Monday, November 15, 2021

ఎన్నో ప్రశ్నలు ర గిల్చిన 'జై భీమ్'


 

ఎన్నో ప్రశ్నలు ర గిల్చిన 'జై భీమ్'

ఇటీవలే ఓటీటీ ప్లాట్‌ఫారంలో విడుదలయి సంచలనం సృష్టిస్తున్న జై భీమ్ సినిమా పట్ల తన స్పందనను తెలియచేస్తున్నారు రాయపెద్ది వివేకానంద.

 

జై భీమ్ - ఈ చిత్రం    చూశాను. ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతం.

మీరు ఒక సారి ఈ కింది లిస్ట్ చూడండి.

 

నిరీక్షణ (1986) దర్శకత్వం బాలూ మహేంద్ర

పిరవి (మలయాళం) (1989) సన్నీ జోసెఫ్

అంకురం (1993) సి. ఉమా మహేశ్వర రావు

మనోహరం (2000) గుణ శేఖర్

షాక్ (2006) ఆర్జీవీ/హరీష్ శంకర్

నాంది (2021) విజయ్ కనకమేడల

జై భీమ్ (2021) త.శె.ఙ్జానవేల్

 

~

 

పై సినిమాలన్నింటిలో ఉన్న కామన్ అంశం ఏమిటి అంటే, మానవ హక్కుల హననం. పోలీస్ హింస. అమాయకులపై అక్రమ కేసు బనాయించి వారిని హింసించి వేధించడం.

 

(గమ్యం, జల్సా, మహానది తదితర చిత్రాలలో సూక్ష్మంగా ఈ అంశాన్ని చర్చించినా, ఇలా అదే కథాంశాన్ని పూర్తి స్థాయి కథాంశంగా తీసుకొనబడలేదు)

 

మళ్ళీ వీటిలో జై భీమ్, అంకురం గూర్చి మాత్రమే విమర్శకులు చర్చించి వాటిని మెచ్చుకుంటూ వ్యాసాలు వ్రాయటం వెనుక ఉద్దేశం, వారు మానవ హక్కులు అంటే దళితుల హక్కులు అని మాత్రమే సెలక్టివ్ మానవత్వంతో ఆలోచించి వ్రాయటం.

 

ఈ డైరెక్టర్ ఎక్కడా కూడా ఇది దళితవాద చిత్రం అని చెప్పలేదు.   ఫిల్మ్ క్రిటిక్స్ మాత్రమే ఇలా అంటున్నారు.

 

త.శె.ఙ్జానవేల్ ఎంతో న్యూట్రల్‌గా తీశాడు చిత్రాన్ని. ఆయన ఎంత న్యూట్రల్‌గా తీశాడో అంత న్యూట్రల్‌గా వ్రాస్తున్నాను నేను ఈ వ్యాసాన్ని.

 

నాకు దళితుడు అన్న పదానికి నిర్వచనం తెలియదు. నా దృష్టిలో అణచివేతకి గురయ్యే ప్రతివాడు బాధితుడే. డబ్బు లేకపోవడం, విద్యాగంధం లేకపోవడం, అమాయకత్వం ఉండటం, అంగ బలం, ఆదుకునే నాథుడు లేకపోవడం, ఈ కారణాల వల్ల సునాయాసంగా రాక్షసుల బారిన పడటానికి అవకాశం ఉండటం వల్ల వారి బారిన పడి తనువు, ప్రాణం, మానం కోల్పోవడం ఎంత బాధాకరం. రక్షకులే భక్షకులై ఈ అమాయకులని సునాయాసంగా కబళించడం ఎంత హేయం.

 

ఇలా అణచివేతకి, వెతలకి, బాధలకి గురయ్యేవాడికి ఒక కులం,  మతం, జాతి ఉండవు.

 

వాళ్ళు బాధితులు అంతే.

 

ఈ సమాజంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల కారణంగా అంగబలం, అర్థబలం లేని వాళ్ళు సునాయాసంగా ఎర అవుతున్నారు. ఫలానా కులం కారణంగా మాత్రమే వారు ఇలా బలవుతున్నారు అని ఆలోచించడం సినికల్ థాట్ ప్రాసెస్ అని నేను భావిస్తున్నాను. చదువుకున్న వారు కూడా ఇలాంటి ఘోరాలనుభవించిన సంఘటనలెన్నో.. అమాయకంగా మోసపోయిన ఘటనలెన్నో. ఇస్రో ఎస్పియొనేజ్ కేసులో గొప్ప శాస్త్రవేత్త సైతం ఇరుక్కుని అవమానాలు, ఆరోపణలు ఎదుర్కోవటం, అతడితో అనుచితంగా, అవమానకరంగా, అణచివెస్తూ ప్రవర్తించటంలో అతడి చదువు, కులం, సామాజిక స్థాయి ఏమీ అడ్డురాకపోవటం చూస్తే,  ఈ రకమైన అన్యాయానికి బలహీనుడవటం తప్ప ఇతర కారణాలన్నీ తదుపరివేనని అర్ధమవుతుంది.  ఆ రకంగా తీసుకుంటే ఈ దర్శకుడు నా ఈ విమర్శకు అతీతుడు కాడు.

 

సినిమా ప్రారంభ సన్నివేశంలోనే తన భావ జాలాన్ని బయటపెట్టాడు దర్శకుడు. అలాగని చెప్పి ఆయన అదే పనిగా అగ్రవర్ణాల పట్ల ద్వేషాన్ని వెలిగక్కలేదు. దళితుల పట్ల సానుభూతిని మాత్రమే తెలియబరచాడు. తను నమ్మిన విషయం తాను తీయటం తప్పు కాదు కద. ఇంత బాగా తీయబడ్డ ఈ చిత్రంలో ఇలాంటి లోపాలే కాక, కొన్ని సత్య దూరమైన అంశాలు లేకపోలేదు. అవి కూడా చర్చిస్తాను ఈ వ్యాసం చివర్లో.

 

ఇది నిస్సందేహంగా హృదయాల్ని ద్రవింపజేసే ఒక దృశ్య కావ్యం. దర్శకుడు ఆద్యంతమూ విషాదవీణియ రాగాల్ని మూగగా మీటుతూనే ఉంటాడు. మన హృదయం కొట్టుకోవడం నిలిచిపోయి, హృదయ స్పందనలు ఆగిపోయి, మనం నిస్సహాయంగా నిలబడిపోయి, కళ్ళలో కన్నీళ్ళు ఇంకిపోయి, రక్తాశ్రువులు రావటం మొదలవుతుంది. మనం జీవిస్తున్న ఈ సమాజం పట్ల ఏహ్యత కల్గుతుంది. కొందరు స్వార్థపరుల అతి తెలివి వల్ల అమాయకులు ఎలా నేల రాలి పోతున్నారో కద అని పిస్తుంది.

 

కొందరు సుఖంగా జీవించటానికి, తెర వెనుక ఎన్ని అమాయక జీవాలు, చిరునామా కూడా తెలియకుండా మూగగా రాలిపోతున్నాయో కద అనిపించింది.

 

చిత్రం యావత్తు అమాయకులైన గిరిజనులు (ట్రైబల్స్) ఎలా దోపిడికీ గురువుతున్నారో, దుష్టులైన మానవ మృగాల వంటి పోలీసులు ఈ అమాయకుల మానవ హక్కులను ఎలా కాలరాస్తున్నారో గుండెల్ని పిండేసేలా చిత్రీకరించారు.

 

ఈ చిత్రం చూస్తున్నంత సేపు, ఆ పాత్రల మనోభావలతో మనం లీనమయిపోతాము. చిన్నతల్లి ఒక కఠినమైన నిర్ణయం తీస్కున్న ప్రతీ సారీ 'అద్దీ. అద్దీ అలా చెయ్యి తల్లీ. భలే చెప్పావు. నా మద్దతు నీకే' అని మనం చిన్నపిల్లాడిలా మన ఎదురుగా ఉన్న టీపాయ్‌నో, టేబుల్‌నో పిడికిలి బిగించి గుద్దుతాం.

 

ఆ పాత్రల పరిస్థితులతో మమేకమై పోతాము. 'ఏం మనుషులురా ఈ పోలీసులు, తమ స్వార్థం కోసం, పదవిలో ఉన్న ఒక వ్యక్తి మెప్పు కోసం, ఈ అమాయక జీవుల ఉసురు పోసుకుంటున్నాడు. ఎటూ పోలేకుండా వారిని చిక్కించుకుని అంత హింస పెడతాడా. మీరు మానవ  జన్మ ఎత్తిన మృగాలా, రాక్షసులా, వెధవల్లారా. అందుకే కదరా మిమ్మల్ని 'అన్న'లు అంత హీనంగా చంపేది. అందుకే మా తెలుగు కమర్షియల్ సినిమాలలో అయితే, మా చిరంజీవో బాలయ్య బాబో అయితే సరిఅయిన మొగుళ్ళు రా. మీ బతుకులు చెడ. మిమ్మల్ని కోసి కండ కండకూ కారం పూయాలి.' అని మనం ఇంకేం చేయలేక నిస్సహాయంగా మన సంస్కారం అనుమతించినంత మేరకు తిట్టుకుంటాము ఈ సినిమాలో పోలీసు వెధవలని.

 

"పాముతో కాటేయబడ్డ వాడు ప్రాణాలు కాపాడమని నీ వద్దకు వస్తే, డబ్బులు ఇస్తేనే మందు ఇచ్చి కాపాడతానని అంటావా, ప్రాణం కాపాడతావా?" అని చంద్రు (సూర్య) అడిగితే,

 

"అదేం మాట. వాడు చివరికి పోలీసు అయినా సరే, మొదట ప్రాణం కాపాడతా" అంటుంది మాయా మర్మం ఎరుగని స్వచ్చమైన ఆ గిరిపుత్రి.

 

ఆ ఒక్క మాటలో ఎంత అర్థం నింపాడో దర్శకుడు.

 

'జీవించు, జీవించనియ్యి' అన్నది మన సనాతన ధర్మం యొక్క ఆదర్శం కద.

 

'నో ఫ్రీ మీల్స్' అనే కరడు కట్టిన నీచ అమెరికన్ బిజినెస్ సంస్కృతి కార్పొరేట్ వ్యవస్థల రూపంలో విద్య, వైద్యం ఇలా అన్ని రంగాలలో ఎలా విషకోరలు చాస్తూ ఉంది అన్నది మనకు ఆ ఒక్క మాటలో అర్థం అయి ఉన్నతమైన మన మూలాల్ని గుర్తు చేసి. ఉలిక్కి పడేలా చేస్తుంది.

 

ఈ చిత్రం గూర్చి నేనేమీ రివ్యూ వ్రాయబోవడం లేదు. ఇప్పటికే బోలెడు మంది వ్రాసేశారు. ఈ చిత్రం చూశాకా నాకు కలిగిన మనోభావాలు మాత్రమే ఇక్కడ వ్రాస్తు ఉన్నాను.

 

***

 

ఈ సినిమాలో మాటలు గుండెల్ని పిండేస్తాయి.

 

"ఈ దెబ్బలని ఓర్చుకోలేకపోతున్నాను. మనం చేయని ఈ నేరం ఒప్పేసుకుందాము" అన్నమాట విని, "ఒరేయ్ ఈ నొప్పులు, దెబ్బల తాలూకు గాయాలు రెండ్రోజుల్లో మానిపోతాయిరా. ఒక సారి దొంగ అన్న ముద్ర పడితే జీవితాంతం మాసిపోదురా. కాస్తా ఓర్చుకోరా" కథానాయకుడి ఈ మాట గుండెల్ని పిండేస్తుంది

"నేనీ దొంగతనం చేయలేదయ్యా" ప్రాణం పోతుండగా అతను చెప్పిన చివరిమాట కూడా ఇదే.

"ఈ పోరాటంలో నేను ఓడుతానో గెలుస్తానో నాకు తెలియదు. కానీ పోరాడి ఓడాను అని నా పిల్లలు తెలుసుకుంటే కూడా చాలు నాకు. కానీ నా భర్తను చంపిన నీచుల వద్ద పాపిష్టి డబ్బులు తీసుకోను"

"లాయర్లందరూ అవినీతి పరులు అని విశ్వసించే పోలీస్ ఆఫీసర్‌ని నేను, పోలీసులు అందరు నీచులని అభిప్రాయపడే లాయర్‌వి నీవు. మనిద్దరం కల్సి పని చేయబోతున్నాం. తమాషాగా లేదు" ఇది ప్రకాష్ రాజ్ మాట. ఇంకా తమాషా ఏమిటి అంటే, ఈ ప్రకాష్ రాజ్‌ని ఎన్నుకుంది సూర్యానే, ఈ కేసు సాల్వ్ చేయటానికి. ఒకరి వృత్తి నిబద్దత పట్ల ఒకరికి అనుమానాలు ఉన్నా, వారిద్దరి మతం మానవత్వం. ఇది వారిని కలుపుతున్న అంశం. ఇలాంటి మనసులను హత్తుకునే అంశాలు బోలెడు ఈ చిత్రంలో.

"పోలీసులందరూ చెడ్డోళ్ళు కారు సర్..." అన్న మాటకి, ముక్తసరిగా "పోలీసులందరూ మంచోళ్ళు కూడా కాదు" అని సమాధానం ఇస్తాడు సూర్య.

"ఈ కులపోళ్ళు అందరూ హ్యాబిచ్యువల్ క్రిమినల్స్ మై లార్డ్స్" అంటాడు ఒక సందర్భంలో రావు రమేష్ ప్రభుత్వ తరఫున లాయర్ (ఆడ్వొకేట్ జనరల్), దానికి ప్రతిగా హీరో సూర్యా ఇంకో సందర్భంలో "ఒక కులంలో పుట్టిన వారందరూ నేరస్థులే అనే జెనరలైజేషన్ తప్పు" అంటాడు

"చట్టం, న్యాయం, ధర్మం ఇలాంటి వన్నీ ఉన్నోళ్ళకు అండగా ఉంటాయి. వీరికి ఉన్న అండ మనమే"

"అమ్మా! డీజీపి మిమ్మల్ని జీపులో దిగబెట్టి రమ్మన్నాడమ్మ" అని పోలీసులు వేడుకున్నా, తనపాటికి బస్సులోనే వచ్చి, నడిచి ఇంటికి వెళ్ళిన చిన్నతల్లిని చూసి మనకేదో కొత్త ఉత్తేజం వస్తుంది.

 

చివరి సీన్లో పేపర్ చదువుకుంటున్న లచ్చిమీ ని చూసినా మనకు అదే స్థాయి ఉత్తేజం వస్తుంది.

 

***

 

మధురాంతకం రాజారాం గారి కథ ఒకటి ఉంది 'గణనీయులు' అని. ఆ కథలో జనాభాలెక్కలు సేకరించే సందర్భంగా ఒక ఉపాధ్యాయుడు అడవులలో, కొండకోనల్లో వెదకి వెదకి జనాభాలెక్కల్లో లేని వలస జీవులను, పశువుల కాపర్లను, ఇలాంటి వాళ్ళని కొత్తగా ఆ జాబితాలోకి చేర్చి తృప్తిగా నిద్ర పోతాడు. ఆ కథలో ఉన్న లాంటి సమాజమే ఇక్కడ, కాకపోతే అంత మంచి ఉపాధ్యాయుడు ఎవరూ వీళ్ళ పేర్లు జనాభాలెక్కలలో చేర్చలేదు. ఒక ఆదర్శ మహిళా టీచర్ ఆ పని చేయబోయి, రాజకీయ నాయకుల చేతిలో చీవాట్లు తింటుంది.

 

ఈ కథలో కథానాయకుడు ఒక దళితుడు. వెనుకబడిన ఆయన కులం వారి కులవృత్తి ఎలకలు, పాములు, పందులు పట్టి కాపుకు వచ్చిన పంట పొలాలను కాపాడి, రైతులు ఇచ్చే తృణమో పణమో తీస్కుని జీవించడం. ఎప్పుడైనా పని దొరికితే కాంట్రాక్ట్ లేబర్‌గా వెళ్ళి ఇటుకల బట్టీలలో పని చేయటం.

 

అధికార పక్షంలో ఉన్న ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో పాము చొరబడితే దానిని పట్టుకోవడానికి వెళతాడు, అనుకోకుండా తాను చేయని దొంగతనం నేరంలో ఇరుక్కుంటాడు. ఆపై పోలీసులు పెట్టే చిత్ర హింసలు, అతను మాయవడం, ఆ తరువాత చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు ఇది ఇతివృత్తం.

 

ఇతన్ని కాపాడటానికి చంద్రు అనే అడ్వకేటు పడిన తపన, చూపిన చొరవ ప్రశంశనీయం. ఈ పరంపరలో ఒళ్ళు గగుర్పొడిచే నిజాలు బయట పడతాయి. అసలు నిందితులు ఎవరూ అన్నది తెలిశాక మనకు మనుషులుగా పుట్టినందుకు అసహ్యం వేస్తుంది. ఇలాంటి సమాజంలోనా మనం ఉన్నది అని భయం వేస్తుంది. మనకు రక్షణ ఉందా అని దిగులు వేస్తుంది.

 

ఇది యథార్థ సంఘటన ఆధారంగా వ్రాసుకున స్క్రిప్ట్. పాత్రధారులు అందరూ పోటీ పడి నటించారు కాదు కాదు, జీవించారు.

 

హీరొయిన్ లిజొమోల్ జోస్ చిన్నతల్లి పాత్ర కోసం పుట్టిందా అన్నట్టు ఉంది. ఆ మేకప్ చూసి, నిజంగానే ఎవరైనా గిరిజన స్త్రీ ఏమో అనుకుంటాము. ఆ తర్వాత ఆమె ఫోటోలు గూగుల్ లో చూసి ఆశ్చర్య పడ్డాను.

 

ఫోటో గ్రఫీ సూపర్. సంగీతం సూపర్. పాటలు ఉన్నాయి, కానీ అన్నీ మాంటేజ్ సాంగ్స్. దీనివల్ల్ సినిమాకి క్లాస్ లుక్కు వచ్చింది. ఎక్కడా కక్కుర్తి పడి డ్యుయెట్లు పెట్టాలి, ఫోక్ సాంగ్ పెట్టాలి, స్టెప్పులు వేయించాలి అని అనుకోలేదు దర్శకుడు.

 

హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేయబోయే ముందు చంద్రు, చిన్నమ్మని సంతకం చేయమన్నప్పుడు "నాకు సంతకం చేయడం రాదు సర్" అని బేలగా అంటుంది.

 

ఆ తరువాత దృశ్యంలో ఆమె బిడ్డ పలక మీద తన పేరు వ్రాసి చూపించి రాబోయే తరాలు విద్యను ఒంటబట్టించుకుంటున్నాయని ఇది అన్ని సమస్యలకు పరిష్కారం ఇస్తుంది అన్న అర్థాన్ని సంకేతంగా ఇస్తాడు దర్శకుడు.

 

ఇదె పాప, చివరి సీన్లో, సందేహిస్తూ, చంద్రూ గారి వంక చూస్తూ కుర్చీలో కూర్చుని, వార్తా పత్రిక అందుకుంటుది. ఆయన 'శభాష్ గో అహెడ్' అన్నట్టు చిరునవ్వు చిందిస్తూ చూస్తారు. ఆ తర్వాత ఆ పిల్ల చంద్రు గారిలాగా కాలు మీద కాలు వేసుకుని దర్జాగా పేపర్ చదవటంలో నిమగ్నం అవుతుంది.

 

ఈ రెండు దృశ్యాల ద్వారా అంబేద్కర్ చెప్పిన సందేశం 'విద్య ద్వారానే స్వేచ్ఛ, సమానత్వం లభిస్తాయి. అజ్ఞానాంధకారాలు తొలగేదానికి, విజ్ఞాన జ్యోత్స్న నలుదెశలా కాంతులు విరజిమ్మటానికి మరియు అన్ని సమస్యలకు పరిష్కారం విద్య ద్వారానే లభిస్తుంది' అన్న సూచనని దర్శకుడు మార్మికంగా చెబుతారు.

 

వారు సినిమా పేరు జై భీమ్ అని పెట్టటం, చివర్లో అంబేద్కర్ గారి ఫోటో పెట్టటం వల్ల నేను ఇక్కడ కొన్ని విషయాలు వ్రాయాల్సి వస్తోంది;

 

నేటి యువత అంబేద్కర్ గారిని పూర్తిగా అర్థం చేసుకోవటంలో విఫలం అయ్యారు అని నేను అనుకుంటున్నాను. ఆయన చెప్పింది ఉత్తి విజ్ఞానం (knowledge) అందించే విద్య గూర్చి మాత్రమే కాదు, విచక్షణతో కూడిన జ్ఞానం (Wisdom) అందరికీ అందాలని ఆశించారు.

 

ఉత్తి డిగ్రీలు, మార్కులు కొలబద్ద అయితే, ఆ పోలీసులు, రావు రమేష్ లాంటి లాయర్లు, దొంగ సాక్ష్యం చెప్పిన మెడికల్ షాప్ వారు, గుడ్డిగా పోలీసులు చెప్పిన మాటలు నమ్మి ఛాతీ ఎముకలు ఆక్సిడెంట్‌లో విరిగాయని పోస్ట్ మార్టం రిపోర్ట్ వ్రాసిచ్చిన డాక్టర్ వీళ్ళందరూ కూడా విద్యావంతులే. మరి వారికి విద్య ఏమి ఒనగూడ్చిపెట్టింది. కాబట్టి నైతికత నేర్పని విద్య వృథా.

 

పలక మీద పేరు వ్రాసి సంతకం చేసినంత మాత్రాన, వార్తా పత్రిక కాలుమీద కాలు వేసి చదివినంత మాత్రాన జ్ఞానం (విజ్‍డం) రాదు. అంతోటి విద్యావంతులు కేరళ నిండా ఉన్నారు. లాభం ఏమి ఉంది? వైద్య రికార్డుల ప్రకారం ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్న రాష్ట్రాలలో కేరళ, వెస్ట్ బెంగాల్ అగ్ర స్థానంలో ఉన్నాయి.

 

ప్రతి ఒక్కరూ ఉత్తిగా డిగ్రీ తెచ్చేసుకుని ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలి, అని ఆశించటము; ఉద్యోగం రాకపోతే ప్రభుత్వాలను అమ్మ నా బూతులు తిట్టటానికి తప్ప ఈ విద్య ఎందుకు పనికిరానిదిగా తయారయింది. నిజమైన విజ్‍డం వల్ల ఆత్మస్థైర్యం రావాలి, ఆత్మ గౌరవం పెరగాలి. ఒకరి వద్ద ఏది ఆశించకూడదు అన్న ధైర్యం, స్థైర్యం రావాలి. అలా కాకుండా 'మేము వెనుకబడి ఉన్నాము' అని నిత్యము ఆక్రోశిస్తు ఉన్నారు అంటే వారు విద్యను చూసే కోణంలో తేడా ఉంది. వీరికి పగటి కలలు చూపి, అరచేతిలో వైకుంఠాన్ని చూపే రాజకీయ నాయకులు కూడా వీరికి విద్య యొక్క పరమార్థాన్ని తప్పు కోణంలో చూపుతున్నారు. ముఖ్యంగా ఇలా వెనకబడి వున్నామని రోదించేవారు సామాజికంగా ఉన్నత స్థాయిలోవుండి, వారి సంతానమంతా గొప్ప ఉద్యోగాల్లో వుండటం గమనిస్తే,  అసలు వెనకబడివున్నదెవరో అర్ధమవుతుంది. ఇలాంటి సౌకర్యాలు తమకున్నాయని తెలియక అట్టడుగునవున్నవారికి తాము వెనుకబడి వున్నామన్న స్పృహకూడా లేనంత దయనీయమైన స్థితిలో వున్నారు, ఈ సినిమాలో తెగలో వారిలా!!

 

ఇదే విషయాన్ని జపాన్ వారి గూర్చి హెక్టార్ కార్షియా, ఫ్రాన్సిస్ మిరాల్లెస్ అనే రచయితలు 'ఇకిగాయ్' అనే పుస్తకం ద్వారా వ్రాస్తే చదివి మనవాళ్ళు అందరూ శభాష్ అంటారు గానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి, విద్య యొక్క పరమార్థం ఉద్యోగం మాత్రమే అని నమ్ముతారు.

 

అజ్ఞానం నుంచి బయటపడటం, ఒకర్ని గుడ్డిగా నమ్మే అమాయకత్వం నుంచి బయటపడటం, కమ్యూనికేషన్ స్కిల్స్‌ని మెరుగుపరచుకోవటం, ఒకరిపై ఆధారపడకుండా సాధికారికంగా తమ జ్ఞానాన్ని పెంపొందించుకునేలా, కంప్యూటర్ వాడకం నేర్చుకోవటం, తద్వారా అన్ని పనులు చేసుకోగలగడం, తమ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవటం, గ్లోబల్ ఆపర్చునుటీస్‌ని విస్తృత పరచుకోవడం, తద్వారా తమకు, తమ కుటుంబాలకు, దేశానికి కూడా అర్థిక సాధికారికతని సాధించుకోగలగడం ఇవన్నీ విద్య ద్వారానే సాధ్యం. కానీ ఇప్పటి యువత అంబేద్కర్ పేరు చెప్పుకుని, ప్రతీ దానికి ప్రభుత్వం మీద ఆధారపడటం, మేము వెనుకబడి ఉన్నామని చెప్పుకోవడానికి పోటీలు పడటం చేస్తున్నారు. వీళ్ళకు తోడుగా మమ్మల్ని కూడా వెనుకబడిన వర్గాలుగా గుర్తించమని కొన్ని సోకాల్డ్ అగ్రవర్ణాల ఆక్రోశం ఇంకో వంక. ఎక్కడికి వెళుతున్నాం మనం?

 

(ఈ విషయంగా నిరుద్యోగ సమస్య గూర్చి నేను సవివరంగా ఇది వరకు ఒక వ్యాసం వ్రాశాను. మీరు ఈ క్రింది లింక్ క్లిక్ చేసి ఆ వ్యాసం చదవవచ్చు.

 

https://m.facebook.com/story.php?story_fbid=10221593757333419&id=1237660552

 

***

 

మళ్ళీ ఈ సినిమా ముచ్చటకి వద్దాం.

 

1995 పీరియడ్ లుక్ భలే తెచ్చారు.

 

ఒక సీన్‌లో, చెన్నయి నగరంలో బొంబాయి సినిమా పోస్టర్ పెద్దది ఉంటుంది బాక్‌గ్రౌండ్‌లో. హీరో సూర్య అప్పుడప్పుడు వాడే యమహా ఆరెక్స్ 100 బైక్, చిన్నతల్లి పాటలు వినే మర్ఫీ కంపెనీ ట్రాన్సిస్టర్, సూర్యా వాడే నేషనల్ పానసోనిక్ టేప్ రికార్డర్, టీడికే 90 మినిట్స్ కాసెట్, వీసీఆర్, పబ్లిక్ కాల్ ఆఫీస్ తదితరాలు మనకు ఆర్ట్ డిపార్ట్ మెంట్ మరియు డైరెక్టర్ బాగా కృషి చేశారని తెలుపుతుంది.

 

ఇక ఈ సినిమాలో చిన్న చిన్న లోపాలు.

 

అప్పటికే దేశంలో మారుతి 800, ఎస్టీమ్, జెన్, బాలెనో (పాత బాలెనో), వాగన్ ఆర్, హ్యుందాయి ఆర్ ఎల్ ఎక్స్ శాంత్రో, ఆక్సెంట్, ఆక్సెంట్, దేవూ వారి సియలో, మేటిజ్, తదితర కార్లు విస్తృతంగా ఉండినాయి. కానీ ఈ సినిమాలో ఎంత సేపున్నా అంబాసిడర్, ఫియట్ పద్మినీ కార్లు చూపిస్తారు. వీళ్ళ దృష్టిలో 1995 అంటే అది ఏదో శ్రీ కృష్ణదేవరాయల కాలం నాటి జమానా అన్న ఫీలింగ్ ఉన్నట్టుంది (ఆ రోజుల్లోనే వచ్చిన ఒక పాట: మారుతి రో, మాటిజ్ రో, సీట్ చూస్తే సియలో రో).

 

వాహనాల నెంబర్ ప్లేట్ల్ తెల్లవి వాడారు. అప్పట్లో పర్సనల్ వెహికల్స్‌కి నలుపు రంగు నెంబర్ ప్లేట్‌పై తెలుపు రంగు అక్షరాలు ఉండేవి. టాక్సీలకు తెల్ల రంగు నెంబర్ ప్లేట్స్ పై నల్ల రంగు అక్షరాలు ఉండేవి.

 

కార్ నెంబర్ ప్లేట్ పై APV అని వ్రాశారు కానీ అప్పటికే ప్రతి జిల్లా ఆర్.టీ.ఓ ఆఫీస్‌కి నెంబర్ కోడ్ వచ్చింది. అంటే వీరు చూపదలచుకున్న రాజమండ్రి తదితర ప్రాంతాలకి AP 05, విశాఖకి AP 31, విజయవాడకి AP 16 అనే నెంబరింగ్ వచ్చింది ఆర్.టీ.వో ఆఫీస్ లకి.

 

ఈ గొడవ అంతా ఎందుకు వస్తుంది అంటే, సాక్షాత్తు అవి తమిళనాడు ప్రాంతాలు అని తెలుస్తు ఉంటుంది. పాత్రలేమో కాకినాడకి వెళ్ళొస్తాము, హైదరాబాద్‌కి వెళ్ళి వచ్చాము అంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ మన కళ్ళ ముందు బఫూన్ లలాగా చేస్తారు. శంకర్ తీసిన జెంటిల్మన్ కాలం నుంచి గమనిస్తున్నాను ఈ ద్విభాషా చిత్రాల పిచ్చి. అలా కాకుండా ఆ దర్శకుడు, హాయిగా అయ్యా ఇది చెన్నయ్. ఏమి చేసుకుంటారో చేసుకోండి, మీకు అర్థమయి చావదు కాబట్టి తెలుగులో సంభాషణలు పెట్టాం అని అంటే పీడ పోతుంది కద. ఒక్కో సారి తెలుగు బోర్డులు ఒక్కోసారి ఎంత వద్దన్నా అరవ బోర్డులు ఈ బాధ చూసే తిప్పలు తప్పుతాయి ప్రేక్షకులకు.

 

ప్రారంభ దృశ్యంలో ఆ రోజు విడుదల అయి బయటకు వచ్చిన ఖైదీలను వారి వారి కులాలు అడిగి తక్కువ కులస్తులను పక్కన నిలబెట్టి మళ్ళీ వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి తమ టార్గెట్లు పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు పోలీసులు. అదే సమయంలో అగ్రవర్ణాల నేరస్తులను మీరు వెళ్ళవచ్చు అని పంపిస్తారు. ఇది నాకు జీర్ణం కాలేదు. ఇది కేవలం సినిమాటిక్‌గా అనిపించింది. కానీ ఈ దృశ్యం, కులాని బట్టి నేరస్తులుగా నిర్ణయించే మనస్తత్వాన్ని చక్కగా ప్రదర్శిస్తుంది. బ్రిటీష్ కాలమ్నుంచి తెగలను నేరగాళ్ళుగా పరిగణించటం ఇన్నేళ్ళయినా మారకపోవటం ఒక దురదృష్టం.

 

ఎవ్వర్నీ కులం అడగకూడదు అనేలాంటి సంస్కారాలతో పెంచారు మమ్మల్ని. మా చిన్నప్పటి నుంచి కూడా ఫలానా వాళ్ళతో స్నేహం చేయవద్దు అని కానీ, ఫలానా వాళ్ళతోనే స్నేహం చెయ్యి అని కానీ మా పెద్దలు చెప్పలేదు. నాకు స్నేహితులు ఏ కులాలవారో నాకు తెలియదు. కానీ 'పెరగంగా పెరగంగా పెద్ద బావ కోతి...' అన్న సీమ సామెత ప్రకారం, ఊహ తెలిసి, ఉద్యోగాలు చేసే దశకు వచ్చేటప్పటికి, నేను ఈ సమాజంలో ప్రతి చోట కులం కులం అని వింటున్నాను.

 

ఒక సారి మహారాష్ట్రలో అకోలా నుంచి ఓవర్ నైట్ జర్నీ చేసి, నాందేడ్‌కి రావాలి. బస్సులో నా పక్క సీట్ అతను డైరెక్టుగా ఇన్‌డైరెక్టుగా నా కులం అడుగుతున్నాడు. నా చేతికి ఉన్న కాశీ దారం లాంటిది నల్లగానో ఎర్రగానో కాక తెల్లగా ఎందుకు ఉంది, ఇది ఏ దేవుడిది అని నిలదీసి అడిగాడు. కానీ నేను నా కులం చెప్పలేదు అతనికి. అతను ఆ రాత్రంతా నన్ను తాకకుండా వీలయినంత దూరంగా కూర్చున్నాడు. అతని ఖర్మ అతనిది అని చెప్పి నేను నిద్ర పోయాను హాయిగా.

 

అలాగే ఇప్పుడు ప్రతి అప్లికేషన్ ఫిల్ చేసెటప్పుడు అగ్రవర్ణం వాడివా- ఇదిగో నీ స్థానం ఇక్కడ అని నన్ను అణగదొక్కబడుతున్న సమాజంలో జీవిస్తున్నాను. నా ఆహారపుటలవాట్లు, పద్దతులు, నా అభిరుచులు అన్నీ కూడా హేళనకి గురిఅవుతున్న సమాజంలో ఉన్నాను నేనిప్పుడు. 1995 లో కూడా ఇదేలాంటి పరిస్థితులే ఉన్నాయి, నేను పెరిగిన సమాజంలో.

 

కాబట్టి కులం ఆధారంగా ఎవ్వర్నీ నేరస్థుడు అనకూడదు అని సూర్యా చెప్పిన సందేశం లాగానే, కులం ఆధారంగా అగ్రవర్ణాల వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళని, బలిసినవాళ్ళని, కడుపు నిండినవాళ్ళని అనుకోకూడదు అని నాకు అనిపించింది.

 

ఒకప్పుడు వెనుకబడ్డ వాళ్ళని నిస్సందేహంగా ముందు వరుసలోకి తేవాల్సిందే, కానీ దానికి ప్రతిగా ఇంకో వర్గపు అమాయకులని (అంటే నాలాంటి వారిని) మెరిట్ ఉన్నా వెనుకకు తోయవలసిందేనా? సమానత్వం కద మనకు కావాల్సింది, ప్రతీకారచర్యలు కాదు కద.

 

సినిమా టైటిల్ మాత్రం చాలా ప్రభావశాలిగా ఉంది.

 

శుభం.

Friday, October 8, 2021

భూత్ బంగ్లా (Published in Go Telugu .com)


భూత్ బంగ్లా 

-డాక్టర్ రాయపెద్ది వివేకానంద్ 

హారర్ సినిమా చూసి వస్తున్నాం నేను మా శ్రీమతి.

వర్షం కారణంగా వైపర్స్ నిరంతరాయంగా పని చేస్తున్నాయి. వర్షం కారణంగా నెమ్మదిగానే నడుపుతున్నాను.

"సినిమా ఏం బాగాలేదు" పెదవి విరుస్తూ అంది నా శ్రీమతి, "మీకోకటి తెలుసా, మా చిన్నప్పుడు మేము ఓ అద్దె ఇంట్లో ఉండేవారం, ఆ ఇంట్లో దెయ్యాలుండేవని చెపుతుండే వారు మా స్నేహితురాళ్ళు. మేము నాలుగేళ్ళున్నా మాకొక్క దెయ్యం కూడా కనిపించలేదు ఆ ఇంట్లో"

" అవునా, నా చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్పనా? ఖచ్చితంగా ఈ హారర్ సినిమాకంటే థ్రిల్లింగా వుంటాయి" అన్నాను నేను.

"సరే చెప్పండి, కాలక్షేపంగా వుంటుంది" ప్రోత్సహించింది శ్రీమతి.

సరే మీరు కూడా వినండి

*****

జమ్మలమడుగు అంటే ఫాక్షన్ సినిమాలు  చూసే వారెవరయినా భయపడటం సహజం. అలాంటి జమ్మలమడుగులో నా బాల్యం ఒక సంవత్సరం గడిచింది. ఆ ఒక్క సంవత్సరంలోనే ఒక జీవితకాలానికి  సరిపోయేటన్ని అనుభవాల్ని మూట కట్టుకున్నాను.  కాకపోతే మేము ఫాక్షనిజం వల్ల సినిమా కష్టాలు ఏమీ ఎదుర్కోలేదు కాని, ఇంకో రకంగా భయంకర అనుభూతుల్ని పొందటం జరిగింది.

దెయ్యంతో మా కుటుంబం ఎదుర్కొన్న కొన్ని చిత్రమైన అనుభవాల్ని చెప్తాను వినండి.

దాన్ని దెయ్యం అనాలా లేక ఏదైనా మానవాతీత శక్తా అన్నది మాకు ఎన్నటికీ అర్థం కాని ఒక ఆశ్చర్యం.

దాన్ని ప్రత్యక్షంగా చూసిన మా అప్ప. ఆ అనుభవాన్ని ఆయన  అందరికీ చెపుతున్నప్పుడు విన్న ఆ అనుభూతి ఇంకా నాకు గుర్తుంది.  అప్పటికి నాకూ మహా అంటే పన్నెండేళ్ళు వుంటాయి. ఇది జరిగి దాదాపు ముఫై ఎనిమిది సంవత్సరాలు అయినా అది నిన్నో, మెన్నో జరిగినట్టుగా తాజాగా వుంది నా స్మృతిలో. అక్కడి విషయాలన్నీఇప్పటికీ నాకు పూస గుచ్చినట్టు గుర్తున్నాయి. ఆ అనుభవాలు చిత్రంగా వుంటాయి. నాస్తికులు నమ్మకుంటే నేనేమీ చేయలేను.

మా అప్పకి ( నాన్న గారికి) ఒక భయానకమైన అనుభూతిని కలిగించేలా దెయ్యం  కనిపించింది.

ఆ ఇంట్లో మా చుట్టాలామెకి కనిపించింది దెయ్యం ఒక సారి కాదు, అనేక మార్లు.

నాకూ ఓ చిన్న సైజు అనుభూతి కలిగింది. అన్నీ వివరంగా చెపుతాను ఈ ఎపిసోడ్‍లోనే.

మా అప్పకు డిప్యూటి కలెక్టర్‍గా పోష్టింగ్ రావటంతో మా కుటుంబం జమ్మలమడుగు రావటం జరిగింది. సినిమాలలో చూపించే విధంగా ఏమి వుండదు అక్కడి పరిస్థితి. మనుషులంతా చాలా స్నేహశీలురు, కష్ట జీవులు. అక్కడి ప్రజలు చాలా అమాయకులు, నమ్మితే ప్రాణం ఇస్తారు.

మాకు దొరికిన ఇల్లు చాలా పెద్దది.  అదేం ఊరికి దూరంగా కూడా ఏమి ఉండదు. మామూలుగా అన్ని ఇళ్ళ మధ్యనే ఉండేది.  మా ఇంటి ఓనర్స్ కూడా మా ప్రక్కింట్లోనే ఉండేవారు. అప్పట్లో ఏవిధమైన ఆధునికమైన సౌకర్యాలు ఉండేవి కాదు ఆ ఇంట్లో. ఒక పెద్ద ఇల్లు అంతే. 

ఇప్పట్లో కనీస సౌకర్యాలైనట్టి ఓవర్ హెడ్ టాంకు, బాత్రూముల్లో కొళాయిలు కూడా వుండేవి కావు. మా ఇంటెదురుగా రోడ్డుకటువైపు వున్న ఓ పెద్ద  ఓపెన్ ప్లాటులో ఓ పెద్ద బావుండేది. మా నౌకర్లు ప్రొద్దునా, సాయంత్రం నీరు చేది బాత్రూంలో తొట్లలో నీరునింపే వారు. . నౌకర్లు పగలు మాత్రం పని చేసి వెళ్ళిపోయే వారు. రాత్రి కేవలం మా కుటుంబ సభ్యులం మాత్రమే వుండేవారం.

ఇంకో విషయం చెప్పాలి. అప్పుడు మేము గమనించలేదు గాని, ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే జ్ఞాపకం వస్తోంది. ఆ వీధిలోని వారు అనేక మంది వచ్చి అదే బావిలో నీరు చేదుకునివెళ్ళే వారు.  వారంతా ఒక విధమైన ఆసక్తితో మాఇంటి వంక చూసే వారు. ’అరె! ఇందులో బాడుగకు (అద్దెకు) మనుష్యులు దిగారే’ అన్న ఆశ్చర్యం వారి కళ్ళలో కనిపించేది. కొందరు మాకు ఏదో చెప్పబోయి, తిరిగి మనకెందుకులే తంటా అన్నట్టువెళ్ళిపోయేవారు. మా ఇంటి ఒనర్లు కాస్తా బలమైన మనుషులు అన్నివిధాలా. అందువల్లనుకుంటాను జనం వెనుకంజ వేసేవారు.

ఆ ఇంట్లో ఓ రెండు గదులు తాళాలు వేయబడి, మా అధీనంలో లేకుండా , ఓనర్ల అధీనంలో వున్నాయి. ఆ రెండు గదులనుంచీ చిన్న చిన్న చప్పుళ్ళు వినిపించేవి అప్పుడప్పుడూ, ఎలకల వల్లనుకుంటాను  .

మేడపైన ఓ పెద్ద హాలు, దానికి అటు, ఇటూ పేద్ద వరండాలు వుండేవి. ముందు వేపు వరండా మెయిన్ రోడ్ వైపుంటుంది. వెనుకువైపు వరండా దాటంగానే పెద్ద ఆరు బయలు. ఆ ఆరుబయలును కప్పేస్తూ ఇందాక చెప్పిన వేప చెట్టు కొమ్మలు విస్తారంగా ఆక్రమించి నీడను ఇస్తూ వుండేవి.

ఇంకా ఓపెన్ స్పేస్ కావాలంటే మేడపైని గది పైకి చేరుకుంటే బోలెడు ఓపెన్ స్పేస్.

ఆ ఇంటి వెనుక దూరంగా పెన్నా నది కనిపించేది. అందులో అరుదుగా నీళ్ళు ప్రవహించేవి. ఎప్పుడన్నా బాగా వర్షాలు వచ్చి, మైలవరం (కడప జిల్లా)  డ్యాం గేట్లు తీస్తే అందులో నీళ్ళు ప్రవహిస్తాయి, లేదంటే నిరంతరం ఇసుక మేటలు కనిపిస్తూ వుంటాయి.వేపచెట్టు కొమ్మలు అడ్డుగా వుండటం వల్ల మొదటి అంతస్థునుంచి చూచాయగాను, పై అంతస్థునుంచి బాగా క్లియర్ గాను కనిపించేది పెన్నానది. మా ఇంటి వెనుక ఇంకేమీ ఇండ్లువుండేవి కావు, మా ఓనర్ల తాలూకు చేనేత మగ్గాలు, పశువల శాలలు కనిపిస్తుంటాయి, వాటి కాంపౌండ్ వాల్ అయినపిమ్మట, బీడుపడిన పొలాలు, వాటి తర్వాత నది.  ఈ బీడు భూములలోనే పెద్ద వృక్షం ఒకటి వుండేది. అది ఏ చెట్టో నాకు సరిగ్గా గురుతు లేదు. పిల్లతనం ఉత్సాహంలో తెలిసేది కాదు గాని, అదేమి పెద్ద సేఫ్ ఎన్విరాన్‍మెంట్ కాదని ఇప్పుడనిపిస్తోంది.  పూర్తిగా రాంగోపాల్ వర్మ హారర్ సినిమాలకు సరిపోయే నేపధ్యం.

ఇక అసలు కథలోకి వద్దాం.

ఆ వృక్షం ఏదయితే వుందో దానిపై బోలెడు పక్షులు, కోతులు వుండేవి. కోతులు పగలంతా నిరంతరం పోట్లాడుకోవటం, పరిగేత్తి గెంతులెయ్యటం, గట్టి గట్టిగా కిచకిచలని మించిన స్థాయిలో అరచుకోవటం చేస్తువుండేవి . ఇక పక్షుల విషయానికి వస్తే అవి తెల్లవారు ఝామున, సాయంసమయాన  కిలకిలారావాలతో తెగ చిరాకు పెట్టేవి. అయితే రాత్రయ్యేటప్పటికి అవన్నీ నిశ్శబ్దంగా అయిపోయేవి. చిత్రమైన విషయం ఏమిటంటే,  రాత్రుళ్ళు నిశ్శబ్దంగా వుండే ఈ జీవులన్నీఒక్కోసారి అరుదుగా, రాత్రిపూట కూడా వున్నట్టుండి తీవ్ర సంచలనం చేసేవి. చాలాసేపటి తర్వాత అన్నీ సద్దుమణిగేవి. అదెందుకో మాకర్థం అయ్యేది కాదు అప్పట్లో (అఫ్‍కోర్స్ ఇప్పటికీ అనుకోండి).

కడపజిల్లాలో ఎండాకాలం చాలా భయంకరంగా వుంటుంది. పగలంతా చండప్రచండంగా మార్తాండుడు తన ప్రతాపం చూపిస్తాడు, ఇక రాత్రంతా ఉక్కపోత. ఈ కారణం వల్ల రాయలసీమలో ప్రజలు రాత్రిళ్ళు ఇంటిముందర ఆరుబయల్లో పడుకుని నిద్రపోయేవారు. మేడలున్న వారు మేడలపై పడుకొనే వారు. ఇది చాలా సహజమైన విషయం అక్కడి ప్రాంతాలలో. చిత్రంగా మా వీధీలో ఎవ్వరూ కూడా ఇలా ఓపెన్ ఎయిర్‍లో పడుకొనేవారు కాదు. ఇప్పుడు గుర్తొస్తొంది ఆ సంగతి కూడా.

మా కుటుంబం మాత్రం మేడపై ఓపెన్ ఎయిర్లో పడుకొనే వారం నిశ్చింతగా. రాత్రి ఎనిమిది, ఎనిమిదిన్నరకల్లా పడుకోనేవారం ఆ రోజుల్లో. నౌకర్లు మంచాలు, దోమతెరలు ఏర్పాటు చేసి వెళ్ళే వారు. కబుర్లు చెప్ప్కున్నంతసేపు చెప్పుకుని క్రమంగా హాయిగా నిద్రలోకి జారుకునే వారం.

మా అప్ప మాత్రం మా  గోలకి దూరంగా, పైమిద్దె పైకి వెళ్ళి పడుకొనే వారు. మేం పిల్లలం వెళ్ళి త్రాగే నీళ్ళ చెంబు, గ్లాసు పెట్టి వచ్చే వారం. మా అప్ప ట్రాన్సిస్టర్ తీసుకుని పైకి వెళ్ళి ఆకాశవాణిలో ఇంగ్లీష్ వార్తలు విని, ఏవయినా కర్ణాటక సంగీతాన్నో, ఏదయినా చర్చావేదికో వింటూ నిద్రలోకి జారుకొనేవారు. ఆ రోజుల్లో ఇంటిపెద్దలందరి పద్దతి ఇలాగె వుండేది.

ఇక నాకు ఒళ్ళు గగుర్పొడిచిన ఒక చిన్న అనుభూతిని మీకు చెప్తాను.

ఒకరోజు రాత్రి ఇలాగే పక్షులు, కోతులు గోలగోలగా అరుస్తుంటే నాకు మధ్యరాత్రిలో మెలకువ వచ్చింది. బాగా అలసిపొయినట్టున్నారు ఇంకెవ్వరికి మెలకువ రాలేదు.  యధాలాపంగా ఆ పెద్ద వృక్షాన్ని చూసి కాస్తా అదిరిపడ్డాను. పైనున్న చెట్టుకొమ్మకు ఎవరో మనిషి ఉరివేసుకుని వేలాడుతున్నట్టు నాకు స్పష్టంగా కనిపిస్తోంది. కాకపోతే తలనుండి కాళ్ళదాకా తెల్లటి నీడలాగా, మనిషి ఆకారంలో కత్తిరించిన ఒక తెల్లటి కటౌట్ లాగా వుంది తప్పనిచ్చి ఒక మనిషిలాగా జుత్తు, కాళ్ళు, చేతులు ఇలా స్పష్టంగా కనిపించలేదు. ఏదో భ్రమలెమ్మనుకుని నిద్రలోకి జారిపొయాను.  క్రమంగా కోతులు, పక్షుల చప్పుళ్ళూ మందగించాయి.

 తెల్లవారి మామూలుగానే మెలకువ వచ్చింది.భయపడాలి అని కూడా తెలిసే వయసు కాదది. అందరూ కాఫీలు త్రాగుతూవుండగా వెళ్ళి ఈ అనుభవాన్ని చెప్పాను, కాకపోతే ఉరివేసుకున్నట్టు కనపడింది అన్నది మినహాయించి ఏదో తెల్లటి ఆకారం కనపడింది అనె చెప్పాను.  ఉరి గిరి అంటే వయసుకు మించి మాట్లాడుతున్నానని కేకలేస్తారేమోనని కాస్తా భయపడ్డాను.

నేనూహించినట్టే అంతా తేలిగ్గా కొట్టేశారు, ఉత్తి భ్రమ అయివుంటుందని, నిద్రలో కలవచ్చివుంటుందని తీర్మానం చేసేసి ఆ విషయం అంతటితో ముగించారు.

ఇది జరిగిన కొన్ని రోజులకి ఇంకో చిత్రం జరిగింది.

మా పెద్దక్కయ్య అప్పుడు గర్భిణి. మా అక్కయ్య బయటపడుకోకుండా మేడపైనే వున్న పెద్ద గదిలో పడుకొంది. ఆమెకు తోడుగా మా చుట్టాలావిడ ఒకరు పడుకొనే వారు. మేమంతా మేడమీదే, ఆగది బయట ఆరుబయల్లో పడుకోని ఉన్నాం. మా నాన్నగారు పై అంతస్థులో ఆరుబయల్లో పడుకుని వున్నారు. 

ఒక సారి మధ్య రాత్రప్పుడు మా చుట్టాలావిడకి మెలకువ వచ్చి చూస్తే ప్రక్కనే మంచి వర్చస్సుతో కూడిన ఒక పెద్ద ముత్తైదువ కూర్చుని చిరునవ్వుతో పలకరించిందట. ఆమెవరో తెలియకున్నా మా చుట్టాలావిడ మొహమాటానికి చిరునవ్వు నవ్విందట. ఆ తర్వాత ఆమె చాలా చక్కగా కబుర్లు చెప్పి వెళ్ళిపోయేదట.

ఇలా కొన్ని రోజులు జరిగిందట. ఆ వచ్చినావిడ ఒకోసారి చాలా ఉత్సాహంగా కబుర్లు చెప్పేదట, ఒక్కోసారి దిగులుగా వుండేదట. ఒక్కోసారి అకారణంగా కోపం తెచ్చేసుకుని కర్ర తీసుకుని ఎడాపెడా మా చుట్టాలావిడని కొట్టేసేదట.

ఇంకా చిత్రమైన విషయమేటిటంటే ఆ వచ్చే ఆవిడ (దెయ్యం?) ఒక్కోరోజు ఒక్కో వ్యక్తి రూపంలో కనపడేదట. అదీ బ్రతికున్నవారి రూపాలలోనే. సాక్షాత్తు  అప్పటికి బ్రతికే వున్న మా దగ్గర బంధువుల రూపాలలోనే వేర్వేరు రూపాలతో వచ్చేదట.

ఇవేవీ ఆమె మాకు చెప్పేది కూడా కాదు. ఒక సంఘటన జరిగే దాకా. ఆ  సంఘటన ఏంటో చెపుతాను వినండి.

ఇదే అన్నిటికన్నా తీవ్రమయిన సంఘటన. అయితే ఒకటి మాత్రం నిజం. ఏ సంఘటనలోనూ ఎవ్వరికీ అపకారం గాని, గాయాలు గానీ కలుగలేదు.

అది మంచి పున్నమి రాత్రి. అంతా పడుకొని వున్నాం. నేను, మా ఇద్దరక్కయ్యలు, మా అమ్మగారు, మా పెద్దన్నయ్య మొదటి అంతస్థు ఆరుబయల్లోనూ, మా పెద్దక్కయ్య, చుట్టాలావిడ ఈ ఇద్దరూ  గదిలోనూ, మా నాన్నగారు పై అంతస్థు ఆరుబయల్లోనూ ఇలా ఎవరి స్థానాలలో వాళ్ళు పడుకుని ప్రశాంతంగా పడుకుని వున్నాం.

సాధారణంగా మా నాన్నగారు దేనికీ పెద్దగా ఉద్వేగానికి గురవ్వరు. ఆయనకి మూఢనమ్మకాలు కూడా ఏమీ లేవు. పిచ్చి పిచ్చి నమ్మకాలు, తాయెత్తులు గట్రా సెంటిమెంట్లు కూడా ఏమీలేవు. అలాంటి కథలు ఎవరయినా చెపితే కూడా నవ్వి వదిలేస్తారు.

సడెన్‍గా మెలకువ వచ్చి లేచి కూర్చున్నాను ఒక రాత్రి. మేడపైనుంచి దిగి వచ్చినట్టున్నారు మా నాన్నగారు. ఆయన బనీన్ అంతా చెమటతో తడిసి పోయుంది. బాగా ఆయాస పడిపోతున్నారు.

అప్పటికే అందరూ లేచి ఆయన చుట్టు కూర్చుని ఆయనని సేదతీరుస్తున్నారు.

నేను వెళ్ళి మాఅమ్మగారిప్రక్కనే కూర్చున్నాను. నాకర్థమయినదాన్ని బట్టి ఆయన అప్పుడే ఒక ఆశ్చర్యకరమైన సంఘటనని చూశారు. అదేంటంటే...........

*****

ఎప్పట్లాగే ఆకాశవాణిలో ఇంగ్లీష్ వార్తలు విని, కాసేపు సంగీతమేదో విని ట్రాన్సిస్టర్ రేడియోని ఆపేసి నిద్రకుపక్రమించారట మా నాన్నగారు ఆరాత్రి కూడా.

 

ఒక రాత్రప్పుడు ఎవరో తట్టిలేపుతున్నట్టనిపిస్తే మెలకువ వచ్చిందట. మెలకువ వచ్చి కళ్ళు కూడా తెరవకముందే ఆయనకి పక్షుల గోల, కోతుల అలజడి వినిపించిందట. ఏంట్రా తెల్లవారిందా అని అనుకుని కళ్ళు తెరిచి చూస్తే ఇంకా చీకటి వీడలేదు.

అప్పుడు వినిపించిందట ఆయనకి "ఒరే హనుమంతుడూ (మా అప్ప పేరు హనుమంతరావు గారు) బావున్నావా?" అన్నపిలుపు ఆప్యాయంగా.

అప్పుడు చూశాడట మానాన్నగారు రమణమ్మని (పేరు మార్చబడింది).

ఆవిడ మాకు దూరపు బంధువు. కాని వారి కుటుంబంతొ మాకు బాగా సాన్నిహిత్యం వుంది . మా నాన్న గారికంటే బాగా పెద్దావిడ ఆమె. అందుకే ఆయనని ’ఒరె, నీవు అని ఏకవచనంతో సంబోధించే చనువు వుంది ఆవిడకి. రమణమ్మగారు పెద్దముత్తైదువ. అప్పటికే అరవైపైన వుంటాయి ఆవిడకి. పెద్ద కుంకుమ బొట్టు, సోడాబుడ్డి లాంటి కళ్ళజోడు, చింపిరి జుత్తు, మడతలు పడి నలిగిపోయిన కాటన్ చీర, ఆవిడ అప్పుడే ప్రయాణం చేసొచ్చినట్టుంది.

చాలాసేపు అప్యాయంగా మాట్లాడిందిట,  అందరి గురించి పేరు పేరునా క్షేమసమాచారాలు అడిగి కనుక్కుందిట. వాళ్ళ ఊరి విశేషాలు, క్షేమ సమాచారాలు తెలియజెప్పిందిట. ఆవిడ నిజంగానే మా రమణమ్మ అత్త అనే అనుకున్నాడట మా నాన్న.

ఆవిడ ప్రవర్తన తేడాగా ఏమీ అనిపించలేదు. బహుశా అప్పుడే ప్రయాణం చేసొచ్చినట్టుంది. అలసటగా కూడా వుంది.  అయినా సరే వచ్చి పలకరించాలని పైకి వచ్చి మాట్లాడిస్తోంది అనే అనుకున్నారట.

కాసేపయ్యాక  ’పదరా క్రిందకెళదాం అందరం కలిసి కూర్చుని మాట్లాడుకోవచ్చని’ చెప్పి నడవటం మొదలెట్టింది రమణమ్మ.

ఆవిడ వెనుకే మానాన్నగారు కూడా నడవటం మొదలెట్టారు. మేడపైన సగం దాకా వచ్చాక , ఆవిడ మెట్లున్న వైపునకు కాకుండా తిన్నగా ముందుకే వెళుతోందట. అలాగే ముందుకు వెడితే  పారపెట్ వాల్ కూడా లేని ఆ మూడంతస్తుల మేడపై నుంచి కింద పడటం ఖాయం. క్రింద మా ఓనర్ల తాలుకు పశువుల శాల, మగ్గాలు వున్నాయి.

’రమణమ్మా అలా కాదు, ఇటు వేపు’ అని మా నాన్న హెచ్చరిస్తూనే వున్నా కూడా ఆవిడ ఇక ఏమీ పలక్కుండా అలాగే ముందుకే వెళ్ళి వెళ్ళి అలాగే నడచుకుంటు, ఫ్లోరింగ్ అయిపోయిన తర్వాత, కాసేపు గాల్లోనే నడిచి ఆపై అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయి చూస్తూ వుండగానే గాల్లో కలిసిపోయిందట.

అప్పుడు కలిగింది భయం మా నాన్నగారికి, మొదటి సారి.

పెద్దగా కేకలు పెట్టుకుంటు పరిగేట్టుకుంటు క్రిందికి వచ్చేశారు.

అదీ జరిగింది.

ఇది ఏదో సినిమాలో అయితే చూడటానికి బాగుంటుంది కాని ఒక సామాన్యమయిన మనిషికి అస్సలు ఎన్నడూ ఊహకుకూడా రాని విధంగా ఇలా జరిగితే ఎలా ఉంటుందో వివరించటానికి మాటలు చాలవు. ఆ రాత్రి ఎవ్వరికి నిద్ర లేదు. అలాగే చర్చించుకుంటూ వుండిపోయారు పెద్ద వాళ్ళందరు.

ఇది భ్రమనా నిజమా అని చాలా సేపు విచికిత్సకి గురయ్యారు. ఏదయినా పీడకల వచ్చిందేమోనని కూడా అనుకున్నారు. ఘంటాపదంగా మా నాన్నగారు అది నిజంగా జరిగిందేనని నొక్కివక్కాణించారు.

ఈ హడావుడికి గదిలో పడుకున్న మా చుట్టాలావిడ కూడా బయటకు వచ్చి జరిగిందంతా విని, అప్పుడు ఏకరువు పెట్టింది తన అనుభవాల్ని.

అందరికీ మిడిగుడ్లు పడ్డాయి.

తరువాత ఉదయాన్నే రమణమ్మ వాళ్ళ ఊరికి ఎస్.టీ.డీ కాల్ బుక్ చేసి మాట్లాడితే ఆవిడ నిక్షేపంగా వున్నారని తెలిసింది.

ఇలా లాజిక్‍కి అందని సంఘటనలు జరిగాయి ఆ ఇంట్లో. అయినా మా వాళ్ళు ఇల్లు మార్చాలని ఏమీ అనుకోలేదు.

మరో ఆరునెలలకు మా నాన్నగారికి నూజివీడు ట్రాన్స్ఫర్ అయ్యింది.

అంతే ఇంతకు మించి ఏమి జరగకున్నా, మాటల్లో వ్యక్త పరచలేని ఒక విధమైన్ ఉద్విగ్నతకి గురవుతాము మా ఇంట్లో అందరమూ ఈ సంఘటనల్ని తలుచుకున్నప్పుడల్లా.

 

****

"ఓ! మై గాడ్ ఇదంతా నిజమా!" గుడ్లు తేలేసింది నా శ్రీమతి.

 

ప్రియమైన పాఠకులారా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది.

మేమా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన అయిదారు సంవత్సరాల తర్వాత అదే ఇంట్లో అద్దెకి దిగారట మా శ్రీమతి వాళ్ళు, తన చిన్నతనంలో. చిత్రంగా వారికి ఎటువంటి అనుభవాలు ఎదురు కాలేదట. మా శ్రీమతి వాళ్ళ స్నేహితురాళ్ళు చాలానే చెప్పారట ఆ ఇంటి గురించి స్కూలుకు వెళ్ళినప్పుడు.

మాకెవ్వరూ చూచాయగా కూడా చెప్పలేదు, కానీ మాకేమో చిత్రాతిచిత్రమైన అనుభవాలు.

ఏంటొ అంతా విచిత్రం.