచ్చా?.. (గో తెలుగు డాట్ కామ్ లో ప్రచురితం)"


 

"లోనికి రావచ్చా!"

-డా.రాయపెద్ది వివేకానంద్

 

ఆ సంఘటన తలచుకున్నప్పుడల్లా ఒళ్ళు గగుర్పొడుస్తుంది.

అలా జరగకుండా ఉండుంటే బావుణ్ణు అని ఎన్ని సార్లనుకున్నానో లెక్కలేదు. కానీ మన చేతిలో ఏమి లేదు కద.

సిక్త్స్ సెన్సో , సెవెన్త్స్ సెన్సో అని అనను కానీ అసలా రోజు ఉదయం లేవంగానే అనిపించింది ’ఈ రోజు సజావుగా సాగబోవడం లేదు’ అని.

అసలేం జరిగిందో చెప్తాను. ఇది తెలుసుకోవాలి అంటే మనం కడపకు వెళ్ళాలి. ఇందులో విధి ఆడే వింతనాటకం ఉంటుంది.

****

"ఐ ట్రీట్-హీ క్యూర్స్" 

పై కొటేషన్ మొదటిసారిగా కడపలో డాక్టర్ .రాధికగారి హాస్పిటలో చూశాను. ఏసు క్రీస్తు ది ఒక పెద్ద తైల వర్ణ చిత్రం, ఆ పటంలో ఒక మూలగా పెద్ద అక్షరాలతో ఈ కొటేషన్. ’నేను వైద్యురాలిగా చికిత్స చేసినా, తగ్గించేది, బాగు చేసేది ఆయనే. నేను నిమిత్తమాత్రురాలిని సుమా!’ అన్న భావం ఈ వాక్యాలలో కనిపిస్తుంది.

ఇంత వేదాంతంతో నిండిన కొటేషన్ పెట్టుక్కూర్చుంది కద, ఆవిడ ప్రశాంతంగా, జాలి దయ ఉట్టిపడే చూపులు చూస్తూ ఆదరంగా మాట్లాడుతూ ఉంటుంది అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే సుమా.

ఆవిడకి ముక్కుమీదనే కోపం ఉండేది. తెగ చిరాకుపడిపోయేది అందరిమీద. అమె ప్రతి అడుగులోనూ, పలుకులోను విపరీతమైన డిసిప్లిన్ కనిపించేది. ఆవిడది అహంకారమో కోపమో కాదు, ఆత్మవిశ్వాసం  అని ఆవిడని దగ్గర నుంచి చూసి అర్థం చేసుకున్నవారికి మాత్రమే తెలుస్తుంది. ఆవిడ తనచుట్టూ ఒక గిరిగీసుకుని ఉంటారు. ఆవిడ వయసు ముఫై అయిదు కి లోపలే ఉంటాయి. చూడంగానే ఆకట్టుకునే రూపం ఆమెది. ఒక సారి చూసిన వారు చటుక్కుమని చూపు తిప్పుకోలేరు ఆమె పై నుంచి.

ఆవిడ భర్త కూడా డాక్టరే, ఆయన ఎక్కడో దూరదేశంలో ఉండేవారు ఆరోజుల్లో.

చొరవతీసుకుని ఎవ్వరూ ఆమెతో చనువుగా ఉండే ప్రయత్నం చేయకుండా, ఇలా ఆమె చిర్రుబుర్రులాడుతుంటారని దగ్గరవారికి మాత్రమే తెలుస్తుంది. 

నిజానికి ఆమె చాలా దయగల మనిషి. చాలా మంచి మనిషి అని నేను స్వయంగా తెలుసుకున్నాను.

నేను ఆవిడ కోపానికి ప్రత్యక్షంగా గురయ్యాను, ఆవిడ దయని కూడా కళ్ళారా చూశాను. ఇవన్నీ చెబుతాను ఈ కథలో.

***

సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ అన్న పదం కూడా తెలియని రోజులు అవి.  అప్పుడు యువతకి ముందున్న ఉద్యోగ అవకాశాలు చాలా పరిమితం. ఏదైన ప్రభుత్వ ఉద్యోగంలో చేరిపోవటం లేదా బ్యాంక్ ఉద్యోగం లో చేరిపోవటం మాత్రమే అప్పుడున్న ప్రధాన ఉద్యోగ అవకాశాలు. అయితే ఇవి కూడా అంత సునాయాసంగా ఏమీ వచ్చేవి కావు.

అతి కష్టం మీద బ్యాంకు ప్రవేశ పరీక్షలు పాసయి ఒకట్రెండు బ్యాంకు ఉద్యోగాలు ఇంటర్వ్యూ వరకు వచ్చినట్టే వచ్చి , నాకు దక్కకుండా పోయాయి.

’కోరుకున్నది దొరకకుంటే, దొరికిన దాన్నే కోరుకోవాలి’ అన్నంత బరువైన డైలాగేమీ చెప్పను. నాకు ఎందుకో మొదట్నుంచీ మెడికల్ రెప్రెజెంటేటివ్ ఉద్యోగం అంటే ఎంతో ఇష్టం ఉండేది.

రోగి కోరినదే వైద్యుడు పథ్యం చెప్పాడు అన్నట్టు, నాకెంతో ఇష్టమైన మెడికల్ రెప్ అవతారం ఎత్తాను. చక్కగా పాలిష్ చేసిన బూట్లు, ఎప్పుడూ మడత నలగని దుస్తులు, మెడలో టై, కంపెనీ వారు ఇచ్చిన మోటారు సైకిల్, ఎక్కడికి వెళ్ళీనా స్టార్ హోటల్లో బస, ఫస్ట్ క్లాస్ ఏసీలో లేదా విమానంలో ప్రయాణం ఇలా చాలా జోరు మీద ఉండేది జీవితం. కొత్తగా ఉద్యోగంలో చేరిన రోజులు అవి.

కొందర్ని చూస్తూనే వీరికి బ్రతకనేర్చిన తనం ఉంది అని అంటుంటాం. అలాంటి స్ట్రీట్ స్మార్ట్ కాను నేను.  నెమ్మదస్తుడిని అని అప్పటికే పేరుతెచ్చుకున్న నేను ఈ ఉద్యోగంలో ఎలా రాణిస్తానో అని ఇంట్లో వాళ్ళు  కాస్తా కంగారు పడ్డ మాట వాస్తవం. ఎందుకంటే ఈ వృత్తిలో విపరీతమైన టూర్లు, టార్గెట్ సంబంధిత వత్తిళ్ళు ఉంటాయనేది జగమెరిగిన సత్యం.

ఇంకో రహస్యం చెబుతాను, మెడికల్ రెప్రజేంటేటివ్స్ కి పిల్ల దొరకడం కష్టం అని, నా పెళ్ళి ఎలా అవుతుందిరా భగవంతుడా అని కూడా మా అమ్మానాన్నలు భయపడ్డారు.  ఏది ఏమయినా ’మొండి వాడు రాజుకంటె బలవంతుడు’ అంటారు కద, అలా నా ఇతర ఉద్యోగ ప్రయత్నాలన్నింటికి స్వస్తి పలికి  నాకిష్టమైన ఉద్యోగంలో చేరిపోయాను.

దేశంలోని పెద్ద కంపెనీలలో ఒకటైన మా కంపెనీకి కాస్తా ’చాదస్తం కంపెనీ’ అని పేరుండేది. కానీ అందరూ చాలా గౌరవించేవారు మా కంపెనీని.

నేను ఉద్యోగంలో చేరిన మొదటి నెలలోనే, హైదరాబాద్ నుండి మా రీజినల్ మేనేజర్ మురళీ గారు నాతో కలిసి పని చేయటనికి జాయింట్ ఫీల్డ్ వర్క్ కి వచ్చారు. ఆయన ఇవ్వబోయే నివేదిక మీద ఆధారపడి నా ఉద్యోగం కన్ఫర్మ్ అవటం జరుగుతుంది. ఈ విధంగా తీసుకుంటే ఆయన పర్యటన చాలా ప్రాముఖ్యతతో కూడినది అని చెప్పవచ్చు.

నన్ను మిగతా రెప్రజెంటేటివ్స్ అందరూ విపరీతంగా భయపెట్టారు. సాధారణంగా ఇలా మేనేజర్ వచ్చి వెళ్ళాక ఉద్యోగం కోలోయిన రెప్రెజెంటేటివ్స్ అనేక మంది ఉన్నారని, ఎందుకయినా మంచిది వచ్చి యూనియన్ లో చేరమని, నీ తరఫున పోరాడుతాం అని నన్ను అయోమయానికి గురిచేశారు.

సరే ఇక ఆయన కడపకి రానే వచ్చారు. రీజినల్ మేనేజర్ గారి పర్యటన అంటే అదో గొప్ప సందర్భం అని చెప్పవచ్చు. ఆయన నుంచి ఒక మూడు రోజులపాటు ఙ్జానాన్ని పొందవచ్చు, ఆయనతో బాటే స్టార్ హోటల్లో చక్కటి భోజనం లభించేది.

సాయంత్రం ఫీల్డ్ వర్క్ కి మురళీ గారితో బయలుదేరాను. ఆ రోజుల్లో నా వద్ద పాత టీవీఎస్ 50 మోపెడ్ ఉండేది. దానిపై ఆయన్ని కూర్చోబెట్టుకుని బయలుదేరాను.

ఆయన చాలా చక్కగా ఉండేవాడు మనిషి. ఆయన కర్ణాటక ప్రాంతాలకు చెందిన మధ్వ బ్రాహ్మిణ్ అనుకుంటా. సన్నగా ఉండే వారు. గిల్లితే కందిపోతారేమో అన్నట్టు తెల్లటి తెలుపు, బట్టతల, సౌమ్యంగా మాట్లాడేవారు. తెలుగు ధారాళంగా మాట్లాడలేకపోయేవారు. కన్నడం ఆయన మాతృభాష. ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది అంటే, చాలా తియ్యగా ఉంటుంది. ఎంత తియ్యగా అంటే,చెరకుముక్కలాంటి  ప్రతి పలుకుని తేనెలో ముంచి, ఆపై దానికి చక్కెర అద్ది ఆపై పలికినట్టు ఉండేది.

కమ్యూనికేషన్ స్కిల్స్ అనే మాటని నేను ప్రాక్టికల్ గా అతి దగ్గరనుండి చూసిన సందర్భాలు అవి.

’మేనేజర్లందరూ నరరూప రాక్షసులని,  మెడికల్ రెప్స్ ని ఇబ్బంది పెట్టటానికే ఫీల్డ్ వర్క్ కి వస్తారని, తస్మాత్ జాగ్రత, జాగ్రత’ అని అందరూ భయపెట్టినట్టేమీ లేదు మేనేజర్ గారి పర్యటన. నిజానికి చాలా ఆహ్లాదంగా గడిచింది. కాకపోతే  ఒక గొప్ప ప్రమాదం జరగనే జరిగింది. అయితే, ముప్పు ఆయన వైపు నుంచి కాక ఊహించని వైపు నుంచి వచ్చింది.

ఈ సంఘటన తో ఆయన నాదృష్టిలో ఎంతో ఎత్తుకు వెళ్ళి కూర్చున్నారు.

నేను ఈ కథ  ప్రారంభంలో ప్రస్తావించిన సంఘటన ఇదే.

ఏమి జరిగిందో చెప్తాను వినండి.

మేము స్నాక్స్, టీలు అయ్యాక ఫీల్డ్ వర్క్ కి బయలు దేరాము.

మేము హరిఓం అని డాక్టర్  రాధిక గారి ఆసుపత్రి కి వెళ్ళాం మొదట. నేను ఆవిడని అప్పటికే ఒక సారి విడిగా కలిసి ఉన్నాను నా ఫీల్డ్ వర్క్ లో భాగంగా. ఆవిడ క్లినిక్ కడప స్టేషన్ రోడ్ లో  ఉండేది ఆ రోజుల్లో.

***

పెద్దగా రద్దీగాలేదు ఆ రోజు. ఒక అయిదారుగురు పేషంట్లు మాత్రమే ఉన్నారు.

కాస్తా బక్కపలచగా చామనఛాయలో ఉన్న  ఒక నర్సు మమ్మల్ని గౌరవంగా ఆహ్వానించి, కూర్చోమంది. మురళీగారి విజిటింగ్ కార్డ్ తీస్కుని డాక్టర్ గారి కేబిన్ లోకి వెళ్ళింది.

ఒక అయిదు నిమిషాల తర్వాత ఆ నర్స్ కారణంగా ఒక పెద్ద ఉత్పాతం జరగబోతోంది మాకు ఏ మాత్రం తెలియదు.

అది ఒక సీదా సాదా ఆసుపత్రి. పెద్ద అట్టహాసం ఏమీ ఉండేది కాదు.

మురళీ గారు నాపక్కనే కూర్చుని వృత్తికి సంబంధించిన కీలక మెళకువలు, కమ్యూనికేషన్ స్కిల్స్ కి సంబందించి టిప్స్ చెబుతూ ఉన్నారు.  ఒక పది పదిహేను నిమిషాలు గడిచిపోయాయి.

***

ఇందాకటి నర్సు డాక్టర్ ఛాంబర్ కి ఉన్న ముదురాకుపచ్చ తెరలని మధ్యలో తొలగించుకుని ఉత్తి తల మాత్రమే బయటకి పెట్టి మా వంక చూసింది. కళ్ళతోటే సైగలు చేస్తూ , ’పసలపూడి వంశీ’ సినిమా పాటల్లో, హీరోయిన్ లాగా కళ్ళ భాషతో మమ్మల్ని లోనికి రమ్మని చెప్పి తాను తిరిగి లోనికి వెళ్ళీపోయింది. 

అది మురళీ గారి సమక్షంలో నాకు మొదటి డాక్టర్ విజిట్. అంటె ఆయన నా వర్క్ ని ప్రత్యక్షంగా చూడబోతున్నాడు.

గోడ మీద ఉన్న ఏసుప్రభువు మా ఇద్దరి వంక జాలిగా చూస్తున్నట్టు నాకు తోచింది ఎందుకో, అది కూడా క్షణంలో వెయ్యవ వంతు మాత్రమే.

నెలక్రితమే బొంబాయిలో ట్రెయినింగ్ పీరియడ్ లో చాలా మంచి పేరుతెచ్చుకున్నాను, ఇంటర్నల్ రిపోర్ట్స్ ద్వారా ఆయనకు ఆ విషయం తెలుసు. గత నెలగా నా ఫీల్డ్ వర్కు తాలుకూ డైలీ రిపోర్ట్స్ ద్వారా కూడా ఆయన నన్ను గమనిస్తూ ఉన్నాడు. మొత్తం మీద ఆయనకు నా మీద మంచి అభిప్రాయమే ఉంది. కంగారు పడవలసింది ఏమీ లేదు అని నాకు నేనే ధైర్యం చెప్పుకుని అడుగు ముందుకు వేసాను.

ఇంక కొద్ది క్షణాలలో ప్రళయం రాబోతోంది అని మాకు చూచాయగా కూడా తెలియదు. 

ఆ నర్స్ అందించిన చూపుల ఆహ్వానాన్ని అందుకుని ఆకుపచ్చని తెర తొలగించుకుని లొపలికి వెళ్ళాము.

ఈ చిన్ని ఆసుపత్రిలో ఆవిడకి ప్రత్యేకంగా కన్శల్టేషన్ రూం అని నిర్మాణం ఏదీ లేదు. ముదురు ఆకుపచ్చ తెరలు చుట్టూ ఏర్పాటు చేయటం ద్వారా లోపలి విషయాలు బయటకి కనపడకుండా ఏర్పాటు చేశారు.  అయినప్పటికీ, ఇక్కడ ఆమెకి విపరీతమైన పేషంట్లు వచ్చేవారు. 

***

అక్కడ డాక్టర్ రాధిక గారు తన టేబుల్ ముందు కూర్చుని ఉంటారనుకుని వెళ్ళిన మాకు  కాస్త వేరే దృశ్యం కనిపించింది. అదే గదిలో ఒక మూలగా ఎత్తైన ఒక టేబుల్ పై ఒక గర్భిణి పడుకుని ఉంది, ఆ పేషంట్ పల్స్ రేట్ ని పరీక్షిస్తూ, మా వైపు వీపు చేసి నిలబడి ఉన్నారు డాక్టర్ రాధిక గారు.

డాక్టర్ గారు పరీక్షిస్తూ ఉండటం వల్ల ఆ గర్బిణి తాలూకు వస్త్రాలు, పడుకున్న భంగిమ చూపరులకు కాస్తా ఇబ్బంది కలిగించే ఉన్నాయి.  క్షణంలో వెయ్యవ వంతులో మేము జాగురూకులం అయ్యి బయటికి కదిలే లోగా, మా అలికిడి విన్న ఆవిడ, వచ్చింది ఆ గర్బిణి తాలూకు తల్లి అనుకుని,

"రండమ్మ, మీ అమ్మాయికి గర్భంలో నీరు కాస్తా తగ్గింది..." అని ఏదో అంటూ ఇటు వైపు తిరిగారు.

ఊహించని విధంగా మమ్మల్ని అక్కడ చూసి వెయ్యి టన్నుల బాంబు పక్కనే పడ్డట్టు ఆమె ఉలిక్కిపడ్డారు. తక్షణమే ఆమె చేసిన మొదటి పని, ఆ పేషంట్ ని అడ్డగిస్తూ నిలబడి, తన వెనుకె ఉన్న మరో తెరని మెరుపువేగంతో మూసేశారు.

కనులు మాట్లాడతాయి అంటే ఏమో అనుకుంటాము కానీ ఆ క్షణంలో నేను ఆమె కనుల్లో భావాలు చదవగలిగాను. ఆమె మమ్మల్ని సంస్కార విహీనుల్ని చూసినట్టు చూసింది. మనం ఒక నీచమైన జంతువుని కూడా అంత అసహ్యంగా చూడము బహుశా.

ఆమెకి వచ్చిన కోపానికి ఆమె ఎలాంటి మాటలయినా వాడి ఉండవచ్చు. కానీ ముక్కు పుటాలు అదిరేలా ఊపిరిపీల్చటం ద్వారా, అరుణిమ దాల్చిన కనులతో మమ్మల్ని చూడ్డం ద్వారా ఆమె కోపాన్ని వ్యక్త పరుస్తూ,

"వై ది హెల్ ఆర్ యూ హియర్?" అని మాత్రమే ఇంగ్లీష్ లో అడిగారు. ఆమె కోపాన్ని అర్థం చేసుకున్నాము.

నా నోటి నుంచి వచ్చిన మొదటి మాట "సారీ" ఆ తర్వాత కొనసాగించాను "క్షమించండి, ఆ నర్స్ మమ్మల్ని లోనికి రమ్మని పిలవటం వల్ల వచ్చాము, వచ్చిన క్షణంలోనే అర్థం అయింది, ఏదో పొరపాటు జరిగిపోయిందని" అని నీళ్ళు నమిలాను.

ఆవిడ కోపంగా నర్సు వంక చూస్తున్నారు.

అప్పుడు మా రీజినల్ మేనేజర్ మురళీ గారు కలగజేసుకుని "క్షమించండి మేడం. తప్పంతా నాది. ఆ అమ్మాయి మమ్మల్ని పిలుస్తోందా లేదా మా పక్కనే కూర్చుని వెయిట్ చేస్తున్న పేషంట్ గారి తల్లిగారినా అని నిర్ధారణ చేసుకోకుండా దూసుకు రావటం ముమ్మాటికి నాది తప్పు. ఇందులో ఈ అమ్మాయి (నర్స్)ది గానీ, మా కొలీగ్ (నేను) ది గానీ ఎటువంటి తప్పు లెదు. ఎక్కడికయినా లోపలికి వెళ్ళే ముందు తలుపుతీసి ఉంచినా సరే ’మే ఐ కమిని ప్లీజ్’ అని అడిగాకే లోనికి  రావాలి అనే కనీస విఙ్జత నేను పాఠించి ఉండాల్సింది. అది స్వంత కొడుకు గది అయినా, కూతురు గది అయినా, కోడలి గది అయినా. ఇది పెద్దల నుంచి నేను నేర్చుకున్నపాఠాలలో ఒకటి, అలాంటిది ఈ వేళ అది మరచి పోయాను.  గొప్పపొరపాటు జరిగిపోయింది. ఈ కుర్రాడు (నేను) కొత్తగా ఈ టెరిటరీలో చేరాడు. చాలా ప్రామిసింగ్ గా ఉంది ఇతని పర్ఫార్మెన్స్, ఈ నర్స్ ని చూడంగానే తెలుస్తొంది కొత్తగా చేరింది అని. ఆమెకి ఉత్సాహమే తప్ప అనుభవం లేదని అర్థం అవుతోంది. కానీ ఆ అమ్మాయి ఆనందంగా పని చేస్తుండడాన్ని బట్టి ఆమె కోరి ఈ వృత్తిలో చేరింది అని అర్థం అవుతోంది. క్రమశిక్షణ పేరిట వీరిద్దరి మీద కానీ ఏ ఒక్కరి మీదో గానీ చర్య తీసుకుని వాళ్ళ భవిష్యత్తు దెబ్బతీయటం వద్దు. కోరి చేరిన వృత్తులలో వీళ్ళు ఖచ్చితంగా రాణిస్తారు. ఇలాంటి వారు కాస్తా శిక్షణ ఇస్తే ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. శిక్ష కంటే, శిక్షణ బాగా పని చేస్తుంది.  వీరిద్దరిని క్షమించండి. మీ కోపం మొత్తం నామీద చూపించండి. అందుకు పూర్తిగా నేను అర్హుడిని" మృదువైన కంఠంతో స్వచ్చమైన ఇంగ్లీష్ లో చెప్పేసి,  ఆయన రెండు చేతులు జోడించి నిలబడి పోయాడు మౌనంగా.

వర్ఛస్సు ఉట్టి పడుతున్న విగ్రహం, సంస్కారం ఉట్టిపడేలాంటి ఆయన మాటలు, ఆయన హావభావాలు ఆ క్షణంలో తీవ్రమైన ప్రభావాన్నే చూపాయి. అంతటి ఆగ్రహం ప్రదర్శించిన ఆవిడ ’ఇట్స్ ఓకే’ అని మౌనంగా గొణిగి, తన కుర్చీలో కూర్చుండి పోయింది.

’మేము ఇక్కడే ఉండి మిమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టదలచుకోలేదు. ఒకటి మాత్రం అర్థం చేసుకోండి మేడం, "మా చర్య తప్పుగా ఉండి ఉండవచ్చు కానీ మా ఉద్దేశం మాత్రం సరి అయినదే" ( ఫర్ ది ఆబ్వియస్ రీజన్స్ అవర్ ఆక్షన్ ఈస్ అన్-డవుటెడ్లీ రాంగ్, బట్ అవర్ ఇంటేన్షన్స్ వర్ నాట్ రాంగ్’)  అని చెప్పేసి మురళీ గారు  మౌనంగా బయటికి వచ్చేశారు. ఆయన వెనుకే నేనున్నూ.

లోపల ఇంత తుఫాను చెలరేగింది అన్న విషయం తెలియని బయటి వారందరూ మామూలుగానే ఉన్నారు. ఇంకా కొత్త పేషంట్లు చాలా మంది పోగయ్యారు బయట ఈలోగా.

మేము బయటకు రాంగానే చాలా మంది పేషంట్లు "మా టైం అంతా వృధా చేస్తారా దుర్మార్గులారా"  అన్నట్టు చూపులతో విసుక్కోవడం కద్దే. మాకు అదేమి అర్థం కానట్టు బయటికి వచ్చాము.

అప్పుడే చీకటి పడిపోయింది. షాప్స్ అన్నీ విద్యుత్ దీపాల కాంతిలో ధగ ధగలాడి పోతున్నాయి.

దగ్గర్లోనే ఉన్న ఏడు రోడ్ల కూడలి వద్ద  సిగ్నల్స్ కి అనుగుణంగా ట్రాఫిక్  నెమ్మదిగా కదులుతోంది.  చిరాకు పుట్టించేలా హారన్లు మ్రోగిస్తూ అనేక వాహనాలు తిరుగుతున్నాయి రోడ్డు మీద.  క్లినిక్ ముందు ఆపిన నా మోపెడ్ వద్దకు వచ్చాము. ఆయన నిశ్శబ్దంగా ఉండిపోయారు కాసేపు.

"దీనిని గూర్చి ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు" అని నా వంక చూస్తూ చెప్పారు ఆయన. నేను తలూపాను. ఆ తరువాత ఆయనే అడిగారు "ఈ సంఘటన ద్వారా నీవు నేర్చుకున్న గుణపాఠం ఏమిటి?"

నేను ఒక్కొక్కపదాన్నే కూడబలుక్కుంటున్న వాడిలా "మే....ఐ....కమిన్....ప్లీజ్?" అని షేక్స్పీరియన్ నాటకాలలోని పాత్రలాగ డ్రమాటిక్ గా పలికాను.

ఆయన గంభీరంగా తలపంకించి "గుడ్, ఈ పాఠం ఒక్కటీ జీవితాంతం గుర్తుంచుకో, ఈ విషయానికి ప్రచారం కల్పించకు. నన్నేమి గొప్ప వాడిలాగా చిత్రీకరించాల్సిన పనిలెదు, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయ్" అన్నాడు.

నిజానికి నేను నేర్చుకున్న పాఠం ఈ ’మే ఐ కమిన్’ అన్నదొక్కటే కాదు, ఒక నాయకుడు ఎలా ఉండాలి అన్న విషయం ఈ సంఘటన ద్వారా మురళీ గారు నాకు ప్రాక్టికల్ గా బోధించారు.

ఇటీవల యూట్యూబ్ లో కలాం గారి ఇంటర్వ్యూ చూస్తుంటే, నాకు ముప్పై ఏళ్ళ నాటి ఈ సంఘటన గుర్తు వచ్చింది.

ఆ ఇంటర్వ్యూలో ఏపీజే కలాంగారు చెప్పుకొస్తారు తన సీనియర్ సతీష్ ధావన్ గారి గూర్చి. అపజయం ఏర్పడినప్పుడు జూనియర్ల మనో స్థయిర్యం  దెబ్బతినకుండా, సతీష్ ధావన్ గారు, ఆ అపజయాన్ని తన భుజాలమీదకి తీసుకుని విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారట. తిరిగి మరోసారి విజయం లభిస్తే దాన్ని  జూనియర్స్ కి ఆపాదించి, కలాం గారిని ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడమన్నారట. జూనియర్ల మనో స్థయిర్యం పెంచటం,  ఒక నిజమైన లీడర్ లక్షణం అని చెప్పుకొస్తారు ఏపీజే కలాం గారు. 

దాదాపు ముప్పై సంవత్సరాలు నాలోనే ఉండిపోయింది ఈ ఙ్జాపకం, ఈ రోజు మీ ముందు ఉంచుతున్నాను ఈ కథ రూపంలో.

ఆ వేళ్టి నుంచి ఈ "మే ఐ కమిన్ ప్లీజ్" అన్న అలవాటు మానలేదు నేను. గడప దాటి లోనికి వెళ్ళబోయిన ప్రతీ సారి ’లోనికి రావచ్చా’ అని విధిగా అడుగుతాను. నన్ను చాలామంది, చాలా  సందర్భాలలో ఛాదస్తుడి కిందకూడా జమకట్టారు, ఎందుకు ఇంత లాంఛనప్రాయంగా ఉండాలి అని. కానీ నేను మానలేదు నాయనా ఈ అలవాటు.

ఈ సంఘటన తరువాత  మురళీగారి కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఆధారంగా నేను అదే ఉద్యోగంలో స్థిరపడ్డాను. త్వరిత గతిలో పదోన్నతులు పొందాను. ఆ తరువాత ఆ సంఘటనని మరచి పోయి, ఆమె కూడా మా కంపెనీ ఉత్పత్తులకు చక్కటి ప్రోత్సాహం ఇచ్చేది.

ఈ  ఉత్పాతం, టీ కప్పులో తుఫానులాగ సమసిపోయింది. అందరం మరచి పోయాం కూడ.

***

టైం లైన్ లో ఓ రెండేళ్ళు ముందుకెళదాము.

ఈ తెరలు, గిరలు లేకుండా చక్కటి ఏసీ ఛాంబర్స్ తో కూడిన మల్టీ స్పెషాలిటీ అసుపత్రి నిర్మించుకున్నారు రాధిక గారు. ఆవిడ జీవితం సజావుగా సాగిపోతోంది.

ఒకేలాగా నడిస్తే అది జీవితం ఎందుకు అవుతుంది? ఆమె జీవితం ఇలా నల్లేరు మీద బండి నడకలాగా  సాగిపోతు ఉండగా ఒక  సంఘటన పెద్ద కుదుపే కుదిపింది ఆమె జీవితాన్ని.

***

గోదావరి నదిలో నీళ్ళు ప్రవహించడం గోదావరి జిల్లాలవారికి విశేషం కాకపోవచ్చు, అదే విధంగా కావేరి నదిలో నీరు ప్రవహించడం కర్ణాటక ప్రాంతాల వారికి పెద్ద వింతగా అనిపించకపోవచ్చు.

కానీ పెన్నా నదిలో నీరు ప్రవహించడం కడప జిల్లా వాసులకు ఖచ్చితంగా వింతే. ఎప్పుడో అరుదుగా నీళ్ళు ప్రవహిస్తాయి ఆ నదిలో.

అలాంటి అరుదైన సందర్భం అది.

కడప జిల్లా చెన్నూరు దగ్గర  పుష్పగిరి మఠం సమీపంలో పెన్నానది తీరం. నది గట్లు తన్నుకుని ప్రవహిస్తోంది. 

ఏడవ శతాబ్దానికి చెందిన ఆ శంకరాచార్య స్థాపిత క్షేత్రం శైవులకు, వైష్ణవులకి కూడా ప్రాముఖ్యత గలిగినది. శంకరాచార్యులు వచ్చి ఆశీర్వదించి ప్రొత్సహించిన మఠంగా పేరు ఉంది అక్కడి మఠానికి.

ఆ సమీపంలోని నది ఒడ్డుకు ఒక కుటుంబం  విహార యాత్రకి వచ్చారు. కాకపోతే వారు గుడికి రాలేదు. నడి ఒడ్డున పిక్నిక్ కి వచ్చారు.

ఇంకా ఎండ ఎక్కువ కాలేదు. ఉదయం నుంచే వాతావరణం వేడిగా ఉండటం కడప జిల్ల ప్రత్యేకత. ఎండ చుర్రుమంటోంది.

జరగబోయే ఘోర ప్రమాదాన్ని వారికి చెప్పాలనుకుంటుందేమో అన్నట్టు గాలి రివ్వు రివ్వున వీస్తోంది.

చాలా ఆనందంగా ఉన్నారు వారు. సాయంత్రం దాకా సరదాగా గడపటానికి అన్ని విధాల సిద్దపడి వచ్చారు.  పిక్నిక్ టెంట్, టిఫిన్, భోజనం కారియర్స్, ఫిషింగ్ రాడ్స్, సైక్లింగ్ కోసం సైకిళ్ళు, స్టీరియో కాసెట్ ప్లేయర్ ఇలా అన్ని తెచ్చుకున్నారు.

వారు ఎవరో కాదు మన  రాధిక డాక్టర్ గారు, ఆవిడ చెల్లి. రాధికగారి భర్త , వారి పదహారేళ్ళ కుమారుడు. వారికి సాయం అందించటానికి ఒక నౌకరు, డ్రయివరు కూడా వచ్చారు.

అందుకే ఆ కుటుంబం సరదాగా నదీ తీరానికి వచ్చారు. టేప్ రికార్డర్ లో ఏదో పాప్ సాంగ్ మోగుతోంది.

నది ఒడ్డున ఆపిన కారు పక్కగా కాంపింగ్ టెంట్  ఏర్పాటు చేశారు. అందులో ఓ చాప పరిచి కారియర్ లలో తెచ్చుకున్న టిపిన్ సర్ది పిల్లవాడిని, భర్తని పిలవమని డ్రైవర్ ని పురమాయించింది రాధిక.

ఆవిడకి సాయంగా ఆవిడచెల్లెలు కూడా ఓ చేయి వేస్తున్నారు ఏర్పాట్లలో.

అప్పుడే ఫిషింగ్ ముగించుకుని విజయగర్వంతో ఓ బాస్కెట్ నిండుగా చేపలుపట్టుకొచ్చారు ఆవిడ భర్త. ఆయన విదేశాల నుంచి వచ్చిన అరుదైన సందర్భం అది. సంవత్సరంలో ఎప్పుడో అరుదుగా గడుపుతారు ఆయన ఇండియాలో. వైద్య సేవలు అందిస్తూ ఆయన విదేశాలలో , ఈవిడ కడపలో ఉంటుంటారు. వారు ఇలా ఆనందంగా గడిపే సందర్భాలు వారికి నిజమైన పండగ లాంటివే.

’ఒక్క నిమిషం డియర్, కాస్తా స్విమ్మింగ్ చేసి టిఫిన్ కి వస్తా. మనబ్బాయి ఇప్పుడే స్విమ్మింగ్ కి వెళ్ళాడు నన్ను రమ్మని కేకేస్తున్నాడు" అని ఆయన ఈత కొట్టటానికి వెళ్ళారు.

అంతే అదే చివరి చూపవుతుందని ఎవ్వరికీ తెలియదు.

కాసేపట్లో "ఓ మైగాడ్, ఓ మైగాడ్ ఇట్స్ ఎ క్విక్ సాండ్. సేవ్ అస్" అంటూ ఆర్తనాదాలు వినిపించాయి.

వాళ్ళ అబ్బాయి ఈత కొడుతూ కాస్తా ముందుకు వెళ్ళి ఊబిలో చిక్కుకుపోయాడు. అతనే ఆర్తనాదాలు చేస్తున్నాడు ’డాడి సేవ్ మీ’ అంటూ. డ్రయివర్ కి, నౌకర్ కీ ఈత రాకపోవటం వల్ల నిస్సహాయంగా నిలబడిపోయారు.

ఇటుగా ఈత కొడుతున్న ఈవిడ భర్త గారు ముందు వెనుక ఆలోచించకుండా పుత్రుడి దిశగా సాగిపోయారు నదిలో.

టెంట్ నుంచి పరిగెత్తి వచ్చారు డాక్టర్ రాధిక గారు ఆవిడ చెల్లెలు.

వారి కళ్ళ ముందే ఆయన మరియు పదహారేళ్ళ వాళ్ళ అబ్బాయి రాధిక గారిని వంటరిని చేస్తూ పరలోకానికి వెళ్ళిపోయారు.

టీవీలో సవివరంగా వేస్తూనే ఉన్నారు వార్తా స్రవంతిలో ఈ దృశ్యాలు.

****

ఈ సంఘటన తర్వాత రాధిక గారి వ్యక్తిత్వంలో చాలా మార్పు వచ్చింది. అధిక భాగం మౌనంలోనే గడిపేవారు. వీలయినంత సేపు పెషంట్ల సేవలో గడపటం ప్రారంభించారు ఆవిడ.

కొత్తగా నిర్మించిన నర్సింగ్ హోం స్థాయిని బట్టి, అక్కడ ఆవిడ ఏర్పాటు చేసుకున్న ఆధునిక ఉపకరణాలని బట్టి, ఎక్కువ చార్జి చేయదగ్గ అవకాశం ఉన్నప్పటికి, అందరినీ ఆశ్చర్యపరుస్తూ నామమాత్ర రుసుము మాత్రమే వసూలు చేయటం మొదలెట్టారు. కొందరు పేదలకు పూర్తి ఉచితంగా కూడా సేవలు అందించే వారు.

ఆమెలోని ఆగ్రహాన్ని, ఆత్మ విశ్వాసాన్ని నా కళ్ళారా చూశాను.  ఇలా దయకి సేవకి మారుపేరుగా శాంతమూర్తిగా మారిన అమె రూపాన్నీ చూశాను.

కొన్ని జీవితాల్ని భగవంతుడు  ఎందుకు ఇలా పరీక్షిస్తాడో మనకు ఎన్నటికీ అర్థం కాదు.

-సమాప్తం-

 

 

 

 

Published in Gotelugu.com in August 2021

The link: https://www.gotelugu.com/telugustories/view/10053/loniki-raavachha